Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

నాదైన ప్రపంచం

nadaina prapancham

 గతసంచికలో నాదైన ప్రపంచం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.  http://www.gotelugu.com/issue203/581/telugu-serials/naadaina-prapancham/naadaina-prapancham/

 

( గతసంచిక తరువాయి )....  ‘‘ఈ రోజు మీరు నేర్పిన దాంతో.... నేను అన్నీ నేర్చుకున్నట్లే. వాలీ బాల్‌ ప్లేయర్‌గా నేనిపుడు అన్ని ప్లేసు ల్లోనూ ఫిట్‌.’’ సగర్వంగా అందా అమ్మాయి.

తల అడ్డంగా ఆడించాడు ప్రణీత్‌.

తెల్లబోయింది కీర్తన. ‘‘కాదా....? ఇందాక మీరు మ్యాచ్‌ చూసే ఉంటారు. నేను అన్ని ప్లేసు ల్లోనూ వుండి పాయింట్స్‌ తెచ్చాను....’’
ఉక్రోషంగా అంది.

‘‘ఆ విషయానికి నేను అనడం లేదు...’’

‘‘మరి.....?’’

‘‘ఫిట్‌గా వుండాల్సింది ముందు ఇది....’’ పిడికిలితో హృదయం మీద కొట్టుకుంటూ అన్నాడు.

అర్ధం కానట్లు చూసింది....

‘‘నువ్వు ఎంత గొప్ప ప్లేయరైనా కావచ్చు. నీ గేమ్‌లో వీక్‌ పాయింట్స్‌ ఏమీ లేక పోయి వుండొచ్చు. కానీ నీ హృదయం వీకయితే నువ్వు అదః పాతాళానికి కుంగి పోతావు.....’’ చెప్పాడు.

భయంగా వింది.... అతను అన్నది అర్ధం కాలేదు.

హృదయం వీక్‌ అంటే!!....

‘‘హార్ట్‌ ఎటాకా....?’’ అదే అడిగింది.

గల గలా నవ్వాడు....

‘‘ఆ! ఆ!.... హార్ట్‌ మీద వ్‌ అటాక్‌!.... అందుకే గేమ్‌లో

ఫుల్‌గా ఫిట్‌ అయిన నేను, ఆ ఎటాక్‌ తోనే నేషనల్‌ గేమ్స్‌లో ఛాన్స్‌ పోగొట్టుకున్నాను. అందుకే ముందు హృదయం ఫిట్‌గా వుండాలి....
చెపుతూనే నడుస్తూ వెళ్ళి పోయాడు.

‘లవ్‌ ఫెయిల్‌ ఏమో!....’ ఒక్క క్షణం బాధ పడింది.

మళ్ళీ వెంటనే మర్చి పోయి బంతితో ఆట ప్రారంభించింది.

*************

చుట్టూ ఆవరించిన రాజ ప్రాసాదంలాంటి ఇల్లు....

అయితే అది రాజసంతో ఠీవిగా లేదు. చాలా పురాతనంగా వుంది.

రాజులూ పోయి, రాజ్యాలూ పోయి అనాటి వారి వైభవాలను

తెలిపే చిహ్నాలు భారత దేశంలో అక్కడక్కడా మిగిలి వున్నట్లే జమీందారుల సంపదను, విలాసాలను తెలిపే కోటల్లాంటి ఇళ్ళూ వున్నాయి....
జమీలు పోయాక జమిందార్లు ప్రభుత్వం ఇచ్చే భరణాలతో చాలా కాలం విలాసం గానే గడిపారు....

తర్వాత ఇందిరా గాంధీ హయాంలో రాజ భరణాలతో పాటు ప్రభుత్వం ఇచ్చే అన్ని రకాల భరణాలూ రద్దు చెయ్య బడ్డాయి.
ఉన్న ఆస్థుల్ని కరిగించుకుంటూ ఎప్పటికి అప్పటి దర్జాను, హోదాను నిల బెట్టుకోవాలనే తాపత్రయంతో సర్వం కోల్పోవడానికి సిద్దంగా వున్న వాళ్ళు ఎందరో....!

అలాంటి వారిలో రావు బహద్దూరు జగపతి రాయ భూపతి ఒకడు....

తమ ఆస్థులన్నింటినీ ప్రభుత్వం జాతీయం చేసుకున్నపుడు అతను టీనేజ్‌లో వున్నాడు.

తండ్రే అన్ని వ్యవహారాలూ చూసుకోవడంతో దాని తాలూకు తీవ్రత ఏంటో అతనికి తెలియ లేదు.

జీవితం అంతా పంచ రంగుల కలగా వుండేది. చదువు అబ్బ లేదు.

