Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
atadu .. aame..oka rahasyam

ఈ సంచికలో >> సీరియల్స్

నాదైన ప్రపంచం

nadaina prapancham

 గతసంచికలో నాదైన ప్రపంచం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.http://www.gotelugu.com/issue214/604/telugu-serials/naadaina-prapancham/nadaina-prapancham/

 

( గతసంచిక తరువాయి )..  అతనెవరో తెలీనప్పుడు అతను వంగుని తన కాలుకి కట్టుకట్టినప్పుడు ఏర్పడిన ఆత్మీయత మనసు పొరల్లోనే వుండి పోయింది. ఎందుకంటే, అతను అందరాని చందమామ, జమీందారీ వంశస్థుడు. తన లాంటి సామాన్యురాలి గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు.

ఖాళీ దొరికినప్పుడల్లా అతని తాలూకు ఆలోచను చుట్టుముట్టేవి. అతడ్ని చూడాలని, ఒక్క మాటైనా మాట్లాడాలనీ మనసు తపించి పోయేది.

కానీ మాట మాత్రంగానయినా ఆమె ఆ విషయం అన్నతో చెప్ప లేదు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఉద్యోగ భద్రత పొందుతున్నాడతను. అతడ్ని డిస్టర్బ్‌ చేయ కూడదనుకుంది.

ఇక ప్రకాష్‌, అశోక్ కి ఆత్మీయుడిగా మారి పోయాడు. కంపెనీకి సంబంధించి ఏ పనీ అతనికి చెప్పకుండా చెయ్యడు. రెండు మంచి ఆర్డర్స్‌ వచ్చినప్పుడు జీతం పెంచి బోనస్‌ లు ఇచ్చాడు. డబ్బుతో నిమిత్తం లేకుండా కంపెనీ లో మమేకమయ్యాడు ప్రకాష్‌.

అశోక్‌ అతన్ని ఎంతగా నమ్మాడంటే, ఈ కంపెనీని అతని మీద వదిలేసి, తను మిగతా కంపెనీల్లో వున్న షేర్లని అమ్మేయడం గురించి ఆలోచిస్తున్నాడు.

అలాగే పిన్ని వాళ్ళ రెండో తమ్ముడి ఆధ్వర్యంలో వున్న పొలాల మీద కూడా అతని దృష్టి వుంది.

అయితే తన తల్లి లాంటి పిన్నికి తక్కువ చేయాలని అతనికి లేదు. కానీ తమ కుటుంబం కష్టాలు పడుతుంటే, తమ ఆస్థిని ఇతరులు అనుభవించటమే అతనికి నచ్చ లేదు.

అందుకే మొత్తం ఆస్థిని తమ స్వాధీనం లోకి తెచ్చుకోవాలని అతని ఉద్దేశం.

ఇక ఈ కంపెనీకి రెండు మూడు కొత్త ఆర్డర్లు తెచ్చి అతనికి బాధ్యత అప్పగించి, తను అప్పుడప్పుడూ లెక్కలు చూసుకుంటే సరి పోతుంది.
అందుకే ప్రకాష్‌కి చేదోడు వాదోడుగా వుండే మనిషి కోసం చూస్తున్నాడు.

ఆ రోజు ఆఫీసులో కూర్చుని ఫైల్స్‌ చూస్తుండగా ఒక వ్యక్తి వచ్చాడు. అతనికి పాతికేళ్ళ వయసు వుంటుంది. టెక్నీషియన్‌గా పరిచయం చేసుకుని ఏవన్నా వేకెన్సీస్‌ ఉన్నాయా అని అడిగాడు.

అతని మాట తీరు చూసి చాలా ఇంప్రెస్సయ్యాడు అశోక్‌. చక్కని ఇంగ్లీష్‌లో చాలా పొయిట్‌గా మాట్లాడుతున్నాడు.

అశోక్‌ చురుగ్గా ఆలోచించాడు.

