Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
nadaina prapancham

ఈ సంచికలో >> సీరియల్స్

అతడు..ఆమె ఒకరహస్యం

atadu .. aame..oka rahasyam

గత సంచిక లోని అతడు-ఆమె-ఒక రహస్యం సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి ...  http://www.gotelugu.com/issue223/622/telugu-serials/atadu-aame-oka-rahasyam/atadu-aame-oka-rahasyam/

గతసంచిక తరువాయి ).. “హలో నరసింహా, నేను పాణిని మాట్లాడుతున్నాను” అన్నాడు.

“చెప్పండి సారూ... ఎక్కడికి వెళ్ళి పోయారు?  నిన్న మీరు కాఫీ బాగుందన్నారు కదా అని కాఫీ చేసి సిద్దంగా ఉంచాను. కానీ పొద్దున్నుంచీ కనపడ్డం లేదు మీరు” అన్నాడు నరసింహ.

పాణి నవ్వి “థాంక్స్ నరసింహా.  చిన్న పని ఉండి బయటికి వచ్చాను. మరో అర గంటలో వచ్చి నీ చేతి కాఫీ తాగుతాను కానీ నాకొక్క  చిన్న విషయం చెప్ప గలవా?”

“చెప్పండి సారూ ఏం కావాలి?”

“ఇది కొద్దిగా రహస్యం చుట్టు పక్కల ఎవరూ లేరు కదా?”  అన్నాడు పాణి.

“ఎవరూ లేరు బాబూ చెప్పండి”

“ఒక విషయం చెప్పు? రాజేంద్ర  గారు చని పోయిన రోజు ఉదయం ఎవరైనా  వంట గదికి వచ్చి ఏమైనా ప్రత్యేకంగా కావాలని అడిగారా?”

“ఆ రోజు వచ్చిన వాళ్ళందరికీ కాఫీలూ టీలూ అన్నీ నేనే చూసుకున్నాను కదండీ. అందరూ అన్నీ నన్నే అడిగారు”

“కాఫీలూ టీలూ  కాదు. ఇంకేమైనా ప్రత్యేకంగా అడిగారా? బాగా గుర్తు  తెచ్చుకుని చెప్పు?  నరేంద్ర వర్మ గారు కానీ, సురేష్ వర్మ గారు కానీ ఇంకెవరైనా కానీ”

కొద్ది సేపు ఆలోచించిన తరువాత అన్నాడు నరసింహ “ఆ గుర్తొచ్చిందండీ”

“ఏమిటి చెప్పు” ఉద్వేగంగా అన్నాడు పాణి.

“బాబు గారు చని పోగానే బంగళాలో  అందరూ  పిచ్చెక్కినట్టు పైకీ, కిందకీ తిరిగుతున్నారండీ. ఆ హడావిడిలో  దీవాన్ జీ గారు వచ్చి వంట సోడా కావాలని అడిగి తీసుకెళ్లారు.  కాఫీలూ టిఫెన్లూ కాకుండా ప్రత్యేకంగా నేను ఇచ్చినది అది ఒకటే. ఎందుకలా అడుగుతున్నారు?”

“ఏం లేదు. ఏదో చిన్న అనుమానం వచ్చింది. సరే, నేనిలా అడిగినట్టు ఎవరికీ చెప్పకు”

“అలాగేనండీ” అని ఫోన్ పెట్టేసాడు నరసింహ.

ఫోన్ పెట్టేసి  ఒక్క సారిగా గాఢంగా నిట్టూర్చి అన్నాడు పాణి “సూసైడ్ నోట్ ని ఆల్టర్ చేసినది సురేష్ వర్మో,  నరేంద్ర వర్మో కాదు- దీవాన్ జీ  సర్వోత్తమ రావు!!    రాజేంద్ర శవాన్ని మొదట పని మనిషి లక్ష్మి చూసింది. మంచం పక్కనే ఉన్న  సూసైడ్ నోట్ ని ఆమె చూసినా, చదువు రాక పోవడం వల్ల చదవ లేదు.  ఆమె షాక్ తిని క్రిందకి పరిగెట్టుకుని వచ్చింది.  వెంటనే పైకి వెళ్ళీన వ్యక్తి దీవాన్ జీ సర్వోత్తమ రావు. అతడు సూసైడ్ నోట్ చదివాడు. వజ్రాల గురించి తెలిసింది. 

