Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Maro Janma Short Film

ఈ సంచికలో >> శీర్షికలు >>

చమత్కారం - భమిడిపటి ఫణిబాబు

chamtkaram

ఇది వరకటి రోజుల్లో ఉమ్మడి కుటుంబాలుగా ఉన్నప్పుడు, ఇంటి పెద్ద మాటే చెల్లేది.కారణాలు ఎన్నో కావచ్చు.మొదటిది, ఆ రోజుల్లో పెద్దవారంటే ఉండే గౌరవం కావచ్చు. ఆస్ఠి అంతా ఆ పెద్దాయనపెరునే ఉండిఉండొచ్చు.ఊరికే దెబ్బలాటలు పెట్టుకుంటే, ఆస్థి ఇవ్వరేమో అనే భయం అవొచ్చు.అప్పుడైనా 'అండర్ కరెంట్స్' ఉండేవి.ఓ కొడుకు బాగా సంపాదించేవాడయుండొచ్చు,ఇంకోడు సామాన్య ఉద్యోగి అయిఉండొచ్చు. ఓ కోడలు పేద్ద కట్నంతో వచ్చుండొచ్చు,ఇంకో కోడలు సామాన్య కుటుంబంలోంచి వచ్చుండొచ్చు.

కాలక్రమేణా రోజులు మారేకొద్దీ, ఎవరి కాపురాలు వాళ్ళు పెట్టుకున్న తరువాత అందరూ సుఖపడ్డారు. విడిగా ఉండడంలో ఉన్న సదుపాయాలు ఇటు తండ్రులకీ తెలిసింది, అటు కొడుకులకీ తెలిసింది.ఎవరి స్పేస్ వారికున్నప్పుడే అందరికీ హాయి. గ్రౌండ్ రియాలిటీస్ అర్ధం చేసికున్నంత కాలం, ఎవరు ఎక్కడున్నా ఒక్కటే. ఊరికే సొసైటీ కోసం 'ఉమ్మడికుటుంబం' లో ఉండి బి.పీ లు పెంచుకోవడంకన్నా విడివిడిగా ఉంటే, వారానికో,పదిహెను రోజులకో కలిసినప్పుడు, ఆత్మీయంగా ఉంటారు.మనవలూ,మనవరాళ్ళూ తాతయ్యా అంటూ పలకరిస్తారు.  అలాగని  పిల్లలు అంటే కొడుకులూ,కూతుళ్ళూ రాక్షసులనీ, పెద్దవాళ్ళంటే గౌరవం లెనివారనీ కాదు. వారి కష్టాలు వారికీ ఉన్నాయి.ఉదాహరణకి ఇంట్లో చదువుకునే పిల్లలున్నాసరే, వారి వారి కార్యక్రమాలకి అడ్డుండకూడదు.టైమయ్యేసరికి టి.వీ ముందర సెటిల్ అయిపోతారు.అందులో కథ ఎంతదాకా వచ్చిందో తెలిసికోకపోతే నిద్ర పట్టదు. పోనీ మర్నాడు పిల్లలు స్కూలుకి వెళ్ళిన తరువాత తీరికగా చూడొచ్చు కదా.కొడుకు ఇల్లూ, తమకి అధికారం ఉందీ అనే అనుకుంటారు. పిల్లలు చదువు మానేసి మామ్మ, తాతయ్యలతో టి.వి. చూస్తూకూర్చుంటానంటే ఎలా కుదురుతుందీ? అసలు గొడవలన్నీ ఈ టి.వీ ల వల్లే వస్తున్నాయి.పిల్లలకి కార్టూన్లూ, పెద్దవాళ్ళకి సీరియల్సూ, పెద్దాయనకి న్యూసూ కావాలి. మరి ఒకే ఇంటిలో ఇన్ని రకరకాల చాయిస్ లు అయితే, అక్కడ కొట్టుకోకుండా ఉంటారని ఎలా అనుకుంటాము?మరి కోడలుకి చిర్రెత్తిందంటే చిర్రెత్తదూ? ఈ పెద్దాళ్ళు మహా ఉంటే ఇంకో పదిహేనేళ్ళుంటారు, పిల్లల భవిష్యత్తు తల్లేకదా చూసుకునేది.

ఇంట్లో పిల్లలకి ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చిందనుకోండి, ఈ పెద్దాళ్ళు తమకి తెలిసున్న కషాయాలూ, రసాలూ వాడితే చాలని ఊదరకొట్టేస్తూంటారు. పిడుక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అంటే ఎలాగ? వీళ్ళని నమ్ముకుని, డాక్టరు దగ్గరకు తీసుకెళ్ళకపోతే అంతే సంగతులు! ఈ మాత్రం తెలియదనుకోవడానికి వీల్లేదు, వాళ్ళ పెద్దరికం చూపించుకోడానికి ఉచిత సలహాలిచ్చేస్తూంటారు. పోనీ అలాగని వాళ్ళకేమైనా వచ్చిందంటే, డాక్టరుదగ్గరకు తీసికెళ్ళేదాకా ఇల్లు పీకి పందిరేసేస్తారు, అప్పుడు రసాలూ,కషాయాలూ మర్చిపోతారు, 'తమదాకా వస్తే' రూల్స్ మారిపోతాయి. పైగా ఎన్ని టెస్టులు చేయిస్తే అంత బాగా చూసుకున్నట్లు!లేదూ, ' మావాడికి పాపం వైద్యం చేయించాలనే ఉంటుంది, కానీ మా కోడలు సాగనివ్వదు'అంటూ అడిగినవాళ్ళకీ, అడగనివాళ్ళకీ చెప్పుకొస్తారు. కూతురు కూడా అదే ఊళ్ళో ఉంటే ఇంకా కాలక్షేపం!

