Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
nadaina prapancham

ఈ సంచికలో >> సీరియల్స్

అతడు..ఆమె..ఒక రహస్యం

atadu .. aame..oka rahasyam

గత సంచిక లోని అతడు-ఆమె-ఒక రహస్యం సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి http://www.gotelugu.com/issue217/611/telugu-serials/atadu-aame-oka-rahasyam/atadu-aame-oka-rahasyam/

( గతసంచిక తరువాయి ).. 

“నాకు నిజంగా మీరేం మాట్లాడుతున్నారో అర్ధం కావడం లేదు.  నిధేమిటీ? వజ్రాలేమిటీ?  రత్నమాల గురించి నాకు చిన్నప్పటి నుంచీ తెలుసు. ఆమె డబ్బు మనిషి కాదు. ఆమె ఆస్థి కోసం రాజేంద్రని ప్రేమించిందన్నది నిజం కాదు.  ఆమె రాజేంద్రని ప్రేమించడాని కన్నా ముందర రాజేంద్రే ఆమె వెంట పడ్డాడు. ఆమె అందం చూసి అతడు దాదాపు  పిచ్చివాడై పోయాడు. ఆమె లేకుండా బ్రతక లేనన్నాడు. అప్పుడే ఆమె రాజేంద్ర ప్రేమని ఒప్పుకుంది. నిజంగా ఆమెకి కావల్సింది డబ్బే అయితే,  రాజేంద్రతో గాంధర్వ వివాహానికి అసలు ఒప్పుకునేదే కాదు.  రాజేంద్ర రత్నమాల మీద ఎంత మోజు ఉందంటే, ఆమె  ఒక్క మాట అడిగినా చాలు... ఆస్థి మొత్తాన్నీ పెళ్ళికి ముందే ఆమె పేరున  రాసిచ్చేవాడు. డబ్బు కోసమో, నగల కోసమో రాజేంద్రని  చంపాల్సిన అవసరం రత్నమాలకి లేదు”   కోపంగా అంది ఇంద్రనీల.


“మరి... ఎవరికి ఉంది?” నవ్వుతూ అన్నాడు పాణి.

ఇంద్ర నీల షాకైనట్టుగా చూసింది.

ఈ సారి పాణి నవ్వలేదు “మీరు మంచి నటి అని నాకు తెలుసు. కానీ నా దగ్గర ఎక్కువగా నటించకండి” అన్నాడు సీరియస్ గా. “మీరు నన్నెందుకు అనుమానిస్తున్నారో అర్ధం కావడం లేదు.  నిజంగా నాకు ఈ నేరంతో ఏ సంబన్ధమూ లేదు.  రాజేంద్ర చని పోయినప్పుడు గదిలో క్లూస్ సేకరిస్తున్న సమయంలో ఆ గదిలో రత్నమాల ఉంగరాన్ని చూసాను నేను.  ఆ ఉంగరాన్ని చూసినప్పుడే నాకు  రత్నమాల ఇక్కడికి వచ్చిందని అర్ధమైంది. 

రత్నమాల నిజంగా ఇక్కడికి వచ్చినా, ఎన్ని సార్లు నేను ఫోన్ చేసినా బంగళాలో మనుషులు రత్నమాల ఇక్కడికి రాలేదని అబద్దం ఎందుకు చెప్పారు?  ఇక్కడ అందరూ కలిసి ఏదో నాటకం ఆడుతున్నారని నాకు అనుమానం వచ్చింది. నేను ఎంక్వయిరీకి ఇక్కడికి రాక ముందే, ఈ రాజ కుటుంబానికి పొలిటికల్ గానూ, పోలీసుల లోనూ ఎంతో పలుకుబడి ఉందన్న విషయాన్ని అర్ధం చేసుకున్నాను. 

ఎలాగైనా రత్నమాల ఇక్కడికి వచ్చిందన్న విషయాన్ని బంగళా మనుషులతో ఒప్పించాలన్నది నా ఉద్దేశం.  రత్నమాల రాజమహల్ కి వచ్చిందన్నదానికి తిరుగు లేని  ఆధారంగా నాకు దొరికిన ఆ క్లూ  డిపార్ట్ మెంట్ చేతికి వెడితే,  ఇన్ ఫ్లూ యెన్స్ ఉపయోగించి రాజేంద్ర కుటుంబీకులు దాన్ని మాయం చేస్తారేమోనన్న భయంతో  అనాలోచితంగా నేను ఆ ఉంగరాన్ని తీసి నా దగ్గర దాచాను.  అంతే తప్ప మరో ఉద్దేశం లేదు. నిన్న రాత్రి రాజేంద్ర గదిలోకి వెళ్ళినది కూడా  రత్నమాల గురించిన మరింకేమైనా సాక్ష్యాలు దొరుకుతాయేమోనన్న ఉద్దేశంతోనే”  అంది ఇంద్రనీల అమాయకంగా.

