Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
nadaina prapancham

ఈ సంచికలో >> సీరియల్స్

అతడు...ఆమె...ఒక రహస్యం

atadu .. aame..oka rahasyam

గత సంచిక లోని అతడు-ఆమె-ఒక రహస్యం సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి http://www.gotelugu.com/issue216/609/telugu-serials/atadu-aame-oka-rahasyam/atadu-aame-oka-rahasyam/

( గతసంచిక తరువాయి )..  తనూ, రాజేంద్ర గారూ గాంధర్వ వివాహం  చేసుకోబోతున్నామని చెప్పింది రత్నమాల !

గాంధర్వ వివాహం అంటే, భార్యా భర్తలు తప్ప మరెవ్వరూ  సాక్ష్యం  ఉండని మానసిక వివాహం.  చట్ట పరంగా కానీ,  హక్కుల పరంగా కానీ ఏ మాత్రం  చెల్లని వివాహం.  అలా ఎందుకూ అని నేను నిలదీసి అడిగాను రత్నమాలని.  ‘మేమిద్దరం వివాహం చేసుకునేది మా కోసం. లోకం కోసం కాదు.  ఈ వివాహం వల్ల సంతోషాన్నే తప్ప  ఒకరి మీద ఒకరికీ ఏ రకమైన హక్కులనీ తామిద్దరం కోరుకోవడం లేదని’ చెప్పింది.

రత్నమాల సంగతి నాకు బాగా తెలుసు.  ఎంతో ఆలోచించి గానీ ఒక  నిర్ణయం తీసుకోదు.  నిర్ణయం తీసుకున్నాక ఇంక ఎవ్వరు చెప్పినా ఆ నిర్ణయం  మార్చుకోదు.  ఆమె చేస్తున్న పనిలో రిస్కు ఉందని తెలిసినా, ఆమె వినదని తెలుసు కనుక మేమెవ్వరం ఆమెని వారించలేక పోయాము.

అనుకున్న ప్రకారం ఒక రోజు గుళ్ళో ప్రాణ స్నేహితురాలైన నన్ను కూడా పిలవకుండా రాజేంద్రని దండలు మార్చుకుని వివాహం చేసుకుంది రత్నమాల.  వివాహంలో  రాజేంద్ర ఆమె వేలికి తొడిగిన వజ్రపుటుంగరం, దండలతో  తీయించుకున్న  కొన్ని ఫోటోలూ తప్ప వాళ్ళ వివాహానికి మరే సాక్ష్యాలూ లేవు.    అన్ని విషయాలూ రత్నమాల చెప్పడమే  తప్ప నేనెప్పుడూ రాజేంద్రని చూడడం కానీ, ఆయనతో మాట్లాడడం కానీ జరగలేదు.

తమ మొదటి రాత్రిని  పౌర్ణమి రోజు పాపి కొండల మధ్యన ఉన్న కరెంటు కూడా లేని ఒక గోదావరి లంకలో,  ప్రకృతి ఒడిలో జరుపుకున్నామని  చెప్పింది.  అంతటి భావుకులు వాళ్ళిద్దరూ !

పెళ్ళైన తరువాత  ఒక రెండు నెలల పాటూ  రత్నమాల మాకెవ్వరికీ కనపడలేదు. రాజేంద్ర ఆమె  కలిసి  కేరళ,  గోవా,  అండమాన్ నికోబార్ దీవులూ వంటి  ప్రదేశాలని  తిరుగుతూ ఒకరినొకరు  తెలుసుకుంటూ గడిపామని చెప్పింది రత్నమాల వచ్చిన తరువాత.

పెళ్ళైన తరువాత కూడా రత్నమాల హైదరాబాద్‍ లోనే ఉండేది.  సిర్నాపల్లి వెళ్ళలేదు.  ఎందుకు వెళ్ళడం లేదని  నేను రత్నమాలని అడిగితే  తమ పెళ్ళి జరిగిన విషయం  రాజేంద్ర  తమ కుటుంబంలో  చెప్పలేదని చెప్పింది.  నేను ఆశ్చర్య పోయాను ఆమె మాటలకి.   ‘రాజేంద్ర నిన్ను మోసం చేస్తున్నాడు’  అని కోపంగా అరిచాను. దానికి రత్నమాల నవ్వింది.  ‘మోసం చేయడానికి మా మధ్యన ఎటువంటి ఒప్పందమూ లేదు. మేము ఇద్దరం ఎవరికి వారూ స్వేచ్చా  జీవులం. ప్రస్తుతం మేమిద్దరం చాలా ఆనందంగా  కలిసి ఉంటున్నాము.  ఆనందంగా ఉండలేక పోతే  కలిసి ఉండము. అంతే.  ఇంక ఒకరి నొకరూ మోసం చేసుకునే ప్రసక్తి ఏముంది?’ అంది. ఆమె సిద్దాంతాన్ని పిచ్చనాలో మరేమనాలో అర్ధం కాలేదు నాకు.  ఏమన్నా ఆమె మారదని తెలుసు కనుక మాట్లాడకుండా ఊరుకున్నాను.