ఈ రోజుల్లో నగరాల్లో అయినా పట్టణాల్లో అయినా, భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తే, పిల్లలకి మంచి చదువులు చెప్పించొచ్చు,అన్ని సదుపాయాలూ సమకూర్చుకోవచ్చు. కోడలు ఉద్యోగానికి వెళ్తానంటే, ముందర అబ్జెక్షన్ పెట్టేది అత్తగారే!

'నాకు ఓపిక లేదమ్మోయ్, నీ పిల్లల్ని చూడ్డానికి' అని ఖరాఖండీగా చెప్పిన వారిని చూశాము.వీళ్ళు అవసరానికి పిల్లలకి ఉపయోగించకపోతే, వాళ్ళేదో వీళ్ళని చూడ్డంలేదూ అని ఏడవడం దేనికో? పోనీ అని పిల్లల్ని ఏ క్రెచ్ లోనో పెట్టి,ఉద్యోగానికి వెళ్ళడానికే డిసైడ్ అయిందా, ఇంక చూసుకోండి, ఈ అత్తగారనే ప్రాణి,తనకి వీలైనన్ని రకాల 'థర్డ్ డిగ్రీ మెథడ్సూ' ఉపయోగిస్తుంది.సాయంత్రం కోడలొచ్చేసరికి, ఓ గిన్నెతో అన్నం వండి, ఏ వేపుడో చేస్తే ఈవిడ సొమ్మేంపోదు, అయినా సరే, తనకేం పట్టనట్లే కూర్చుంటుంది.అలాటి అత్తగార్లని ఛాన్సొస్తే ఏ కోడలు వదుల్తుందీ?ఇంట్లో ఉన్న మామగారు ప్రపంచంలో ఉన్న విషయాలన్నీ తనకే తెలిసున్నట్లూ,అసలు తన సలహా లేనిదే, గ్రహాలు గతి తప్పుతాయన్నట్లూ ప్రవర్తిస్తారు.అడిగినా అడక్కపోయినా ఉచిత సలహాలు ఇచ్చేస్తూంటారు.ప్రస్తుత ప్రపంచం,తన రోజుల్లాలెదని ఓమారు జ్ఞాపకం చేసికుంటే ఎవరికీ ఏ సమస్యా ఉండదు. ఏదో ' ఆయనే ఉంటే.....'అన్నట్లు ఆమాత్రం 'సంఝోతా' ఉంటే ఈ గొడవలన్నీ ఎందుకు వస్తాయి?

కలిసే ఉండవలసిన పరిస్థితే వస్తే,ఎవరైనా అడిగితేనే కానీ సలహా ఇవ్వకూడదు. జరిగేవి జరక్క మానవు, ఊరికే కంఠ శోష తప్ప ఒరిగేదేదీ లేదు.ఎవరి పిల్లల్ని ఎలా పెంచుకోవాలో వాళ్ళకే వదిలేస్తే ఎంతో హాయి.మన పిల్లల్ని మనక్కావలిసిన పధ్ధతిలోనే పెంచుకున్నప్పుడు, వాళ్ళ పిల్లల్ని వాళ్ళేం చేసికుంటే వీళ్ళకెందుకంట?

ఎవరి దృష్టికోణాన్ని బట్టి వారు ఆలోచిస్తారు.ఇలాటివాటికి పుస్తకాలు చదివితేనూ,  కౌన్సెలింగులకి వెళ్తేనూ సొల్యూషన్సు రావు. వీధిన పడకూడదనుకుంటారా హాయిగా విడివిడిగా ఉండాలి.అంతేకానీ, ఎదో పాయింటు ప్రూవ్ చేద్దామని కలిసే ఉండడానికి ప్రయత్నిస్తే ఎప్పుడో ఒకప్పుడు చిన చిన్న అపార్ధాలు తప్పవు. అలాగని ఒకే ఊళ్ళో, పిల్లలోచోటా, తల్లితండ్రులోచోటా ఉంటున్నారంటే వాళ్ళకేదో గొడవొచ్చిందనికాదు. దీన్ని ' ప్రివెంటివ్ మైంటెనెన్స్అంటారు..

విడిగా ఉండడమనేది ఏమీ  “ ప్రాణాంతక అపరాధం “ అనుకోకుండా, ఊళ్ళో వాళ్ళేమనుకుంటారో అని ఆలోచించకుండా, హాయిగా  ఎవరికి వారు విడిగా ఉంటే పుణ్యానికి పుణ్యం, పురుషార్ధానికి పురుషార్దమూనూ…

సర్వేజనా సుఖినోభవంతూ…

మరిన్ని శీర్షికలు
one and only in gulf