Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
one and only in gulf

ఈ సంచికలో >> శీర్షికలు >>

ఉత్తరాఖండ్ ( తీర్థ యాత్రలు ) - కర్రా నాగలక్ష్మి

uttarakhand tourism

రుద్రప్రయాగ , కర్ణప్రయాగ

కనుల విందు చేసే సంగమం చూసేక రుద్రమహదేవ్ దర్శనానికి వెళ్లేం . మందాకినీ అలకనందల సంగమానికి యెదురుగా వుంది రుద్రమహదేవ్ మందిరం . కారు రోడ్డుపైన ఆపి మేం యిళ్ల మధ్యన వున్న సందులలోంచి నడక సాగించేం . కొంతదూరం నడిచేక  రోడ్డుకి ఒక వైపు చిన్న గుట్టమీద ఓ కోవెల , సంగమం వైపు మరో కోవెల వున్నాయి .

సంగమం వైపు వెళ్లాలంటే కొండదిగాలన్న మాట , యెత్తైన మెట్లు దిగాలి , కొండముచ్చులు గుంపులుగా తిరుగు తున్నాయి , మెల్లగా మెట్లు దిగ సాగేం . సగం కొండ దిగేక గుట్టులా వున్న ప్రదేశంలో చిన్న శివకోవెల , నారదశిల వున్నాయి , కొందరు యాత్రీకులు సంగమం వరకు దిగి  మందాకినీ అలకనందల సంగమ ప్రదేశంలో స్నానాలు చేస్తున్నారు , మేం అంత సాహసం చెయ్యదలచుకోలేదు , సాహసం అని యెందుకన్నానంటే  యెక్కేటప్పుడు నిటారుకొండ యెక్కడం చాలా కష్టం అనే అనుభవం వుంది కాబట్టి దిగే సాహసం చెయ్యలేదు  .  దిగినా స్నానాలు చెయ్యదలచుకోలేదు , కనిపించిన ప్రతీచోటా స్నానాలు చేస్తే మా యాత్ర ముందుకు సాగడం కష్టం , అందుకే ముఖ్యమైన ప్రదేశాలలో తప్ప స్నానాలు చెయ్యలేదు . నారద శిలను , రుద్రనాధుని దర్శించుకున్నాం .

ఇక్కడ స్థలపురాణం యేమిటంటే సత్యకాలంలో నారదుడు దేవతల అభీష్టానుసారం యీ సంగమ ప్రాంతంలో సంగీత సాధన చేసుకొనే వాడు , ఘోరమైన అతని స్వరానికి మందాకిని , అలకనందలు వికృతంగా మారిపోయి శివుని దర్శనార్ధమై గుట్టపై నున్న కోవెలకు రోజూ వచ్చి అభిషేకాదులు చేసుకొని తమ నిజరూపాన్ని పొంది తిరిగి వెళ్లేవారట . దినమంతా సాగే నారదుని వికృత గాత్రానికి తిరిగి వికృతంగా మారేవారట , ప్రతీ రోజూ వికృత స్త్రీలు మందిరంలోకి ప్రవేశించడం అందమైన స్త్రీలు బయటకి కావడం చూచిన నారదుడు విషయం అడుగగా ఆ స్త్రీలు తాము నారదుని వికృత గానానికి వికృతంగా మారుతున్నట్లు , పరమశివుడు అర్చించుకొని తిరిగి తమ సౌందర్యాన్ని పొందుతున్నట్లు చెప్తారు .

నారదుడు వారిని తనకు శ్రావ్యమైన గానాన్ని నేర్పవలసినదిగా కోరగా తమకు అంతటి శక్తి లేదని , పరమ శివుని వేడుకొమ్మని చెప్తారు . నారదుడు గుట్టపై శివుని కూడా పూజలందుకుంటున్న ఛాముండ దేవి మందిరంలో శివుని ప్రసన్నుని గావించుకొనుటకై పాటపాడతాడు . నారదుని వికృత గానానికి కోపగించుకున్న ఛాముండీ దేవి నారదునకు తన మందిరంలో ప్రవేశార్హత లేదని వెడలగొడుతుంది . నారదుడు చేసేది లేక సంగమ ప్రదేశం లో వున్న బండపై శివుని కొరకై ఘోర తపస్సాచరించి శివుని ప్రసన్నుని చేసుకొని అతని వద్దనుండి రుద్రవీణ పై సంగీతం నేర్చుకుంటాడు . నారదుడు తపస్సాచరించిన శిలను నారదశిల అంటారు . నారదుని కరుణించి శివుడు ప్రత్యక్షమైన ప్రదేశంలో రుద్ర నాధ్ శివలింగం వుంది . సంగీతసాధకులు యీ నారదశిలను దర్శించుకొని రుద్రనాధునికి అభిషేకాదులు చేసుకుంటూవుంటారు . ఇలా చేసిన వారు సంగీతంలో మంచి పేరుప్రఖ్యాతలు పొందుతారట .