సమయానికి  సురేష్ వర్మ ఇంట్లో లేడు. నరేంద్ర వర్మ సూసైడ్ నోట్ని ఇంకా చదవ లేదు.  అందుకే అతడికి ఐడియా వచ్చింది.  ఆ  సూసైడ్ నోట్ ని దాచేస్తే వజ్రాల గురించి మరెవరికీ తెలిసే అవకాశం ఉండదనుకున్నాడు.  అయితే, నోట్ పూర్తిగా దాచేస్తే  అనుమానం వస్తుందని  నోట్ లో వజ్రాల గురించి ఉన్న మేటర్ ని చెరిపేయాలనుకున్నాడు.  అంతకు ముందు డాక్యుమెంట్ ల లో ఎన్నో అలాంటి ఆల్టరేషన్స్  చేసిన అనుభవం ఉన్న వ్యక్తిగా, అప్పటికప్పుడు ఇంకు ఎరేజర్ గా పని చేసే వస్తువు ఏమి దొరుకుతుందా అని ఆలోచించి,  బేకింగ్ సోడాని ఎన్నుకున్నాడు.   బహుశా సురేష్ వర్మ గారి రైస్ మిల్లు వ్యవహారాలు చూసేది కూడా అతడే అయి ఉంటాడు. అందుకే,  అన్ని వ్యవహారాలనీ ఆ రైస్ మిల్  నుంచే నడిపిస్తున్నాడు. ఈ విషయంలో మాత్రం సురేష్ వర్మ, నరేంద్ర వర్మలు అమాయకులు”

అతడు ఆ మాటలు పూర్తి చేసే సమయానికి వాళ్ళ కారు సీతారామా రైస్ మిల్లు ముందర ఉంది.

*****************

రైసు  మిల్  గొడవున్ లో ఉన్న సర్వోత్తమ రావునీ అతడి మనుషులనీ అదుపు లోకి తీసుకుని బంగారు లక్ష్మిని విడుదల చేసారు పోలీసులు. రెండు రోజుల హింస వల్ల  సొమ్మసిల్లి పడి పోయి ఉన్న బంగారు లక్ష్మిని చికిత్స కోసం  ఆసుపత్రికి తరలించారు.  అక్కడి నుంచి నేరుగా  అందరూ రాజ మహల్ కి వెళ్ళారు.  

వాళ్ళు వెళ్ళే సరికి రాజేంద్ర అంత్య తిధి కార్యక్రం అప్పుడే ప్రారంభమౌతోంది. రాష్ట్రం నలుమూలల నుంచీ  ప్రత్యేకంగా పిలిపించిన  పురోహితులు  చదువుతున్న వేద మంత్రాల ఘోషతో   రాజమహల్  ప్రతిధ్వనిస్తోంది.  

ఒక పక్కగా కూర్చుని ఉన్న  నరేంద్ర వర్మ, సురేష్ వర్మ దగ్గరకి వెళ్ళి “ఒక సారి మీరు పక్కకి వస్తారా?” అన్నాడు పాణి.

పోలీసులతో సహా వచ్చిన పాణిని భయంగా చూసాడు సురేష్ వర్మ.  ఏ భావమూ లేకుండా వాళ్ళతో  పాటూ పక్క గది లోకి నడిచాడు నరేంద్ర వర్మ.

