Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
sri satya sai baba information

ఈ సంచికలో >> శీర్షికలు >>

శ్రీరామనవమి ( రామాతీర్థాలు) - కర్రా నాగలక్ష్మి

sriramanavami special artical

ప్రతీ సంవత్సరం చైత్ర శుక్ల నవమిని శ్రీరామ నవమిగా ప్రపంచ వ్యాప్తంగా వున్న హిందువులు హర్షోల్లాసాలతో జరుపుకుంటారు . భారతదేశంలోని ఉత్తర భాగానికి చెందిన హిందువులు చైత్ర పాడ్యమి నుంచి చైత్ర నవరాత్రులు గా ఉపవాసదీక్షలు చేపడతారు . తొమ్మిదవరోజును శ్రీరామనవమిగా రాముని పూజించుకొని  దశమితో ఉపవాస దీక్షను విరమిస్తారు . ఉభయ తెలుగు రాష్ట్రాలవారు శ్రీరామ నవమిని  పోటీలు పడి మరీ  వైభవంగా జరుపుతారనేది మనందరకీ తెలుసు .

శ్రీరామనవమి ఉత్సవాలు మొదటి రోజు అంటూ నవమినాడు శ్రీరాముని జన్మదినంగాను , మరునాడు సీతారామకల్యాణం , సాయంత్రం లేక మరునాడు శ్రీరామ పట్టాభిషేకం తో ముగుస్తాయి . చిన్న పెద్ద అనే తేడాలేకుండా దేశవ్యాప్తంగా అన్ని గ్రామాలలోనూ యిదే తీరుగా రామనవమి జరుపుకోవడం ఆనవాయితీ , రామనవమికి వడపప్పు , పానకాలు పంచడం కూడా ఆనవాయితీవే .

శ్రీరాముని జన్మ వృత్తాంతాన్ని తెలియ జేసేదే రామాయణ కావ్యం .దీనిని ఆది కావ్యాన్ని కూడా అంటారు . 

త్రేతాయుగం లో 24 వేల శ్లోకాలు , 7 ఖండాలు , 4 లక్షల 80 వేల రెండు పదాలు గల రామాయణ కావ్యాన్ని వాల్మీకి సంస్కృతం లో రచించేడు . శ్రీరాముడు నెలత్పిన సీతమ్మను అరణ్యం లో విడిచి పెట్టినప్పుడు వాల్మీకి సీతమ్మకు ఆశ్రయం యిస్తాడు . అక్కడే సీత లవకుశులకు జన్మనిస్తుంది . మొదటి సారి రామాయణ కావ్యాన్ని లవ కుశులకు నేర్పించి అయోధ్యలో రామ సభలో అందరికీ వినిపింప జేస్తాడు .

సుమారుగా అన్ని భాషలలోనూ కొన్ని వేల సంఖ్యలో అనువదించబడిన రామాయణానికి మూలం వాల్మీకి రామాయణమే .
త్రేతాయుగం లో రాయబడ్డ రామాయణ కావ్యం దానితరువాత ద్వాపరయుగం గడిచి పోయింది , కలియుగం ప్రవేశించింది అయినా రామాయణం మీద యెవ్వరికీ మోజు తగ్గలేదు , వెగటు కలుగలేదు . ఎందుకంటారూ ? ఆ రామ నామం లో అంత మాధుర్యం వుంది , మనసులోని చింతలను తీర్చే శక్తి రామ నామానికి మాత్రమే వుంది . సర్వపాపాలను కడిగివేసే శక్తి రామనామానికే వుంది . ద్వాపరయుగంలో కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడు అన్నదమ్ములపై ఆయుధాలను ప్రయోగించ లేనని యుధ్దభూమినుండి మరలి పోదామని కృష్ణునితో అంటే శ్రీకృష్ణుడు తన విశ్వరూపమును ప్రకటించి అర్జునునికి భగవద్గీత వినిపిస్తాడు . భగవద్గీత లో విష్ణుసహశ్రనామం కూడా చెప్పబడింది , అందులో పార్వతి పరమేశ్వరుని విష్ణుసహశ్రనామ స్తోత్రం చదివినంత ఫలం దక్కాలంటే సూక్షంగా యేం చెయ్యాలని అడుగుతుంది . , అప్పుడు పరమేశ్వరుడు వ్యాధి గ్రస్థులై నవారు , చిన్నపిల్లలు , సమయం లేనంతగా వారి వారి పనులలో నిమఘ్నమైనవారు ' శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమ సహస్రనామ తత్తుల్యం రామనామానికి వరాననే ' అనే మంత్రం జపిస్తే చాలు అదే విష్ణు సహశ్ర నామాలతో సమానం అని చెప్తాడు . అంటే రామ నామం ఒక్కటీ సుమారు వంద విష్ణునామాలతో సమానమన్నమాట .