అక్కడనుంచి పైకి వచ్చి ఛాముండాదేవి దర్శనానికి వెళ్లేం . చాలా పురాతనమైన మందిరం , ఓ పక్కగా అమ్మవారి కోవెల , శివకోవెల వున్నాయి .

రుద్ర ప్రయాగకి సుమారు నాలుగున్నర కిలోమీటర్ల దూరంలో అలకనంద వొడ్డున వున్న కోటేశ్వరమహదేవ్ మందిరం తప్పకుండా చూడవలసినది .

ఇది గుహాలయం , అలకనంద వొడ్డున కాలినడక అహ్లాదకరంగా వుంటుంది . అలకనంద గలగలలు మనలో కూడా ఉత్సాహాన్ని నింపుతూ వుంటాయి . చల్లని అలకనంద నీటిలో కాళ్లు తడుపుకొని గుహ లోనికి వెళ్లేం , యింతకు ముందు యిలాంటి యెన్నో గుహాలయాలను చూసేం కాబట్టి యిదో అద్భుతంలా అనిపించలేదు , యిలాంటి మందిరాలను మొదటి మారు చూసే వారికి మాత్రం యిదో అద్భుతమే . సహజంగా యేర్పడ్డ పౌరాణిక ఆకృతులు నోటమాటరాకుండా చేస్తాయి . ఈ ఈశ్వరుడి దర్శనం కోటి లింగాలను దర్శించుకున్నంత పుణ్యాన్ని యిస్తుందట , యీ గుహ లో కోటి లింగాలు వున్నాయని స్థానికుల కధనం , అన్ని లేవు కాని పెద్ద సంఖ్యలో మాత్రం వున్నాయి . కొండకు వున్న ప్రతీ లింగాకారాన్ని లొంగమని లెక్కించమని స్థానికులు చెప్పేరు .

ఇక స్థల పురాణానికి వస్తే భస్మాసురుడు శివుని కొరకై ఘోర తపస్సు చేసి శివుని నుండి తన హస్తము యెవరి తలపై నుంచితే వారు భస్మమయే వరం కోరుకుంటాడు . ఆ వరమును శివుని తలపై చెయ్యవేసి పరీక్షించదలచి శివుని వెంబడించగా , భస్మాసురుని బారి నుంచి తప్పించుకొని శివుడు యీ గుహ లో విష్ణుమూర్తి కొరకై తపస్సు చేసుకొని విష్ణుమూర్తి సహాయమర్ధించిన ప్రదేశమట .

శివుడు హరిద్వార్ నుండి కేదార్ కు పోయే సమయంలో యీ గుహలో విశ్రమిస్తాడట

ఈ రెండు ప్రదేశాలు చూసుకున్న తరువాత రుద్ర ప్రయాగకి 31 కిలోమీటర్ల దూరం లో వున్న కర్ణ ప్రయాగ చేరుకున్నాం , కర్ణప్రయాగలో అలకనంద పిండారి హిమానీనదములో పుట్టిన పిండారీగంగతో సంగమించి అలకనందగా రుద్రప్రయాగ వైపు ప్రవహిస్తుంది .

కర్ణప్రయాగ NH-58 ని ఆనుకొనే వింటుంది . టీ ఫలహారాలు దొరికే దుకాణాలు , కూరలు , పండ్లు అమ్మేదుకాణాలతో పగలు యెంతో సందడిగా వింటుంది .

కర్ణ ప్రయాగ ఓ కూడలి , యిక్కడినుంచి అలకనంద వొడ్డున ప్రయాణిస్తే నందప్రయాగ , జోషిమఠ్ మీదుగా బదరీనాథ్ చేరుతాం , పిండారిగంగ వొడ్డున వున్న దారిలో ప్రయాణిస్తే కుమావు ప్రాంతానికి చెందిన నైనితాల్ , అల్మోడా , జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ కి చేరుతాం , చుట్టుపక్కల పొలాలలో పండించే తాజా కూరలు పండ్లు యిక్కడ దొరకుతాయి . కర్ణ ప్రయాగ తరువాత పంటభూములు లేవనే చెప్పాలి .       నంద ప్రయాగ దాటేక విష్ణు ప్రయాగ దగ్గర నిర్మింపబడ్డ హైడెల్ పవర్ ప్లాంటు వుద్యోగులు యిక్కడనుంచే పండ్లు కూరలు కొనుగోలు చెయ్యడం తో యీ చిన్న కూడలి యీ ప్రాంతాలలో ముఖ్యకూడలిగా రూపు దిద్దుకుంది .పిండారీగంగ నీరు పాలనురుగులా తెల్లగా వుంటాయి మహాభారత కాలంలో కుంతీదేవికి సూర్యుని వరం వల్ల కలిగిన పుతృడు కర్ణుడు , విలువిద్యలో అర్జునుడితో సమానమైన బలవంతుడు కావలని చాలా సంవత్సరాలు  తపస్సాచరించి దివ్యమైన అస్త్రములను పొందిన ప్రదేశం కావడంతో యీ సంగమం అతని పేరుమీదుగా కర్ణ ప్రయాగ అని పిలువబడసాగింది .