ఉన్నట్టుండి ఒక రోజు రాత్రి  రత్నమాల నాకు ఫోన్ చేసింది.  రాజేంద్ర  తనని సిర్నాపల్లి రమ్మని కారు పంపాడని,   వెంటనే బయలుదేరి రమ్మని కబురు పంపాడని, తను బయలుదేరుతున్నానని చెప్పింది.  నా ఆనందానికి అంతులేదు.  ఆమెని  సిర్నాపల్లి రమ్మని పిలిపించుకుంటున్నాడంటే, అతడికి ఆమెని మోసం చేసే ఉద్దేశం లేదని అర్ధమైంది.

ఆమెకి సెండాఫ్ ఇవ్వడానికి వస్తానని అన్నాను.  అయితే తను అప్పటికే బయలు దేరిందనీ,  అక్కడికి వెళ్ళాక  ఫోన్ చేస్తానని చెప్పింది.   ఫోన్  లోనే ఆమెకి వీడ్కోలు చెప్పాను.  

సిర్నాపల్లి వెళ్ళిన ఆమె దగ్గర నుంచి ఫోన్ వస్తుందని మర్నాడంతా ఎదురు చూసాను.  రత్నమాల ఫోన్ చెయ్యలేదు. మర్నాడు... ఆ  మర్నాడు... ప్రతి రోజూ ఎదురు చూసాను కానీ వెళ్ళి పది రోజులై పోతున్నా అమె నుంచి ఎటువంటి సమాచారం లేదు.  నేను ఫోన్ చేస్తే ఆమె సెల్ స్విచాఫ్ అని వచ్చేది.  ఎంత ప్రాణ స్నేహితురాలినైనా ఎందుకో రత్నమాల నాకు కానీ, మా స్నేహితుల్లో ఎవరికీ కానీ రాజేంద్ర కాంటాక్ట్ నెంబరు ఎప్పుడూ చెప్పలేదు. అవన్నీ రహస్యంగా ఉంచేది. ఆమె కూడా అతడితో ఫోన్ లో తక్కువగా మాట్లాడేది.

 ధైర్యం చేసి నేనే సిర్నాపల్లి రాజమహల్‍కి ఫోన్ చేసి రత్నమాల గురించి చెప్పి ఆమెతో మాట్లాడాలని అడిగాను.  అక్కడికి ఏ రత్నమాలా రాలేదని వాళ్ళు సమాధానం చెప్పారు.   రాజేంద్ర గారితో మాట్లాడాలని  చాలా సార్లు బంగళాకి ఫోన్ చేసి రక రకాలుగా ప్రయత్నించాను కానీ ఆయనతో  నన్ను  మాట్లాడనివ్వలేదు బంగళాలోని వ్యక్తులు.

అసలు రత్నమాల ఎక్కడికి వెళ్ళిందో ఏమై పోయిందో అని ఆదుర్దా మొదలైంది నాలో.  సరిగ్గా అదే సమయంలో  నా పోలీస్ ట్రైనింగ్ పూర్తయి నాకు ఎస్సైగా పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చారు.   అప్పుడు నేను రిక్వెస్టు చేసి సిర్నాపల్లి మండలం పరిధి లోకి వచ్చే పోలీస్ స్టేషన్‍కి పోస్టింగ్ వేయించుకున్నాను.

ఒక స్నేహితురాలిగా రత్నమాల ఆచూకీ కనిపెట్టలేక పోయిన నేను ఆ పనిని ఎస్సైగా చెయ్యాలనుకున్నాను.  అయితే నేను  డ్యూటీలో జాయినైన మర్నాడే సిర్నాపల్లి సంస్థానం యువరాజు రాజేంద్ర గారు ఆత్మహత్య చేసుకుని మరణించాడన్న  షాకింగ్ న్యూస్ తెలిసింది.   ఎవరినైతే కలుసుకుని నేను  నా స్నేహితురాలి ఆచూకీ తెలుసుకుందామనుకున్నానో ఆ వ్యక్తే చనిపోవడం నాకు పెద్ద  షాక్.  ఆయన మరణం  కేసుని అటెండవ్వడానికి వచ్చిన నేను ఇక్కడ నా స్నేహితురాలి అదృశ్యం గురించి ఏమైనా సమాచారం దొరుకుతుందేమోనని వచ్చిన దగ్గర నుంచీ వెదుకుతున్నాను.

సరిగ్గా అదే సమయంలో వారి స్నేహితులైన మీరు తారసపడ్డారు.  కనీసం మీ ద్వారా నైనా రత్నమాల ఆచూకీ ఏమైనా తెలుస్తుందేమో అని చాలా ప్రయత్నించాను.  కానీ మొదటి నుంచీ  మీరు కూడా అసలు రత్నమాల మాటే ఎత్తడం లేదు.    అందరూ కలిసి ఏదో మోసం చేస్తున్నారనిపించింది నాకు.