నామ ఉఛ్చారణ  మాత్రాన యింతటి పుణ్యం లభిస్తుంది అంటే రాముడు సామాన్యుడు కాడు కారణజన్ముడు అని మనకి తెలుస్తోంది . 
విష్ణుమూర్తి   భూలోకంలో పాపులు , పాపకర్మలు పెరిగిపోయి ధర్మం నశించి పోతున్నప్పుడు  తాను అవతారం ధరించి పాపులను సంహరించి ధర్మాన్ని  కాపాడుతానని బహ్మాండోత్పత్తికి ముందు చెప్తాడు . సత్యయుగము లేక కృతయుగా  పిలువబడే మొదటి యుగంలో భగవానుడు మత్య , కూర్మ , వరాహ , నృసింహ అవతారాలను ధరించి రాక్షస సంహారం గావించి ధర్మాన్ని రక్షిస్తాడు . త్రేతాయుగంలో వామన , పరశురామ , రామ అవతారాలను ధరించెనని ద్వాపరయుగంలో బలరామ , కృష్ణ అవతారాలను ధరించెనని , కలియుగాంతానికి భూలోకంలో ధర్మాన్ని రక్షించడానికి కల్కి అవతారం యెత్తుతానని భగవంతుడు గీతలో శలవిచ్చేడు . వీటిని మనం దశావతారాలుగా వ్యవహరిస్తూ వుంటాం .

దశావతారాలలో యేడవదిగా చెప్పబడే రామావతారం గురించి తెలియజేసే కావ్యమే రామాయణం .

దశావతారాలలో రామ కృష్ణావతారాలు యిప్పటికీ ప్రజాదరణ పొందుతున్నాయి . ఈ రెండు అవతారాలు కూడా మానవ జన్మలు కావడం , భగవంతుడు మానవ రూపంలో అనుబంధాలుచ.  , రాగద్వేషాలు , కష్టాలు , సుఖాలు అనుభవిస్తూ మనిషికి సామాజికంగా వున్న బాధ్యతలను తెలియజేసే అవతారాలు కావడంవల్లనేమో రామ కృష్ణ అవతారాలు ప్రజల గుండెలలో హత్తుకు పోయేయి .

ఏక పత్నీవ్రతుడు , పురుషోత్తముడు , సకల గుణాభి రాముడు , సీతారాముడు , రఘుకులతిలకుడు మొదలయిన బిరుదులను పొందిన రాముని జన్మదిన పర్వదినాన రామాతీర్థం అనే పుణ్య స్థలం గురించి తెలుసుకుందాం .

ఆంధ్రరాష్ట్ర ప్రజల మనసులలోనూ శాసనసభలోనూ రామనవమి యెక్కడ జరుపుకోవాలి అనే ప్రశ్న చాలా రోజులు గందరగోళాన్ని సృష్టించినపుడు ప్రజల , పాలకుల మనసులలో రెండు ప్రదేశాలు గురించి చర్చలు జరిగేయి అవి ఒకటి రామాతీర్థం , రెండవది ఒంటిమిట్ట . చివరగా ఒంటిమిట్ట రామనవమి వుత్సవాలకు అనువైనదిగా నిర్ణయం జరిగింది . ఆ రామా తీర్థమే యిది .

సరే యింక రామాతీర్థం గురించిన వివరాల్లోకి వెళదాం .

రామా తీర్థం విజయనగరం జిల్లాలో నెల్లూరు మండలంలో వున్న చిన్న గ్రామం . విజయవాడ నుంచి హౌరా వెళ్లే ముఖ్య రైలు మార్గం లో వుంది . విజయనగరం రైలు స్టేషను రామా తీర్ధానికి అతి దగ్గరగా అంటే సుమారు 14 కిలో మీటర్ల దూరంలో వుంది  . ఆంధ్ర రాష్ట్ర ముఖ్య పట్టణం అమరావతికి సుమారు 465 కిలో మీటర్లు , విశాఖ పట్నం విమానాశ్రయానికి సుమారు 64 కిలో మీటర్ల దూరం లో వుంది రామాతీర్థం . విజయనగరం నుంచి బస్సు , టాక్సీ సౌకర్యాలు విరివిగా దొరకుతాయి  .

