Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
atadu aame oka rahasyam

ఈ సంచికలో >> సీరియల్స్

నాదైన ప్రపంచం

nadaina prapancham

 గతసంచికలో నాదైన ప్రపంచం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

http://www.gotelugu.com/issue210/595/telugu-serials/naadaina-prapancham/nadaina-prapancham/

( గతసంచిక తరువాయి )... ఇతని పేరు ఆకాషా? మంచి పేరు. ఇతని పేరుకి తగినట్లే అతనికి వాలీ బాల్‌ ఆటంటే ఆకాశమంత అభిమానం! మురిపెంగా అనుకుంది.

అంతలోనే ఏదో సందేహం వచ్చింది. ఇతనికి తన ఆటంటే అభిమానమైనపుడు ఆట జరుగుతున్నపుడే రావాలి. ఇలా వేళా పాళా లేకుండా వచ్చి తనని డిస్టర్బ్‌ చెయ్యడమేంటి? కోపం వచ్చింది కీర్తనకి.

‘‘ఏంటి?’’ నొసలు చిట్లించి అంది.

‘‘అంతా వృధా!....బూడిదలో పోసిన పన్నీరు.’’ అన్నాడు.

అతని అసందర్భ ప్రేలాపనకి మరింత చిరాకు వచ్చింది. మాట్లాడకుండా ముందుకు నడిచింది. గాభరా పడ్డాడతను....

‘‘కీర్తన గారూ!.....’’ వెంటబడ్తూ పిలిచాడు. సర్రున తిరిగి చూసింది.

‘‘నా పేరెలా తెలుసు మీకు?’’ అనుమానంగా అంది.

‘‘భలే వారండీ మీరు....చిన్నప్పటి నుంచీ మీ ఆటని చూస్తున్నాను. ఎన్ని సార్లు మీ పేరు మైక్‌లో ఎనౌన్స్‌ చేయ లేదు?’’

‘‘ఆ! అవునవును. అయినా మీతో ఇలా మాట్లాడటం నాకు ఇష్టం వుండదు.’’ ఖచ్చితంగా అంది.

‘‘పోనీ అలా కార్లో వెళ్తూ మాట్లాడుకుందామా?’’ తమాషాగా అన్నాడు ఆకాష్‌.
కోపంగా చూసింది.

‘‘పోనీ లెండి....మీ మీద అభిమానంతో....’’ మధ్య లోనే అతని మాట కట్‌ చేసి, ‘‘ఆట మీద అభిమానంతో సరి దిద్దింది.

‘‘అదే లెండి. ఏ రాయి అయితేనేం పళ్ళూడగొట్టుకోడానికి మీ మీద సారీ....మీ ఆట మీది అభిమానంతో రేయింబవళ్ళు పిచ్చి పట్టి ఇలా తిరుగుతున్నాను కదా! నాకిలాంటి శాస్తి జరగాల్సిందే. అయినా ఆ వాలీబాలూ  ఒక గేమా? ఛ....అంత దరిద్రపు గేమ్‌.’’

‘‘నన్నేవన్నా అనండి. కానీ వాలీ బాల్‌ ని మాత్రం ఏవనొద్దు’’ ఆమె కళ్ళు రోషంతో నీళ్ళతో తళ తళ లాడ్తున్నాయి.

‘‘అంటానండీ! నాయిష్టం. మీకేంటి బాధ?’’ మీది మీది కొస్తూ అన్నాడు.

వెనక్కి జరుగుతూ, ‘‘ప్లీజ్‌!....అలా మాట్లాడొద్దు....’’ మళ్ళీ అంది.

‘‘అలాగే అంటాను. వంద సార్లు అంటాను. వాలీ బాల్‌ డర్టీ గేమ్‌. ఐ హేట్‌ వాలీ బాల్‌.’’ గట్టిగా అన్నాడు.

అంతే!!....

కన్నీళ్ళు చెంప మీద టప టపా వాన చినుకుల్లా పడి...ఆనక ధారలు కట్టడం మొదలు పెట్టాయి. బిత్తర పోయాడతను. ఏదో ఏడిపించడానికి అన్నాడు గానీ ఆమె అంత సీరియస్‌గా తీసుకుంటుందనుకో లేదు.

‘‘కీర్తనా!....ఏంటది....? ప్లీజ్‌!.. అందరూ మనల్నే చూస్తున్నారు.’’ వారించ బోయాడు. వినిపించుకో లేదామె. ప్రవాహ వేగం పెరిగేలా వుంది తప్ప తరిగేలా లేదు.

‘‘ఇలా రండి!.....’’ అంటూ చెయ్యి పట్టుకొని తన కారు దగ్గరికి తీసుకొచ్చాడు.