ఎప్పుడూ గుర్రపు బగ్గీలో షికారు వెళ్ళడం, మిగతా వారందరి ముందూ దర్జా చూపించ డానికి ప్రయత్నించడం తప్ప అతనికి ఏమీ తెలియదు.

జరిగిన నష్టం.... రాబోయే కాలంలో గడప బోయే జీవితం పదే పదే మనసు మీద దాడి చేస్తుండటంతో హఠాత్తుగా తండ్రి హార్ట్‌ ఎటాక్‌తో చని పోయాడు.

ఇరవై ఏళ్ళకే బాధ్యతలు నెత్తిన పడ్డాయి భూపతికి.

అపుడే తెల్లబోయి జీవితం వంక చిత్రంగా చూడడం ప్రారంభించాడు. ఇక ఈ జీవితంలో సర్దుబాట్లు, పొదుపు, కష్ట పడటం లాంటివి తప్ప ఇంకేమీ కన్పించ లేదు.

తల్లి పెద్దగా గడుసైంది కాదు. అన్నీ తన మీద పడి పోవడంతో ఉక్కిరి బిక్కిరి అయ్యాడు మనిషి.

ఇరవై ఐదోయేట పెళ్ళయింది. అయిదేళ్ళలో ఇద్దరు ప్లిల్ని కని కన్ను మూసింది భార్య. జీవితం మరింత దుర్భరంగా మారింది.
ఒకప్పటి తమ విలాసాలు ఇప్పటికీ కొనసాగించటం వైట్‌ ఎలిఫెంట్‌లా మారింది.

అంత మంది నౌకర్లూ చాకర్లని పోషించడం అతి కష్టం అయి పోయింది. మెల్లగా ఒక్కొక్కరినీ తీసి వేయడం ప్రారంభించాడు.
దానికి తల్లి విపరీతంగా వ్యతిరేకించేది. గతం నుంచి వర్తమానం లోకి రాని మనిషి ఆమె..... ఇక భవిష్యత్తు గురించి ఏమి ఆలోచించ గలదు....
ప్రతి దానికి తల్లితో వాదించ వలసి వచ్చేది. ఆమెని ఒప్పించడం గగనమై పోయేది.

ఎపుడూ ఒంటరి తనంతో బాధ పడే వాడు. ఇలాంటి స్థితిలో మళ్ళీ పెళ్ళి చేసుకో మని తల్లి పోరుతూ వుండేది. ఎన్ని సంబంధాలు వచ్చినా తిరస్కరించాడు. కానీ మృదులా దేవిని చూశాక మనసు మార్చు కోక తప్ప లేదు.

తమ లాగే చితికి పోయిన కుటుంబం వారిది. కట్న కానుకలు ఇచ్చుకో లేని స్టేజిలో పాతికేళ్ళ మృదులా దేవిని నలభై ఏళ్ళ భూపతి పెళ్ళి చేసుకున్నాడు.

అప్పటికి కొడుకు అశోక్‌ భూపతి వయసు పధ్నాలుగేళ్ళు.

కూతురు కీర్తన వయసు పదేళ్ళు.

కొత్తగా ఇంట్లోకి వచ్చిన పిన్ని వంక కొత్తగా చూశారు పిల్లలిద్దరూ. కీర్తన అందంగా వున్న పిన్ని వంక చూసి సంబర పడింది.
అశోక్‌ మాత్రం ఏ భావమూ వ్యక్త పరచ లేదు. తండ్రి పరిచయం వేశాక అలా కాసేపు నిలబడి బయటికి వెళ్ళాడు. ఆ తర్వాత అతని జీవితాన్ని గనుక క్షుణ్ణంగా పరిశీలిస్లే ఆరోజు నుంచే అతని జీవిత కాలమంతా బయట గడపడానికి సిద్ధమయ్యాడన్న విషయం బోధ పడ్తుంది....
అందరు ఆడ పిల్లల్లా ఆమె కూడా జీవితం గురించి ఎన్నో కలలు గంది. అందమైన రాజ కుమారుడు వచ్చి తనని గుర్రం ఎక్కించి తీసుకు వెళ్తాడనే కల కూడా అందులో వుంది.

అయితే తను జమిందారీ బిడ్డ కాబట్టి ఆ కల కనడానికి తనకు హక్కు ఉందనుకొంది మృదులా దేవి.....

చూస్తుండ గానే కళ్ళ ముందు ఆస్థులన్నీ కరిగి పోయాయి. సామాన్యమైన పెళ్ళి కొడుకుని వెతక లేక జమిందారీ పెళ్ళి కొడుకు దొరకని పరిస్థితిలో భూపతి విషయం తెలిసింది.....

ఎదిగిన ఇద్దరు బిడ్డ తండ్రి....

చేసేదేం లేక అయిష్టం గానే ఒప్పుకుంది మృదులా దేవి. అయితే అత్త గారిలా కాక ఆమె చాలా తెలివైంది.

