గత సంచిక లోని అతడు-ఆమె-ఒక రహస్యం సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి. http://www.gotelugu.com/issue212/600/telugu-serials/atadu-aame-oka-rahasyam/atadu-aame-oka-rahasyam/
( గతసంచిక తరువాయి )... ఇవన్నీ నిజమైన ఫోటోలేనా లేక అవి మార్ఫింగ్ చేసినవా? అలా ఫోటోలు తయారు చేసి తనకి పంపాల్సిన అవసరం ఏమిటి ఆ ఫోటోలు పంపిన వ్యక్తులకి? ఫోటోలు పంపి, వెంటనే ఫోన్ స్విచాఫ్ ఎందుకు చేసుకున్నాడు?
రక రకాల ప్రశ్నలు మెదడుని తొలుస్తుంటే హఠాత్తుగా ఆమె మెదడులో ఏదో ఫ్లాష్ వెలిగినట్టనిపించింది. ఆ ఫోటోలోని అమ్మాయిని తను ఎక్కడో చూసింది... ఆ ఆలోచన రావడం తోనే ఆమెకి గుండెలు దడ దడ లాడాయి. ఆ ఫోటోలు మార్ఫింగ్ చేసినవై ఉంటాయన్న ఒక్క ఆశా పటా పంచలై పోయింది. ఆ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయిని మరో సారి పరిశీలనగా చూసింది... సందేహం లేదు... ఆమె ఆమే !!
నిజామా బాద్ బయలు దేరే ముందర పాణి మొబైల్ కి వాట్సప్ లో వచ్చిన అమ్మాయి ఫోటో ఆమెదే!
ఆమెకి ఒంట్లోని రక్తం మరిగినట్టనిపించింది. వెళ్ళిన దగ్గర నుంచీ పాణి దగ్గర నుంచి ఫోన్ లేదు. పనిలో ఉన్నప్పుడు పాణికి ఇల్లు గుర్తుకు రాదు. అది అంజలికి అలవాటే కనుక అప్పటి దాకా పెద్దగా పట్టించుకో లేదు. ఇప్పుడు ఆ ఫోటోలు చూస్తుంటే ‘అసలు పాణి నిజామా బాద్ వెళ్ళినది ఇన్వెస్టిగేషన్ పని మీదేనా’ అన్న అనుమానం వస్తోంది.
ఆ అనుమానం వచ్చాక ఇంక నిలబడ లేక పోయింది ఆమె. గబ గబా థియేటర్ లోంచి బయటకి వచ్చేసి పాణి నెంబర్ కి ఫోన్ చేసింది.
“హలో” అన్నాడు పాణి ఫోన్ ఎత్తి.
“ఎక్కడ ఉన్నారు?” మరో మాటకి ఆస్కారం ఇవ్వకుండా అడిగింది.
“నిజామాబాద్ లో. ఆ రాజేంద్ర వర్మ కేస్ చాలా చికాకు పెడుతోంది. ఆ బిజీలో ఉండి ఫోన్ చెయ్య లేక పోయాను. ఏమిటి సంగతులు? ఎలా ఉన్నావు?”
“అక్కడ మీతో పాటూ ఎవరు ఉన్నారు?”
“నాతో పాటూ అంటే?”
“మీతో పాటూ ఇన్వెస్టిగేషన్ లో మీకు సహాయం చెయ్యడానికి ఎవరు ఉన్నారు? మీకు పార్ట్ నర్ గా?” అందామె ‘పార్ట్ నర్’ అన్న పదాన్ని నొక్కి పలుకుతూ.
“ఎవరూ లేరు. నేనొక్కడినే”
“ఈ రోజు ఉదయం జాగింగ్ కి వెళ్ళారా?”
