దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత రజనీకాంత్ అభిమానులతో మమేకమయ్యారు. అభిమానుల్ని అలా చూసిన సూపర్ స్టార్ చాలా ఉద్వేగానికి లోనయ్యారు. అసలు ఇన్నాళ్లు ఎందుకు ఆయన అభిమానులకు దూరంగా ఉండాల్సి వచ్చిందంటే, గత చిత్రాల పరాజయాలు ఆయన్ని ఎంతగానో బాధపెట్టాయట. ఆ పరాజయాల వల్ల తలెత్తిన వివాదాలు ఆయన్ని చాలా ఒత్తిడికి గురి చేశాయట. అందుకే మానసికంగా చాలా బాధకు గురయ్యానని తెలిపారు సూపర్ స్టార్. ఈ చికాకుల వల్లనే ఇన్నాళ్లు ఆయన అభిమానులకు దూరంగా ఉండాల్సి వచ్చిందని అభిమానులకు చెప్పారు రజనీ. అలాగే ఆయన రాజకీయ రంగ ప్రవేశం గురించి బాగా ప్రచారాలు జరుగుతున్నాయి.
కానీ రాజకీయాల పట్ల ఆయనకు ప్రస్తుతం ఆశక్తి లేదనీ, సినిమాల పైనే మొత్తం దృష్టి పెట్టాలనుకుంటున్నాననీ ఆయన తెలిపారు. ప్రస్తుతం ఆయన హీరోగా తెరకెక్కుతోన్న 'రోబో 2.0' షూటింగ్ పూర్తి చేసుకున్నందుకు సంతోషంగా ఉన్నాననీ రజనీ తెలిపారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నాననీ ఆయన అన్నారు. సినిమాల్లోకి రావడం దైవ సంకల్పమనీ అలాగే రాజకీయాలు కూడా అంతేననీ ఆయన అన్నారు. అయితే రాజకీయాల్లోకి రావాలా వద్దా అనే విషయంపై ఇంకా ఆలోచించాలనీ ఆయన క్లారిటీ ఇచ్చారు. కానీ ప్రజలు మాత్రం ఆయన రాజకీయ ఎంట్రీ కోసం ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం రజనీ కొత్త సినిమా షూటింగ్‌కి సంసిద్ధంగా ఉన్నారు. పా రంజిత్ డైరెక్షన్‌లో ధనుష్ నిర్మాతగా ఈ సినిమా రూపొందుతోంది.
|