Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

అతడు..ఆమె..ఒక రహస్యం

atadu aame oka rahasyam

గత సంచికలోని అతడు-ఆమె-ఒక రహస్యం సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.

http://www.gotelugu.com/issue210/596/telugu-serials/atadu-aame-oka-rahasyam/atadu-aame-oka-rahasyam/

( గతసంచిక తరువాయి )... “ఒకటనేం లేదు. నేర ప్రదేశంలో ఉన్న  ప్రతి చిన్న ఆధారం- అంటే రక్తం మరకలూ, ఇతర బాడీ ఫ్ల్యూయిడ్స్ తాలూకు మరకలూ, మామూలుగా మనం పట్టించు కోని జుట్టూ, పీచు, దారాలూ, పగిలిన అద్దాలూ, పెయింట్లూ, అనుమానాస్పద పదార్ధాలూ, వేలి ముద్రలూ, కాలి ముద్రలూ ఇలా ప్రతి చిన్న విషయమూ మనకి ఆ నేరం వెనక ఉన్న కథ చెబుతుంది. అందుకే అనుమానం ఉన్నా లేక పోయినా, ప్రతి చిన్న సాక్ష్యాన్నీ  సేకరించి, తదుపరి పరిశోధనకి  క్రైమ్ ల్యాబ్ కి పంపాలన్నది నా ఉద్దేశం”      “సాక్ష్యాలని సేకరించడం అన్నది కొద్దిగా కన్ప్ఫూ జన్ తో కూడుకున్నది కదా? ఇంత అనుభవం ఉన్న మేమే ఒక్కో సారి టెన్షన్ పడుతూ ఉంటాము.  కానీ ఆరోజు మీరు మాత్రం చాలా కూల్ గా మీ పని మీరు చేసుకున్నారు” నవ్వుతూ అన్నాడు పాణి.

ఆ యువకుడి ఛాతీ ఉప్పొంగింది. “అందరూ అలా అంటూ ఉంటారు కానీ ఒక పద్దతి ప్రకారం వెడితే అందులో పెద్ద కన్ప్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏమీ ఉండదండీ” అన్నాడు ఆ పొగడ్తలకి మొహమాట పడుతున్నట్టుగా

“ఏమిటి మీరు అనుసరించే పద్దతి?”  గొంతులో ఆసక్తిని ఒలికిస్తూ అడిగాడు పాణి.

“ముందుగా నేర ప్రదేశాన్ని ఏ రకంగానూ డిస్టర్బ్ చెయ్యకుండా ఉన్నదున్నట్టు ఫోటోగ్రాఫ్స్ తీస్తాం. నేర దృశ్యాన్ని పూర్తిగా డాక్యుమెంట్ చేసిన తరువాత ఎగ్జిబిట్లన్నింటికీ నెంబరింగ్ ఇస్తాం.  ఆ నెంబర్స్ స్పష్టంగా పడేటట్టు నేర దృశ్యాన్ని మళ్లీ ఫోటోగ్రాఫ్ తీసుకున్నాక అప్పుడు  సేకరణ ప్రక్రియ ప్రారంభిస్తాము. తొందరగా పాడై పోతాయనుకున్న  ఆధారాలని అంటే, అంటే వేలి ముద్రలూ, రక్తం సేంపిల్స్ వంటి బాడీ  ఫ్ప్ల్యూయిడ్స్ సేకరణ మొదట చేసేసి వాటిని పూర్తిగా పాడై పోకుండా సాధ్యమైనంత తొందరగా పరీక్షల కోసం ల్యాబ్ కి  పంపేస్తాం.  మిగిలిన వాటిని తరువాత నెమ్మదిగా సేకరిస్తాము.