ఆ సీన్‌ ఆమె ఫ్రెండ్సందరూ చూశారు. మోచేతులతో సైగలు చేసుకుంటూ ఒకరి కొకరు చూపించు కున్నారు.

చెయ్యి పట్టుకునే కారు  డోర్‌ తీసి ఫ్రంట్‌ సీట్లో కూర్చో బెట్టి తను డ్రైవింగ్‌ సీట్లో కూర్చున్నాడు.

కీర్తన కి షాక్‌ తిన్నట్లుగా వుంది.

ఇంత వరకూ తన ముందు ఎవరూ వాలీ బాల్‌ గేమ్‌ గురించి విమర్శించ లేదు.

ఇవాళ కాక నిన్న తన అభిమానిగా పరిచయమయిన ఈ ఆకాష్‌ అంత లోనే ప్లేట్‌ మార్చేసి వాలీ బాల్‌ని డర్టీ గేమ్‌ అని నిందిస్తున్నాడు.
ఇదెలా సాధ్యం....?

వాలీ బాల్‌ డర్టీ గేమా.....?

ఇతని కెంత ధైర్యం....?

కీర్తనని చూసి జాలి కలిగింది ఆకాష్‌కి.

‘‘అంత సెన్సిటివ్‌గా ఉంటే ఎలా?’’ మృదువుగా అడిగాడు.

‘‘సెన్సిటివ్‌ నెస్‌ కాదు. నేను చాలా స్టెబర్న్‌. కానీ, మీరన్న మాటలు నా కమిట్‌ మెంట్‌కి సవాలు.’’ రోషంగా అంది.

‘ఏంటో ఈ పిచ్చి పిల్ల’ గొణుక్కున్నాడు.

కాసేపు తీవ్రంగా బాధ పడ్డాక ఈ లోకం లోకి వచ్చి తను ఎక్కడ ఉందో చూసుకుంది.

‘‘ఇదేంటీ....??

తను ఈ ఆకాష్‌తో....కారులో.... అమ్మో! ఇలా వెళ్ళడం ఎంత తప్పు? అందుకే అన్నయ్య అంటూ వుంటాడు. ‘నీకు లోక జ్ఞానం కాస్త తక్కువ’ అని. ఇలా ఇంకెప్పుడూ ఎవరి కార్లో ఎక్క కూడదు. గట్టిగా నిశ్చయించుకుంది.

ఇంకెప్పుడూ ఎక్క కూడదన్న విషయం తర్వాత...ముందు దిగటం గురించి ఆలోచించాలి.

‘‘ఎక్కడికి తీసుకువెళ్తున్నారు...?’’ భయంగా అంది.

‘‘ఏం భయమా...? తల తిప్పి చూస్తూ అడిగాడు.

‘‘నాకెందుకు భయం...?’’ బింకంగా అంది.

ఓరగా ఆమె వంక చూసి నవ్వుకున్నాడు.

నల్లటి ఒత్తయిన జుట్టు శోభనిస్తుండగా విరిసిన తాజా రోజాలా వుంది ఆమె మొహం.

ఆమెని మొదట చూసిన వారు ఎవరూ ఆమె ఇంత అమాయకు రాలంటె నమ్మరు. రాజసంతో నిండిన చూపు, కదలికలు చూసి పొగరు బోతయిన అమ్మాయి ఎలాగైనా వంచి తీరాలి అనిపిస్తుంది.

కానీ పది నిమిషాలు నిలకడగా నిలబడి మాట్లాడితే తెలుస్తుంది ఆమె ఎంత బోళా మనిషో!.....

ఆమె గురించి తన అంచనా తప్పని ఆ క్షణంలో ఆకాష్‌కి తెలీదు.

పువ్వులా మృదువుగా కనిపిస్తున్న ఆమె అవసరమైతే వజ్ర కఠోరంగా మారగలదనీ వాలీ బాల్‌ని తిడితేనే కంటికి కడివెడుగా ఏడుస్తున్న ఈమె, మరణ సమానమైన విషయాలని కూడా ఈజీగా తీసుకో గలదని.

కాసేపు ఏదో ఆలోచించింది కీర్తన. అంత సీరియస్‌గా ఏం ఆలోచిస్తోందో!....నవ్వుతూ అనుకున్నాడు ఆకాష్‌.

‘‘అసలు ఇంతకీ మీరెవరు?’’ సడెన్‌గా అడిగింది.

‘‘ఇది వరకు ఒక సారి ఆన్సర్‌ చెప్పాను’’ నవ్వుతూ అన్నాడు.

