Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

అనుబంధాలు - పదహారవ భాగం

Anubandhaalu telugu serial sixteenth part

"వాడు పొలం పనుల్లో బిజీగా ఉన్నాడయ్యా. సాయంత్రం వస్తాడు" అంది భ్రమరాంబ.

రెండు సూట్ కేసులు అనంతసాయి గదిలోనూ, రెండు సూట్ కేసులు శివాని గదిలోను ఉంచారు. వాళ్ళిద్దరూ తమ గదిలోకి వెళ్లి స్నానాలు చేసి, డ్రస్సులు మార్చుకొని వచ్చేవరకు అంతా అక్కడే హాల్లో ఉన్నారు. తరువాత అంతా అన్నపూర్ణేశ్వరి మండువాలోకి వచ్చారు. అక్కడే అంతా భోజనాలు చేసారు. ఎంతో కమ్మగా, రుచిగా చేసిన వంటకాలు కూడా అన్నాచెల్లెల్లిద్దరినీ మెప్పించలేకపోయాయి.

వాళ్లకి హాట్ డాగ్స్, పిజ్జాలు ఇతర అమెరికన్ పుడ్స్ కి అలవాటుపడిన వాళ్ళు. ఇవే కూరలు, వంటలు అప్పుడప్పుడూ తమ ఇంట్లో కూడా అమ్మ చేస్తుంది. కాని వాటిని తినడం అలవాటు చేసుకోలేదు. ఎలాగో భోజనం చేశాం అనిపించుకొని లేచారు.

అమెరికా నుంచి తాము తెచ్చిన బహుమతుల్ని పేరు పేరున అందరికీ అందజేశారు. వాటిలో ఖరీదైన ఎలక్ట్రానిక్ పరికరాలు, వాచీలు, బట్టలు, ఆటవస్తువులు, నగలు లా చాలానే వున్నాయి. డాక్టర్ గోపాల్, సత్యవతులు ప్రత్యేకించి ఎవరికి ఏవి నచ్చుతాయో కొని పేర్లు రాసి మరీ పాక్ చేయించి పంపించడం చేత ఎవరికి వాళ్లకు అందజేయడంలో ఏ ఇబ్బందీ ఎదురవలేదు. నవీన్ కు పంపించిన రోలెక్స్ వాచీ మాత్రం మిగిలిపోయింది. దాన్ని శివాని దగ్గరే ఉంచేశాడు అనంతసాయి. సాయంత్రం అయ్యేసరికి అన్నాచెల్లెల్లిద్దరూ నిద్రకు తట్టుకోలేకపోయారు. తలుపులు బిడాయించి పడుకున్నవాళ్ళు కాస్తా మరునాడు ఉదయం వరకూ లేవనేలేదు. దాంతో చీకటి పడుతుండగా పొలంనుంచి ఇంటికొచ్చిన నవీన్ కి వాళ్ళిద్దర్నీ చూసే అవకాశమే రాలేదు.

మరునాడు ఉదయం... ఏడుగంటలకు ముందుగా అనంతసాయి నిద్రలేచాడు. అప్పటికి అరడజను సార్లు వాళ్ళు లేచారేమో చూడ్డానికి ఎవరో ఒకరు వచ్చి చూసి పోతూనే ఉన్నారు. కానీ ఎవరూ వాళ్ల నిద్రకు భంగం కలిగించలేదు. తను బ్రష్ చేసుకుని స్నానం చేసి రెడీ అయ్యాక వెళ్ళి బెడ్ రూమ్ తలుపుకొట్టి చెల్లెలు శివానీని నిద్రలేపాడు.

ఇంతలో వాళ్ళని పిలవడం కోసం మహేశ్వరి లోనకొచ్చింది.

పొద్దుటే తలారా స్నానం చేసినట్టుంది. వదులుగా జడవేసుకుని గులాబి తురిమింది. చీర, జాకెట్ లో కడిగిన ముత్యంలా మెరిసిపోతూ లోనకొచ్చిన మరదల్ని చూసి కాసేపు రెప్పవేయడం మర్చిపోయాడు అనంత్. ఆమె బుగ్గలు సిగ్గుతో ఎర్రబారగా ఎడంగా సోఫానానుకొని నిలబడిపోయింది.

