Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
naadaina prapancham

ఈ సంచికలో >> సీరియల్స్

అతడు..ఆమె ... ఒక రహస్యం

atadu..aame..oka rahasyam

గత సంచికలోని అతడు-ఆమె-ఒక రహస్యం సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి http://www.gotelugu.com/issue202/580/telugu-serials/atadu-aame-oka-rahasyam/atadu-aame-oka-rahasyam/

 

( గతసంచిక తరువాయి ).... ఉదయం ఆరు గంటలకి ఎవరో  తలుపు మీద కొడుతుంటే మెలకువ వచ్చింది  పాణికి.

‘కొత్త ప్రదేశంలో ఇంత ఉదయాన్నే తనని నిద్రలేపుతున్నదెవరా’ అనుకుంటూ లేచి వెళ్ళి తలుపు తెరిచాడు పాణి.  ఎదురుగా... ఇంద్రనీల !
ఊహించని ఆమె రాకకి కొద్దిగా ఆశ్చర్యపోతూ చూసాడు పాణి “ఏమిటింత పొద్దున్నే లేచారు?” అన్నాడు.

“నన్ను ఇలా గుమ్మంలోనే నిలబెట్టి మాట్లాడేస్తారా? లోపలకి రానివ్వరా?” అందామె చనువుగా అతడ్ని తోసుకుని గదిలోకి అడుగు పెడుతూ.

“సారీ అండీ, నిద్ర మత్తులో ఉన్నాను. రండి లోపలకి”  అన్నాడు పాణి.  అప్పటికే ఆమె లోపలకి వచ్చేసి  బెడ్ ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది  “ఉదయాన్నే జాగింగ్‍కి వెళ్ళడం నాకు అలవాటు.  అలవాటు ప్రకారం రెడీ అయిపోయాను.  మీరేమైనా వస్తారేమోనని అడగడానికొచ్చాను”  అంది.    ఆమె ట్రాక్ సూట్, టీ షర్ట్ వేసుకుని  వచ్చింది. నీలి రంగు ఇంపోర్టెడ్ ట్రాక్ సూట్ ఆమె ఒంటి మీద అతుక్కుపోయి అసలే స్లిమ్‍గా ఉన్న ఆమె మరింత స్లిమ్‍గా కనిపిస్తోంది.   ముందురోజు  ఉదయం పోలీస్ డ్రెస్‍లో  గంభీరంగా, రాత్రి చీరలో  సొగసుగా,  ఇప్పుడు ట్రాక్ సూట్, టీ షర్టులో రెచ్చగొడుతున్నట్టుగా- ఆమె తన అందంలోని రకరకాల వేరియేషన్లని తనకి చూపించడానికి నిశ్చయించుకుని ఇక్కడికి వచ్చిందా అనిపించింది అతడికి.

“అసలు మీకు జాగింగూ అలాంటివేమైనా అలవాటుందా? లేక నేను అనవసరంగా పొద్దున్నే నిద్ర లేపేసానా?”  మొహమాటంగా అంటున్నట్టుగా ఉంది.

పాణికి ఉదయాన్నే జాగింగ్ కి వెళ్ళే అలవాటు  అస్సలు లేదు. ‘లేవగానే ఏదో కొంపలంటుకు పోతున్నట్టుగా ఆ కంప్యూటర్ ముందు కూర్చోకపోతే కాస్త వాకింగో, జాగింగో చెయ్యచ్చు కదా?’ అని అంజలి  ఎన్ని సార్లు  పోరు పెట్టినా ఆ అలవాటు చేసుకోలేకపోయాడు. ముందు రోజు రాత్రి సరిగ్గా నిద్ర లేకపోవడంతో,  ఆరోజు ఇంకా  నిద్రమత్తుగా ఉంది.  అయినా సరే, అందమైన అమ్మాయి వచ్చి జాగింగ్‍కి రమ్మని పిలిస్తే ఏ మగాడు మాత్రం ‘నాకు అలాంటివి అలవాటు లేదని’ చెప్పగలడు?!

“రెండు నిమిషాల్లో  ఫ్రెష్షయి వస్తాను”  అంటూ టవల్ తీసుకుని బాత్రూమ్ లోకి దూరి,  నిజంగానే రెండు నిమిషాల్లో  రెడీ అయి బయటకి వచ్చి, ఆమెతో పాటూ బంగళా బయటకి నడిచాడు.

వెలుతురుని ఆకుపచ్చని తెరలతో ఫిల్టర్ చేసి వదులుతున్నట్టుగా, ఎర్రని అరుణ కాంతి  దట్టమైన చెట్ల ఆకుల సందుల్లోంచి వింత రంగులో నేల మీద పడుతోంది.  దారిపొడగునా ఉన్న పారిజాత చెట్లు దారిమీద పూలవాన కురిపించాయి.  ఆ వాతావరణంలో పొగమంచు మేలి ముసుగు వేసినట్టు కనిపిస్తున్న ఆ  తోటలో ఉన్న  ఆ వాకింగ్ ట్రాక్ స్వర్గంలో రహదారిలా ఉంది.

ఆ సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ కొద్ది సేపు ట్రాక్ మీద నడిచి, బంగళాకి కొంచెం  దూరంగా వెళ్ళాక ,  “కమాన్” అంటూ పరుగు మొదలు పెట్టిందామె.