పాణి నరేంద్ర వర్మతో “మీరు నన్ను క్షమించాలి. నేను మీతో అబద్దం చెప్పాను. నేను రాజేంద్ర  స్నేహితుడ్ని కాదు” అంటూ రెండు నెలల క్రితం రాజేంద్ర తనకి మెయిల్ ఇచ్చిన సంగతీ, ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచీ తను చేసిన పరిశోధన అన్నీ చెప్పి అన్నాడు “సాక్ష్యాధారాలన్నీ పకడ్బందీగా ఉన్నాయి. మర్యాదగా  జరిగిన దాంట్లో మీ పాత్ర ఏమిటో  మీరు ఒప్పుకుంటే మంచిది.  ఒప్పు కోక పోతే ఎలా ఒప్పించాలో  నాకన్నా పోలీసులకి బాగా తెలుసు” అన్నాడు.

పాణి మాటలు వింటూ ఏడుస్తూ కుర్చీలో  కూలబడ్డాడు నరేంద్ర వర్మ “నా మనవడి చావుకి కారణం నేనే బాబూ... ఒప్పుకుంటున్నాను. 
తక్కువ కులానికి చెందిన రత్నమాలని చేసుకుంటే  వంశానికి మచ్చ వస్తుందని పిచ్చి పట్టుదలతో మనవడ్ని బాధ పెట్టి మొత్తానికి  వంశాన్నే నాశనం చేసుకున్నాను. నా పాపానికి నిష్కృతి లేదు. మీరైనా నాకు తగిన శిక్ష వేసి పుణ్యం కట్టుకోండి!”  అన్నాడు ఏడుస్తూ.

“జరిగిన దాంట్లో మా తాత గారి తప్పేం లేదు. ఆయన బాధని చూడ లేక, రత్నమాల కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నంత వరకూ  రాజేంద్ర బావ గారు మరో పెళ్ళికి ఒప్పుకోరని,  తాత గారి కోరిక నెరవేరదనీ నేనే ప్లాన్ చేసి రత్నమాలని చంపించాను. ఆ శిక్ష ఏదో నాకే వేయండి.  మొదటి నుంచీ పరువు ప్రతిష్టల మీదే తప్ప తప్ప ఆస్థి పాస్తుల మీద వ్యామోహం లేని మనుషులం మేము. ఆ వజ్రాలు ఎక్కడ ఉన్నాయో కనుక్కుని మా బావగారి ఆఖరి కోరిక ప్రకారం   వాటిని ఇక్కడి గ్రామాల  బాగు కోసం ఖర్చు చేయండి. ఈ సంస్థానానికి అదే మేము  చెయ్య గలిగిన ఆఖరి సేవ, అదే మా బావ గారి ఆత్మకు శాంతి!”  పశ్చాత్తాప పడుతున్నట్టుగా అన్నాడు సురేష్ వర్మ కూడా.

పాణి వాళ్ళిద్దరి వంకా జాలిగా చూసాడు. అతడి మనసంతా చేదుగా అయి పోయింది.  బయట నుంచి వేద మంత్రాల ఘోష ఆగకుండా వినిపిస్తూనే ఉంది.

****

“రాజేంద్ర గారు నాకు  నిజంగా ఏ వజ్రాలూ ఇవ్వలేదు.  రత్నమాల చెబితే వినడమే తప్ప అసలు నేను రాజేంద్రని ఎప్పుడూ కలవ లేదు, మాట్లాడ లేదు. ఆయన వజ్రాలని  నాకిచ్చినట్టుగా ఎలా రాసారో నాకు అర్ధం కావడం లేదు. ఒకవేళ నిజంగా వజ్రాలని ఆయన  నాకిచ్చినట్టయితే,  సర్వోత్తమ రావు మనుషులు పెట్టిన చిత్ర హింసలకి తట్టుకో లేక అవి ఎక్కడ ఉన్నాయో ఎప్పుడో చెప్పేసి ఉండేదాన్ని”   డాక్టర్లు చేసిన చికిత్సకి  అప్పుడప్పుడే  తేరుకున్న  బంగారు లక్ష్మి హాస్పిటల్ బెడ్  మీద పడుకుని చెప్పింది.

