భారతదేశమంతా ఉత్కంఠగా ఏ సినిమా కోసం ఎదురుచూస్తోన్న ప్రశ్నకు 'బాహుబలి ది కంక్లూజన్'ని సమాధానంగా చెప్పవలసి ఉంటుంది. 6 వేల థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుంది. వెయ్యి కోట్ల వసూళ్ళ టార్గెట్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్న 'బాహుబలి ది కంక్లూజన్' కోసం సర్వం సిద్ధమయ్యింది. 'కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో' సమాధానం తెలియాలంటే ఏప్రిల్ 28 వరకు వేచి చూడాలి. ఆ రోజెంతో దూరంగా లేదు. ఇన్నేళ్ళు ఎదురు చూశాం, ఇంకొన్ని రోజులు ఎదురు చూడలేమా? ఎదురుచూపుల్లోనూ ఇంత తియ్యదనం ఉంటుందని 'బాహుబలి ది కంక్లూజన్' కోసం వెయిటింగ్ చేస్తున్నవారికి మాత్రమే తెలుస్తుంది.
ఇది కేవలం సినిమా మాత్రమే కాదు, అంతకు మించి. ఇదొక అద్భుతమైన ప్రయాణం అంటారు సినిమా కోసం పనిచేసినవారు. చిన్న టెక్నీషియన్ నుంచి దర్శకుడు రాజమౌళి వరకూ, సినిమాలో ఎక్కడో ఏదో ఒక చిన్న సన్నివేశంలో కనిపించిన చిన్న నటుడి నుంచి హీరో ప్రభాస్ వరకు ప్రతి ఒక్కరూ 'బాహుబలి ది కంక్లూజన్' సృష్టించబోయే సంచలనం కోసం ఎదురుచూస్తున్నారు. తొలి పార్ట్ 'బాహుబలి ది బిగినింగ్' సృష్టించిన సంచలనం నేపథ్యంలో 'బాహుబలి ది కంక్లూజన్'పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. కర్నాటకలో సినిమా విడుదలపై వివాదం నడుస్తున్నప్పటికీ సినిమా విడుదలయ్యేనాటికి అదీ సద్దుమణగవచ్చు. ఇంకో వైపున సినిమాని చూస్తే ఐమాక్స్ ఫార్మాట్‌లోనే చూడాలంటున్నారు. పెద్ద బొమ్మ, సూపర్బ్ సౌండింగ్, అద్భుతమైన క్వాలిటీతో ఐమ్యాక్స్ స్క్రీన్‌పై చూడటానికి అప్పుడే ఉన్నతస్థాయిలో రికమండేషన్స్ కోసం ప్రయత్నిస్తున్నారు ఆడియన్స్. ఏ తెరమీద చూసినాసరే, ఇంకోసారి ఐమ్యాక్స్‌మీద చూస్తేనే ఆ 'కిక్' ఉంటుందేమో!
|