టెక్నికల్‌ వర్క్‌ తెలిసిన వ్యక్తి. చక్కని మాట తీరు చూస్తే మార్కెటింగ్‌ కి కూడా ఉపయోగ పడొచ్చు. పనిలో శ్రద్ధ, నిజాయితీ వుంటే ఇక ఢోకా వుండదు.

ప్రకాష్‌, ఇతను కలిస్తే వండర్స్‌ క్రియేట్‌ చెయ్యవచ్చు. అనుకున్నదే తడవుగా తానే స్వయంగా ఎపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌ టైప్‌ చేసి ఇవ్వ బోయాడు. ఇస్తుంటే కరెక్ట్‌గా ఆ సమయానికి గుర్తొచ్చింది. కంపెనీలో ఎంత చిన్న విషయం జరిగినా ప్రకాష్‌తో షేర్‌ చేసుకునే తను అతనితో సంప్రదించ లేదని.

నాలిక్కరుచుకుని బెల్‌ కొట్టి అతడ్ని పిలిచాడు. అతను లోపలికి రాగానే తన ఎదురుగా కుర్చీలో కూర్చున్న వ్యక్తిని చూపిస్తూ...
‘‘ఇతను శ్రీధర్‌! న్యూ ఎపాయింట్‌మెంట్‌.... ఇక నుంచీ మీకు చేదోడు వాదోడు’’ అంటూ తను టైప్‌ చేసిన అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌ అతని చేతికిచ్చాడు అశోక్‌.

ఏదో చెప్పబోయి విరమించుకున్నాడు ప్రకాష్‌. అదే అతను చేసిన తప్పు.

ఆ చెప్పేది ఆ సమయంలో కాక పోయినా, తర్వాతయినా చెప్పి వుంటే, అశోక్‌ కి ఎంతో మేలు చేసి వుండే వాడు.

అసలు ప్రకాష్‌ మనసులోవున్న విషయం చాలా చిన్నది...

శ్రీధర్‌, అశోక్‌ రూం లోకి వెళ్ళడానికి వెయిట్‌ చేస్తూ కారిడార్‌లో ఉన్నప్పుడు స్మోక్‌ చేశాడు.

సిగరెట్‌ పీక కింద పడేసి కాలితో ఆర్ప లేదు.

కార్పెట్‌ చివర అంటుకుని మండటం చూసి కూడా నిర్లక్ష్యంగా కూర్చున్నాడు. ఇవి ప్రకాష్‌ అబ్జర్వ్‌ చేసిన విషయాలు.

****************

మహారాష్ట్ర. ఆంధ్రా జట్లు ఫ్రెండ్లీ మ్యాచ్‌ ఆడుతున్నారని తెలుసుకుని కాలేజీ అంతా ఆరోజు గ్రౌండ్‌లోనే వుంది.

ఎందుకో అందరి లోనూ ఒకింత టెన్షన్‌గా వుంది. నేషనల్‌ గేమ్స్‌ జరిగే లోపు ఎక్కడా ఈ రెండు జట్లు తలపడే అవకాశాలు లేవు. ఇదే ఏకైక ఛాన్స్‌.

ఎంత ఫ్రెండ్లీ మ్యాచ్‌ అనుకున్నా గెల్చిన జట్టు ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకుంటుంది.

అందుకే ఎవరికి వారు ఈ మ్యాచ్‌ గెలవాలని పట్టుదలగా వున్నారు.

కీర్తన ఒక్కతే ప్రశాంతంగా వుంది. ఫ్రెండ్లీ మ్యాచ్‌లో జయాపజయాలు ఎలా వచ్చినా ఒక్కటే! దానికి ఎక్కువ ఇంపార్టెన్స్‌ ఇవ్వొద్దని మొదట్నుంచీ చెపుతూనే వుంది.

అందరూ పైకి విన్నట్లు నటించినా, మనసులో ఒకింత ఆందోళన ఉండనే వుంది.

సాయంత్రం నాలుగు గంటలయింది.

ఇరు జట్లు మైదానానికి చేరుకున్నాయి.

స్టూడెంట్స్‌, ప్రాక్టీస్‌ చేయటానికి వచ్చిన వాళ్ళందరూ కలిపి నాలుగైదు వందల మంది వుంటారు.

