Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
weekly horoscope 17th march to 23rd march

ఈ సంచికలో >> శీర్షికలు >>

పర్యాటకం - ..

paryatakam

లేహ్ లోయ అందాలు

జమ్ము కశ్మీరు రాష్ట్రం లో లదాక్ జిల్లా ముఖ్య పట్టణం లేహ్ . భారత దేశంలో రెండవ పెద్ద జిల్లాగా సుమారు 45,110 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణం కలిగి వుంది . అతి పెద్ద జిల్లాగా గుజరాత్ లోని కచ్ జిల్లా మొదటి స్థానంలో వుంది . 

లేహ్ చేరుకోడానికి కశ్మీరు లోయ మీంచి
NH -1D మీద  సోనె మార్గ్ , ద్రాస్ , కార్గిల్ , నిమ్మో మీదుగా సుమారు 419 కిలో ప్రయాణించి చేరుకోవచ్చు లేదా ఛండీగఢ్ , మనాలి , రొహతాంగ్ పాస్ , స్పితి వేలీకి పక్కగా ప్రయాణించి చేరుకోవచ్చు . ఛండీ గఢ్ మీదుగా అయితే సుమారు 773 కిలో మీటర్ల దూరం ప్రయాణించాలి . అయితే మేం శ్రీనగరు మీదుగా లేహ్ చేరి తిరుగు ప్రయాణం లో రోహతాంగ్ , మనాలి మీదుగా ఛండీ గఢ్ చేరుకున్నాం కాబట్టి మొత్తం ఆ ప్రాంతాన్ని పూర్తి చేసుకున్నాం .

మేం వెళ్లింది మిలిటరీ దారిలో , మిలటరీ వారితో కాబట్టి కొన్ని లాభాలు నష్టాలు సరిసమానంగా అనుభవించేం . లాభాలు యేమిటీ అంటే అంత చలి ప్రదేశంలో వేడి వేడి భోజనాలు మంచం దిగక్కరలేకుండా లభించడం , చూడ వలసిన ప్రదేశాలకి వారి జీపులలో కట్టు దిట్టమైన భద్రతా వలయం లో ప్రయాణం అయితే నష్టాలు మిలిటరీ ట్రక్కులో యినుప బెంచీలమీద ప్రయాణించడం . అయితే దాన్ని మేం నష్టంగా కాక అదో అనుభవం గా అనుకున్నాం . ఆ భావన రాగానే ఆర్మీ వారి మీద గౌరవం పెరిగింది .

లదాక్ జిల్లాని మంచు యెడారి అంటే సరిపోతుందేమో ? యెక్కడా మొక్క మోడూ లేని ప్రదేశం . కాస్త పచ్చగా మొక్కలున్న ప్రదేశం చుట్టూ జనావాసాలు తప్ప మిగతా ప్రాంతమంతా యెడారిలా ధూళి దుమ్మూ .

యెక్కువగా సంచార జాతికి చెందిన టిబెటియన్లు మాత్రమే కనిపిస్తారు . పర్యాటకుల రద్దీ పెరగడంతో మట్టి యిళ్లు నిర్మించుకొని , పర్యాటకుల అవుసరాలు తీరుస్తూ  కాలం వెళ్ల దీస్తున్నారు . యేడాది పొడవునా మంచు కురుసే పర్వత ప్రాంతం కావడంతో పంటలు పండటం కూడా తక్కువే , మొత్తం లదాక్ జిల్లాలో ' కలట్సే ' ప్రాంతం లో మార్చి , ఏప్రెల్ మాసాలలో బార్లీ పంట పండుతుంది . ఈ పంటకు కావలసిన నీటి వసతి సింధునది నుండి లభిస్తుంది .

లేహ్ నగరం సముద్ర మట్టానికి సుమారు 3500 మీటర్ల యెత్తులో వుంది . 

హిందూదేశాన్ని పరిపాలించిన కుషాను రాజుల కాలంలో చైనా వారు వ్యాపారనిమిత్తం యీ మార్గం గుండా భారతదేశానికి వచ్చేవారు .

లేహ్ నగరం బౌద్ద ఆరామాలకు , స్థూపాలకు ప్రసిద్ది , అంటే శిల్పకళకు అని కాదు , బౌద్ద భిక్షువులు యెక్కువగా పర్యటించిన ప్రదేశాలుగా గుర్తించి స్థూపాలను నిర్మించేరు . శిక్కు మత స్థాపకుడు గురు నానక్ యీప్రాంతాన్ని సందర్శించేరు . స్థానికులు గురునానక్ ని బుద్దుని మరో జన్మగా తలచి పూజిస్తారు . ఈ ప్రాంతం బౌద్దులలోని రెండు తెగలవారూ అంటే దలైలామాని గురువుగా సమ్మతించిన వారు , కర్మపా ని అనుసరించేవారూ కూడా వారి వారి స్థూపాలను నిర్మించుకోడం విశేషం .