విజయనగరం పట్టణపరిసరాలు దాటిన తరువాత మన వరిపొలాలు , మామిడి తోటలలోంచి సాగే ప్రయాణం హఠాత్తుగా  కొండల మధ్యకు చేరుతుంది . చుట్టూరా రాతి కొండల మధ్య చిన్న గ్రామం కనిపిస్తుంది . నాలుగయిదు పూజా సామగ్రి విక్రయించే దుకాణాలు , కల్లాపు జల్లి , తెల్లని ముగ్గు పిండితో దిద్దిన రంగవల్లుల ముంగిళ్లతో వున్న పెంకుటిళ్లు మనకి స్వాగతం పలుకుతాయి .

ఈ గ్రామం వున్న ప్రాంతం అంతా రాతి కొండలే , అలాంటి ఓ రాతి కొండమీద వుంది రామమందిరం ,  రామ మందిరం వున్న కొండని ' బావి కొండ ' అని అంటారు . ఈ కొండకు దిగువున భాస్కర సరస్సు , నీలాచలం కొండల మధ్యనుంచి మెలికలు తిరుగుతూ  చంపానది ప్రవహిస్తోంది .

బావి కొండ పైకి చేరడానికి మెట్లదారి వుంది , చాలా సులువుగా యెక్కవచ్చు . ఇప్పుడిప్పుడే ప్రాముఖ్యతను సంతరించు కుంటున్న మందిరం కావడం తో పండగ రోజులలో తప్ప  భక్తులు చాలా తక్కువగా కనిపిస్తారు . రామాలక్ష్మణసీతల రాతి విగ్రహాలు కళ్లుతిప్పకో నివ్వవు . పక్కగా నల్లరాతి హనుమంతుని విగ్రహం మరో పక్కగా యిత్తడి వుత్సవ విగ్రహాలు వున్నాయి . చిన్న మందిరం మందిర ప్రాంగణం లో కొన్ని తాబేళ్లు పెంచుతున్నారు . ఇవి ప్రత్యేకమైనవని అంటారు . వీటి వీపు పైన వున్న గీతలు విష్ణు నామాలని యిక్కడివారి నమ్మకం . మందిరానికి యెదురుగా వున్న పుష్కరిణి వుంది కాని కాస్త నిరాదరణకు గురైందని అనిపించింది .

ప్రతీ వూరుకి ఒక రామమందిరం వుంటుంది , ఈ మందిరానికే యెందుకింత ప్రాముఖ్యత వుంది , పోనీ మందిరం లో కళ్లు చెదర శిల్ప కళ వుందా అంటే అదీకాదు  మరి  యీ మందిరానికి యే ప్రాముఖ్యత వుండడం వల్ల బద్రాచలం తో పోటీ పడగలిగింది అంటే కారణం త్రేతాయుగం లో శ్రీరాముడు వనవాస సమయం లో కొంతకాలం యీ ప్రాంతాలలో నివసించడమే .

ఈ మందిరం క్రీస్తుపూర్వం మూడవ శతాబ్ధం లో నిర్మించినదైనా యీ ప్రాంతం స్థలపురాణం మాత్రంత్రేతాయుగానికి చెందినది . త్రేతాయుగంలో శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతంగా వనవాససమయంలో కొంతకాలం యీ ప్రాంతంలో నివసించినట్లు ఆనవాళ్లు లభించేయి . గర్భగుడిలో పూజలందుకుంటున్న మూల విరాట్టులు ద్వాపరయుగంలో మహాభారత కాలానికి చెందినవి .  పాండవులు అరణ్యవాస సమయంలో యీ ప్రాంతాలలో సంచరిస్తూ రాముని నివాసస్థలాన్ని దర్శించుకొని ఆ ప్రదేశంలో విగ్రహ ప్రతిష్ఠ చేసి శ్రీరాముని సీతాలక్ష్మణ సమేతంగా పూజించుకున్నారు . అవే విగ్రహాలు ఆలయంలో యివాళ  కూడా పూజలందుకుంటున్నాయి .

రామనవమి , వైకుంఠయేకాదశి యెంతో భక్తి శ్రద్దలతో వుత్సవాలు నిర్వహిస్తారు .

పెద్ద జియ్యరు స్వామి వారిచే ప్రతిష్ట చేయబడ్డ రామస్థంబం కూడా చూడొచ్చు .

మా తాతలు చెప్పిన దానిని బట్టి రామాతీర్థం లో శివరాత్రి వుత్సవాలు మూడు రోజుల పాటు అత్యంత భక్తి శ్రధ్దలతో జరుపుకుంటారు . చుట్టుపక్కల పల్లెలనుంచి భక్తులు బళ్లమీద వచ్చి , శివరాత్రి జాగారాలు చేసి , రాత్రి యీ కొండలమీద గడిపేవారట .

