గత సంచికలోని అతడు-ఆమె-ఒక రహస్యం సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.
http://www.gotelugu.com/issue211/597/telugu-serials/atadu-aame-oka-rahasyam/atadu-aame-oka-rahasyam/
( గతసంచిక తరువాయి )... “బేకింగ్ సోడా ఇంకుతో జరిపిన రియాక్షన్ వల్ల ఇంకు పేపరు నుంచి వేరవుతుంది. రాజేంద్ర రాసిన సూసైడ్ నోట్ ని ఎవరో బేకింగ్ సోడా ఉపయోగించి ఆల్టర్ చేసారు”
“బేకింగ్ సోడా ఉపయోగించి అలా చెయ్యచ్చా?”
“బేకింగ్ సోడాని నీళ్ళలో మిక్స్ చేసి ఆ పేస్టుని ఇంకు మీద రాసి ఆర బెడితే, కాస్సేపటికి నీరు ఎవాపరేట్ అయి, నీటితో పాటూ ఇంకు కూడా మాయమౌతుంది. ఎండిన బేకింగ్ సోడా పౌడర్ లా రాలి పోతుంది. ఎరేజ్ చేసిన ఆనవాలు లేకుండా పేపరు మీద ఉన్నది ఆల్టర్ చెయ్యచ్చు. రాలి పోగా మిగిలిన బేకింగ్ సోడా పార్టికల్స్ మన ఫోరెన్సిక్ రిపోర్టులో బయట పడింది.
ఈ సూసైడ్ నోట్ పరిశీలనగా చూస్తే క్రింద కొంత మేర పేపర్ లో తేడా తెలుస్తోంది చూసావా? బేకింగ్ సోడా వల్ల చెరిగి పోగా మిగిలిన ఇంకు మార్కులని అనుమానం రాకుండా సున్నితంగా బ్రష్ తో రబ్ చేసి చెరిపేసి ఉండచ్చు. దీన్ని బట్టి సూసైడ్ నోట్ ని ఎవరో ఆల్టర్ చెసారన్న విషయాన్ని కచ్చితంగా చెప్పచ్చు”
“అసలు సూసైడ్ నోట్ ని ఆల్టర్ చేయాల్సిన అవసరం ఎవరికి వస్తుంది?”
“ఎవరైతే ఈ మరణం వెనుక ఉన్నారో ఆ నేరస్తులకి”
“మరణం ఆత్మహత్య అయితే ఈ మరణం వెనుక వేరెవరో ఉండే అవకాశం ఎక్కడ ఉంది?” లాజిక్ లాగుతూ అన్నాడు ప్రసాద్.
“ఇక్కడ మూడు రకాల ప్రాబబిలిటీలు ఉన్నాయి. మొదటిది అతడినెవరో హత్య చేసి, అంతకు ముందు అతడు రాసిన కవిత్వాన్నో, మరో మేటర్ ఉన్న కాగితాన్నో తీసుకుని దానిలో కొంత మేటర్ ని ఆల్టర్ చేసి సూసైడ్ నోట్ గా తయారు చేసి ఉండచ్చు.
రెండో ప్రాబబిలిటీ హంతకుడు హత్య చేయడానికి ముందే ప్లాన్ చేసి, ఆ హత్యని ఆత్మహత్యగా నిరూపించేందుకు అతడిని హింసించి, బలవంతంగా సూసైడ్ నోట్ రాయించి ఉంటారు. రాసేటప్పుడు రాజేంద్ర తెలివిగా ఆ నోట్ తన చేత బలవంతంగా రాయించ బడుతోందని తలిసే హింట్ ఏమైనా ఇచ్చి ఉంటే, అది బయటికి తెలియకుండా తరువాత ఆల్టర్ చేసి ఉండచ్చు.
మూడో ప్రాబబిలిటీ రాజేంద్ర నిజం గానే ఆత్మహత్య చేసుకుని, తన ఆత్మహత్యకి కారణమైన వాళ్ళ పేరు సూసైడ్ నోట్ లో రాసి ఉండచ్చు. అతడు మరణించిన తరువాత వాళ్ళు ఆ సూసైడ్ నోట్ చూసి, తమ పేరు బయటికి రాకుండా నోట్ ని ఆల్టర్ చేసి ఉండచ్చు”
“యూ ఆర్ రైట్” అన్నాడు ప్రసాద్.
