Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Anubandhaalu telugu serial sixteenth part

ఈ సంచికలో >> సీరియల్స్

నడిచే నక్షత్రం పదవ భాగం

nadiche nakshatram telugu serial tenth part

అయితే... అవతలి వ్యక్తి పేరుమోసిన ప్రొడ్యూసరే. ఆయన భావజాలం మాతంగరావు భావజాలానికి సరిపడదు. 'లోకోభిన్నరుచి..." అన్నారు కదా పెద్దలు. విభిన్న పూలతో కూర్చిన హారమే భారతీయం. భారతీయ సినిమాయణం. భిన్న రుచులున్నపుడే విందు సంపూర్ణం... 'వినదగునెవ్వరుచెప్పిన...' అన్నట్లు వినాలి. తర్వాత వరించి వచ్చినదానిని అందిపుచ్చుకోవాలి... అనుకుంది గాయత్రీపాటిల్.

తర్వాత - "నీ విషయంలో నా అంచనా తప్పు కాలేదు. ఆ సినిమాకి నువ్వే కరెక్ట్ హీరోయిన్ వనే ప్రశంసలు వచ్చాయి. అందంగా, అమాయకంగా స్క్రీన్ పై కనిపించి ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసావు. నీ క్యూట్ లుక్స్ కి పడిపోయిన జనాలు నీకు నీరాజనాలు చెప్తున్నారు. ఫస్ట్ డే ఫస్ట్ షోలోనే చూసావుగా ఆడియన్స్ నిన్నెంతగా రిసీవ్ చేసుకున్నారో? ఏ మాత్రం ప్రతిఫలం ఆశించకుండా నిన్ను నెత్తిన పెట్టుకుని మోస్తున్న ఆ ఆడియన్స్ కి థాంక్స్ చెప్పాలంటే నువ్వు ఖచ్చితంగా ఫంక్షన్ కి రావాల్సిందే. సినిమావాళ్ళకి హండ్రెడ్ డేస్ ఈవెంట్ జరిగేరోజంటే అంటే ఓరకంగా 'కృతజ్ఞతా దివస్'. ఏ బంధం లేకున్నా మన సినిమాని హిట్ చేసి సంబరం చేసుకుంటున్న అశేష ప్రేక్షకులకు మనం సమష్టిగా ఆరోజున కృతజ్ఞతలు చెప్తున్నాం. నెక్స్ ట్ సండే ఏ షూటింగ్ లు లేకుంగా ఫ్లాన్ చేసుకో..." సలహా ఇచ్చాడు మాతంగరావు.

"ఓ... అలాగే. అది మన ఫంక్షన్. తప్పకుండా వస్తాను..." ప్రామిస్ చేసిందామె.

"సాటర్ డే నైట్ వరకూ ఓ సినిమా షూటింగ్ లో పార్టిసిపేట్ చేసేందుకు డేట్స్ కేటాయించింది తను" డైరీ చూసుకున్న తర్వాత అనుకుంది గాయత్రీపాటిల్.

"అంటే... సండే మార్నింగ్ ఫ్లయిట్ లో హైద్రాబాద్ వచ్చి ఆ నైట్ జరిగే హండ్రెడ్ డేస్ ఫంక్షన్ కి అటెండవొచ్చు. మరోసారి కాల్ షీట్స్ కన్ ఫర్మ్ చేసుకుంటే మంచిది..." ఓ క్షణం ఆలోచించిన తర్వాత డైరక్టర్ కి కాల్ చేసిందామె.

"హౌ ఆర్ యూ మేడమ్" డైరక్టర్ అడిగాడు.

"ఫైన్... మన సినిమా లేటెస్ట్ షూటింగ్ గురించి తెలుసుకోవాలని కాల్ చేసా" చెప్పింది గాయత్రి.

"చెన్నయ్ మనం రేపే బయల్దేరుతున్నాం. సాటర్ డే దాకా అక్కడ షూటింగ్. ఓ డ్యూయెట్ సాంగ్ లో సెకండ్ చరణంతో పాటు కీలకమైన కొన్ని సన్నివేశాల్ని అక్కడ చిత్రీకరిస్తున్నాం" చెప్పాడతను.

