Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
any gadjet ..  meet doctor

ఈ సంచికలో >> యువతరం >>

సిక్కోలు కుర్రాడి గెలుపు - ఓ స్ఫూర్తి

hats off ronanki gopalakrishna

సివిల్స్‌లో దేశవ్యాప్తంగా మూడో ర్యాంక్‌ సాధించడం చిన్న విషయం కాదు. అత్యంత ప్రతిష్టాత్మకం. తెలుగువారంతా గర్వపడాల్సిన విషయమిది. అదే సమయంలో, మనుషులుగా మనమంతా సిగ్గుపడాల్సిన విషయం ఇంకోటుంది. అది ఆ విజేత 'కళ్ళలోకి' తొంగి చూస్తేనే అర్థమవుతుంది. పంటి బిగువన, ఎన్నో అవమానాల్ని దాచి ఉంచిన ఆ సిక్కోలు కుర్రాడు, లక్ష్యాన్ని మాత్రమే గుర్తుపెట్టుకుని, ర్యాంక్‌ని సాధించడం నేటి యువతకు ఎంతో స్ఫూర్తినిచ్చే అంశం. తల్లిదండ్రులు లక్షలు, కోట్లు ఖర్చు పెట్టి, చదువులు చదివించినా, ఆ చదువు బుర్రకెక్కదు అన్ని సందర్భాల్లోనూ. చదవాలన్న కసి ఉంటే, మట్టిలోంచి కూడా మాణిక్యాలు పుట్టుకొస్తాయనడానికి ఈ సిక్కోలు కుర్రోడే నిదర్శనం. పూట గడవడమే కష్టమనుకునే వ్యవసాయ కూలీ కుటుంబం నుంచి వచ్చిన ఆ మట్టిలోని మాణిక్యం రోణంకి గోపాలకృష్ణ. ఊరి నుంచి వెలివేయబడింది ఆ కుటుంబం. కానీ, ఎక్కడా వెనకడుగు వేయలేదు. లక్ష్యం తప్ప ఇంక దేని గురించీ ఆలోచించలేదు. అవమానాల్లోంచి కసి పుట్టుకొచ్చింది. సాధించాలనే తపన పెరిగింది. అదే గోపాలకృష్ణని సివిల్స్‌ విజేతని చేసింది. విజేత అంటే అలాంటిలాంటి విజేత కాదు, దేశం గర్వించేంత గొప్ప విజయం. 

ఇంత పెద్ద విజయం అందుకున్న ఆ కుర్రాడు, తన కుటుంబానికి ఎదురైన అవమానాల్ని ఇప్పుడు మర్చిపోయాడు. 'మనమంతా కలిసి ముందడుగు వేద్దాం..' అని తమను వెలివేసిన గ్రామస్తులకు విజ్ఞప్తి చేయడం అభినందనీయం. ఐఏఎస్‌గా దేశానికి సేవలు అందించాలన్నదే తన లక్ష్యం అంటున్నాడు గోపాలకృష్ణ. శ్రీకాకుళం జిల్లాలో ఓ మారుమూల గ్రామంలో, ప్రభుత్వ పాఠశాలలో, తెలుగు మీడియంలో చదువుకుని, ఆ చదువుని కూడా పూర్తిగా కొనసాగించలేని ఆర్థిక ఇబ్బందులతో ఎలాగోలా చదువుని ముందుకు నడిపించిన రోణంకి గోపాలకృష్ణ జీవితం చాలామందికి స్ఫూర్తినిస్తుందనడం నిస్సందేహం. సివిల్స్‌ మనోళ్ళకి కాదులే, ఉత్తరాది పెత్తనమే ఎక్కువనుకునేవారికి రోణంకి గోపాలకృష్ణ ఎపిసోడ్‌ ఆశాదీపంలా కన్పిస్తుంది. డబ్బు, హోదా, దర్పం ఇవేవీ సివిల్స్‌లో ర్యాంకులు సాధించలేవనీ, కేవలం పట్టుదల ఆత్మవిశ్వాసం మాత్రమే సివిల్స్‌లో విజేతగా నిలబెడ్తుందని సివిల్స్‌ విజేత నిరూపించాడు. 

ఎంత గట్టిగా బంతిని నేలకేసికొడితే అంత గొప్పగా అది పైకెగురుతుంది. ఈ మాటకి నిదర్శనంగా ఓ సామాన్యుడు నిలిచాడంటే, ఏ అవకాశాలూ లేని వ్యక్తి అవకాశాల్ని అందిపుచ్చుకున్నాడంటే, కొన్ని అవకాశాలైనా ఉన్నవారు ఇంకెంతగా ఎదగాలి? అందుకే, రోణంకి గోపాలకృష్ణ భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాడు. ఆయన గెలిచింది సివిల్స్‌లో మాత్రమే కాదు, వ్యవస్థలో గెలిచాడు. వ్యవస్థలోని అణచివేత నుంచి విజయం సాధించాడు. భావితరాలకు అద్భుతమైన గెలుపుని చూపించాడు. హేట్సాఫ్‌ టు రోణంకి గోపాలకృష్ణ.

మరిన్ని యువతరం