“అన్నింటి కన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ మూడు ప్రాబబిలిటీలూ కాకుండా మనం ఊహించ లేని నాలుగో ప్రాబబిలిటీ కూడా ఉండచ్చన్న విషయాన్ని కూడా మనం విస్మరించక పోతేనే మన డిటెక్షన్ సక్రమమైన మార్గంలో వెడుతుంది” నవ్వుతూ అన్నాడు పాణి.
ప్రసాద్ కూడా నవ్వాడు అతడి మాటలకి.
“ఈ ప్రశ్నలకి సమాధానాలు నాకు సిర్నాపల్లి లోనే దొరుకుతాయి. ఎనీ హౌ, నేను అడగ్గానే ఎటువంటి ఫార్మాలిటీలూ లేకుండా క్లూస్ ని పరిశీలించడానికి అవకాశం ఇచ్చినందుకు థాంక్స్” అన్నాడు పాణి బయలు దేరుతూ.
అతడి కారు నిజామాబాద్ నుంచి సిర్నాపల్లి రోడ్డు మీదకి వెడుతుంటే, పడమట దిక్కున అప్పుడే సూర్యుడు అస్తమిస్తున్నాడు. ‘రేపీపాటికి మిస్టరీని సాల్వ్ చెయ్యాలి. ఇంకా నాకు మిగిలిన సమయం ఇరవై నాలుగు గంటలే’ అస్తమిస్తున్న సూర్యుడ్ని చూస్తూ అనుకున్నాడు పాణి. అతడు అనుకున్నట్టుగా ఆ మిస్టరీని సాల్వ్ చెయ్యడానికి అతడికి మిగిలిన సమయం ఇరవై నాలుగు గంటలు కాదనీ, కేవలం పదహారు గంటలేననీ. ఇంకో పదహారు గంటల్లో తనకి అర్జెంటుగా ముంబయి వెళ్ళాల్సిన అవసరం వస్తుందనీ, అతడికి ఆ క్షణంలో తెలియదు !!
****
ముంబై లోని జుహూలో ఉన్న పి.వి.ఆర్ ప్రీమియర్ మల్టీప్లెక్స్ థియేటర్స్ లో తెలుగు సినిమాలు ఆడే ఒక స్క్రీన్ లో ‘బాహుబలి’ సినిమా చూస్తోంది అంజలి.
ప్రీమియర్ క్లాస్ లగ్జరీ సీటులో కూర్చుని ఉన్న ఆమె పక్కన స్నాక్స్ పెట్టుకునే ట్రేలో పాప్ కార్న్, కోకోకోలా ఉన్నాయి. మధ్య మధ్యలో పాప్ కార్న్ తింటూ, కోక్ ని సిప్ చేస్తూ సినిమాని ఎంజాయ్ చేస్తోందామె. ఆమెకి తెలుగు సినిమాలంటే చాలా ఇష్టం. దేశంలో ఎక్కడ ఉన్నా తెలుగు సినిమా చూసే అవకాశం వస్తే వదులుకోదు. చాలా మంది స్త్రీలలా కంపెనీ లేకుండా ఒక్కత్తే సినిమాకి వెళ్ళాలన్నా జంకే స్వభావం కాదామెది. అంతటి సినిమా ప్రేమికురాలామె. పాణి ఊర్లో లేక పోవడంతో ముంబైలో ఎక్కడెక్కడ తెలుగు సినిమాలు ఆడుతున్నాయో వెదుక్కుని మరీ వెళ్ళి చూస్తోందామె రెండు రోజుల నుంచీ.
స్క్రీన్ మీద హీరో హీరోయిన్లు ‘పచ్చ బొట్టేసినా’ అంటూ వివిధ డిజైన్లలో పచ్చ బొట్లని ఇద్దరి శరీరాల మీదా ఉమ్మడిగా వేసుకుని రకరకాల భంగిమల్లో నాట్యం చేస్తుంటే, ఆ క్రియేషన్ కీ, ఫోటోగ్రఫీ పనితనానికీ అబ్బుర పడుతూ రెప్ప వెయ్యకుండా చూస్తోంది.
