Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
atadu .. aame..oka rahasyam

ఈ సంచికలో >> సీరియల్స్

నాదైన ప్రపంచం

nadaina prapancham

 గతసంచికలో నాదైన ప్రపంచం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి..http://www.gotelugu.com/issue213/602/telugu-serials/naadaina-prapancham/nadaina-prapancham/

( గతసంచిక తరువాయి )..  చిరునవ్వు నవ్వింది.

‘‘ఎక్కడ మీ ఇల్లు?’’ అడిగాడు.

గాజుల చేత్తో ఎటు వెళ్ళాలో వివరించింది.

అతనేవో ప్రశ్నలు అడుగుతుంటే పొడి సమాధానాలు చెప్పడం తప్ప ఆమె ఏమీ కల్పించుకొని మాట్లాడ లేదు.

పావు గంటలో వాళ్ళుంటున్న ఇల్లు వచ్చింది. మిడిల్‌ క్లాస్‌ లొకాలిటీలో మూడు గదుల పోర్షన్‌ అది.

కారు దిగి.....

‘‘లోపలికి రండి’’ మర్యాదగా పిలిచింది.

ఇంకో సారి అడిగించుకోకుండానే దిగి వచ్చాడు.

సంకోచం గానే అతన్ని వెంట బెట్టుకొని లోపలికి నడిచింది.

ముందు గదిలో ఎవరో పెద్దావిడ కూర్చుని గోంగూర కాడలు త్రుంచుతోంది.

అశోక్‌ని చూసి లోపలికి నడవ బోయింది.

‘‘ఉండత్తా.. ఈయన అశోక్‌’’ పరిచయం చేసింది.

అశోక్‌ నమస్తే చెప్పగానే తబ్బిబ్బువుతూ ప్రతి నమస్కారం చేసిందామె.

‘‘అన్నయ్యకి ఎలా వుంది?’’ ఆతృతగా అంది.

‘‘జ్వరం అలాగే వుంది. ఒళ్ళు పేలిపోతోంది. పోనీ ధర్మాసుపత్రికైనా...’’ అంటూ ఆవిడ ఏదో చెప్పబోతోంటే...

‘‘సరేలే అత్తా!’’ అంటూ వారించి, ‘‘కూర్చోండి’’ అంటూ అతనికి చెప్పింది.

‘‘ఎవరికి బాగా లేదు....?’’ వాడి పోయిన ఆమె మొహాన్ని చూస్తూ అన్నాడు.

‘‘మా అన్నయ్యకి బాగా ఫీవర్‌’’ లో గొంతుకతో అంది.

‘‘మెడిసన్స్‌ వేశారా?’’ అడిగాడు.

సమాధానం చెప్ప లేకపోయిందామె. తల దించుకుంది. ఎంత ప్రయత్నించినా ఆగమంటూ విశాలమైన ఆమె కళ్ళ నుంచి నీటి బిందువులు టప టపా చేతులపై పడ్డాయి.

‘‘చూద్దాం రండి’’ పిలిచాడు.

మధ్య గది వైపు నడిచిందామె.

అక్కడ ఒక యువకుడు ఇంచుమించుగా తన వయసే వుంటుంది. మంచంపై స్పృహ లేనట్లు పడున్నాడు.

జ్వర తీవ్రతకి మొహమంతా కంది పోయింది. ఒంటి మీద చెయ్యి వేసి చూసాడు.

చురుక్కున కాలింది. నూట మూడు డిగ్రీలకి తక్కువ వుండదు.

‘‘హాస్పిటల్‌కి తీసుకు వెళదాం. ముందు తడి గుడ్డతో ఒళ్ళు తుడవండి’’ చెప్పాడు.

ఆపద్భాందవుడిలా వచ్చిన అతన్ని తిరస్కరించానిపించ లేదు.

అతను చెప్పినట్లే తుడిచి అన్నని లేపింది.