"బావా! అమ్మ మీ ఇద్దర్నీ టిఫిన్ కి పిలుచుకు రమ్మంది" అంటూ వచ్చిన పని చెప్పింది.

"ఓహో! అమ్మ చెప్తే వచ్చావన్నమాట. నువ్వుగా రాలేదు" అన్నాడు నవ్వుతూ.

"ఎందుకు రావాలి?" గడుసుగా ఎదురు ప్రశ్నించింది.

"ఏం రాకూడదా?"

"అదే ఎందుకని అడుగుతున్నాను. అమెరికా నుంచి నువ్వెప్పుడైనా నాకు ఫోన్ చేసి ఒక్క మాట మాట్లాడావా? కనీసం నాకోసం చిన్న గిఫ్ట్ అయినా తెచ్చావా? అవున్లే. అమెరికా వాళ్లకి మాలాంటి పల్లెటూరివాళ్ళం గుర్తుంటామా ఏమిటి? అంది అక్కడ తామిద్దరమే ఉన్నారన్న ధైర్యంతో.

"అబ్బో! నీకు మాటలే సరిగా రావనుకున్నాను. బాగానే మాట్లాడుతున్నావ్"

"బాగుంది. తెలుగు మాటలు రాకపోవడానికి మేమేమన్నా విదేశాల్లో వున్నామా?"

"మాకు సరిగా తెలుగు మాట్లాడటం రాదని వెక్కిరింపా? ఏం చేస్తాం? అక్కడ కాలు బయటపెడితే అంతా ఇంగ్లీషే. ఇంట్లోనే ఏదో ఆ మాత్రం తెలుగు మాట్లాడుకుంటాం. అంచేత ఇంగ్లీషు మాట్లాడినంత ఫ్రీగా తెలుగు మాట్లాడలేం. అవునూ! మమ్మీ నీ కోసం గిఫ్ట్ పంపించింది కదా. డైమండ్ నెక్లెస్. ఏం తేలేదంటావేంటీ?"

"అది నాకు అత్తయ్య పంపించారు. నేనడిగింది నీ సంగతి?"

"ఓకే. ఓకే. మనమిలా పోట్లాడుకోవడం బాగాలేదుగాని ఒక్క నిముషం ఆగు" అంటూ తన బెడ్ రూమ్ లోకి వెళ్ళి చిన్న పాకెట్ తీసుకుని వచ్చాడు.

"ఏదో మాట వరసకన్నాను. ఇప్పుడు నాకేమీ అక్కర్లేదు" అంది బెట్టుగా.

"నీకు అక్కర్లేకపోవచ్చు. నీకు తెచ్చింది ఇవ్వకపోతే ఎలా?"

"నా కోసమే తెచ్చావా?" ఒక్కసారిగా మహేశ్వరి కళ్ళల్లో మెరుపు.

"అవును. వాళ్ళందరి ముందు ఇస్తే వేళాకోళం చేస్తారని నిన్న ఇవ్వలేదు" అంటూ పాకెట్ చేతిలో ఉంచాడు.

"ఏముంది ఇందులో?" ఆసక్తిగా అడిగింది.

"తీసి చూడు. నీకే తెలుస్తుంది" చెప్పాడు.

పాకెట్ విప్పింది మహేశ్వరి. లోన అందమైన చిన్న ప్లాస్టిక్ బాక్సుంది. అదికూడా తెరిచింది. లోన ముచ్చటైన, ఖరీదైన లేడీస్ రిస్ట్ వాచ్ ఉంది. చాలా బావుంది.

"నాకేనా?" అనుమానంగా అడిగింది.

"ఏమిటా పిచ్చిప్రశ్న? నీక్కాకపోతే నీ చేతికిస్తావా? మేం ఇక్కడ వున్నన్ని రోజులు మనం బెస్ట్ ఫ్రెండ్స్ గా వుండాలి. మన స్నేహానికి గుర్తుగా ఈ వాచీ ఎప్పుడూ నీ చేతికి ఉండాలి" అన్నాడు. ఆ మాటలతో ఒక్కసారిగా ఆమె ముఖంలో రంగులు మారాయి. తీసిన వాచీని తిరిగి ప్లాస్టిక్ బాక్స్ లో పెట్టి మూసేసి విసురుగా అతడి చేయి లాగి చేతిలో పెట్టేసింది.

