ఫస్ట్ లుక్‌తోనే సంచలనాలకు తెరలేపాడు సూపర్ స్టార్ మహేష్‌బాబు. 'స్పైడర్' సినిమా ఫస్ట్ లుక్ రావడంతోనే సినిమాపై ఉన్న అంచనాలు అమాంతం రెట్టింపయ్యాయి. మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ద్విభాషా చిత్రంగా ఇది రూపొందుతున్నప్పటికీ కూడా దీన్ని ఇతర భాషల్లోనూ విడుదల చేసేందుకు ప్రయత్నాలు మొదలైనట్లుగా సమాచారం అందుతోంది. ముఖ్యంగా బాలీవుడ్ నుంచి 'స్పైడర్' సినిమాకి ఆఫర్లు వస్తున్నాయట. ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్, దానికోసం రూపొందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
మహేష్ స్టైలిష్ లుక్‌తోపాటుగా మురుగదాస్ మేకింగ్‌పై తమిళ, హిందీ సినీ వర్గాల్లో ఉన్న అంచనాల నేపథ్యంలో 'స్పైడర్' సినిమా జాతీయ స్థాయిలో ప్రేక్షకుల్ని అలరించే అవకాశాలున్నాయని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికైతే ఇది ద్విభాషా చిత్రం మాత్రమే. సినిమా విడుదలయ్యేనాటికి ఎన్ని భాషల్లో సినిమాకి ఆఫర్స్ వస్తాయో ఊహించడం కష్టమే. రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాలో మహేష్ సరసన తొలిసారి హీరోయిన్‌గా నటిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇంతకు ముందే ఓ సినిమా రావాల్సి ఉంది. ఇంకో వైపున ఈ సినిమాకి మరో ప్రధాన ఆకర్షణగా నిలిచాడు ప్రముఖ దర్శకుడు ఎస్‌జె సూర్య. ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్నాడతను.
|