ఆ తర్వాత - "ఈ కాల్ షీట్ డిటెయిల్స్ మీ దగ్గర లేవా?" అడిగాడు.

"ఉన్నాయి. అయితే, ఒక్క విషయం. సండే నా ఫస్ట్ మూవీ హండ్రెడ్ డేస్ ఫంక్షన్. అందువల్ల ఆ రోజు నేను ఖచ్చితంగా హైద్రాబాద్ లో ఉండాల్సిందే"

"షూటింగ్ సాటర్ డే నైట్ కల్లా కంప్లీట్ అవుతుంది. నా మీద నమ్మకం ఉంచండి" అన్నాడు డైరక్టర్ నవ్వుతూ.

"అదే చెప్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ సండే మార్నింగ్ ఫ్లయిట్ కి చెన్నయ్ నుంచి హైద్రాబాద్ వచ్చేయాల్సిందే" అంది ఆమె.

"అలాగే" ఆమెకి అభినందనలు చెప్పాడు డైరక్టర్.

మొదటి సినిమా హండ్రెడ్ డేస్ ఫంక్షన్ జరుపుకుంటోందంటేనే ఆనందంతో ఉబ్బితబ్బిబవుతోంది గాయత్రీపాటిల్. ఇంట్లోవాళ్లకి కాల్ చేసింది. హీరో ప్రదీప్ తో సంతోషాన్ని పంచుకుంది. తనని తరచూ కలుస్తున్న ఒకరిద్దరు జర్నలిస్ట్ మిత్రులకి ఇంటర్వ్యూలిచ్చింది. అలా ఆమెనుంచి మరోసారి ఇంటర్వ్యూ తీసుకున్న జర్నలిస్ట్ ల్లో సుదర్శన్ కూడా ఉన్నారు. జర్నలిస్ట్ సుదర్శన్ ని అబ్జర్వ్ చేస్తుంటే గాయత్రికి ఎందుకో తన అభిమానే గుర్తొస్తున్నాడు. 'ఒకవేళ ఈ సుదర్శనే ఆ మెసేజ్ ల్ని పంపిస్తున్నాడా?' డౌటొచ్చింది. అయితే, సుదర్శన్ సెల్ నంబర్, అభిమాని సెల్ నంబర్ ఒకటి కాదు. అయినంతమాత్రాన... ఇతడే ఎందుకు కాకూడదు? బహుశా, రెండు నంబర్లు మేంటైన్ చేయొచ్చు కదా! ఆ విషయాన్నే ఓసారి ప్రదీప్ తో అంటే - "ఆ మెసేజ్ ల్ని కూడా అంత సీరియస్ గా తీసుకుంటున్నావా? సినీ సెలబ్రిటీ అన్న తర్వాత ఎవరెవరో ఏదేదో రాస్తుంటారు. అన్నీ పట్టించుకుంటే మనం ముందుకు సాగలేం" అని కొట్టి పారేశాడు.

ఆ తర్వాత - "పోనీ... ఆ నంబర్ కి ఓసారి నువ్వే ట్రయ్ చేయలేకపోయావా?" సజెషనిచ్చాడు.

"అదీ అయింది. మెసేజ్ లు తప్ప ఫోన్ లిఫ్ట్ చేయడే మహానుభావుడు" చెప్పింది గాయత్రీపాటిల్. ఎప్పటికైనా సరే... ఆ అభిమాని ఎవరో కనిపెట్టాలి. అలాగే, సుదర్శన్ రైటింగ్స్ ని అబ్జర్వ్ చేయాలి. ఒక్కోసారి అతడు రాస్తున్నవి చదువుతుంటే అభిమాని మెసేజ్ ల్ని చదువుతున్నట్లే ఉంటున్నాయి..." అనుకుంది గాయత్రీపాటిల్. సినిమాలో ముద్దు సీన్లో నటించినపుడు... హీరో ప్రదీప్ తో కాస్త దగ్గరగా తను మసులుతున్నప్పుడు... అభిమాని పంపించిన మెసేజుల్లో చిన్నపాటి అసూయ ధ్వనించింది. సరిగ్గా... అవే సమయాల్లో 'నవతార' పత్రికల్లో తన గురించి పబ్లిష్ అయిన ఆర్టికల్స్ లో కూడా అలాటి భావనే వ్యక్తమైంది. అంటే... ఈ సుదర్శన్, ఆ అభిమాని ఒకరా? ఇద్దరా?

