Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

అతడు..ఆమె..ఒక రహస్యం

atadu .. aame..oka rahasyam

 

గత సంచిక లోని అతడు-ఆమె-ఒక రహస్యం సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి http://www.gotelugu.com/issue214/603/telugu-serials/atadu-aame-oka-rahasyam/atadu-aame-oka-rahasyam/

( గతసంచిక తరువాయి ).... రాత్రి పన్నెండు గంటల సమయంలో  తన గదిలో నిద్ర పట్టక బయటికి వచ్చాడు పాణి.


బంగళా అంతా నిశ్శబ్దంగా ఉంది. వచ్చిన అతిథులంతా ఎవరి గదుల్లో వాళ్ళూ గాఢంగా నిద్ర పోతున్నారు. విశాలమైన  కారిడార్ లో నడుచుకుంటూ మేడ మెట్లు ఉన్న దగ్గరకి వచ్చాడు పాణి. ఆ కారిడార్, నగిషీలు చెక్కబడి ఉన్న చెక్కలతో  ఒంపులు తిరిగి ఉన్న మేడ మెట్లూ,  దారి పొడవునా  ఉన్న పాతకాలం నాటి సైనికుల బొమ్మలూ...  అన్నీ ఏదో రహస్యాన్ని తమలో దాచుకున్నట్టుగా గుంభనంగా అనిపించాయి పాణికి.  ఆ పరిసరాలని గమనిస్తూ చూస్తూ ఆలోచనలో పడ్డాడు.


జంపన్న గౌడ్ చెప్పిన దాని ప్రకారం రత్నమాల ఒకరోజు  రహస్యంగా సిర్నాపల్లి కోటకి వచ్చి వెళ్ళింది.  అతడు కారులో ఆమెని మాత్రమే చూసానని చెప్పాడంటే, బహుశా రాజేంద్ర ఆమె పక్కన లేడనే అర్ధం.  అంటే ఆమె రాజేంద్రకి కూడా తెలియకుండానే బంగళాకి వచ్చిందా? ఎందుకు?  రాజేంద్ర చనిపోయిన గదిలో దొరికిన  వజ్రపు ఉంగరం ఆమెదేనా?  ఆమెదే అయితే క్లూస్ టీమ్ కలెక్ట్ చేసిన ఆ ఉంగరాన్ని ఇంద్రనీల ఎందుకు దాన్ని  మాయం చేసింది?    రత్నమాలకీ ఇంద్రనీలకీ ఏమిటి సంబంధం?

మరోసారి  రాజేంద్ర గదిలోకి వెడితే,  ముందు రోజు తను మిస్సైన ఆధారాలు ఏమైనా దొరకచ్చనిపించింది.   బంగళాలో ఎవరూ  మెలకువగా ఉన్న సూచనలు కూడా కనపడక పోవడంతో  ధైర్యం చేసి  నెమ్మదిగా మేడ మెట్లు ఎక్కాడు.

మొదటి అంతస్థులో ఉన్న  కారిడార్లో నడుచుకుంటూ  రాజేంద్ర గదిలోకి వెళ్ళాడు.  గదిలో లైటు వెలుగుతోంది.  ఎవరైనా చనిపోయిన గదిలో పదిరోజుల దాకా దీపం ఆర్పరు.   తలుపులు  కూడా తెరిచే ఉన్నాయి.   లోపల నుంచి వస్తున్న గాలికి పరదాలు చిన్నగా  ఎగురు తున్నాయి.  పరదాలని  సున్నితంగా  పక్కకి నెట్టి గదిలోకి అడుగు పెట్టాడు పాణి.

అధునాతన మైన హోటళ్ళలో ఉండే  ‘సూట్’ లా ఉంది ఆ పడక గది.  అడుగు పెట్టగానే  పాతకాలం నాటి పెద్ద సోఫా సెట్టు, చుట్టూ పెద్ద పెద్ద  అరల నిండా రక రకాల పుస్తకాలూ, ఒక పక్క రాసుకునే బల్ల, కుర్చీ, మరో పక్కన డైనింగ్ టేబిల్. కొద్దిగా లోపలకి అడుగు పెడితే,  మళ్ళీ  పరదాల చాటున విశాలమైన జెయింట్ సైజ్ బెడ్. 