అత్త గారి జమీ చితికి పోయినా పూర్తిగా చెయ్యి దాటి పోలేదని తెలుసుకుంది.

జాగ్రత్త పడితే హాయి గానే బతకొచ్చు. అంతే! మెల్లమెల్లగా అధికారాన్ని హస్తగతం చేసుకోవడం ప్రారంభించింది.
అందమైన భార్య....

వయసులో తన కన్నా చాలా చిన్నది.

భూపతికి ఎదురు తిరిగే ఆస్కారం లేక పోయింది.

అత్త గార్నీ, భర్త పిల్లల్నీ నోరు ఎత్తనివ్వకుండా చేసి సమస్తం తన స్వాధీనం లోకి తెచ్చుకుంది.

అలాగని ఆమె గయ్యాళిలా అందరినీ హింసించే రకం కాదు. ఆమె తనకి కావలసింది మెత్త గానే సాధించుకుంటుంది. అనుకుంటే సాధించి తీరుతుంది. అదీ తత్వం.

భూపతి పూర్తిగా నిస్తేజంగా తయారయ్యాడు.

అతని పవర్‌ అంతా నామ మాత్రంగా తయారయింది. మృదులా దేవి వచ్చాక పాత పద్ధతులన్నీ పోయి, మోడరన్‌ వ్యవహారం ప్రారంభమయింది.

అనవసరమైన వర్కర్స్‌ అందరినీ తీసి వేసి కావలసిన వాళ్ళనే వుంచింది.

డబ్బు వ్యవహార మంతా తన చేతుల్లోనే వుండేది.

పెళ్ళయిన మూడేళ్ళకే భూపతికి పక్షవాతం వచ్చింది. మనిషి మంచంలో పడ్డాడు. వున్నా లేనట్లే లెక్క. మృదులా దేవి తట్టుకో లేని షాకది.....అయినా తేరుకుంది. ఆమె తన ఆనందం కోసం జీవించాలనుకునే మనిషి.

ఇక ఇప్పుడు ఆమెకి అడ్డు చెప్పే వాళ్ళు లేరు. పిల్లలు చిన్న వాళ్ళు కావడంతో బాధ్యతలు తీసుకునే ప్రసక్తి లేదు. ఒక వేళ వాళ్ళకి ఆ శక్తి వున్నా మృదులా దేవి పడ నివ్వ లేదు.

కీర్తన పదో తరగతి పరీక్షలు పాసయి వచ్చాక....

చదువు మాన్పించేసి పది హేనేళ్ళకే సంబంధం చూసి పెళ్ళి చేయడానికి నిశ్చయించు కుంది మృదులా దేవి.

కళ్ళ వెంట నీరు కారుతుండగా పెదవి విప్ప లేని స్టేజిలో వద్దన్నట్లు అభ్యర్ధించాడు భూపతి.

లెక్క చెయ్య లేదు...మృదులా దేవి.

అయితే మొదటి సారి ఆ ఇంటి నుండి వ్యతిరేకత అశోక్‌ రూపంలో వచ్చింది.

అప్పటికి అతను మేజర్‌.....

చెల్లి పెళ్ళి చేయడానికి వీల్లేదన్నాడు.

విభ్రాంతికి లోనైంది మృదులా దేవి. అయినా తన ప్రయత్నాలు మాన లేదు.

అది గమనించాడు అశోక్‌. అన్నాళ్ళ నుంచీ దాగిన ఏదో కసి బయట పడింది.  లాయర్లని సంప్రదించి తమ ఆస్తి పంచుకుని వేరే వెళ్ళి పోతామని, చెల్లి తమ సంరక్షణలో వుంటుందని బెదిరించాడు.

బవంతంగా పెళ్ళి చేయడానికి ప్రయత్నిస్తే పోలీస్‌ రిపోర్ట్‌ ఇస్తానన్నాడు.

దాంతో వెనక్కి తగ్గక తప్ప లేదు మృదులా దేవికి.

అయితే ఆమె అంతంత మాత్రంతో వెనక్కి తగ్గే మనిషి కాదు.

ఎదురు దాడి వేరే రూపంలో ప్రారంభమైంది. ఇంట్లో వుండటం కన్నా పెళ్ళి చేసుకుని బయటికి పోవడమే ఉత్తమమనే పరిస్థితులు కల్పించడం ప్రారంభించింది.అయితే కీర్తన చలించ లేదు.

జయాప జయాల్ని సమానంగా స్వీకరించే క్రీడా స్ఫూర్తి ఉన్న మనిషి ఆమె. ఆ స్ఫూర్తిని జీవితానికి అన్వయించుకుందామె! వచ్చిన కష్టాల్ని నిబ్బరంగా ఎదుర్కోనేది.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
atadu..aame..oka rahasyam