తేలాల్సి ఉంది... అనుకుంది గాయత్రీపాటిల్.

"అతడు: ప్రేమిస్తే ఏమవుతుంది?

ఆమె: పెళ్ళవుతుంది

అతడు: పెళ్ళయితే ఏమవుతుంది?

ఆమె: ఇల్లవుతుంది

అతడు: ఇల్లేలే మహారాణివి నువ్వయితే...

ఆమె: నన్నేలే మహారాజువు నువ్వేలే..."

ఇదీ పాట పల్లవి. మనసిచ్చిపుచ్చుకున్న ఇద్దరు ప్రేమికులు కలల్లో తేలిపోతూ హాయిహాయిగా పాడుకునే పాట.

"ఈ పాట తర్వాతే హీరోహీరోయిన్ల మధ్య అభిప్రాయభేదాలు రావడం... విడిపోవడం జరుగుతుంది. ఆ తర్వాత 'శుభం కార్డు' పడేదాకా వాళ్ళిద్దరూ కలుసుకోవడం కుదరదు. అందువల్ల ఈ పాటలోనే దగ్గరితనమంతా కుమ్మరించేయాలి" చెప్తునాడు డైరక్టర్.

"దగ్గరితనం... అంటే" అడిగింది గాయత్రీపాటిల్.

"క్లోజ్ నెస్..." రెండు చేతుల్తో 'కౌగిలింత'కు భాష్యం చెప్తూ అన్నాడు డైరక్టర్.

"పెళ్ళంటూ కాకపోయినా పెళ్ళాం కన్నా ఎక్కువ ప్రేమను చూపిస్తూ హీరోని మెస్మరైజ్ చేయాలి. మొగుడ్స్ పెళ్లామ్స్ మీ క్లోజ్ నెస్ ని రియల్ లైఫ్ లో అడాప్ట్ చేసుకోవాలి"

'ఓకే' చెప్పేసింది గాయత్రి.

"సేమ్ టు సేమ్" అన్నాడు హీరో సాగర్.

అతడీ సిన్మాతోనే ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. అతడికన్నా హీరోయిన్ గాయత్రీ రెండు సినిమాల సీనియర్. 'ఏంటో... సిన్మాల్లో తనకు జోడీగా మూడక్షరాల హీరోలే నటిస్తున్నారు. ఫస్ట్ సినిమాలో హీరో కిరణ్... తను యాక్ట్ చేస్తున్న రెండో సినిమా హీరో ప్రదీప్... ఇపుడు ఈ సినిమాలో హీరో సాగర్. ఇక... తను గాయత్రీపాటిల్ అయినా 'గాయత్రీ' గా ఇండస్ట్రీలో ప్రాచుర్యం పొందుతోంది. అంటే తన పేర్లోని అక్షరాలు మూడే. అంతేనా... తనెంతగానో ఇష్టపడిన హీరోయిన్ గా ప్రెస్ మీట్ లో మూడక్షరాల 'సావిత్రి' పేరునే ప్రస్తావించింది. ఈ సంగతి ఏ ఫిల్మ్ జర్నలిస్ట్ పసికట్టినా 'మూడంటేనే గాయత్రీకి మూడ్' అంటూ తన బొమ్మ వేసి మరీ ఓ ఆర్టికల్ వండివార్చేసాడు. 'ఔను... ఫాంలో ఉన్న హీరోయిన్ల గురించి ఏదో ఒకటి రాస్తూ రీడర్స్ ని వాళ్లు ఎంటర్టయిన్ చేయాల్సిందే. నిజానికి న్యూస్ ఎలా ఉన్నా పెట్టే టైటిలే ఎంతో సెన్సేషన్ అవుతుంది.