మగతలో లేచాడు.

‘‘ఈయన అశోక్‌’’ చెప్పింది.

నమస్కరించాడే గానీ కళ్ళు వాలి పోతున్నాయి.

అతని స్థితి చూసి కంగారు పడ్డాడు అశోక్‌. మెల్లగా నడిపించుకుంటూ తీసుకెళ్ళి కార్లో బాక్‌ సీట్లో పడుకోబెట్టించాడు జాహ్నవి సహకారంతో...
తమ ఫామిలీ డాక్టర్‌ హాస్పిటల్‌కి తీసుకెళ్ళాడు. వెంటనే ఎడ్మిట్‌ చేసుకొని ట్రీట్‌మెంట్‌ స్టార్ట్‌ చేశాడు డాక్టర్‌.

టెస్టుల్లో టైఫాయిడ్‌ అని తేలింది.

‘‘ఇన్ని రోజులు నెగ్లెక్ట్‌ చేశారు’’ గొణిగాడు డాక్టర్‌.

‘‘ప్రమాదం ఏమీ లేదు కానీ మూడు రోజులు హాస్పిటల్లో వుంచాలి’’ అని చెప్పాడు.

టైఫాయిడ్‌ ట్రీట్‌మెంట్‌ లేటయింది కాబట్టి, బాడీలో ఏవయినా భాగాలు ఎఫెక్టయినాయేమో అబ్జర్వ్‌ చేయాలని చెప్పాడు.

రూంలో ఎడ్ మిట్‌ చేసి మందులవీ టేబిల్‌ మీద సర్దించి, వాళ్ళ మేనత్తని రూంలో వుంచి, అశోక్‌ బయటికి నడిచాడు. జాహ్నవి అతని వెనకాలే వచ్చింది.

ఆ పొడవాటి కారిడార్‌లో అతని పక్కనే నడుస్తూ మెడలో ఉన్న సన్నటి చైన్‌ని తీసి అతనికిస్తూ చేతులు జోడించి..

‘‘అసలు డబ్బులు లేవు. ఈ ఒక్క చైనే....ఆత్మాభిమానం కన్నా ప్రాణాలే ముఖ్యం కదా! మా అన్నని కాపాడండి....’’ కన్నీళ్ళతో అంది జాహ్నవి.

చిత్రంగా అతని చెయ్యి ఆ చెయిన్‌ని తీసుకుంది.

అతనలా తీసుకున్నందుకు ఆమె మొహం వికసించింది కూడా.

‘‘నేను రాత్రికి మళ్ళీ వస్తాను’’ చెప్పి వచ్చేశాడు. తను జమీందారీ బిడ్డయినా, ఆస్థి ఉన్నా అప్పుడు తన దగ్గర ఎక్కువ డబ్బు లేదు.
ఇంటికొచ్చి చాలా సేపు ఆలోచించాడు. ఎవరినీ డబ్బు అడగాలనిపించ లేదు. హాస్పిటల్‌ ఖర్చు అయిదు వేలు దాటొచ్చు. ఆ క్షణంలో వాళ్ళ ఫ్యామిలీని కూడా ఆదుకోవాలనిపించింది.

అందుకే చిన్నప్పుడు తండ్రి తనకి చేయించిన నాలుగు తులాల పులిగోరు చెయిన్‌, మూడు తులాల బ్రాస్‌లెట్‌ అమ్మేశాడు. పాతికవేలు వచ్చింది.

అమ్ముతున్నప్పుడు....పాకెట్‌ జేబులో వున్న సన్నటి చెయిన్‌ని ఆప్యాయంగా తడిమాడు. ఏదో బంధం ముడి పడి పోయినట్లు అనిపించింది.

ఆ రోజు రాత్రికి మళ్ళీ హాస్పిటల్‌ కి వచ్చాడు.