లేహ్ నగరం లో పెద్ద పెద్ద కట్టడాలు లాంటివి యేమీ వుండవు . నగరం చుట్టూరా వున్న మంచు పర్వతాలు తప్ప చూడ్డానికి మరేమీ వుండదు . మంచు పర్వత ప్రాంతాలు అంటే పచ్చని పచ్చిక మైదానాలు , సెలయేళ్లు , సరస్సులతో ఊహించుకునే నాలాంటి వాళ్లకి నిరాశే మిగులుతుంది .  మట్టి తప్ప యేమీ వుండదు . పిచ్చి గాలులకి మన్ను యెగురుతూ చిరాకు పరుస్తుంది .

లేహ్ లో ముఖ్యంగా చూడదగ్గ ప్రదేశాల గురించి చెప్పుకుందాం .

ముందుగా వందల సంవత్సరాల చరిత్ర కల రాజభవనం గురించి తెలుసుకుందాం .

సుమారు 1645 లో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన న్యంగాల్ వంశ రాజులు టిబెట్ లో అయిదవ దలైలామా చే నిర్మింపబడ్డ ' పటోలా ' రాజభవనాన్ని పోలిన భవనాన్ని నిర్మించేరు . ఒక చిన్న గుట్ట మీద తొమ్మిది అంతస్తులలో నిర్మించిన యీ భవనం లో పై అంతస్తులు రాజ వంశీయుల నివాసం గాను కింద అంతస్తులు పశు నివాసాలు , ధాన్యాగారం , ఆయుధాగారం , ధనాగారాల కోసం కేటాయించేరు . 19 వ శతాబ్దం లో డోగ్రా రాజుల చేతిలో వోటమి పాలయిన తరువాత యీ భవనాన్ని న్యంగాల్ రాజులు విడిచి పెట్టి స్టోక్ భవనానికి వెళ్లి పోయేరు . డోగ్రా రాజులు కూడా తగినంత శ్రద్ద తీసుకోకపోవడం వల్ల యీ భవనం పాడుపడిపోయింది . ప్రస్తుతం సుమారుగా నేలమట్టం అయేస్థితిలో వుందీ భవనం . భవనం పై అంతస్తు నుంచి చూస్తే దక్షిణాన సింధునది లోయ , ఝంగ్సార్ పర్వత శ్రేణులు , ఉత్తరాన లదాక్ పర్వతశ్రేణులు మధ్యన లేహ్ నగరం కనువిందు చేస్తుంది . నగరమంతా తిరిగి చూసినప్పుడు ధూళి దుమ్ము తప్ప యే అందాలు కనిపించలేదు , కాని రాజభవనం పైనుంచి చూస్తే చాలా అందంగా కనిపించి ' దూరపు కొండలు మునుపు ' అనే సామెత నిజం అనిపించింది .

రాజభవనం లో వున్న మ్యూజియం చాలా బాగుంది , అందులో రాజ వంశస్థులకు చెందిన పురాతనమైన నగలు , దుస్తులు , ప్రత్యేక దినాలలో వాడే దుస్తులు భద్ర పరిచేరు . ఆయుధాలు , కిరీటాలు కూడా చూడొచ్చు . సుమారు 450 సంవత్సరాల కిందటి టిబెట్ కి చెందిన ఢంకా లేక సూత   కళగా పిలువబడే పెయింటింగ్సు ను చూడొచ్చు . రాజస్థాన్ లో వెజిటబుల్ కలర్స్ వుపయోగిస్తే యిందులో వీరు నవరత్నాలను పొడి చేసి  వాటిని పెయింటింగ్సులో వాడుతారు .

ఈ మ్యూజియం లో వున్న రాణీ వాసపు స్త్రీలు వాడిన' Amber ' లు పొదిగిన ఆభరణాలు ప్రత్యేక ఆకర్షణ .

ఈ భవనం ఆర్కియాలజికల్ సర్వే వారి సంరక్షణ లో వుంది .

శాంతి స్థూపం ---

1985 లో జపాన్ వారు భారతదేశంలో చాలా చోట్ల నిర్మించిన శాంతి స్థూపాలలో యిదొకటి . శాంతికి చిహ్నంగా తెల్లని రంగులో వృత్తాకారంలో నిర్మించి కింద అంతస్తు  లో బుద్దుని జీవిత చరిత్రని చిత్రీకరించేరు . వివిధ దేశాల కి చెందిన బౌద్దభిక్షువులు  ధ్యానం చేసుకుంటూ కనిపిస్తారు

మళ్లా వారం మిగతా విశేషాలతో పాటు రంగులు మారే సరస్సు గురించి చదువుదాం ,

మరిన్ని శీర్షికలు
satya sai baba information