తను ఇక్కడ ఇవాళ జాగింగ్ చేసాడని చెబితే ముంబయిలో కూడా రోజూ చెయ్యమంటుందని భయం వేసింది పాణికి. అందుకే “లేదు. ముంబైలో ఉన్నప్పుడే జాగింగ్ చెయ్యడానికి నాకు బద్దకం అని తెలుసు కదా? ఇక్కడెలా వెడతాను? ఎందుకలా అడుగుతున్నావు?” అన్నాడు.
ఈ ప్రపంచంలో భార్యలని మించిన డిటెక్టివ్ లు ఉండరు. గొంతులో పలికే వైబ్రేషన్ ని బట్టి భర్త నిజం చెబుతున్నాడో అబద్దం చెబుతున్నాడో వాళ్ళు ఇట్టే కనిపెట్టెయ్య గలరు. పాణి అబద్దం చెబుతున్నాడని ఆమెకి అర్ధమైంది.
“ఏం లేదు. ప్రమాద కర మైన కేసు కదా, తోడుగా ఎవరినైనా ఉంచుకోండి. జాగింగ్ చెయ్యడం ఆరోగ్యానికి మంచిది. క్రమం తప్పకుండా చెయ్యండి. అది చెబుదామనే ఫోన్ చేసాను” కసిగా అని ఫోన్ పెట్టేసింది.
ఆమె మాటలకి చిన్నగా నవ్వుకుని, తన ఆలోచనలో తను పడి పోయాడు పాణి. సరిగ్గా ఆ సమయంలో అతడి కారు సిర్నాపల్లి గ్రామం పొలిమేరల్లోకి అడుగు పెట్టింది. పరిశోధనలో ఉన్న ప్రతి సారీ అంజలి ఫోన్ చేసినప్పుడు అతడికి ఏదో కొత్త ఐడియా వస్తూ ఉంటుంది. ఎప్పటిలాగే అప్పుడు కూడా అంజలి ఫోన్ పెట్టెయ్యగానే అతడికి కొత్త ఐడియా వచ్చింది. సమయం చూసుకున్నాడు ఇంకా ఐదున్నర కూడా కాలేదు.
రాజ మహల్ ఉన్న దారిలోకి మలుపు తిరుగుతున్న సమయంలో డ్రైవర్ కి చెప్పాడు పాణి “రాజ మహల్ వైపు కాదు రెండో వైపుకు పోనియ్. సిర్నాపల్లి గ్రామం లోకి వెడదాం” అన్నాడు.
“గ్రామంలో ఎక్కడికి వెళ్ళాలి?”
పాణికేం చెప్పాలో అర్ధం కాలేదు. గ్రామంలోకి వెడితే, అప్పుడు రాజేంద్ర అంత్య క్రియల సమయంలో కనిపించిన యాద గిరి మళ్ళీ కనిపిస్తాడేమోనన్న ఆలోచనతో గ్రామంలోకి వెడదామన్నాడు. ఇప్పుడు డ్రైవర్ మాటలతో ఆలోచనలో పడ్డాడు. గ్రామం లోకి వెళ్ళి తను యాదగిరి కోసం ఎంక్వయిరీ చేస్తే ఆ వార్త కచ్చితంగా రాజ మహల్ వరకూ వెడుతుంది. డ్రైవర్ కి ఏమని చెప్పాలి?
‘ఊళ్ళో చెరువు దగ్గరకి వచ్చినప్పుడల్లా నన్ను పిలిచి నాతో కబుర్లు చెప్పేవారు’ అని యాదగిరి అనడం గుర్తొచ్చింది.
“చెరువు దగ్గరకి పోనియ్” అన్నాడు అప్రయత్నంగా.
ఆ కారు కోసమే రోడ్డు మలుపులో కాసుకుని కూర్చున్న ఒక వ్యక్తి కారు రాజమహల్ వైపు కాకుండా, సిర్నాపల్లి గ్రామం వైపు మలుపు తిరగడాన్ని గమనించి, సైకిల్ మీద తను కూడా కారు వెంట సిర్నాపల్లి గ్రామం వైపు బయలు దేరాడు.
