Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
nadaina prapancham

ఈ సంచికలో >> సీరియల్స్

అతడు..ఆమె..ఒక రహస్యం

atadu..aame..oka rahasyam

గత సంచికలోని అతడు-ఆమె-ఒక రహస్యం సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.  http://www.gotelugu.com/issue203/582/telugu-serials/atadu-aame-oka-rahasyam/atadu-aame-oka-rahasyam/

( గతసంచిక తరువాయి ).... “అవునండీ. తన జీవితంలో జరిగిన మార్పు గానీ, ఏదైనా కొత్తగా బయట పడ్డ విషయం గానీ... ఏదైనా సమ్ థింగ్ న్యూ... మీకు చెప్పిన విషయం గుర్తుకు తెచ్చుకుంటే, మనం ఆ దిశగా పరిశోధన ప్రారంభించచ్చనిపిస్తోంది”

పాణి ఆలోచనలో పడ్డాడు. ముందు రోజు ఆమె కళ్ళని చూడగానే ఆమె తనని నిజంగా పాణి స్నేహితుడిగానే అనుకుంటూ,  తననుంచి ఏదో విషయాన్ని తెలుసుకోవాలనుకుంటోందని ‘ఐ రీడింగ్’ ద్వారా ఊహించాడు. ఇప్పుడు ఆమె సంభాషించే విధానం చూస్తే అది నిజమని నిర్ధారణ అవుతోంది.  ఆమె తెలుసుకోవాలనుకుంటున్న విషయం ఏమిటి?

ఆమె పరిగెత్తడం ఆపి, ఒక దగ్గర ఆగింది ఆయాస పడుతున్నట్టుగా.  గుండెలు ఎగిరెగిరి పడుతున్నాయి.  రెండు క్షణాలు గుండెల నిండా గాలి పీల్చుకుని వదిలింది.  రెండు చేతులూ పైకి  క్రిందకీ ఊపుతూ,  రెండు కాళ్లనీ దూరంగా, దగ్గరగా చేస్తూ  చిన్నగా   ఎక్సర్ సైజ్ చెయ్యడం మొదలు పెట్టింది..

ట్రాక్ సూట్లో ఆమె అంత దగ్గరగా అలా ఎక్సర్‍సైజులు మొదలు పెట్టేసరికి పాణి గుండె లయ తప్పింది. 

“ఏమైనా గుర్తుకు వచ్చిందా?”   అతడు ఏదో సంగతి చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్నాడన్న విషయం  ఆమెకి అర్ధమై,  కుడి చేత్తో  ఎడమ కాలి బొటన వేలుని అందుకోవడానికి వంగుతున్నట్టుగా ముందుకు వంగుతూ అంది.

అర క్షణం పాటూ పాణి గుండె ఆగిపోయినట్టుగానే అనిపించింది.  ఒక అద్భుతాన్ని మొదటి సారి చూసినప్పుడు సంభ్రమం కలుగుతుంది.  మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. రెండో సారి చూసినప్పుడు మోహం కలుగుతుంది. మూడో సారి చూసినప్పుడు సొంతం చేసుకోవాలన్న కాంక్ష కలుగుతుంది.   మనుషుల మనస్తత్వం ఇంద్రనీల కి బాగా తెలుసు.

ఈ సారి ఎడమ చేత్తో కుడికాలి బొటన వేలుని అందుకోవడానికి వంగింది. ఆ వంగడంలో, కావాలనే అతడికి తన నడుము తగిలేలా ఒంగింది.  అతడు పక్కకి తప్పుకోవడానికి ప్రయత్నిచడంతో, ఆమె బ్యాలన్స్ తప్పి పడబోతే, అతడు రెండు చేతులతో అప్రయత్నంగా ఆమె నడుముని పట్టుకుని ఆపాడు.

క్షణంలో సగం సేపు... చేతులకి షాక్ కొట్టినట్టుగా అనిపించింది పాణికి.

“సారీ” అంటూ  సరిగ్గా నిలదొక్కుకుంటూ అడిగింది “ఏమైనా గుర్తొచ్చిందా?”

“మీరు అడుగుతుంటే ఒక విషయం గుర్తొస్తోంది” మెస్మరిజానికి గురయిన వ్యక్తిలా అన్నాడతడు.

“ఏమిటది? చెప్పండి?” అంది ఉత్సాహంగా. అంతటి ఉత్సాహంలోకూడా  తన శరీరం అతడికి తగిలీ తగలనంత దగ్గరగా ఉండేలా చూసుకోవడం మర్చిపోలేదు ఆమె.

“ఈ మధ్యన మాటల్లో ఈ కోటలో పూర్వీకుల తాలూకు అపూర్వమైన నగలు రెడ్ డైమండ్స్ పొదిగినవి  తవ్వకాల్లో దొరికాయని చెప్పాడు. ఆ సంపద విలువ కొన్ని కోట్లు ఉంటుందట!”  నెమ్మదిగా అన్నాడు పాణి.

“ఏం చేసాడు ఆ నగలని? ఎక్కడ ఉంచాడట?  ఇది కాకుండా ఇంకేమైనా చెప్పాడా?”   ఆత్రుతగా అడిగిందామె.

“ఏమో తెలియదు.  ఆ సంపదని ఏం చేసాడూ, ఎక్కడ ఉంచాడన్న వివరాలు అతడు నాతో చెప్పలేదు. బహుశా ఆ సంపద కోసమే ఎవరైనా అతడ్ని హత్య చేసి ఉంటారంటారా?” అడిగాడతడు.