దొరికిన అన్ని ఆధారాలు సేకరించామనడానికి నిదర్శనంగా, ఇన్వెంటరీ లాగ్ తయారు చేస్తాము.  ఆ ఇన్వెంటరీ లాగ్ నేర సన్నివేశాన్ని డాక్యుమెంట్ చేయడానికి  తీసుకున్న ఫోటో మరియు నేర రిపోర్ట్ లో ఉన్న వివరణతో  సరి పోవాలి. ఉదాహరణకి ఒక కత్తి సేకరించి ఉంటే,  లాగ్ రిపోర్టులో కత్తికి వేసిన  సీరియల్ నెంబరు,  సన్నివేశం వద్ద తీసుకున్న ఫోటో లోని సీరియల్ నెంబరు,  క్రైమ్ రిపోర్టులో ఉన్న సీరియల్ నెంబరుతో సరి పోవాలి. ఆ విధంగా ఒక క్రమ పద్దతిలో చేసుకు పోతే అందులో గజి బిజి ఉండదు”   అంటూ పాణికే పాఠాలు చెప్పడానికి ప్రయత్నించాడు అతడు.

“రాజేంద్ర గదిలో దొరికిన వేలి ముద్రలని, కాలి ముద్రలనీ ఎనలైజ్ చేసారా?”

“వేలి ముద్రలనీ, బ్లడ్ శాంపిల్స్ నీ,  హెయిర్, అన్నీ ఎగ్జామిన్ చేసాము.  అనుమానించ తగ్గవి ఏమీ కనపడ లేదు”

“అంటే?”

“అన్ని వేలి ముద్రలూ, శాంపిల్స్ అన్నీ రాజేంద్ర గారివే. ఆ గదిలో రెండో వ్యక్తి వెళ్ళినట్టు అనుమానం కలిగించేట్టుగా ఉన్న ఇన్వెంటరీ మాకేమీ దొరక లేదు”

“మరి అతడి చేతుల మీదా, కాళ్ళ మీదా ఉన్న కత్తి గాట్ల మాటేమిటి?”

“అవి కూడా అతడు స్వయంగా  చేసుకున్న గాయాల్లాగే అస్తున్నాయి. అదే మాట ఎస్సై ఇంద్ర నీల గారు కూడా అన్నారు.  వేరే ఎవరైనా చేసిన గాయాలైతే కొద్దిగా నైనా ప్రతిఘటించిన ఆనవాళ్ళు కనిపిస్తాయి. ఎక్కడో అక్కడ రెండో వ్యక్తి వేలి ముద్రలు కానీ,  బాడీ ఫ్ల్యూయిడ్స్ కానీ బయట పడతాయి.  అలాంటివేమీ అక్కడ లేవు.  అందుకే  పెద్ద సీరియస్ కేసుగా దీన్ని తీసుకోనక్కర్లేదని ఆవిడ కూడా అన్నారు”  
అమాయకత్వం వల్లో,  పాణి దగ్గర  తన తెలివి తేటలని మరింత గొప్పగా ప్రొజెక్టు  చేసుకోవాలన్న కోరిక వల్లో అతడు అవసరం ఉన్నదాని కన్నా ఎక్కువ మాట్లాడ సాగాడు.  పాణికి కావాల్సింది అదే.  అతడు తన గ్రిప్ లోకి వచ్చాడన్న నమ్మకం కుదిరాక అన్నాడు “ఆరోజు నాకు చూపిస్తున్నప్పుడు మీరు తయారు చేసిన ఇన్వెంటరీలో నెంబరు స్కిప్ అయిందన్నారు. అసలది ఎలా జరిగింది?”

“నెంబరు స్కిప్ కావడం కాదండీ. నేను ఇన్వెంటరీ లాగ్ తయారు చేసేటప్పుడు చాలా మెటిక్యులస్ గా ఉంటాను.  క్రైమ్ సీన్ ని డాక్యుమెంట్ చేసేటప్పుడు ఐడెంటిఫై చేసిన ఆధారాల దగ్గర నెంబర్లు వేసిన పేపర్ల స్టిక్కర్స్ పెట్టుకుని మరీ ఫోటో తీసుకుంటాను. అదే నెంబరు ఇన్వెంటరీ లాగ్ లోనూ, క్రైమ్ రిపోర్టులోనూ వస్తుంది కనుక కన్ఫ్యూజన్ కి  అవకాశం ఉండదు.  ఆ రోజు స్కిప్ అయిందనుకున్న నెంబరు ఫోటోగ్రాఫ్ లో కూడా వచ్చిది.  కాక పోతే ఇది పెద్ద సీరియస్ గా తీసుకోవాలనుకున్న కేసు కాదు కనుక నేను కూడా పెద్దగా పట్టించుకో లేదు”