"నీ చెల్లెలు రెడీ అవగానే ఇద్దరూ వచ్చి టిఫిన్ చేయండి" అంటూ వెనుతిరిగింది. అనంతసాయికి అర్ధం కాలేదు.

"ఏయ్... మహీ... వాచ్ తిరిగి ఇచ్చావేమిటి?" వెనుక నుంచి అడిగాడు. ఆమె గుమ్మం వరకూ వెళ్ళి ఆగి తిరిగి చూసింది.

"నాకు ఫ్రెండ్స్ దగ్గర్నుంచి బహుమతులు తీసుకునే అలవాటు లేదు. సారీ." అంటూ మరో మాటకు అవకాశం ఇవ్వకుండా విసవిసా బయటకు వెళ్ళిపోయింది. అనంతసాయికి ఆమె మనసు అర్ధం కాలేదు.

మొదట ఎందుకు తీసుకున్నట్టు, తర్వాత ఎందుకు తిరిగి ఇచ్చేసినట్టు. ఫ్రెండ్స్ గా వుందామనడం తప్పా? ఇదే విషయాన్ని ఆలోచిస్తూ చాలాసేపు సోఫాలోనే కూర్చుండిపోయాడు.

ఇంతలో తనూ రెడీ అయి సాయిశివాని తన గదిలోంచి బయటకు వచ్చింది.

"ఇంతక్రితం మహేశ్వరి వచ్చి వెళ్ళింది కదూ?" అంది వచ్చి ఎదురుగా కూర్చుని.

"మా మాటలు విన్నావన్నమాట?" అడిగాడు.

"ఊ! వినబడ్డాయిలే. వాచీ తీసుకోకుండానే వెళ్ళిపోయిందిగా..."

"అదే అర్ధం కావడం లేదు"

"నీకు బుద్ధిలేదు. అది నిన్ను ప్రేమిస్తోంది. ఐ లవ్ యూ అని చెప్పి ఇస్తే తీసుకునేదేమో. ఫ్రెండ్ షిప్ అనగానే పారిపోయింది" అంటూ ఫక్కున నవ్వింది.

"లవ్వా... ఈ కంట్రీ గరల్ తోనా? నెవ్వర్?"

"అయితే ఆ వాచీని సూట్ కేస్ లో పడెయ్. ఏ సమస్యా వుండదు. ఇక్కడ నెలరోజులుండేసరికే మన పనయిపోతుంది. ఏదో చేసి మనం ఎంత త్వరగా అమెరికా వెళ్తే అంత మంచిది."

"నాకూ అలాగే అన్పిస్తోంది. చూద్దాం. వెళ్ళి టిఫిన్ చేద్దాం పద." అంటూ లేచాడు.

ఇంతలో పెద్దనాన్న రామలింగేశ్వర్రావు లోనకొచ్చాడు.

"హమ్మయ్య! లేచి రెడీ అయ్యారు గదా, రండి రండి. టిఫిన్ చేయడానికి మీ కోసం ఎదురుచూస్తున్నారంతా." అన్నాడు.

"అదేమిటి పెద్దనాన్నా! మా కోసం దేనికి? వాళ్ళు చేసెయ్యొచ్చుగా" అంది శివాని.

"లేదమ్మా! మాకా అలవాటు లేదు. టిఫిను గాని, భోజనాలు గాని ఆ టైం కి ఇంట్లో ఎవరెవరున్నారో అంతా ఒకేసారి డైనింగ్ టేబుల్ ముందుకు రావలసిందే. అంతా కలిసి కూర్చుని తిన్న సంతోషం వేరు. ఉమ్మడి కుటుంబం గదా. మా అమ్మ నేర్పిన అలవాట్లలో ఇదీ ఒకటి. భోజనాలు గానీ, నిర్ణయాలు గానీ కలిపే తీసుకుంటాం. మీకివి అలవాటవ్వాలంటే కొంచెం టైం పడుతుంది. రండి" అంటూ ఇద్దర్నీ వెంటబెట్టుకొని మండువా లోగిట్లోకి తీసుకెళ్ళాడు.