ఇండస్ట్రీలోకి వచ్చాక తీరిగ్గా ఉన్నప్పుడు తెలుగు సినిమాలు చేస్తూ వాటి తీరుతెన్నులు వంటపట్టించుకున్న సమయంలో శ్రీయ సినిమాలు ఒకట్రెండు చూసింది. అందులో... ఆమెకి బాగా నచ్చిన సినిమా 'ఠాగూర్'. చిరంజీవి, శ్రీయ పాడిన 'మన్మథామన్మథా మామ కూతురా!' పాట పర్సనల్ గా గాయత్రికెంతో ఇష్టం. అంతేకాదు, ఒకట్రెండు సినిమా ఫంక్షన్లలో శ్రీయని కలిసి విష్ చేసింది. తర్వాత్తర్వాత అడపాదడపా ఫోన్ లో ఆమెకి 'హలో...' చెప్తోంది. ఒకపుడు హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన శ్రీయ ఇపుడు అవకాశాల కోసం ఆశగా ఎదురుచూస్తూ ఆఖరికి 'ఐటెంసాంగ్స్' కూడా చేస్తోందని ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడ్తున్న వార్తలు. ఈ నేపధ్యంలో సడన్ గా ఓ సినీపత్రికలో 'ప్రాస్టిట్యూట్ గా మారిన శ్రీయ' అనేవార్త చదివి అవాక్కయింది గాయత్రీపాటిల్.

"సినిమా అవకాశాలు ఎంత లేకపోయినా ప్రాస్టిట్యూట్ గా మారాలా?" టైటిల్ చదవగానే ఆమెకి మొదట కోపం వచ్చింది. తీరా... న్యూస్ చదివిన తర్వాత ఆ కోపం జర్నలిస్ట్ మీదకి మళ్ళింది. ఓ చిత్రంలో ప్రాస్టిట్యూట్ కేరక్టర్ వేసేందుకు శ్రీయ ఎంపికైంది... అదీ ఆ వార్త సారాంశం. ఆ న్యూస్ కి మరింత బలం చేకూరుస్తూ... సిన్మాల్లో ఇంతవరకూ వేశ్య కేరక్టర్స్ వేసిన హీరోయిన్లు... వాళ్ళు గడించిన పేరు ప్రఖ్యాతులు ఉదహరించాడు జర్నలిస్ట్. హిందీ 'దేవదాసు' సినిమాలో చంద్రముఖి గా వేశ్య కేరక్టర్ వేసిన ఒకప్పటి అందాల నటి మాధురీదీక్షిత్ నుంచి 'వేదం' సినిమాలో వేశ్య కేరక్టర్ వేసిన అనుష్క, ఛార్మి, టబుల గురించి రాస్తూ ప్రాస్టిట్యూట్ కేరక్టర్ లో తళుక్కుమనడం ఇపుడు శ్రీయ వంతు... అని వ్యాఖ్యానించారు. రొటీన్ కేరక్టర్లలోనే విచ్చలవిడిగా అందాలు ఆరబోసి మగాళ్ల మతులు పోగొట్టిన సెక్సీ హీరోయిన్ శ్రీయ... ఇక, ప్రాస్టిట్యూట్ కేరక్టర్ లో ఎంత రెచ్చిపోనుందోనంటూ ఆ జర్నలిస్ట్ ముక్తాయింపు ఇచ్చాడు. అయితే, ఆ న్యూస్ టైటిల్ చదివిన వెంటనే... 'అవకాశాలు లేని ఓ హీరోయిన్ ప్రాస్టిట్యూట్ గా మారింద'నే అర్ధం వచ్చేట్లుగానే ఉంది. అదే విషయాన్ని ప్రదీప్ తో గాయత్రి ప్రస్తావిస్తే - "నిజానికి ఆ టైటిల్ అలా పెట్టడం తప్పే. స్వీయ నియంత్రణ లేని ఆ జర్నలిస్టుల్ని నిరోధించాలంటే ఒక్కటే మార్గం. ఆ న్యూస్ వల్ల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ కోర్టు తలుపు తట్టడం. అయితే, కెరీర్ లో కలవరపరిచేది ఆ ఒక్కవార్తేనా. మళ్లీ మళ్లీ అలాటి వార్తలు వస్తూనే ఉంటాయి. ఏ హీరోయిన్ అయినా ఎదురవుతున్న కాంపిటీషన్ ని తట్టుకుంటూ ఇటు కెరీర్ ప్లాన్ చేసుకోవాలా? లేక, తన గురించి పత్రికల్లో పబ్లిష్ అవుతున్న న్యూసుల్ని డిఫెండ్ చేసుకుంటూ న్యాయం కోసం పోరాడాలా? అందుకే, హీరోయిన్లే కాదు... సినిమావాళ్ళంతా ఇలాటి రాతలు రాసే కొన్ని పత్రికల్ని పెద్దగా పట్టించుకోరు. అలా పట్టించుకోరని తెలిసే ఆ జర్నలిస్ట్ లు సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూస్తూ వార్తాకథనాలు వండివార్చేస్తుంటారు"