మణి బిందు వాళ్ళ టీమ్‌ని చూస్తూనే అబ్బాయిలు రెప్ప వేయటం మర్చి పోయి చూస్తున్నారు.

ఎందుకంటే, వాళ్ళ టీం డ్రస్‌ అంత గ్లామరస్‌గా వుంది. మోకాళ్ళు దిగని టైట్‌ ఫిట్‌ స్కర్ట్స్‌, దాని మీద వక్షోజాల ఆకారాన్ని ప్రస్ఫుటంగా కనిపింప చేసే టీ షర్ట్స్‌.

అసలు ఆటని చూడాలా, ఆడే వాళ్ళని చూడాలా అన్న డైలమాలో పడతారందరూ.

వాళ్ళని చూసి కీర్తన అసహనంగా ఫీలయింది.

ఇది ఆటా....?

ఫ్యాషన్‌ పెరేడా....?

ఆమె ఫీలింగ్స్‌ చూసి గర్వంగా నవ్వుకుంది మణి బిందు ఆమెకి కావలసింది అదే!

తమని చూసి ఎదుటి వారి ప్రశాంతత భగ్నం కావాలి. ఆ దిశలో తమని చూసి కీర్తన అసహనానికి లోను గావటం తాము సాధించిన విజయంగా భావించింది మణి బిందు.

ఆట ప్రారంభమవడానికి ముందు రిఫరీ టాస్‌ వేయించాడు. టాస్‌లో విన్నయింది మణి బిందు. సంప్రదాయం ప్రకారం పద్ధతిగా సర్వీస్‌ కావాలో, కోర్టు కావాలో ఆమె కోరుకోవాలి. ఆమె అది ముందు చెప్పకుండా విక్టరీ సూచకంగా రెండు వేళ్ళూ చూపించింది. తన సహచరుల కేసి, గ్రౌండ్‌ కేసి.

ఈ తతంగానికి నాలుగు నిమిషాలు పట్టింది. ఇంకొకరైతే టాస్‌ వేసిన పాయింట్‌ని వదిలి బయటకి వచ్చేస్తారు. కానీ కీర్తన పెదవుల మీద చిరునవ్వు చెదరకుండా అక్కడే ఓపికగా నిల్చుంది. రిఫరీ కూడా కీర్తన సహనానికి ఆశ్చర్య పోయాడు.

ఆ తర్వాత మణి బిందు వచ్చి తన ఛాయిస్‌ కోరుకుంది. ఆమె ఛాయిస్‌ సర్వీస్‌, కీర్తన కోర్టుని ఎంచుకుంది.

మూడు నిమిషాల్లో అందరూ ఎవరి కోర్టుల్లో వాళ్ళు నిల్చున్నారు. రిఫరీ విజిల్‌ వేయగానే మ్యాచ్‌ స్టార్టయింది.

ఫస్ట్‌ సర్వ్‌ మణిబిందు చేసింది. రైట్‌ డిఫెన్స్‌లో వున్న కీర్తన సెంటర్‌కి పాస్‌ చేసింది. సెంటర్‌లో వున్నమ్మాయి కొట్టిన బంతి నెట్‌ని రాసుకుంటూ వెళ్ళి వాళ్ళ కోర్టులో పడింది.

ఫ్రంట్‌ లైన్ లో ఎవరూ తియ్య లేక పోయారు. పాయింట్సేమీ రాకుండానే మణి బిందు సర్వీస్‌ డౌనయింది.

ఆ అమ్మాయి మొహం కంద గడ్డలా మారి పోయింది. అతి ప్రయత్నం మీద అణుచుకుంది.

తర్వాత కీర్తన సర్వీస్‌లో వరుసగా మూడు పాయింట్లు వచ్చి ఆంధ్రా జట్టు 3.0 లీడింగ్‌ లోకి వెళ్ళింది.

ఆ టీమ్‌ రెట్టించిన ఉత్సాహంతో ఆడే సరికి మొదటి గేమ్‌ను పదిహేను, ఆరుతో ఆంధ్రా జట్టు గెలిచింది.