పరిగెడుతున్నప్పుడు  కదులుతున్న ఆమె అందాలని చూడడానికి అతడు మధ్య మధ్యలో తల తిప్పకుండా ఉండ లేకపోతున్నాడు. అతడు తనని దొంగచాటుగా చూస్తున్నాడన్న విషయం నిర్దారించుకున్నాక, ఆమె అతడితో సంభాషణ ప్రారంభించింది  “రాజేంద్ర గారితో మీరు  ఆఖరి సారిగా ఎప్పుడు మాట్లాడారు?”

ఆమె ప్రశ్నకి పాణి తడబడ్డాడు. “గుర్తు లేదు. గత నెలలో అనుకుంటా, నేను హైదరాబాద్ ఏదో పని మీద వచ్చినప్పుడు మాట్లాడాను. అప్పుడు కూడా నన్ను సిర్నాపల్లి రమ్మని  బలవంతం చేసాడు.  కానీ  నాకు ముంబయిలో  ముఖ్యమైన పని ఉండటంతో వెంటనే తిరిగి వెళ్ళిపోయాను”  పాడిన పాటే మళ్ళీ మళ్ళీ పాడుతున్నట్టుగా అలవోకగా అబద్దం చెప్పెసాడు.

“ఆయన మీతో క్లోజ్ గానే ఉండేవారా?”  

క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో సంభాషణలు అత్యంత కీలక పాత్ర వహిస్తాయి.  పైకి మామూలుగా కనిపించేవే అయినా, వాటిల్లో దొరికే సమాచారం పరిశోధనలో కీలక పాత్ర వహిస్తుంది.  అందుకే ఇన్వెస్టిగేషన్లో సంభాషణలు ఎప్పుడూ ప్రశ్నలతోనే ప్రారంభమౌతాయి. ప్రశ్నల మీద ప్రశ్నలతో  సంభాషణని  తమకి కావల్సిన వైపుకు మళ్ళించడం నేర్పరి అయిన డిటెక్టివ్ చేసే పని. సంభాషణ ఎవరు ప్రారంభిస్తే వాళ్ళకి సంభాషణని ఎటు తీసుకెళ్ళాలన్నదాని మీద కమాండ్ ఉంటుంది. అందుకే,  తెలివిగా  సంభాషణలోని మొదటి ప్రశ్న తనే వేసింది ఇంద్రనీల.

“అవును.  అండమాన్లో  దీవులలో చాలా ప్రదేశాలకి ఇద్దరం ఒంటరిగా తిరిగే వాళ్ళం.  ఆ సమయంలో  అన్ని విషయాలనీ నాతో  పంచుకునే వాడు. ఆ స్నేహం అతడు ఇక్కడి కొచ్చేక కూడా కొనసాగింది. తరచుగా ఫోన్లలో మాట్లాడుకునే వాళ్ళం”  మరో అబద్దాన్ని కల్పించి చెప్పాడు.

ఆమెకి జాగింగ్ బాగా అలవాటు ఉండడంతో మాట్లాడుతూ మాట్లాడుతూ ముందుకు వెళ్ళిపోతోంది.  అతడు వెనక పడుతున్నాడు. ఆమెని అందుకోవడం అతడికి కొంచెం కష్టంగా ఉంది. అయినా,  ఆ వెనక బడడంలో ఉన్న సౌకర్యం అర్ధమయ్యాక అతడికి వెనక ఉండడమే బాగున్నట్టుగా అనిపించి, నెమ్మదిగా పరిగెట్టసాగాడు.  ఆమె పరుగుని ఆపి వెనక్కి తిరిగి చూసి రెచ్చగొడుతున్నట్టుగా నవ్వి,  “కమాన్” అంటూ అతడ్ని ఎంకరేజ్ చేస్తోంది మధ్య మధ్యలో.

వాకింగ్ ట్రాక్  బాగా చిన్నగా ఉండడం వల్ల అప్పుడప్పుడూ ఆమె భుజాలు అతడికి రాసుకుంటున్నాయి. ఆమె గమనించినా పెద్ద పట్టించుకోకపోవడం లేదామె. అతడు తన పక్కగా వచ్చినప్పుడు తల తిప్పి, అతడి కళ్లలోకి చూస్తూ అందామె.  “మీరు ఏమీ అనుకోక పోతే మిమ్మల్ని ఒక విషయం అడగనా?” 

ఆమె తన వంక సూటిగా చూడడంతో అతడు తన చూపులని ఆమె శరీరమ్మీదనుంచి కళ్ళమీదకి మళ్ళించక తప్పలేదు.  పల్చగా ఐ లైనర్ అద్దిన విశాలమైన ఆ సోగ కళ్ళని చూస్తే, కళ్ళు కూడా సెక్సీగా ఉండచ్చన్న విషయం మొదటిసారిగా అర్ధమైంది అతడికి. “అడగండి” అన్నాడు. 

“నాకు తెలిసి ఆత్మహత్య చేసుకోవాల్సినంత సమస్యలు కానీ, ఎవరైనా హత్య చెయ్యాలనుకునేంతటి శత్రుత్వం కానీ రాజేంద్రకేమీ లేవు. కానీ అతడి హఠాన్మరణం చూస్తుంటే, అతడి జీవితంలో ఈ మధ్య కాలంలో ఏదో ముఖ్యమైన సంఘటన జరిగిందని అనుమానంగా అనిపిస్తోంది. అతడు మీతో అన్ని విషయాలనీ  చెబుతాడన్నారు కదా?  ఈ మధ్య కాలంలో  అతడు మీతో ఏదైనా ముఖ్యమైన విషయాన్ని చెప్పారా?”

“ముఖ్యమైన విషయమా?” ఆలోచిస్తున్నట్టుగా అన్నాడు పాణి.

 

మిగతా భాగం వచ్చేవారం......

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్