యిప్పటికీ యీ ప్రాంతం లో కర్ణుడు తపస్సు చేసుకున్న మర్రి చెట్టు వుంది . పక్కగా శివకోవెల , కర్ణుడు నివసించిన గుహ వున్నాయి . ఆ గుహలో ఓ పక్కగా సిమెంటుతో నిర్మించిన కర్ణ , కృష్ణుల విగ్రహాలు వున్నాయి . ఒకసారి యీ ప్రాంతాలలో తపస్సు చేసుకుంటున్న జడలధారిని చూసేం , యీ సంవత్సరం యెవరూ నివసిస్తున్న ఆనవాలు లేవు . అక్కడ నుంచి అలకనంద , పిండారిగంగల సంగమం బాగా కనిపిస్తుంది .

ఈ ప్రాంతానికి మరో ప్రత్యేకత కూడా వుంది అదేంటంటే మహాభారతయుధ్దం లో కర్ణుడు అర్జునునితో యుధ్దం చేస్తున్నప్పుడు అతనిపైగల శాపాలవలన అతని రధం భూమిలో కూరుకు పోగా కర్ణుడు ఆయుధాలను రథము పై విడచి చక్రమును యెత్తుటరు రథము దిగగా అర్జునుడు కృష్ణుని ఆజ్ఞానుసారము ' అంజాలిక ' అస్త్రాన్ని ప్రయోగించగా కర్ణుడు నేలకు వొరుగుతాడు కాని మరణించడు . సర్వాంతర్యామి అయిన కృష్ణుడు దివ్యదృష్టితో చూడగా కర్ణుని కాపాడుతున్న ధర్మదేవత కనిపిస్తుంది , ధర్మదేవత కాపాడుతున్నంతకాలము కర్ణుని యే ఆయుధము సంహరించలేదనే సత్యము నెరిగిన కృష్ణుడు ముసలి బ్రాహ్మణ వేషధారియై కర్ణుని వద్దకేగి అతని పుణ్యమును దానముగా కావాలని అడుగుతాడు , దానకర్ణుడు తన శరీరమునుండి కారుతున్న నెత్తురును నీటిగా భావించి తన పుణ్యమును దానమిస్తాడు .

కర్ణుని పుణ్యము వృధ్దబ్రాహ్మణునకు చెందడంతో ధర్మదేవత అతనిని విడిచి పోతుంది , కృష్ణుడు కర్ణుని దానగుణమునకు మెచ్చి అతనిని ఒక వరము కోరుకొనమనగా కర్ణుడు తన శరీరమునకు మానవులు ప్రవేశించని భూమిపై అంత్యక్రియలు జరుపమని కోరుతాడు . కృష్ణుని సైగ అందుకొని అర్జునుడు బాణ ప్రయోగము చేసి కర్ణుని వధిస్తాడు . కర్ణుని కిచ్చిన మాట ప్రకారము కృష్ణుడు అతని శరీరాన్ని తెచ్చి సంగమానికి అవతల వైపున వున్న గుట్టపై అంత్యక్రియలు జరుపుతాడు .

కర్ణుడు తపస్సు చేసుకున్న ప్రదేశానికి యెదురుగా అవతల వొడ్డున వున్న గుట్టను చూడొచ్చు . అక్కడే అమ్మవారి కోవెల కూడా వుంది .    ఈ ప్రదేశానికి వున్న మరో విశేషం యేంటంటే యిక్కడ వివేకానందుడు తన గురు పుతృలతో పద్దెనిమిది రోజులు తపస్సు చేసుకున్నాడు . ఇక్కడ వివేకానంద ఆశ్రమం సంగమం దగ్గరనుంచి ఓ కిలోమీటరు దూరంలో వుంది .

ప్రశాంతత కొరుకునే వారు యిక్కడ మెడిటేషన్ చేస్తూ  కొంతసమయం గడుపుతూ వుంటారు .

కర్ణుడు తపస్సు చేసుకున్న ప్రదేశాన్ని దర్శించుకున్న తరువాత మాముందున్న ప్రశ్న యే దారిగుండా ప్రయాణించాలి , యే బదరీని ముందు దర్శించుకోవాలి అని , యెందుకంటే కర్ణప్రయాగ నుంచి దారి చాలా పోతుంది ఒకటి నందప్రయాగవైపు వెళుతుంది మరొకటి ఆదిబదరి మీదుగా నైనితాల్ చేరుతుంది .

ముందు ' ఆదిబదరి ' చూసుకొని తరువాత నందప్రయాగ వెళుదాం అని నిర్ణయించుకున్నాం .

పై వారం ' ఆదిబదరి ' గురించి చదువుదాం అంతవరకు శలవు .

మరిన్ని శీర్షికలు
sarasadarahasam