పాణి వాచీ చూసుకున్నాడు.  సమయం  తొమ్మిదీ నలభై ఐదు అవుతోంది. మరో పావు గంటలోనైనా తను బయలు దేరక పోతే, ఎంత వేగంగా వెళ్ళీనా తను  ముంబై  ఫ్లైట్ కి అందుకోవడం ఇంపాజిబుల్.

“అండమాన్ లో కూడా వాళ్ళిద్దరూ నిధి గురించి మాట్లాడుకునేటప్పుడు ఆ సంభాషణలో తరచుగా మీ పేరు దొర్లేదని యోగేష్ చెప్పేడు. బాగా గుర్తు తెచ్చుకుని చెప్పండి”

“మర్చి పోవడానికిదేమైనా చిన్న విషయమా? కోట్ల విలువ చేసే నిధి.  అలాంటి విషయాన్ని  ఎలా మర్చి పోగలను?”

పాణి అసహనంగా గదిలో అటూ ఇటూ పచార్లు  చేయ సాగాడు. ఇంద్రనీల,  ప్రసాద్ ఏం చెయ్యాలో తెలియనట్టుగా వాళ్ళిద్దరి వంకా చూస్తూ  కూర్చున్నారు.

పాణి బాధని చూడ లేనట్టుగా అంత నీరసంలో కూడా బంగారు లక్ష్మి  కళ్ళు మూసుకుని దీర్ఘంగా ఆలోచించడానికి  ప్రయత్నించ సాగింది. సమయం గడుస్తోంది... గదిలో ఎవ్వరూ మాట్లాడడం లేదు.

సడెన్ గా అంది బంగారు లక్ష్మి “గుర్తొచ్చింది”

ఆమె మాటలకి ఎవరి ఆలోచనలో వాళ్ళూ ఉన్న ఆ ముగ్గురూ ఒక్క సారిగా లేచి ఆమె మంచం చుట్టూ మూగారు. “ఏమిటి?” అన్నారు ఆత్రుతగా.

“రాజేంద్ర గారు నాకు ఏమీ ఇవ్వ లేదు కానీ,  వాళ్ళు అండమాన్ వెళ్ళే ముందర రత్నమాల మా ఇంటికి వచ్చి  ఒక కవరు ఇచ్చింది.  దాంట్లో వాళ్ళ పెళ్ళి రోజు గుర్తుగా గుళ్ళో  తీయించుకున్న ఫోటోలూ, ఒక తాళం చెవీ ఉన్నాయి.   ఆ పేకెట్ నాకిచ్చి  వీటిని నీ దగ్గర జాగ్రత్తగా దాచు. వచ్చేక తీసుకుంటాను అని చెప్పింది”

“ఆ తాళం చెవి ఏమిటి?” 

“ఆ విషయం నేను అడగ లేదు. దానికి ఒక ట్యాగ్ ఉంది.  ఆ ట్యాగ్  మీద ఒక లోగో ఉంది.  నవకేతనో మరేదో కంపెనీ పేరు రాసి ఉండి  యువర్ కీ టు సెక్యూరిటీ  అన్న లైన్ లు లోగో క్రింద చూసినట్టు గుర్తు.  అది బహుశా ఏదైనా బ్యాంకు తాలూకు లాకర్ కీ అయి ఉండచ్చు”

పాణి రిలీఫ్ గా నవ్వాడు “యెస్... నవ కేతన్ అన్నది ఒక ప్రైవేట్ సేఫ్ డిపాజిట్ లాకర్ ఏజన్సీ. దాని బ్రాంచిలు దేశ వ్యాప్తంగా ఉన్నాయి, హైదరాబాద్ లో  కూడా ఉంది. బహుశా పాణి ఆ వజ్రాల నగలని అక్కడి లాకర్ లో దాచి, తాళం చెవిని రత్న మాలకి ఇచ్చి ఉంటాడు.  రత్న మాల అండమాన్ వెళ్ళే ముందు ఆ తాళం చెవిని  బంగారు లక్ష్మికి ఇచ్చింది. అదే విషయాన్ని పాణికి అండమాన్ లో చెప్పింది. 