అంతా భోజనాల గదిలో పొడవాటి టేబుల్ చుట్టూ కూర్చున్నారు. సాయిశివాని ఓసారి అందర్నీ చూసింది. అక్కడ అంతా వున్నారు. ఒక్కరు తప్ప, ఆ ఒక్కరూ నవీన్... నిన్న కనబడలేదు. ఇప్పుడూ కనబడలేదు. ఏమయ్యాడు? ఆరేళ్ళ క్రితం వచ్చినప్పుడు కూడా అలాగే తామంటే పట్టనట్టే వుండేవాడు.

"అత్తయ్యా! అంతా వచ్చేసినట్టేనా?" భ్రమరాంబను చూస్తూ అడిగింది.

"ఆ... ఇక్కడే ఉన్నారుగా. ఎందుకలా అడిగావ్?" కుతూహలంగా చూసింది భ్రమరాంబ.

"ఏం లేదు. ఒక మెంబరు తగ్గినట్టుంటేనూ?" నసిగింది.

"అవును. నవీన్ గురించేగా? మిరపతోటకు పురుగుల మందు కొట్టించడానికి చీకటితోనే పొలం వెళ్లాడు. రావడం ఆలస్యం అవుతుంది" అంది.

వీళ్లకు పని తప్ప ఇంకేమీ వ్యాపకం ఉండదనుకుంటా" మనసులోనే అనుకుంది.

ఈ సందర్భంలో రామలింగేశ్వర్రావు కల్పించుకుంటూ "అయినా ఇదేం బాగాలేదు బావా... ఎంత పనుంటే మాత్రం? మా పిల్లలు అమెరికా నుండి వచ్చారు. కనీసం వీళ్లకి ముఖం చూపించాలని కూడా మీ కొడుక్కి ఆలోచన లేదు. ఏమనుకుంటున్నాడు వాడు?" అంటూ సపోర్ట్ గా మాట్లాడాడు.

"ఊహు. ఈ మాట మమ్మల్ని అడిగి ఏం లాభంలేదు. వచ్చాక వాడినే అడిగి చూడు. వాడి అమ్మమ్మ చిన్నప్పుడు వాడికి ఏ పని కషాయం పట్టించిందో గాని, ఎప్పుడూ పనిలో మునిగి తేలుతుంటాడు. వాడికి పని తర్వాతనే ఏదయినా" అన్నాడు రఘునాథ్.

టిఫిన్లు కానిస్తూనే మాట్లాడుకుంటున్నారంతా.

వేడి వేడి ఇడ్లీలు, దోసెలు, పూరీలు, స్వీట్లు అలా చాలా రకాలు ఉన్నాయి. చట్నీల కారం తట్టుకోలేక చెరో రెండు ఇడ్లీలు తిని పండ్లు స్వీట్స్ తో సరిపెట్టుకున్నారు అనంత్, శివానిలు.

"బావ బాగా చదువుకున్నాడని విన్నాను. పొలం పనులు చేయడం ఏమిటి?" చెల్లెలి మనసులో వున్న అభిప్రాయాన్నే తను వకాల్తా పుచ్చుకుంటున్నట్టు అడిగాడు అనంతసాయి.

"మన పని మనం చేసుకుంటే తప్పేముంది?" బదులు చెప్పాడు రామలింగేశ్వర్రావు.

'మీ నాన్న గాని, నేను గాని చదువుకుంటున్నామని ఎప్పుడూ వ్యవసాయాన్ని అశ్రద్ధ చేయలేదు. శెలవు దొరికితే మా అమ్మకు సాయంగా మేమూ పొలంలోకి దిగి, పనిచేసిన వాళ్లమే. నాలాగే నా మేనల్లుడు నవీన్ కి వ్యవసాయమంటే ఇష్టం.