***
బంగళాలో ఒంటరిగా ఉన్న ఇంద్ర నీలకి ఏం చెయ్యాలో తోచడం లేదు. వంట వాళ్ళతో, పని వాళ్ళతో అందరితోనూ మాటలు కలిపి ప్రశ్నలు వేసింది కానీ తనకి కావాల్సిన సమాచారం దొరక లేదు.
బంగళాలో ఆమె ఏం చేస్తున్నా పట్టించుకోనట్టుగా ఉంటున్నాడు పెద్ద రాజా నరేంద్ర వర్మగారు. సురేష్ వర్మ మాత్రం తను ఎవరితో మాట్లాడుతున్నా, తనని ఒక కంట కనిపెడుతున్నాడు. తాత గారి మాట కాదన లేక పెద్ద కర్మ దాకా తాము అక్కడ ఉండడానికి ఒప్పుకున్నాడు కానీ, అసలు అతడి వాలకం చూస్తుంటే తాము అక్కడ ఉండం అతడికి అస్సలు ఇష్టం లేనట్టుగా ఉంది.
‘రాజేంద్ర మరణం గురించి ఇప్పడు పరిశోధన చేసి మాత్రం ఏం ప్రయోజనం?’ అని పెద్ద రాజా వారి ఉద్దేశం అయితే, ‘అసలు పరిశోధనే జరగ కూడదన్నది’ సురేష్ వర్మ అభిమతంలా కనిపిస్తోంది. రాజేంద్ర గదిలోకి మరో సారి వెళ్ళి తనకి కావాల్సిన దాని గురించి ఏమైనా క్లూ దొరుకుతుందేమోనని వెదుకుదామనుకుంది కానీ, సురేష్ వర్మ తనని వెంట పడుతున్నట్టుగా గమనిస్తుండడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది.
అయినా, రాజేంద్ర మరణం గురించి ఎంక్వయిరీ చేస్తుంటే సురేష్ వర్మ ఎందుకు భయపడుతున్నాడో అర్ధం కావడం లేదామెకి. పాణి అనుమానిస్తున్నట్టుగా రాజేంద్ర మరణం వెనుక మరేదైనా కారణం ఉందా? అతడు మరణించడం వల్ల మొత్తం సంస్థానానికంతటికీ ఉన్న వారసుడు సురేష్ వర్మే ఔతాడు. ఆస్థి మీద కోరికతో సురేష్ వర్మ రాజేంద్రని హత్య చేసాడా? కంప్యూటర్ లో హత్య ఎలా చెయ్యాలి అన్న విషయం మీద బ్రవుజ్ చేసినది అతడేనా?
ఏది ఏమైనా తనకి అవరసరమైన సమాచారం తప్ప మిగిలినదంతా దొరకడం ఆమెకి విసుగ్గా అనిపిస్తోంది. తన మనసులోని భావాలని ఎవరికైనా చెప్పుకుంటే కొంత విసుగు తగ్గే అవకాశం ఉంది. బంగారు లక్ష్మికి ఫోన్ చేస్తోంది కానీ, దొరకడం లేదు.
ముందు రోజు రాత్రి ఆమెతో మాట్లాడిన దగ్గర నుంచీ బంగారు లక్ష్మి ఫోన్ మళ్ళీ కలవలేదామెకి. ‘అసలు ఫోన్ స్విచాఫ్ చేసి వెలగ బెట్టాల్సినంత రాచ కార్యాలు ఏమున్నాయి ఆమెకి?’ అసహనంగా అనుకుంటూ బంగళా లో కాలు కాలిన పిల్లిలా తిరగ సాగింది.
పాణి కూడా మధ్యాహ్నం నుంచీ కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్ళాడు? అసలు అక్కడ ఏం జరుగుతోందో అర్ధం కావడం లేదామెకి. ‘తనేమైనా ప్రమాదంలో ఉందా?’ అనుకుంది.
