పర్సనల్ కంప్యూటర్, ల్యాప్‌టాప్, స్మార్ట్ మొబైల్, స్మార్ట్ గ్యాడ్జెట్ ఇలా ఏదైనా కావొచ్చుగాక, అవకాశం ఉంది కదా అని విచ్చలవిడిగా వాడేస్తే అనారోగ్యం తప్పదు. మనకేమో మానసిక అనారోగ్యం, గ్యాడ్జెట్స్‌కేమో సాంకేతిక అనారోగ్యం. కాబట్టి, ఇద్దరికీ డాక్టర్ తప్పనిసరి. మనకంటే మానసిక వైద్య నిపుణులున్నారు, వివిధ విభాగాలకు సంబంధించిన డాక్టర్లున్నారు. గ్యాడ్జెట్లకోమరి.? వాళ్ళకీ డాక్టర్లున్నారు, వాళ్ళే టెక్నీషియన్లు. మనమెలాగైతే కొన్ని రోగాలు దరిచేరకుండా ఉండేందుకు వ్యాక్సిన్లు వేసుకుంటున్నామో, గ్యాడ్జెట్లకీ వ్యాక్సిన్లు వేయించాలి. ఆ వ్యాక్సిన్లే యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌లు. ఆ ఏముందిలే, ఇంటర్నెట్‌లో ఫ్రీ డౌన్‌లోడ్ కొడితే చాలనుకునే రోజులు కావివి. ఎప్పటికప్పుడు వైరస్‌లు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. కాబట్టి, వ్యాక్సిన్ తయారు చేసే డాక్టర్ సరైనోడే అయి ఉండాలి. దానర్థం, జెన్యూన్ యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌ని కొనుగోలు చేయడం తప్పనిసరి ఇక్కడ. తద్వారా ఎప్పటికప్పుడు పుట్టుకొచ్చే వైరస్‌లతో మన గ్యాడ్జెట్స్‌ని సేఫ్‌గా ఉంచుకోవడానికి వీలవుతుంది.
ప్రపంచాన్ని కుదిపేసిన 'వాన్నాక్రై' వైరస్ తర్వాత గ్యాడ్జెట్ వినియోగదారుల ఆలోచనల్లో మార్పులొచ్చాయి. స్మార్ట్ ఫోన్, కంప్యూటర్ ఇలా ఏదైనాగానీ, దానికీ రక్షణ కవచం ఉండాలనే చైతన్యం పెరిగింది. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలనే చైతన్యం ఇంకా పెరగాల్సి ఉంది. మెయిల్స్‌లో వచ్చే 'అవాంఛిత మెసేజ్'లను క్లిక్ చేయడం చాలావరకు తగ్గిందట వాన్నా క్రై ప్రకంపనల తర్వాత. ప్రపంచ వ్యాప్తంగా జరిగిన సర్వేల్లో తేటతెల్లమయ్యిందిది. స్మార్ట్ ఫోన్లలోనూ ఇదివరకటి విచ్చలవిడితనం ఇకపై ఉండబోదని అంచనా వేస్తున్నారు. వాట్సాప్ గ్రూపులు కావొచ్చు, సోషల్ మీడియా లింకులు కావొచ్చు 'క్లిక్'మనిపించేముందు ఒకటికి వందసార్లు ఆలోచన చేస్తున్నారంటూ 'యూజర్ల' పనితీరుపై పలు సర్వేల నివేదికలు వెల్లడిస్తున్నాయి. అతి సర్వత్ర వర్జయేత్ అని పెద్దలు ఎప్పుడో చెప్పారుగానీ, దాన్ని పాటించకపోవడం వల్లనే ఇన్ని అనర్థాలూ చోటుచేసుకున్నాయని చెప్పక తప్పదు. 50 వేలు ఖర్చు చేసి మొబైల్ ఫోన్ కొనుగోలు చేస్తున్నప్పుడు, దాన్ని జాగ్రత్తగా వాడాలన్న ఇంగితం లేకపోతే ఎలా? అలాగే కంప్యూటర్ వినియోగంలో కూడా జాగ్రత్త తప్పనిసరి.
ఏదేమైనా కొన్ని సంఘటనలు చెడు చేసినా, ఆ తర్వాత మంచి ఆలోచనల వైపుగా నడిపిస్తాయి. చెడు సంఘటనలు, మంచి మార్గంలో పయనించడానికి హెచ్చరికలుగా భావించాల్సి ఉంటుంది. ప్రపంచమంతా 'ఆన్‌లైన్' అంటోన్న ఈ తరుణంలో ఏ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ అయినా పద్ధతి ప్రకారం వినియోగించగలిగినప్పుడు దాన్నుంచి అద్భుత ఫలితాలను ఆశించగలుగుతాం, వాటిని ఆస్వాదించగలుగుతాం.
|