వేరే ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఆమె అతడి మాటలని సరిగ్గా వినలేదు మొదటి సారి “ఏమంటున్నారు?” అంది.

అతడు మళ్ళీ అదే ప్రశ్నని రిపీట్ చేసాడు.  “చెప్పలేం. ఇంకా ఏమైనా ముఖ్యమైన విషయం అతడు మీతో చెప్పాడా?”  అందామె మరోసారి అతడి ముఖంలోకి ఆశగా చూస్తూ.

“లేదు. ముఖ్యంగా అతడి మాటల్లో ఎప్పుడూ జీవితమ్మీద విరక్తి కానీ దేనికైనా భయపడుతున్నట్టు కానీ సూచనలు కనపడేది కాదు.  ఇలా జరుగుతుందని అతడి మాటల్లో ఏమాత్రం హింట్ ఇవ్వలేదు. లేదా నేను సరిగ్గా గ్రహించలేదో?  మాటల్లో చాలా విషయాలు క్యాజువల్‍గా  మాట్లాడుకుంటూ  ఉంటాం. అన్నీ గుర్తు పెట్టుకోం. ఏది ముఖ్యమైనదో  ఇలాంటప్పుడు కానీ తెలియదు” అన్నాడు అతడు  నవ్వుతూ.

ఆమె నవ్వలేదు. ఎందుకో నిరాశపడ్డట్టుగా ఉంది ఆమె ముఖం. మరో ఐదు నిమిషాల తరువాత  అదే దారిలో జాగింగ్ చేసుకుంటూ బంగళాలోకి వెనక్కి వెళ్ళిపోయారు ఇద్దరూ.  తిరిగి వెళ్ళేటప్పుడు ఆమెలో అంతకు ముందున్న ఉత్సాహం లేకపోవడాన్ని గమనించాడు పాణి.

వాళ్ళు బయట నుంచి  వచ్చేసరికి కిచెన్లోంచి కమ్మని కాఫీ వాసన వస్తోంది. ఆ వాసన చూస్తే పాణికి ప్రాణం లేచొచ్చినట్టౖంది.

“కిచెన్లో కాఫీ చేస్తున్నట్టున్నారు.  మీరు కాఫీ తాగుతారా?”  అన్నాడు పాణి.

“నాకు అలవాటు లేదు.  మీరు వెళ్ళండి. నేను ఫ్రెష్షై వస్తాను” అంది ఇంద్రనీల.

పాణి కిచెన్ వైపు నడిచాడు.

“కాఫీ కావాలా దొరా?”  వాళ్ళని చూస్తూనే అన్నాడు  వంటగదిలో  ఉన్న నరసింహ.

“అవును. ఒక పెద్ద కప్పుడు వేడిగా పట్టుకురా” అన్నాడు  పాణి డైనింగ్ టేబిల్ దగ్గర కూర్చుంటూ. అర్ధరాత్రి దాటే వరకూ  పార్టీలో మేలుకుని   చనిపోయిన రాజేంద్ర ‘ఆత్మశాంతికి’  కృషి చేసి ఉండటంతో బంగళాలో జనం అంతా ఎక్కడివాళ్ళక్కడ గాఢ నిద్రలు పోతున్నారు. ఎవ్వరూ ఇంకా మేలుకోలేదు.

రెండు నిమిషాల్లో కమ్మటి వాసనలు వెదజల్లుతున్న వేడి వేడి కాఫీని తీసుకొచ్చి అతడి ముందర పెట్టాడు నారసింహ.

“నువ్వు చేస్తున్న కాఫీ వాసన  కోట బయటకి వస్తోందోయ్.  అది చూసే ఇక్కడ కాఫీ రెడీ అయిందని తెల్సి  వచ్చాను”    

“చనిపోయిన చిన్న రాజావారు కూడా ఇలానే అనేవారు సారూ  ఆయనకి కాఫీ అంటే చాలా ఇష్టం. ఆయనకోసం తమిళనాడు తోటలనుంచి ప్రత్యేకంగా ఏరిన మేలిరకం కాఫీ గింజలని ఆడించి తయారు చేసే కాఫీపొడి  వస్తుంది బంగళాకి.  రాత్రి తిన్నా తినకపోయినా ఉదయం నా చేతి కాఫీ తాగనిదే రోజుని ప్రారంభించేవారు కాదాయన. చనిపోయే రోజు కూడా క్రింద నేను కాఫీ తయారు చేసి  రాజా వారు వస్తారేమోనని ఎదురుచూస్తున్నాను”    బాధపడుతున్నట్టుగా అన్నాడు నరసింహ.

“రాజావారు చనిపోయిన రోజు రాత్రి నువ్వేనా బంగళాలో ఉన్నది?” అడిగాడు పాణి.

“అవునండీ. బంగళాలో సాధారణంగా రాత్రుళ్ళు ఉండేది ఎక్కువగా నేనే. నేనూ మా ఆవిడ లక్ష్మీ ఉంటూ ఉంటాం”

“ఎన్నాళ్ళ నుంచీ పని చేస్తున్నావు ఇక్కడ?”

“నాకు పుట్టి బుద్దెరిగిన దగ్గర నుంచీ ఇక్కడే పని చేస్తున్నానండీ”

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్