సరిగ్గా ఆ సమయంలో ఆమె సెల్ కి ఏదో మెసేజ్ వచ్చింది. సెల్ ‘బీప్ బీప్’ మని శబ్దం చేసింది. ‘తరువాత చూసుకుందాంలే’ అని ఆమె పట్టించుకో లేదు. ఒక రెండు క్షణాల తరువాత మళ్ళీ ‘బీప్ బీప్’మని శబ్దం చేసింది. సినిమాలో లీనమై ఉన్న అంజలి విసుగ్గా సెల్ ని సైలెంట్ మోడ్ లోకి మార్చి ట్రే మీద పెట్టింది.
అయినా సరే ఊరుకోలేదు ఆమె సెల్ ఫోను. మళ్ళీ మెసేజెస్ వచ్చాయన్నదానికి గుర్తుగా ట్రేమీద వైబ్రేట్ అవుతూ ‘గుర్ర్...’ మంటూ మరో రెండు సార్లు శబ్దం చేసింది.
‘ఇన్ని సార్లు మెసేజ్ ఇస్తున్నదెవరా’ అని విసుగ్గా అనుకుంటూ తప్పదన్నట్టుగా సెల్ ఫోన్ ని చేతిలోకి తీసుకుని చూసింది. వాట్సప్ లో మెసేజిలు వచ్చినట్టుగా సింబల్ కనపడింది స్క్రీన్ మీద.
వాట్సప్ ఓపెన్ చేసింది.
ఎవరిదో తెలియని నెంబరు. ఏవో ఫోటోలని పంపిస్తున్నారు. అదే నెంబరు నుంచి ఆగకుండా ఫోటోలు వస్తున్నాయని కనిపిస్తోంది స్క్రీన్ మీద. ఫోటోలు నెమ్మదిగా డౌన్ లోడ్ అవుతుంటే, ఆ గుర్తు తెలియని వ్యక్తులు తనకి ఫోటోలు ఎందుకు పంపిస్తున్నారో అర్ధం కాక సినిమా చూడడం మానేసి సెల్ ఫోన్ స్క్రీన్ వంకే చూడసాగింది.
ఒక్కో ఫోటో డౌన్ లోడ్ అయ్యి స్పష్టంగా కనిపిస్తున్న కొద్దీ ఆమె ముఖంలో రంగులు మారసాగాయి.
తను సినిమా హాల్లో ఉన్నాన్నా విషయాన్ని కూడా మర్చిపోయి వెంటనే ఆ నెంబర్ కి కాల్ చేసింది. ఫోన్ స్విచాఫ్ అయి ఉందని ఆపరేటర్ చెబుతున్న మెసేజ్ వినిపించింది. మరో సారి అతడు పంపిన ఫోటోలనే పరిశీలనగా చూసింది. ఆమె రక్తం ఉడికి పోయింది.
‘ఎవరీ మనిషి? తనకెందుకు మెసేజెస్ పంపించాడు?’ అవి కాదు ఆమెని వేధిస్తున్న ప్రశ్నలు... అసలు ఆ ఫోటోల్లో తను చూస్తున్నది నిజమేనా?
ఆ ఫోటోలని జూమ్ చేసుకుని మరోసారి చూసింది. పాణి ఎవరో అమ్మాయితో కలిసి ఉదయాన్నే తోటలో జాగింగ్ చేస్తున్న ఫోటోలు...
ఒక ఫోటోలో ఇద్దరూ భుజం భుజం రాసుకుంటూ జాగింగ్ చేస్తుంటే, మరో ఫోటోలో ఇద్దరూ ఒకరి కళ్ళల్లోకి ఒకరూ నవ్వుతూ చూసుకుంటున్నారు. మరో ఫోటోలో పాణి ఆమె నండు చుట్టూ చెయ్యి వేసి పట్టుకున్నాడు. ఆమె నవ్వుతూ అతడి వంక చూస్తోంది. ట్రాక్ సూట్లో ఉన్న ఆమె ఒంటి ఒంపు సొంపులు ఫోటోలో కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి.
(అపరాధ పరిశోధనలో ఆరితేరిన పాణికి చుక్కలు కనిపించే కథ ఇప్పుడే మొదలైందా? చుక్కలు చూపించే ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరు? ఎవరు?? ఈ సస్పెన్స్ వచ్చేవారం దాకా....) |