‘ఇది పెద్దగా సీరియస్ గా తీసుకోవాల్సిన కేసు కాదని అతడ్ని మొదట్నుంచీ ఇన్ ఫ్ల్యూయెన్స్ చేసినదెవరో’ ఊహించ గలిగాడు పాణి.

“ఫోటో తీసినప్పుడు కూడా మీరు  నెంబరు పొరపాట్న పెట్టారేమో?” అన్నాడు పాణి.

పాణి ఊహించినట్టుగానే ఆ ప్రశ్న అతడి ఈగోని హర్ట్ చేసింది. అతడు ఒప్పుకో లేదు “నా గురించి నాకు బాగా తెలుసండీ. వర్క్ దగ్గర ఎలాంటి పొరపాట్లూ జరగవు.  నెంబరు తప్పుగా పెట్ట లేదు. నెంబరు కరెక్టుగానే పెట్టాను.  ఆ ఇన్వెంటరీ కూడా కలెక్టు చేసాను. లాగ్ రిపోర్టు తయారు చేస్తున్నప్పుడే ఒక్క క్షణంలో ఆ ఐటెమ్ ఎక్కడో జారి పోయింది. తరువాత చాలా సేపు వెదికాను కానీ దొరకలేదు. ఖంగారు పడి ఇంద్ర నీల గారికి చెబితే ఫర్వా లేదులే అన్నారావిడ” అన్నాడు.

“అలాగా? ఏమిటా ఐటమ్?”  ఆఖరి ప్రశ్నని సంధించాడు పాణి.

“ఉంగరం. బహుశా వజ్రపుటుంగరం అనుకుంటాను. బాగా మెరుస్తోంది. అది మగవాళ్ళు పెట్టుకునే ఉంగరం కాదు, ఆడవాళ్ళ ఉంగరం.  ఆడవాళ్ళ ఉంగరం అక్కడ  కనిపించడం ఆడ్ గా అనిపించి దాన్ని కూడా సేకరిద్దామనుకుని నెంబరింగ్ ఇచ్చి ఫోటో తీసాను”    ఇనుము వేడిగా ఉన్నప్పుడు సరైన దెబ్బ పడినట్టుగా,  అతడు  పాణికి కావాల్సిన సమాచారం ఇచ్చేసాడు.

కొద్ది సేపు మామూలు మాటలు మాట్లాడి మరింక సమయం వృధా చెయ్యకుండా “సారీ మీరు పనిలో ఉన్నట్టున్నారు, మరోసారి కలుద్దాం” అని చెప్పి బయటికి వచ్చేసాడు. జరిగినది మొత్తం డి.ఎస్.పి. ప్రసాద్ కి  ఫోన్ లో చెప్పి అన్నాడు పాణి. “నేను ఒకసారి మీ కస్టడీలో ఉన్న ఆధారాలని చూడవచ్చా?” అన్నాడు.

“ష్యూర్. ఎలాగూ నిజామాబాద్ లో నే ఉన్నావు కనుక మా ఆఫీసుకి వచ్చెయ్యి.  వెంటనే చూసే ఏర్పాటు చేస్తాను” అన్నాడు.మరో పది నిమిషాల్లో  పాణి ప్రసాద్ ఆఫీసులో ఉన్నాడు. అప్పటికే ప్రసాద్ రాజేంద్ర కేసు తాలూకు ఎవిడెన్సు బాక్సుని తీసుకు వచ్చి రెడీగా ఉంచాడు.   జాగ్రత్తగా ఒక్కొక్క ఎవిడెన్సునీ పరిశీలిస్తూ, వివేక్ తయారు చేసిన లాగ్ రిపోర్టుని చూసాడు.  అతడు చెప్పుకున్నట్టుగానే నిజంగానే ఎక్కడా గజిబిజి లేకుండా క్రైమ్ సీన్ కళ్ళకి కనబడేట్టుగా డాక్యుమెంట్ చేసాడు.  మనసు లోనే వివేక్ ని అభినందించకుండా ఉండ లేక పోయాడు.