ఇప్పుడున్న మందిరం క్రీస్తు  పూర్వం మూడవ శతాబ్దానికి చెందినదిగా 1903 లో ఆర్కియాలోజికల్ సర్వేవారి రిపోర్టు లో దృవ పరిచేరు .

రామమందిరానికి పక్కగా 2007 శ్రీకామాక్షి సమేత శివమందిరం నిర్మాణం చేసేరు .

శ్రీరామ మందిర వున్న కొండను బావి కొండ అని యెందుకు పేరొచ్చిందంటే యెండాకాలంలో వచ్చే నీటి యెద్దడిని తట్టుకోడానికి వర్షపునీటిని  యీ కొండ మీద గుంతలు త్రవ్వి  నిలువచేసుకునేవారు , ఆ నీటి గుంతలను కాలక్రమాన బావులు అని పిలువసాగేరు . అలా యీ కొండకు బావికొండ అనే పేరు వచ్చింది .

బావి కొండ మీద బౌద్ధమతంలోని హీనయాన తెగకు చెందిన యెన్నో శిధిలాలు యిప్పటికీ చూడొచ్చు .

ఇంత దూరం వచ్చేం , రాముని దర్శనం చేసుకున్నాం , మరి చుట్టు పక్కల వున్న మిగతా దర్శనీయ స్థలాలు కూడా చూసేద్దాం .

ఇక్కడ బోధికొండ , గురుబక్తకొండ , దుర్గ కొండ దీనిని ఘని కొండ అని కూడా అంటారు . లు కూడా చూడదగ్గవి .

ఇక్కడ హిందూ మతములు కాక బౌద్ద , జైన మతాలు కూడా చాలా ప్రాచుర్యం లో వుండేవి అని యిక్కడ దొరికిన శిధిలాలు , త్రవ్వకాలలో లభించిన ఆధారాలు చెప్తున్నాయి .

బోధికొండమీద రాముని కి సంబంధించిన అనవాళ్లు జైన మతానికి చెందిన యిటుక కట్టడాల అవశేషాలు వున్నాయి . బోధికొండమీద వున్న సహజ కొండగుహలో జైన సన్యాసులకు ఆవాసాలు వుండేవి అనేదానికి యెన్నో ఆనవాళ్లు యిప్పటికీ వున్నాయి .

గురుబక్తకొండ మీద బౌద్ద మతానికి చెందిన అవశేషాలు చాలా వున్నాయి . బౌద్ధమతం ప్రచారంలో వున్న సమయంలో యీ ప్రదేశం ముఖ్య బౌద్దవిహారంగా వుండేదని చరిత్రకారుల కథనం . ఇక్కడ అయిదు బౌద్ద చైతన్య గృహాలు , అయిదు బౌద్దవిహారాలు , అయిదు  బౌద్ద స్తూపాల అవశేషాలు వున్నాయి . వీటిని చూస్తే యిక్కడ బౌద్దమతం అప్పట్లో బాగా ప్రాచుర్యం లో వుండేదని అర్దమౌతుంది . ఇక్కడ జరిగిన త్రవ్వకాలలో బుద్దుని విగ్రహాలు , శాతవాహనులకాలంనాటి నాణాలు , రాజముద్రలు లభ్య మయేయి . కొన్ని రాజ ముద్రల పైన   1వ రెండవ శతాబ్దాల మధ్య  యీ ప్రాంతాన్ని పరిపాలించిన ' శివ విజయరామరాజు సెలసఘస ' రాజుయొక్క రాజముద్రలు లభ్యమయేయి . ఈ కొండ పై భాగం వృత్తాకారం లో వుండి యెత్తు సుమారు 500 అడుగులువుంటుంది . ఈ కొండపైన నీటి జల వుంటుంది , ఈ జల శ్రీరాముడు వనవాస సమయంలో  తన బాణముతో నేలపై కొట్టగా అక్కడనుండి నీటి జల పుట్టిందట , యెంత యెండాకాలమైనా , చుట్టుపక్కల గ్రామాలు నీటి యెద్దడిని యెదుర్కుంటున్నా యీ జలలో నీళ్లు యెప్పుడూ యెండిపోవు , అలా యెప్పుడైనా జరిగితే ప్రళయమొస్తుందని యిక్కడివారి నమ్మకం .

దుర్గాకొండ లేక ఘనికొండ అని పిలువబడే కొండమీద సహజ గుహలో పెద్ద దుర్గాదేవి విగ్రహం వుంది . అయితే ఈ విగ్రహం యేకాలమైనా చెందిందో , యెవరు ప్రతిష్ఠంచేరో యేవిధమైన ఆధారాలు లభించలేదు .       

మరిన్ని శీర్షికలు