‘‘సీరియస్‌గా చెప్పండి’’ అడిగింది.

‘‘ఓ.కె. వినండి. నేను ఎం.బి.ఎ. చేశాను. ఓ ప్రైవేట్‌ కంపెనీలో మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌గా చేస్తున్నాను’’ చెప్పాడు.

‘‘ఆహా....మరి ఈ కారు?’’

‘‘నాకు కంపెనీ వాళ్ళిచ్చారు.’’

‘‘మరి అలాంటప్పుడు కంపెనీ పనుల మీద తిరగాలి కదండీ, యిలా నాతో.’’

‘‘అమ్మో! మరీ ముద్ద పప్పేం కాదు’’ అనుకుని.

‘‘పర్సనల్‌ గా కూడా వాడుకో వచ్చు.’’

ఆ తర్వాత కీర్తన ఏమీ రెట్టించ లేదు. తర్వాత టైమ్‌ చూసుకుంటూ ‘‘నాకు క్లాస్‌ టైమవుతోంది’’ అంది.

ఆకాష్‌కి మనసంతా భారంగా తయారైంది. తన మీద వున్న బాధ్యత చాలా పెద్దదిగా తోస్తోంది.

అసలేంటీ ఈ అమ్మాయి తత్త్వం?

ఒకోసారి ఆరిందాలా....

ఒకో సారి చిన్నపిల్లలా.....

అయినా చిన్నపిల్లలే నయం చాక్లెట్లిస్తే ఫ్రెండ్షిప్‌ చేస్తారు. ఈ అమ్మాయితో చాలా కష్టం.
మాట్లాడకుండా కారు వెనక్కి తిప్పాడు.

కీర్తన ఆలోచనలు వేరే విధంగా వున్నాయి. ఇతనితో కారులో రావడం మూలంగాగా ఏవో కొత్త విషయాు తెలుస్తున్నట్లుగా వుంది వాటి గురించి ఆలోచిస్తూ వుండి పోయింది.

అతను మౌనంగా వుండి పోవడం విచిత్రంగా వుంది.

‘‘మీగురించి ఏవైనా చెప్పండి’’ అందామనుకుంది కానీ ఎందుకో అడగ బుద్ధి కాలేదు. అడగకుండానే అతనే ఏమయినా చెపితే బాగుండుననిపించింది. అతన్ని చూస్తే చాలా బావున్నాడనిపిస్తోంది. మగ వాళ్ళని చాలా మందిని చూసింది. ఎప్పుడూ ఎవరినీ పరిశీనగా చూడాలనిపించలేదు. కానీ ఇతన్ని చూసిన కొద్దీ చూడాలనిపిస్తోంది.

ఏంటో మరి....

ఈ అబ్బాయి ఎంత బావున్నాడో నవ్వుకుంటూ అనుకుంది.

‘‘ఏంటి నవ్వుతున్నారు?’’ అతను గమనించి అడిగాడు.

‘‘ఏం లేదు’’ నసిగింది.

కాలేజి దగ్గర పడటం చూసి అతను ఆతృతగా ‘‘ప్లీజ్‌! చెప్పవా" అన్నాడు.

‘‘చెప్పొచ్చో లేదో! మీరేమైనా అనుకుంటారేమో!’’ మొహమాటంగా అంది. ’’నేనేమీ అనుకోను. తొందరగా చెప్పండి’’ టెన్షన్‌ భరించ లేక అన్నాడు.కారు కాలేజీ ముందుకొచ్చి ఆగింది.

ఆమె నవ్వుకుంటూనే డోర్‌ తీసుకుని దిగింది.

సమాధానం కోసం ఎదురు చూస్తున్నాడతను. అతని మొహం వంక ఓసారి చూసి ‘‘కొత్త వాలీ బాల్‌లా ఎంత బావున్నారో మీరు?’’ అని గిరుక్కున తిరిగి వెళ్ళి పోయింది.

నిలువు గుడ్లేసుకుని చూస్తుండి పోయాడు ఆకాష్‌.

అతనికి నవ్వూ కోపం రెండూ కలిగాయి. ‘అమ్మో! చాలా కష్టం’ మళ్ళీ అనుకున్నాడు.

************

క్లాసు లోకి అడుగు పెట్టే సరికి క్లాసంతా ఒకటే గోలగా వుంది. ఆరోజు లెక్చరర్‌ రాక పోవడంతో అందరికీ ఆట విడుపుగా వుంది.
అబ్బాయి కళ్ళన్నీ అమ్మాయి మీదా, వాళ్ళని కామెంట్‌ చెయ్యడం మీదే.

(మిగతా వచ్చేవారం)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్