ఫోటోగ్రాఫ్ లో పన్నెండో నెంబరు క్లూ ఎక్కడ ఉందా అని చూసాడు. సరిగ్గా చని పోయిన రాజేంద్ర దిండు క్రింద ఉందా వజ్రపు ఉంగరం. ఆ ఫోటోని జూమ్ చేసి చూస్తే దాని మీద చిన్న రక్తపు మరక కనిపిస్తోంది.

“ఈ ఉంగరం ఎవరిది?  ఆ ఉంగరమే ఈ కేసులో కీలకమైన ఆధారమా? అసలు ఇంద్ర నీలకీ ఈ కేసుకీ సంబంధం ఏమిటి? కేసు పరిశోధనకి వెళ్ళిన ఆమెకి ఉంగరం మాయం చెయ్యాల్సిన ఆవసరం ఏమిటి?  నువ్వు ఇంద్ర నీల ని ఇంటరాగేట్ చేస్తే బెటరేమో?” అన్నాడు ప్రసాద్.

“అంత కన్నా ముందు తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకా ఉన్నాయి. రాజేంద్ర మరణించిన తరువాత ఉంగరాన్ని మాయం చేసినది సుప్రియే కావచ్చు. కానీ అతడి మరణానికి ముందే  కంప్యూటర్ లో  హత్య ఎలా చెయ్యాలా అని ప్లాన్ చేసినది ఎవరు?   ఆత్మహత్య నోట్ మీద వంట సోడా ఎందుకు వచ్చింది?

అసలు రాజేంద్రని చంపాలనుకోవడం కేవలం వజ్రాల కోసమే అయి ఉండక పోవచ్చు. సిర్నాపల్లి సంస్థానం మొత్తం ఆస్థి ఎంత ఉండచ్చు? రాజేంద్ర వర్మ మరణించడం వల్ల ఎవరికి లాభం? శవం దగ్గరున్న ఇవన్నీ ఆలోచించాల్సిన విషయాలనిపిస్తోంది”

క్లూస్ బాక్సు మూసెయ్య బోతూ ఒక్క సారి రాజేంద్ర సూసైడ్ నోట్ని బయటకి తీసి పరిశీలనగా చూసాడు.

సోడియం బై కార్బనేట్... బేకింగ్ సోడా !

దానికీ ఈ సూసైడ్ నోట్ కీ ఏమిటి సంబంధం?  వంట సోడాని వంటకి కాకుండా మరెందుకు వాడతారు? ఒకసారి ఇంట్లో అంజలి బేకింగ్ సోడాని నిమ్మ రసంతో కలిపి నేచురల్ బ్లీచ్ తయారు చెయ్యడం గుర్తొచ్చింది.

హఠాత్తుగా అతడి బుర్రలో ఏదో బల్బు వెలిగినట్టనిపించింది.  గబ గబా సూసైడ్ నోట్ ని కవరు లోంచి బయటకి తీసి, మరింతగా పరిశీలనగా చూసాడు... అతడి అనుమానం నిజమే !

“యెస్...” అన్నాడు  ఏదో సాధించినట్టుగా.

“ఏమిటి?” అన్నాడు ప్రసాద్.

“ఈ సూసైడ్ నోట్ ని ఎవరో ఆల్టర్ చేసారు”

“వాట్ డూ యూ మీన్?” ఆశ్చర్యంగా అన్నాడు ప్రసాద్.

(ఈ సస్పెన్స్ వచ్చేవారం దాకా.....)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
nadaina prapancham