చని పోయే ముందు ఆ విషయం గుర్తొచ్చి  రాజేంద్ర సూసైడ్ నోట్ లో   ఆ నిధి  బంగారు లక్ష్మి దగ్గర ఉందని రాసాడు.  ఆమెని గుర్తు పట్టడానికి వీలుగా ఎక్సైజ్ డిపార్టుమెంట్ లో పని చేసే బంగారు లక్ష్మి అని రాసాడు. ఆమె గురించి అతడికి అంత కన్నా ఎక్కువ వివరాలు తెలియవు. రత్న మాల  అది లాకర్ కీ అని కానీ, ఆ లాకర్ లో  కోట్ల విలువ చేసే వజ్రాల నగలు ఉన్నాయని కానీ బంగారు లక్ష్మికి చెప్ప లేదన్న సంగతి రాజేంద్రకి తెలియదు”

ప్రసాద్ ఆనందంగా పాణిని కౌగిలించుకున్నాడు.  ఇంద్రనీల సెలైన్ పెట్టి ఉన్న బంగారు లక్ష్మి చేతి మీద చెయ్యి వేసి ప్రేమగా నిమిరింది.

****

హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్.

ముంబై వెళ్ళే ఫ్లైటు కొద్దిగా ఆలస్యం కావడంతో  బోర్డింగ్ కి చాలా సమయమే దొరికింది.  సెక్యూరిటీ చెక్ ముగించుకుని రిలాక్స్డ్ గా ఉన్నాడు పాణి. 

“అవునూ, రాజేంద్ర గారిది ఆత్మహత్యే అయినప్పుడు మరి కాళ్ళ మీదా చేతుల మీదా ఉన్న కత్తి గాట్లు ఎక్కడి నుంచి వచ్చాయి?”  అన్నాడు ప్రసాద్.

“అవి అతడు చేసుకున్నవే.  నువ్వే అన్నావు కదా? మామూలు వ్యక్తులకి తెలియక పోయినా,  అనుభవం ఉన్న పోలీసు అధికారులకి ఒక వ్యక్తి లేదా శవం మీద గాయాలని పరిశీలనగా చూస్తే అవి అతడు  స్వయంగా చేసుకున్న గాయాలా లేక ఇతరులు చేసిన గాయాలా అన్నది  తెలుసు కోవడం పెద్ద కష్టం కాదని?  ఇంద్ర నీల గారు బాగానే గెస్ చేసారు.  అవి అతడు చేసుకున్నవే” అన్నాడు పాణి క్రీగంట ఇంద్ర నీల వంక చూస్తూ.

అతడి పొగడ్తకి ఇంద్ర నీల సిగ్గు పడింది.

“నిద్ర మాత్రలు మింగిన వాడు మళ్ళీ కాళ్ళ మీదా చేతుల మీదా ఎందుకు కోసుకున్నట్టు?”  

“ఈ ప్రశ్నకి సమాధానం  మనసున్న ప్రేమికులకి మాత్రమే తెలుస్తుంది” అన్నాడు.

అతడి మాటలకి  ప్రసాద్ తో పాటూ ఇంద్ర నీల కూడా ఆసక్తిగా చూసింది పాణి వంక. 

పాణి చిన్నగా నిట్టూర్చి చెప్పాడు “రాజేంద్ర రత్న మాలని గాఢంగా ప్రేమించాడు. అంత ఆస్థి ఉన్న అతడిలో ఆస్థిని కాక, మనసుని చూసి ప్రేమించిన  ఒక అద్భుతమైన వ్యక్తి రత్నమాల. అటువంటి స్త్రీలు అరుదుగా ఉంటూ ఉంటారు. అలాంటి స్త్రీ తన వాళ్ళ చేతిలో దారుణంగా చంపబడడం, ఆఖరి దశలో ఆమె శరీరం  ఖండ ఖండాలు కోయబడి తలో చోటా పాతి పెట్టబడడం సున్నిత మనస్కుడైన రాజేంద్ర జీర్ణించుకో లేక పోయి ఉండచ్చు.  కేవలం తనని ప్రేమించిందన్న ఒక్క కారణం వల్లనే అంత గొప్ప వ్యక్తి అలాంటి దుస్థితి పాలైందన్న అపరాధ భావనతో రాజేంద్ర  తనని తాను హింసించుకుని, ఆమె అనుభవించిన బాధని తాను కూడా అనుభవించాలనుకుని అఖరి క్షణంలో తన శరీరాన్ని కత్తితో కోసుకుని ఉండచ్చు”