పెద్ద రాజా వార్ని కానీ, సురేష్ వర్మని కానీ ఆ విషయం అడిగి ప్రయోజనం ఉండదని నాకు తెలుసు. ఎందుకంటే వాళ్ళకి తెలిసినా చెప్పరు. ఇక్కడ మిగిలిన వారందరి కన్నా మిమ్మల్ని చూస్తే నాకెందుకో ఒక నమ్మకం కలిగింది.  నా మనసు లోని బాధని మీకు చెప్పుకుంటే  మీరేదైనా దారి చూపిస్తారని, మీకు తెల్సిన సమాచారాన్ని చెప్పి మా స్నేహితురాలి ఆచూకి తెలుసుకోవడానికి సహకరిస్తారని అనిపించింది. అందుకే ఇంక దాగుడు మూతలాపేసి ఇలా నేరుగా మీ ముందుకి వచ్చి మాట్లాడుతున్నాను.  రాజేంద్ర గారు రత్నమాల గురించి మీకేమైనా  చెప్పారా? ఆ రోజు  టాక్సీలో హైదరాబాద్ నుంచి  బయలుదేరి సిర్నాపల్లి వచ్చిన రత్నమాల ఏమైంది?  ఈ ప్రశ్నలకి మీరేమైనా సమాధానం చెప్పగలరేమోనని అడగడానికి వచ్చాను”

అగకుండా మాట్లాడి, ఒక్క నిమిషం ఆయాసం తీర్చుకోవడానికన్నట్టు ఆగింది.

పాణి  ముఖంలో ఏ భావమూ లేకుండా అలాగే తనని చూస్తూ ఉండడంతో అతడేం ఆలోచిస్తున్నాడో అర్ధం కాక అడిగింది “ఏమిటండీ ఏమీ మాట్లాడరు?  ఈ విషయాలు మీకేమైనా తెలిస్తే దయచేసి చెప్పండి. మా  స్నేహితురాలి ఆచూకీ తెలియక చాలా వర్రీ అవుతున్నాను”  

పాణి చిన్నగా నవ్వి అన్నాడు “మీరు వర్రీ అవుతున్నది మీ స్నేహితురాలు ఆచూకీ తెలియకా లేక వజ్రాల నగల ఆచూకీ తెలియకా?”

“వజ్రాల నగలేమిటి?” ఆశ్చర్యంగా అంది  ఇంద్రనీల.

“మీ ప్రశ్నకి నేను సమాధానం చెప్పే ముందర నా ఒక ప్రశ్నకి మీరు సమాధానం చెప్పండి.  చనిపోయిన రాజేంద్ర గదిలో  మీ స్నేహితురాలు రత్నమాల తాలూకు ఉంగరం  ఉంది.  అంటే,  రాజేంద్ర చనిపోయే రోజు ఆమె రాజమహల్లో  ఉందన్నది నిజం.  అంతే కాదు ఆమె ఎవరికీ తెలియకుండా రహస్యంగా  రాజమహల్‍కి అప్పుడప్పుడూ వచ్చి వెడుతూ ఉండేది. ఆమె ఒకసారి   హైదరాబాద్ నుంచి టాక్సీలో బయలు దేరి  సిర్నాపల్లి రావడం సిర్నాపల్లికి చెందిన జంపన్న గౌడ్ అనే వ్యక్తి చూసాడు. రాజేంద్ర చనిపోయిన రోజు ఆమె ఇక్కడే ఉందన్న దానికి సాక్ష్యం చెప్పగలిగే  ఆ వజ్రపుటుంగరాన్ని   మాత్రం ఎవరికీ దొరక కూడదని మీరు మాయం చేసారు. ఎందుకు?”

అతడి మాటలకి ఇంద్రనీల ముఖం తెల్లగా పాలిపోయింది.

“ఎందుకో నేను చెబుతాను వినండి.  మీ స్నేహితురాలు రత్నమాల రాజేంద్రని ప్రేమించినది అతడి ఆస్థిని చూసి. కానీ కారణాలేమైనా రాజేంద్ర ఆమెని పెళ్ళి చేసుకున్నాడు కానీ ఆస్థి  మీద హక్కునివ్వలేదు. అందుకే అదను చూసి ఆమె రాజేంద్రని హత్య చేసి, దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించి, వజ్రాలతో పారిపోయింది.  మీ స్నేహితురాలు కనుక ఆమె చేసిన నేరం  బయటపడకుండా ఎస్సై హోదాలో  మీరు బంగళాలో తిరుగుతూ  ఒక్కో ఆధారాన్నీ మాయం చేస్తున్నారు. అవునా?”

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్