అప్పటికే సరైన మందులు పడటంతో తేరుకున్నాడతను. తాను వెళ్ళే సరికి దిండ్లనానుకుని కూర్చున్నాడు ప్రకాష్‌. మొహం తేటగా వుంది.
అశోక్‌ని చూడగానే అతని కళ్ళు కృతజ్ఞతతో మెరిశాయి.

‘‘హౌవ్వార్యూ?’’ ఆప్యాయంగా అన్నాడు.

‘‘ఫైన్‌ సర్‌! నా పేరు ప్రకాష్‌....’’ అశోక్‌ చేతిని రెండు చేతులతో బంధించి అన్నాడు.

అప్పుడు తెలిశాయి వాళ్ళ ఫామిలీ వివరాలు. చిన్న తనం లోనే తల్లి తండ్రులను పోగొట్టుకున్నా, ఉన్న కొద్ది పాటి ఆస్థితో తల చెడి ఒంటరిగా వున్న మేనత్త అండతో ప్రకాష్‌ బి.ఫార్మసీ, జాహ్నవి ఇంటర్‌ వరకూ చదివారు.

ప్రకాష్‌ ఏదో చిన్న కంపెనీలో జాబ్‌ చేస్తూ జాహ్నవికి పెళ్ళి సంబంధాలు చూస్తున్నాడు.

చిన్నప్పుడే తల్లిదండ్రులు పోయినా, తనే కష్టాలు పడ్డాడు కానీ....చెల్లిని పువ్వులా పెంచాడు.

ప్రకాష్‌ పని చేస్తున్న కంపెనీలో ఏవో గొడవలు వచ్చి మూసేశారు. అతనికి ఆధారం పోవడంతో ఇంట్లో తిండికే కష్టమయిన పరిస్థితి. ఉన్న ఎకరం పొలం అమ్ముదామని అనుకుంటుండగా, ప్రకాష్‌కి జ్వరం పట్టుకుంది.

దాంతో వారం కిందటే జాహ్నవి సేల్స్‌గాళ్‌గా జాయినయింది. కానీ ఆ విషయం అన్నయ్యకి తెలియనివ్వలేదు. కానీ తను ఎన్నోరోజులు ఆ ఉద్యోగం చేయ లేనని అనుకుంటుండగానే అశోక్‌ పరిచయమయ్యాడు.

సుడి గుండంలో మునిగి పోతున్న వాడికి ఆధారం దొరికినట్లుగా వుంది జాహ్నవికి అతని పరిచయం.

ఎంతో భరోసాగా, నిశ్చింతగా వుంది. పరాయి వాడన్న భావమే కగడం లేదు.

‘‘నాలుగు రోజుల్లో డిశ్చార్జ్‌ చేస్తారు. ఏమీ ఫర్వాలేదు. డాక్టర్‌కి నేను పే చేశాను. మీరేం వర్రీ అవ్వొద్దు’’ చెప్పాడు.

ప్రకాష్‌ మొహమాటంగా తల దించుకున్నాడు.