అతడి విశ్లేషణకి  మనసు కలిచి వేసినట్టై కొద్ది సేపు ఎవరూ మాట్లాడ లేదు.

“నాది మరొక సందేహం.  మొత్తం యాక్టివిటీ అంతా సురేష్ వర్మ రైస్ మిల్లు నుంచే జరుగుతోందని తెలిసినా మీరు  సూసైడ్ నోట్ ని ఆల్టర్ చేసినది సురెష్ వర్మా అని అడిగితే కాదని అంత కచ్చితంగా ఎలా చెప్ప గలిగారు?”  అడిగింది ఇంద్ర నీల.

చిన్నగా నవ్వి అన్నాడు పాణి  “రాజేంద్ర మరణించిన రోజు సురేష్ వర్మ ఇంట్లో లేడు. అంతే కాక ఒక వేళ నిజంగా వజ్రాల కోసం  సురేష్ వర్మ ఆ పని చేసినా  తొందర పడి అంత తొందరగా వాటిని బేరానికి పెట్టడు.  ఎందుకంటే, రాజేంద్ర తరువాత మిగిలిన ఏకైక వారసుడిగా ఆ వజ్రాలు ఎలాగైనా సురేష్ వర్మకే  చెందుతాయి. వాటిని అమ్మడానికి అంత తొందర పడాల్సిన అవసరం అతడికి లేదు. అందుకే ఆ పని చేసినది  బయటి వ్యక్తులే అయి ఉంటారని ముందు నుంచీ నేను ఊహిస్తున్నాను.  కాక పోతే వంట మనిషితో మాట్లాడాలన్న ఆలోచన నాకు ఆలస్యంగా వచ్చింది”

“ఏది ఏమైనా మీతో కలిసి పని చేయడం నాకు చాలా మంచి అనుభవం”  అంది ఇంద్ర నీల.

“థాంక్స్” అన్నాడు పాణి ‘నాక్కూడా’ అనడానికి కొద్దిగా మొహమాటపడ్దాడు.

“ఇన్వెస్టిగేషన్ లో నా అతి చొరవ వల్ల మీ భార్యా భర్తల మధ్య విబేధాలు  వచ్చాయి. అయాం వెరీ సారీ ఫర్ దట్”   ప్రసాద్ వినకుండా నెమ్మదిగా అంది ఇంద్రనీల పాణితో.

పాణి మళ్ళీ నవ్వాడు “ఐ  వెల్ కమ్ సచ్ థింగ్స్.  పెరుగుట విరుగుట కొరకే అన్నది మామూలు సామెత. కానీ రొమాన్సులో మాత్రం ఆ సామెతని మార్చి విరుగుట పెరుగుట కొరకే అని  చెప్పాలి.  ఆమె అలక, నేను బ్రతిమాలడం, ఆ తరువాత  మా కలయిక మరింత రమ్యంగా ఉంటుంది”

ఇంద్ర నీల బుగ్గలు ఎర్రగా చేసుకుని నవ్వింది అతడి మాటలకి.  అంతలోనే అతడి ఫ్లైటుకి బోర్డింగ్ అనౌన్స్ మెంట్ అయింది.  వాళ్ళిద్దరికీ వీడ్కోలు చెప్పి వెళ్ళ బోతూ ఇంద్ర నీల కళ్ళలోకి చూసిన పాణి తనకి తెలిసిన ఐ రీడింగ్  విద్య వల్ల  ఆ సమయంలో ఆమె ఏమనుకుంటోందో  అర్ధమై షాకయ్యాడు !

(అయిపోయింది)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్