కీర్తన మామూలుగానే వుంది. కానీ మిగతా వాళ్ళ మొహాలు మెరిసి పోతున్నాయి.

ఇక మణి బిందు పరిస్థితి చెప్పక్కర్లేదు.

ఆమె టీమ్‌ మేట్స్‌ కూడా కుత కుత వుడికి పోతున్నారు.

ఇప్పటి వరకూ గెలుపు పట్ల అత్యంత విశ్వాసంగా వున్న వాళ్ళు ఒక్క సారిగా అంత తేడాతో ఫస్ట్‌ గేమ్‌ ఓడి పోవడం జీర్ణించుకో లేక పోతున్నారు.

ఏదో ఒకటి చెయ్యాలి.

లాభం లేదు. పరువు పోయేలా వుంది.

ఏం చెయ్యాలో ముందే ఆలోచించుకున్నారు. అందుకే ఇండైరెక్ట్‌ మాటలు, హేళనగా చూడటం, ఎదుటి వార్ని చూపించి, కనుబొమ్మలతో వ్యంగ్యంగా, వెటకారం చెయ్యడం మొదలు పెట్టారు.

కాస్తంత కాన్సంట్రేషన్‌ దెబ్బతింది. ఆంధ్రా జట్టుకి సడెన్‌గా వీళ్ళేంటి ఇలా ప్రవర్తిస్తున్నారనిపించింది.

స్టూడెంట్స్‌ కోలాహం మధ్య రెండో గేమ్‌ స్టార్టయింది. వీళ్ళ సర్వీస్‌ డౌన్‌ అయినప్పుడల్లా కించ పరిచేలా మాట్లాడటం బిగినయింది.
ఇటు వైపు జట్టులో ఎవరూ రిపోర్ట్‌ చెయ్యక పోవడంతో రిఫరీ చూసీ చూడనట్లు వూరుకున్నాడు.

వూహించని దాడికి ఆంధ్ర జట్టు ఉక్కిరి బిక్కిరయి 12`15తో సెకెండ్‌ గేమ్‌ ఓడి పోవడంతో మూడో గేమ్‌ తప్పని సరై అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

విరామం సమయంలో గట్టిగా హెచ్చరించింది కీర్తన. ఎదుటి వారి మాటల్ని అసలు పట్టించుకో వద్దని.

తమని మానసికంగా దిగ జార్చడానికి వాళ్ళు అలా మాట్లాడుతున్నారని అమ్మాయిలు గ్రహించారు.

అందుకే దెబ్బ తిన్న తాచుల్లా బుసలు కొడుతూ బరిలో దిగారు.

ఈసారి మాటల దాడి సరి పోదనిపించింది మహారాష్ట్ర టీమ్‌కి.

ఏం చెయ్యాలా అని ఆలోచించే లోపే ఆంధ్రా జట్టు 10`7 ఆధిక్యతలో వుంది.

మహారాష్ట్ర జట్టులో అమ్మాయిలందరూ కళ్ళతో సైగలు చేసుకుని టైమ్‌ అవుట్‌ తీసుకుని బయటకి వచ్చారు.

ఒక్క నిమిషం వాళ్ళలో వాళ్ళు గుసగుసలాడుకున్నారు. ఇంతలో సడెన్‌గా వాళ్ళలో ఒకమ్మాయి...

‘‘ఏయ్‌! అడుగో ఆకాష్‌’’ అంటూ గట్టిగా అరిచింది.

‘‘ఆకాష్‌...ఏడీ?’’ అందరూ చుట్టూ చూశారు. చప్పున తిరిగి చూసింది కీర్తన.

‘‘ఆకాష్‌ వచ్చాడా? ఎక్కడున్నాడు?’’ చూపుల్తో వెతుకుతుండగా...

వాళ్ళు కోర్టులోకి వచ్చేశారు.

కీర్తన ఆ మూడ్‌ నుండి బయటకి రాకుండానే గేమ్‌ స్టార్టయింది.

వరుసగా మూడు పాయింట్లు సాధించి ఈక్వల్‌ చేశారు.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్