అశోక్‌ అతని భుజం తట్టి.. ‘‘ఫర్లేదు.. అప్పేలెండి. తీర్చేద్దురు గాని’’ అన్నాడు.
అతని కలివిడి తనానికి ముచ్చట పడింది మేనత్త.
ఆ మూడు రోజులూ ప్రతి పూటా వెళ్ళి చూసొచ్చాడు. ఆరోగ్యం అంతా బావుండటంతో డిశ్చార్జ్‌ చేశారు.
ఆ రోజు కార్ లోనే ఇంట్లో దింపి వచ్చే ముందు అయిదు వేలు చేతిలో పెట్టి ‘‘ఖర్చుకి వుంచండి’’ చెప్పాడు.
ముక్కూ మొహం తెలియని వాళ్ళకి ఇంత డబ్బు ఖర్చు చేయటం వెనుక వున్న కారణం....?! అతని చెల్లిని చూశా? అనే డౌట్‌ వచ్చినా ప్రకాష్‌ మాటల్లోని స్వచ్ఛత, చూపుల్లోని గాంభీర్యం తన అనుమానాలను పటా పంచలు చేశాయి.
ఆ తర్వాత....వారం రోజులు వూపిరి సపని పనుల్లో మునిగి పోయాడు.
ఆ వారం రోజులూ ప్రతి రోజూ క్షణమొక యుగంగా అతని కోసం ఎదురు చూడటం జాహ్నవికే విచిత్రంగా వుండేది.
ఆ రోజు భూపతి ఫార్మాస్యూటికల్స్‌ నుంచి ఇంటర్వ్యూకి రావాలని లెటర్‌ వచ్చింది. ఫార్మాసిస్ట్‌ జాబ్‌.
తనెప్పుడూ అప్లయ్‌ చెయ్య లేదే?’ ఆలోచనలో పడ్డాడు. మర్చి పోయి వుంటావులే వెళ్ళిరా అన్నయ్యా!’’ అంటూ ఉత్సాహ పరిచింది జాహ్నవి.
అతనికి ఇంకా నీరసం తగ్గక పోవడంతో తను కూడా వెనక వెళ్ళింది.
ఇంటర్వ్యూ జరిగే రూంలోకి తన అన్న వెళ్ళ గానే మనసు లోనే ఉద్యోగం రావాలని కోటి దేవుళ్ళకి మొక్కుకుంది జాహ్నవి.
పావు గంటకి గది లోంచి బయటకి వచ్చాడు ప్రకాష్‌. మొహమంతా చిరు చెమటలు, సంభ్రమం పెనవేసుకుని వున్నాయి. మనిషి కొద్దిగా తూలాడు. గబుక్కున వెళ్ళి పట్టుకుంది.
‘‘లోప ఎవరో తెలుసా?’’ అడిగాడు ప్రకాష్‌.
‘‘ఎవరు?’’ ప్రశ్నించింది జాహ్నవి.
‘‘అశోక్‌.....’’
అశోక్‌!!....మన అశోక్‌?!’’ ఆశ్చర్యంలోనయినా అతను తమకి ఎంత కావల్సిన వాడో తెలియ జెప్పింది జాహ్నవి.
‘‘యస్‌! మన అశోక్‌’ దృఢంగా అన్నాడు ప్రకాష్‌.
ఇద్దరూ ఆటోలో ఇంటికి వచ్చారు. వచ్చాక మేనత్తనీ, చెల్లినీ కూర్చోబెట్టుకుని తన ఉద్యోగ వివరాలు తెలియ చేసాడు.
పెద్ద కంపెనీ కాక పోయినా అశోక్‌ తెలివి తేటలు చూస్తుంటే దాన్ని మంచి పొజిషన్‌లోకి తీసుకు వెళతాడనిపిస్తోంది. నమ్మకమయిన పనులన్నీ అతను తనకే కేటాయించాడు. జీతం నెలకి పది వేలు, మంచి ఆర్డర్లు వచ్చాక పెంచుతానని చెప్పాడు.
అసు జీతం ఎంతని కాదు. కంపెనీ వృద్ధిలోకి వస్తే అశోక్‌తో పాటు తన జీవితమూ బావుంటుంది. చూచాయగానయినా అర్ధమయిన దాని ప్రకారం అశోక్‌ తర్వాత పొజిషన్‌ తనదే!
అంతా విని ఆనంద పడ్డారిద్దరూ. ‘‘దేవుడే ఆ బాబు రూపంలో వచ్చుంటాడు’’ మేనత్త అతన్ని దీవిస్తూ అంది.
ఇక తర్వాత ప్రకాష్‌ రోజూ ఆఫీసుకి వెళ్ళడమే తప్ప, జాహ్నవికి అతన్ని చూసే అవకాశం లేక పోయింది.
(......................వచ్చేవారం...)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
atadu .. aame..oka rahasyam