****
విశాలమైన పెద్ద చెరువు స్వఛ్ఛంగా మెరుస్తున్న నీలి రంగు నీటితో మానస సరోవరంలా ఉంది. చెరువు మీదుగా ఉదయయిస్తున్న చంద్రుడు పసుపూ ఎరుపూ తెలుపూ కలగలిసిన రంగులో కనిపిస్తూ అందంగా మెరుస్తున్నాడు. చంద్రుడి ప్రతిబింబం ఆ నీటి అలలలో మరింత అందంగా కనిపిస్తోంది. అద్భుతమైన ఆ సౌందర్యాన్ని చూస్తూ అలాగే ఉండి పోయాడు పాణి.
పాణి అక్కడ టాక్సీ దిగగానే ఒక వ్యక్తి పరిగెట్టుకుంటూ వచ్చాడు “బంగళానుంచేనా సారూ” అని అడిగాడు.
పాణి తలూపాడు. “మీరు ముంబై నుంచి వచ్చిన రాజేంద్ర దొర గారి స్నేహితుడు కదా?” అన్నాడు ఆ వ్యక్తి.
“అవును. నీ పేరు?” అన్నాడు పాణి ఆ వ్యక్తిని పరిశీలనగా చూస్తూ.
“నా పేరు జంపన్న గౌడ్. మిమ్మల్ని రాజేంద్ర దొర గారి అంత్యక్రియలప్పుడు చూసాను”
“దొర గారింత తొందరగా వెళ్ళిపోతారని ఎవ్వరం అనుకోలేదండీ. వెన్నపూసంటి మనసు అయనది. ఎవరికేం కావాలన్నా అడగ్గానే సహాయం చేసే వారు” బాధ పడుతున్నట్టుగా అన్నాడు అతడు “కోటలో ఉంటే ప్రతి పౌర్ణమి నాడూ తప్పని సరిగా దొర గారు చెరువు గట్టు కొచ్చి కాస్సేపు గడిపి వెళ్ళే వారండీ. పౌర్ణమి నాడు చెరువు గట్టుకొస్తే ఆయనే గుర్తుకొస్తారు”
“నాతో కూడా రాజేంద్ర మీ ఊరి చెరువు గురించి చాలా సార్లు చెప్పే వాడు. నేను ఇదే మొదటి సారి చూడడం. నిజంగా రాజేంద్ర చెప్పినంత అందం గానూ ఉంది మీ ఊరి చెరువు” అన్నాడు పాణి.
జంపన్న గౌడ్ గర్వంగా నవ్వాడు. “సిర్నాపల్లి చెరువు గట్టంటే జిల్లా మొత్తానికి ఫేమస్ సారూ. ఇంత విశాల మైన చెరువు ఈ ప్రాతంలో ఎక్కడా లేదు. ఎక్కడెక్కడి నుంచో ఈ చెరువుని చూడడానికి వస్తూ ఉంటారు. రాజా వారు పౌర్ణమి రోజున చెరువు గట్టున అర్ధరాత్రి వరకు కవిత్వాలు చెప్పుకుంటూ స్నేహితులతో పార్టీలు చేసుకునే వారు. పట్నం నుంచి ఆయన స్నేహితులెవరు వస్తే ఈ చెరువు చూపించ కుండా పంపించే వారు కాదు. ఒక రోజు అర్ధ రాత్రి ఒక దొరసానమ్మగార్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చారు...” ఉత్సాహంలో చెప్పేసి చటుక్కున నాలుక్కరుచుకున్నట్టుగా ఆగాడు జంపన్న గౌడు.
“దొరసానమ్మ గారా?” ఆశ్చర్యంగా అన్నాడు పాణి.
(నోరు జారిన జంపన్న గౌడ్ మాట వెనక్కి తీసుకున్నాడా, లేక ఆ దొరసాని ఎవరో చెప్పేసాడా........ఈ సస్పెన్స్ వచ్చేవారం దాకా.....................) |