ప్రదీప్ చెప్పింది నిజమనిపించింది గాయత్రికి. ఇండస్ట్రీలో ఎలా ఉండాలో... ఎలా ఉండకూడదో తనకు తెలియచెప్పే 'మెంటర్' దొరికాడని భావించింది.

"రేపు నీపై కూడా ఇలాటివార్తలెన్నో రావొచ్చు. అంతెందుకు... ఆల్రెడీ మనిద్దరి గురించి గాసిప్స్ వండడం మొదలెట్టేశారు కదా జర్నలిస్ట్ లు. మనం ఎక్కడెక్కడ కలుసుకుంటున్నామో... ఏమేం చేస్తున్నామో తెలుసుకోవడానికి 'కెమెరా నిఘా' కూడా పెట్టారు. ఇలా వెంటాడి... వెంటాడి చేసేదాన్ని జర్నలిజం అనరు. శాడిజం అంటారు. అయినా... రాతల్లో ఆ ఆనందాన్ని వాళ్ళు వెతుక్కోని... మనకి మనం అంటీ ముట్టనట్టుగా... 'తామరాకు మీద నీటిబొట్టు' లా లైట్ గా తీసుకోవాల్సిందే..." ప్రదీప్ చెప్పిన విషయాల్ని గుర్తుచేసుకుంటుండగా... అసిస్టెంట్ డైరక్టర్ వచ్చి 'షాట్ రెడీ' చెప్పాడు.

"నేను రెడీయే" గాయత్రీపాటిల్ లేచింది.

కొన్ని కొంటె చూపులు, కొన్ని చిర్నవ్వులు, కొన్ని పులకింతలు, కొన్ని కౌగలింతలు... కొన్ని క్లోజప్ లు, కొన్ని మిడ్ షాట్ లు, కొన్ని లాంగ్ షాట్ లు -

జోరుగా హుషారుగా సాంగ్ పిక్చరైజేషన్ అవుతోంది. కెమెరా రన్ అవుతుంటే హీరోహీరోయిన్లు మరింత దగ్గరవుతున్నారు.

ప్రేమ ఇంత గొప్పదా? అనుకుంటోంది గాయత్రీపాటిల్. తెరపై కేవలం మూడు నిముషాలు మాత్రమే కనిపించే ఒకానొక పాటలో ఓ 'ఆడామగా' ప్రేమని సంపూర్ణంగా ఆవిష్కరించేందుకు కొన్ని రోజుల షెడ్యూల్... కొంతమంది క్రియేటివ్ పర్సన్స్ 'మేథోమధనం'.