గదిలో ఉన్న  ఒక్కో వస్తువునీ  గమనిస్తూ  అలమారలోని పుస్తకాల దగ్గరకి వెళ్ళాడు పాణి.   ముందురోజు చూడని  అరల్లో ఉన్న  ఒక్కో పుస్తకాన్నీ  చక చకా తీసి ప్రొఫెషనల్ గా పరిశీలించాడు.   ఆ తరువాత రాత బల్ల దగ్గరకి వెళ్ళాడు. దాని సొరుగులని లాగి చూసాడు.  నోట్ ప్యాడ్, పెన్నూ ఉన్నాయి.  మరింకేమైనా ఉన్నాయేమోనని  చూడబోతుండగా అలమారల వెనుక ఎవరో  కదులుతున్న అలికిడి అయింది.  పాణి  అలికిడి అయిన వైపు తల తిప్పి చూసాడు.

అక్కడెవరూ కనిపించలేదు.  

అతడు అనుమానంగా రాత బల్ల దగ్గర నుంచి అలమారల వైపు కదిలేలోగా  గదిలో లైటారిపోయింది.

గదంతా చీకటి ఆవరించుకోవడంతో ఏం  జరిగిందో వెంటనే అర్ధం కాలేదు పాణికి.  ఆ గదిలో ఉన్న రెండో వ్యక్తి తానెవరో తనకి  తెలియకూడదన్న  ఉద్దేశంతో లైటు ఆర్పేసాడన్న సంగతి ఒక్క క్షణం తరువాత అర్ధమైంది అతడికి. తన అంచనా తప్పు కాకపోతే  మరుక్షణం అతడు ఆ గదిలోంచి బయటకి వెళ్ళిపోతాడు !

ఆ ఆలోచన రాగానే చీకట్లోనే తనకి అలికిడి వినిపించిన దిక్కుని గుర్తు తెచ్చుకుని మెరుపు వేగంతో అటు వైపు కదిలాడు. అతడు అటు కదులుతుండగా, చీకటిలో ఆకారం అతడు ఊహించినట్టుగానే వేగంగా బయటి వైపుకు కదలబోయింది.  పాణి రెండు చేతులూ చాపి కదులుతున్న ఆ  ఆకారాన్ని గట్టిగా ఒడిసి పట్టుకున్నాడు.   ఒకరికొకరూ ఎదురెదురుగా  వేగంగా కదలడంతో ఆ సమయానికే ఇద్దరూ  బాగా దగ్గరగా వచ్చేసారు.

తన చేతులకి తగిలిన స్పర్శకి పాణికి ఒళ్ళు ఝల్లు మన్నట్టనిపించింది. అడవి కలువ పూవు రేకులని  తాకుతున్నట్టుగా మెత్తటి స్పర్శ చేతులకి. శరీరానికి దగ్గరగా తగులుతున్న మరో శరీరం స్త్రీదని అర్ధమైందతడికి.

ఒక్క క్షణం ఏమీ మాట్లాడలేక పోయాడు. మెడ దగ్గర ఆమె వదులుతున్న ఊపిరి వెచ్చగా తగులుతోంది. ఆమె శరీరం నుంచి వస్తున్న ఒక ప్రత్యేకమైన సువాసన అతడి నాసికకి తగులుతూ మత్తెక్కిస్తున్నట్టుగా ఉంది.

ఊహించని ఈ పరిణామానికి షాక్ తిన్నట్టుగా అతడు పక్కకి తప్పుకో బోయాడు.  అలమార అడ్డం  తగులుతూ అతడి ప్రయత్నాన్ని సఫలీకృతం కాలేదు. తప్పుకోవడానికి ఆమె తనవంతు ప్రయత్నంగా ముందుకు   జరగబోయి అతడికి మరింత  హత్తుకుంది. అతడు ఆమె నడుము మీద నుంచి చెయ్యి తియ్యబోయి మరో చోట చెయ్యి వేసాడు.

చీకట్లో ఇద్దరూ ఎవరేం చేస్తున్నారో తెలియడం లేదు.  ఆమె ఒంటి నుంచి వస్తున్న పరిమళాన్ని బట్టి ఆమె ఎవరో  ఊహించగలిగాడు పాణి.  దాంతో పాటూ ఆ గదిలో జరుగుతున్న మరో పరిణామాన్ని కూడా గ్రహించగలిగాడు... 

ఆమె ఏదో మాట్లాడబోయేలోగా అతడు ఆమె నోరు మూసేసాడు తన చేతులతో.

“ఇంద్రనీల కదూ మీరు? నేను పాణిని” అన్నాడు ఆమె చెవిలో గుస గుసగా.

“అవునా? ఏదో నిద్రపట్టక పుస్తకాల కోసం ... వచ్చాను. ఈలోగా ...కరెంటు పోయినట్టుంది...” ఆతడి చేయి తన నోటి మీద ఉండడంతో  అతి కష్టమ్మీద మాట్లాడడానికి ప్రయత్నిస్తూ అంది.