పనివాళ్ళతో పనులు చేయించడమే కాదు... తనూ చేలో దిగి వాళ్ళతో బాటు పని చేస్తాడు. చదువు మనోవికాసాన్ని ఇస్తుంది. కాయకష్టం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది" అన్నాడు.

ఆ మాటలు అన్నాచెల్లెల్లిద్దరికీ రుచించలేదు. టిఫిన్లు ముగించి లేచారంతా.

అక్కడే హాల్లో అమెరికా విశేషాలు వింటూ కబుర్లతో చాలాసేపు కాలక్షేపం చేసారు.

సుమారు పదకొండు గంటల ప్రాంతంలో పొలం నుంచి ఇంటికొచ్చాడు నవీన్. రావడమే తన మేడలోకి వెళ్ళి స్నానం చేసి, బట్టలు మార్చుకుని మండువా లోగిట్లోకి వచ్చాడు.

అతడ్ని గుర్తుపట్టడంలో అనంతసాయి గాని, సాయిశివాని గాని ఇబ్బంది పడలేదు. నవీన్ కూడా సరాసరి వాళ్ళిద్దరి ముందుకు వచ్చి ఆప్యాయంగా పలకరించాడు.

"మాకిక్కడ పనుల హడావుడి. అందుకే నిన్నటి నుండి మీకు కన్పించలేకపోయాను. ఎలా ఉన్నారు మీరు? ప్రయాణం బాగా సాగిందా." అంటూ పద్ధతి పూర్వకంగా పలకరించి, రెండు మాటలు మాట్లాడి టిఫిన్ కోసం భోజనాల గదిలోకి వెళ్ళిపోయాడు.

అదేరోజు సాయంకాలం... ఏదో పని మీద బయటకు బయలుదేరిన నవీన్, తన బైక్ తీయబోతుండగా...

"హే మేన్... కం... కంహియర్?" అంటూ ఎవరో పిలవడం విన్పించి తిరిగి చూసాడు. శివానీ వరండాలో నిలబడి కన్పించింది.

"ఏమిటి? నన్నేనా పిలిచావ్?" అంటూ విసవిసా దగ్గరకెళ్ళాడు.

"నిన్నే... చూడు నవీన్..." అంటూ ఆమె ఏదో చెప్పబోతుంటే వారిస్తూ...

"తర్వాత చూడొచ్చు గాని, ఏమిటా పిలుపు...? నీ అమెరికా ఇంగ్లీషు ఇక్కడ వుపయోగించకు. పిలవాలనుకుంటే బావాని పిలు. మర్యాదగా పిలవాలనుకుంటే బావగారూ అని పిలు. ఇలా ఏమేన్ సీయూ... అంటూ మరోసారి నా దగ్గర ఇంగ్లీషు మాట్లాడితే మర్యాదగా వుండదు. మరోమాట. నువ్వున్నది అమెరికా కాదు... మున్నులూరు గ్రామం. నువ్విలా అమెరికా స్టయిల్లో డ్రస్సులు వేసుకుంటే, జనం విరగబడి చూస్తారు. నీ పరువుతో బాటు మా పరువులూ మట్టిగొట్టుకుపోతాయి. కొంచెం పద్దతిగా డ్రస్సులు వేసుకోవడం అలవాటు చేసుకో. అర్ధమైందా?" అంటూ హెచ్చరించాడు.

"ఇట్స్ టూ మచ్. నువ్వు చెప్పినట్టు నేను వినాలా?" కోపంతో అరిచింది.

"వినకపోతే పోవే..." అంటూ బైక్ స్టార్ట్ చేసుకొని, తన దారిన వెళ్ళిపోయాడు నవీన్.

"యూ కంట్రీ బోయ్... స్టుపిడ్..." అంటూ ముక్కుపుటాలు అదురుతుండగా, కోపంతో నేలను తన్ని విసురుగా లోనకు వెళ్లిపోయింది శివాని.

మూడు రోజులు...

మూడంటే మూడే రోజులు అన్నాచెల్లెల్లిద్దరూ బుద్ధిగా వూళ్ళోనే ఉన్నారు. ఒకరోజు సాయంత్రం మాత్రం మహేశ్వరి వెంట అలా పొలానికి వెళ్లి చూసి వచ్చారు. తర్వాత తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఇలా సిడీలు వేసుకుని టి.వి లో సినిమాలు చూశారు.