ఆమెకి ఆశ్చర్యంగా ఉంది. రియల్ లైఫ్ లో ఓ వ్యక్తి ఒక్కసారే ప్రేమలో పడతాడు. కానీ, రీల్ లైఫ్ లో హీరోహీరోయిన్లు ప్రతిసారీ లవ్ లో పడుతుంటారు. సినిమా సినిమాకీ జోడీని మార్చేస్తూ ప్రేమించుకుంటారు. నిన్నమొన్నటిదాకా హీరో ప్రదీప్ తో ప్రేమని కుమ్మరించింది. మరిపుడో... కెమెరా సాక్షిగా సాగర్ తో ప్రేమాయణం జరుపుతోంది. కెమెరా ముందు కథ, స్క్రీన్ ప్లే, డైరక్షన్ మేరకు ప్రేమని నటిస్తున్నామని పైకి ఎంతగా చెప్తున్నా... ఓ శరీరం మరో శరీరాన్ని తాకితే 'మనస్సునామీ' పోటెత్తదా? ఎదలో కాంక్ష జ్వలించదా? సరిగ్గా ఇలాటి దశలోనే హీరో ప్రదీప్ తనకు దగ్గరయ్యాడు. 'డేటింగ్' చేద్దామంటూ ప్రపోజ్ చేసాడు. తనూ 'ఓకే' అనేసింది. మరి, ఇవాళ... ఈ హీరో కూడా తనకు దగ్గరవుతున్నాడా? తను అతడ్ని తాకినపుడు అతడి కళ్లలో మెరుపునీ, మేనిలో మైమరుపునీ గమనిస్తోంది. డైరక్టర్ 'కట్' చెప్పినా తనని వదలకుండా పట్టుబిగిస్తున్న అతడి చేతులు, చేతలు చెప్పాల్సింది చెప్పకనే చెప్తున్నాయి. సాధారణంగా ఓ ఆడామగా ఎపుడు శారీరకంగా ఒకర్నొకరు తాకుతారు? ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడిన తర్వాతే కదా! మరి, అలాటి ఇష్టం ఏదీ ఏర్పడకముందే... సిన్మా సీన్ల కోసం కళ్లలో కళ్ళు పెట్టి చూసుకోవడం... కలిసి దగ్గరగా కూచోడం... తాకడం... కౌగలించుకోవడం... డైరక్టర్ 'పేకప్' చెప్పగానే 'ఎవరిదారి వారిదన్న'ట్లు విడివిడిగా కూచోవడం... మూడక్షరాల సినిమా అంటే ఇదేనా?

సాగర్ మరింత దగ్గరగా హత్తుకుని గుసగుసగా చెవిలో చెప్పాడు - 'ఐ లవ్ యూ'.

ఒక్కసారి తలెత్తి అతడివేపు చూసింది. వెంటనే కోపంగా డైరక్టర్ అరిచాడు - 'కట్' అని. తర్వాత దగ్గరికొచ్చి - "ఈ సాంగ్ లో మీరు తలెత్తి చూడకూడదు. అతడి కౌగిట్లో తన్మయత్వాన్ని ప్రదర్శించాలి. చరణం వింటున్నారుగా... లిరిక్ రైటర్ తన్మయత్వం అని రాస్తే సింగర్ గొంతు చించుకుని మరీ ఆ పదాన్ని అరిచింది..." అన్నాడు.

"ఓకే..." అంది గాయత్రీపాటిల్. కానీ, మరోసారి షూట్ చేస్తున్నప్పుడు కూడా ఆమె తలెత్తకుండా ఉండలేకపోయింది. కారణం... సాగర్. ఓపక్క సాంగ్ వినిపిస్తుంటే... మరోపక్క
అతడు డైలాగులు చెప్తున్నాడు.