అతడు ఆమె నోటిని తన చేత్తో మరింత గట్టిగా నొక్కుతూ మళ్ళీ ఆమె చెవిలో గుస గుసగా అన్నాడు  “ష్... ఇక్కడేం మాట్లాడకండి.  ఇక్కడేదో ప్రమాదం పొంచి ఉంది.. మనం ఇక్కడినుంచి తక్షణం వెళ్ళిపోవడం మంచిది”  అంటూ ఆమెని అలాగే పట్టుకుని  నడిపిస్తూ  బయటికి తీసుకు వచ్చాడు పాణి.  అతడి మాటలకి మరింత భయపడిన ఆమె అతడ్ని లతలా అల్లుకుపోయి అలాగే బయటికి వచ్చింది.

బయటికి వచ్చేసాక సిగ్గు పడుతూ పాణికి దూరంగా జరిగింది.  అప్పుడు సంజాయిషీ చెబుతున్నట్టుగా అంది “గదిలో ఉండగా మధ్యలో కరెంటు పోయినట్టుంది”   గదిలో లైటు ఆర్పినది తనే అయినా తెలియనట్టుగా అందామె.  తను గదిలో లైటు ఆర్పితే మొత్తం కారిడార్ తో సహా లైట్లు ఎలా అర్పాయో అర్ధం కాలేదామెకి. ఐతే, పాణిని అక్కడ చూసిన ఖంగారులో తను ఆర్పినది లైటు స్విచ్ని కాదనీ, ఫ్యూజ్  స్విచ్ననీ ఆమెకి తెలియలేదు.

పాణి ఆమె మాటలని పట్టించుకోలేదు. “మనం గదిలో ఉండగా  చిక్ చిక్ మంటూ ఏవో  చిన్న చిన్న శబ్దాలు వినబడ్డాయి గమనించారా?” “కరెంటు పోగానే మిమ్మల్ని గుద్దు కున్నాక నాకు ఖంగారుగా అనిపించింది. ఆ ఖంగారులో నేను పెద్దగా గమనించలేదు. ఏమిటా శబ్దాలు?” 

“ఏమో నాకూ అర్ధం కావడం లేదు. కానీ  ఒక విషయం మాత్రం నిజం. మనిద్దరమూ కాక మరో మనిషెవరో కూడా ఉన్నారు ఆ గదిలో” ఇంద్రనీల భయంగా చూసింది అతడి మాటలకి “ఏం చేస్తున్నాడా మనిషి? ఏమిటా శబ్దాలు?” “తెలియదు.  రేప్పొద్దున్న మాట్లాడుకుందాం మీరు మీ గదికి వెళ్ళి పడుకోండి. గుడ్ నైట్” అన్నాడు పాణి.  ఆమె గది గుమ్మం వరకూ ఆమెని దింపి, ఆమె గదిలోకి వెళ్ళాక తన గదిలోకి  వచ్చాడు.

గదిలోకి రాగానే తలుపు గడియ పెట్టుకుని, అంత వరకూ జేబులో దాచి ఉంచిన ఒక వస్తువుని బయటికి తీసాడు.  రాజేంద్ర గదిలో  తన కళ్ళబడిన దాన్ని అంత  చీకటిలోనూ, అంత హడావిడిలోనూ, అక్కడి నుంచి తీసుకు రావడాన్ని మర్చి పోలేదు అతడు.

తను తీసుకు వచ్చిన ఆ వస్తువుని బల్ల మీద ఉంచి పరిశీలనగా చూసాడు. కొద్ది సేపటికి అతడి కళ్ళు మెరిసాయి.  కొంచెం ప్రయత్నిస్తే,  ఈ కేసులో ఒక ముఖ్యమైన  రహస్యాన్ని తనకి ఆ వస్తువు విప్పి చెప్పగలదనిపించింది అతడికి.  అప్పటికి సమయం అర్ధరాత్రి దాటుతున్నా లెక్కచెయ్యకుండా పని ప్రారంభించాడు.

పాణి తన పనిలో బిజీగా ఉన్న ఆ సమయంలో  మేడమీద నుంచి ఒక వ్యక్తి క్రిందకి దిగి బయటకి  వెళ్ళి పోయాడు.

(ఎవరావ్యక్తి? మేడమీదకెలా వెళ్ళాడు? ఏం తీసుకుని వెళ్ళిపోయాడు.....ఇంద్రనీల కాకుండా ఆ గదిలో మరొకరున్నారన్న పాణి అనుమానం నిజమేనా.....????ఈ సస్పెన్స్ వచ్చేవారందాకా......)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
nadaina prapancham