అమెరికా సంస్కృతికి అలవాటుపడ్డ అన్నా, చెల్లెల్లిద్దరికీ కుదురుగా మున్నలూరు లో వుండడం సాధ్యం కాలేదు.

ముఖ్యంగా ఇద్దరికీ షాంపేన్, బీర్ ల వంటివి తాగడం అలవాటు. డిస్కోటెక్ లు, పబ్ లు, మ్యూజిక్ షోలు వంటివి ఇక్కడ వుండవు. గోళ్ళు గిల్లుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ వుండడం అసాధ్యమైపోయింది. పైగా ఇక్కడి వాతావరణం వేడి కూడా వాళ్లకి ఇబ్బందికరంగా వుంది.

నాలుగో రోజు తాము బయటకెళ్లడానికి ఎ. సి. కారు కావాలని పెదనాన్న రామలింగేశ్వర్రావుని అడిగారు.

ఆయన వెనకా ముందూ చూడకుండా విజయవాడలోని టూరిస్ట్ కంపెనీకి ఫోన్ చేసి, మంచి ఎ.సి కారుని రప్పించారు. ఉదయం పది గంటలకి కారులో విజయవాడ వెళ్లి చక్కగా బీర్ తాగి, ఖరీదైన హొటల్లో లంచ్ తీసుకొని, డిస్కో డాన్సుల్లో పాల్గొని రాత్రి పదిగంటలకు ఇంటికి చేరుకున్నారు. ఖర్చు ఎనిమిది వేలు.

ఇక అది మొదలు, ఎ.సి కారుని రప్పించుకుని అప్పుడప్పుడూ బయటకు వెళ్ళిపోవడం ఆరంభించారు. మొదట విజయవాడ వరకే వెళ్ళేవారు. తర్వాత హైదరాబాద్ కూడా వెళ్ళడం మొదలుపెట్టారు. పదిరోజులు గడిచిపోయాయి. అమెరికా నుంచి అన్నపూర్ణేశ్వరి ఫోన్ చేస్తే అంతా బాగానే వుంది. పిల్లల్లో మార్పు వస్తోంది అని అబద్ధం చెప్పాడు రామలింగేశ్వర్రావు. నిజానికి మార్పు సంగతి ఎలా ఉన్నా, అనంతసాయి, సాయిశివానీలకు ఇక్కడ వుండడం ఇష్టం లేదు.

తమకు అలవాటైన పద్ధతుల్ని వదులుకోమని, ఇక్కడి పద్ధతులు నేర్చుకోమని పెదనాన్న రామలింగేశ్వర్రావు, పెద్దమ్మ మహాలక్ష్మీ, మేనత్త భ్రమరాంబ తమకు బుద్ధులు చెప్పడం వాళ్లకి ఇష్టం లేదు.

అందుకే ఎడా పెడా ఖర్చులు చేస్తే భరించలేక వాళ్ళే తమను వెనక్కి పంపించేస్తారన్న ఆలోచనతో మరింత స్వేచ్చగా ప్రవర్తించడం ఆరంభించారు. ఇక్కడి వాళ్ళందరూ అమెరికా నుండి వచ్చారన్న ఒకే ఒక కారణంతో అనంతసాయి, సాయిశివానీలను మరీ నెత్తికెత్తుకుని అపురూపంగా చూడడం మహేశ్వరికి నచ్చలేదు.

వాళ్లను చూస్తుంటే ఆమెకు అసూయగా వుంది. కొంచెం కూడా తన గురించి పట్టించుకోని అనంత్ మీద పీకలదాకా కోపం వుందామెకు. ఇక నవీన్ అయితే వీళ్లని పట్టించుకోవడం మానేశాడు. ఇరవై రోజులు గడిచిపోయాయి. పరిస్థితిలో మార్పులేదు. ఎవరు చెప్పినా వినే పరిస్థితిలో లేదు.

(...ఇంకా వుంది)

http://www.suryadevararammohanrao.com/

మరిన్ని సీరియల్స్
nadiche nakshatram telugu serial tenth part