"మేడమ్... మీ పక్కన హీరోగా నటించడం నా అదృష్టం. మీ ఫస్ట్ మూవీ చూసాను. స్క్రీన్ కి మరో బ్యూటీ దొరికిందని సంబరపడ్డాను. కానీ... ఆ బ్యూటీతోనే నేను యాక్ట్ చేస్తానని ఊహించలేదు. సడన్ గా ఈ ప్రొడ్యూసర్ నుంచి పిలుపొచ్చింది. హీరోవి అన్నారు. ఎగిరి గంతేసాను. హీరోయిన్ గాయత్రీపాటిల్ అని చెప్పారు. అంతే! ఒక్కసారిగా ఆకాశాన్నందుకున్నాను. నాకు అవకాశం వచ్చిందానికన్నా... ఈ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం మీకు వచ్చినందుకు సంబరపడ్డాను..." అసలు పాట ఆమెకి వినిపించడం లేదు. అతడి మాటే వినిపిస్తోంది.

"ఎందుకో అర్ధరాత్రివేళల్లో మెలకువొస్తుంది. కళ్ళ రెటీనా తెరపై హఠాత్తుగా మీ బొమ్మ కదుల్తుంది. ఆకుపచ్చని ప్రకృతి మధ్య మనం ఊటీలో ఉన్నట్లు... కోడైకెనాల్, కులుమనాలి కలిసి తిరుగుతున్నట్లు... చేతుల్లో చేయి వేసుకుని కమ్మని కబుర్లు చెప్తున్నట్లు... డ్యూయెట్లు పాడ్తున్నట్లు ఏవేవో కలలు..."

"కలిసి సినిమా చేస్తున్నాం కదా... ఆ కలలేమో?" అంది గాయత్రీపాటిల్ తలపైకెత్తి.

"కట్... కట్... కట్..." మళ్ళీ డైరక్టర్ అరుపులు.

"సారీ..." చెప్పింది గాయత్రీ సాగర్ వేపు కోపంగా చూస్తూ. అయిదు నిముషాల తర్వాత మళ్ళీ 'షాట్ రెడీ' చెప్పాడు డైరక్టర్.

"ప్లీజ్... మాట్లాడొద్దు" హెచ్చరించిందామె.

"ఐ లవ్ యూ... ఐ లవ్ యూ... ఐ లవ్ యూ" ముమ్మారు చెప్పాడు సాగర్.

"నిజం మేడమ్. మీకు దూరంగా ఉండాలంటే నాకు పిచ్చెక్కుతోంది. ఇంతవరకూ ఏ అమ్మాయి వెనక ఇంతలా పడలేదు. మీరు 'ఓకే' చెప్తే మిమ్మల్ని నా జీవితంలోకి ఆహ్వానిస్తా. ప్లీజ్... నా లవ్ ని యాక్సెప్ట్ చేయరూ" దీనంగా అడుగుతున్నాడతడు. సడన్ గా ఆమెకి హీరో ప్రదీప్ గుర్తొచ్చాడు.

అతడూ అంతే... తనని కావాలనుకున్నాడు. కానీ, అతడు 'హండ్రెడ్ పర్సంట్ డేటింగ్' అన్నాడు. ఇతడు 'హండ్రెడ్ పర్సంట్ లవ్' అంటున్నాడు. తను అతడితో డ్యూయెట్లు పాడింది. ఇతడితోనూ పాడుతోంది. అతడి డేటింగ్ ప్రపోజల్ కి ఓకే చెప్పింది. మరి, ఇతడి 'లవ్ ప్రపోజల్'కి ఓకే చెప్పాలా? హీరో ప్రదీప్ బాగున్నాడు... ఇతడూ బాగున్నాడు. తను ఇద్దర్నీ ప్రేమించింది సిన్మా సన్నివేశాలకనుగుణంగా. అయితే, ప్రదీప్ కి మాత్రం ఓకే చెప్పింది. సాగర్ నీ ప్రేమించాలా? ఇన్నిసార్లు ఇంతమందితో ఏకకాలంలో ప్రేమ సాధ్యమేనా? ప్రేమని తింటూ, తాగుతూ అనుక్షణం రైటర్లు రాసే ప్రేమ కబుర్లు చెప్తూ బతికే సినిమా తారలంతా ప్రేమలో పడుతూ లేస్తూ ఉంటారా? కేరళకుట్టి నయనతార మొదట శింబుని ప్రేమించింది. "వల్లభా... వల్లభా!' అంటూ అతడితో సిన్మాల్లో సైతం రెచ్చిపోయి నటించింది. ఎన్నో ముద్దులిచ్చిపుచ్చుకుంది. ఆ ముద్దులన్నీ ఇంటర్నెట్ కి ఎక్కాక... ఏమైందో ఏమో అతడితో తెగతెంపులు చేసుకుంది. తర్వాత... అతడిని చూడకూడదనుకునే తన అందాల్తో తెలుగు ఇండస్ట్రీని టార్గెట్ చేసింది. ఇక్కడ అగ్రనటులందరి సరసన నటించి అగ్రతారగా ఎదిగింది. ఈ మధ్యలో ప్రభుదేవాతో జట్టుకట్టింది. కలిసి ఇద్దరూ కెమెరాకి ఫోజులిచ్చారు. తన పేరు ప్రదీప్ పేరుతో జతపరుస్తూ రాసినట్లుగానే 'ఔను... వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు' అని నయనతార, ప్రభుదేవా విషయంలో మీడియా ప్రకటించేసింది. అయినా సరే... వాళ్ళెంతకీ నోరు విప్పలేదు. అలాగనీ... మీడియాకి భయపడి కలిసి తిరగడం మానుకోలేదు. ముంబాయి నించి చెన్నయ్ మీదుగా హైద్రాబాద్ వరకూ వారు జతగానే తిరిగారు. జర్నలిస్టుల కెమెరా కళ్లలో పడ్డారు. వేడివేడి వార్తలకు ముడిసరుకుగా మారారు. తర్వాత్తర్వాత సీన్ మారింది. విషయం బహిరంగంగానే ఒప్పుకున్నారు. త్వరలోనే పెళ్లి అని ప్రకటించేశారు. ప్రభుదేవా భార్య రమాలత ఈ విషయంలో తలదూర్చడంతో వివాదంగా మారింది. కోర్టు మెట్లెక్కిన ప్రభుదేవా కోట్లు ఇచ్చి మరీ మొదటి భార్యని శాంతపరుచుకున్నాడు. ఇక, రేపోమాపో నయనతార, ప్రభుదేవా పెళ్లి అని వసందైన వార్తల్ని మీడియా వండివార్చేస్తుంటే... బాపు దర్శకత్వంలో నటిస్తున్న 'శ్రీరామరాజ్యం' తన చివరి సినిమా అని నయనతార ప్రకటించేసింది. ఆ సినిమా ముగింపు సందర్భంలో భోరున విలపిస్తూ పేరుపేరునా ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెప్పింది.

అందాల ఆరబోతలో తనకెలాటి మోమాటం లేదని ప్రతి సినిమా ద్వారా ప్రకటించిన నయనతార... చివరికి తన కెరీర్ ని భక్తిరస సీత పాత్రతో ముగిస్తోందని ఫిల్మ్ క్రిటిక్స్ ప్రశంసించారు. కానీ... కథ అడ్డం తిరిగింది. ఏం జరిగిందో... ఏమో ప్రభుదేవాతో 'కటీఫ్' చెప్పిన నయనతార మళ్ళీ ఇండస్ట్రీలో కొనసాగుతోంది. 'శ్రీరామరాజ్యం' సినిమాలోని నటనకు గాను నంది అవార్డు గెలుచుకున్న ఆమె ఆ తర్వాతి చిత్రమైన 'కృష్ణం వందే జగద్గురుమ్...'లో మరింతగా ఎక్స్ పోజ్ చేసింది. అదలా ఉంచితే... మళ్లీ తను ఇంకో హీరోతో ప్రేమలో పడుతున్న సంకేతాల్ని నయనతార నుంచి మీడియాకి అందుతున్నాయి.

గాయత్రీపాటిల్ కి ఒక్క క్షణం అదంతా గుర్తొచ్చింది. తనూ నయనతారలా అవబోతుందా?

(...ఇంకా వుంది)

మరిన్ని సీరియల్స్
event manager story by somaraju susheela