“శభాష్”  అన్నాడు పాణి “ఈ గదిలోకి వచ్చిన దగ్గరనుంచీ ఇప్పటిదాకా మీరు మాట్లాడుతున్న విధానాన్ని చూస్తుంటే, నాకొక విషయం బాగా అర్ధమౌతోంది”

“ఏమిటది?” ఆశ్చర్యంగా అడిగింది ఆమె.

“మీకు చాలా వేగంగా కథలు అల్లగల నేర్పు ఉంది. మీరు చెప్పిన కథ చాలా బాగుంది. అభినందనలు !”

ఇంద్రనీల దెబ్బతిన్నట్టుగా చూసిందతడి మాటలకి  “మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పినది కథ కాదు. నిజం”

“ఎగ్జాక్ట్ గా నేను కూడా అలాగే నమ్మి ఉండే వాడిని – ఈ  కథలో మీరు బంగారు లక్ష్మి కేరెక్టర్ని కూడా కలిపి చెప్పి ఉంటే...”  నెమ్మదిగా ఒక్కో మాటా ఒత్తి పలుకుతూ అన్నాడు పాణి.

మరింత షాక్ తిన్నట్టుగా చూసింది ఇంద్రనీల “బం... మధ్యలో బంగారు లక్ష్మికీ  ఈ  కేసుకీ ఏమిటి సంబంధం?  ఆమె గురించి ఎందుకు  అడుగుతున్నారు?”  తడబడుతూ అంది.

“ఎందుకంటే... ఏ వజ్రాల కోసమైతే ఈ డ్రామా అంతా నడుస్తోందో- ఆ వజ్రాలు... బం... గా... రు... ల... క్ష్మి దగ్గర ఉన్నాయి కనుక !!”   అన్నాడు పాణి. కళ్ళు తిరుగి పడుతున్నట్టుగా అనిపించి కుర్చీ అంచుని ఆసరాగా పట్టుకుంది ఇంద్రనీల.  ఒక్క నిమిషం తల వాల్చి కళ్ళు మూసుకుంది.   కొద్ది సేపటి తరువాత నెమ్మదిగా  తల ఎత్తి  “నిజంగానే ఇక్కడ నాకు తెలియని డ్రామా ఏదో జరుగుతోంది. నేను అనుకున్నంత సింపుల్ కేసు కాదిది.  వజ్రాలేమిటీ? నగలేమిటీ? బంగారు లక్ష్మి దగ్గర ఉండడమేమిటీ? అస్సలు నాకేమీ అర్ధం కావడం లేదు” అంది నీరసంగా.

ఆమె స్త్రీ కాకపోయి ఉంటే,  ఆమె పోలీస్ ఆఫిసర్  కాకపోయి ఉంటే, అతడి చెయ్యి వెళ్ళి ఆమె కుడి చెంప మీద బలంగా తాకి ఉండేది.  అంత కోపం వచ్చింది అతడికి.

కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ,  అలమార దగ్గరకి వెళ్ళి అందులోంచి ఒక నోట్ ప్యాడ్ ని తీసి ఆమె ముందుకి విసిరాడు.

“ఏమిటిది?” ఆశ్చర్యంగా అడిగింది ఇంద్రనీల ఆ నోట్ ప్యాడ్ ని చూస్తూ.

“నిన్న రాత్రి రాజేంద్ర గదిలో నన్ను చూసి  మీరు లైటు ఆర్పుతున్న సమయానికి  అతడి రాత బల్ల సొరుగులో దొరికిన నోట్ ప్యాడ్. ఈ నోట్ ప్యాడ్ మీదే రాజేంద్ర సూసైడ్ నోట్ రాసినది” అన్నాడు.

ఆమె దాన్ని చేతుల్లోకి తీసుకుంటుంటే అన్నాడు “రాజేంద్ర సూసైడ్ నోట్ లోని కొంత మేటర్ని ఎవరో ఎవరో ఆల్టర్ చేసారు.  కెమికల్ ఉపయోగించి నోట్ లోని కొంత భాగాన్ని ఎరేజ్ చేసేసారు.  ఎరేజ్ చేసిన ఆ భాగంలో రాజేంద్ర ఏం రాసాడో  తెలుసుకుంటే, ఈ కేసులో చాలా ముళ్ళు విడిపోతాయని నాకు తెలుసు. కానీ ఎలా?  ఆల్టర్ చేసిన  ఆ భాగాన్ని తిరిగి తెప్పించడం మరే కెమికల్ వల్లా  అయ్యే పని కాదు. ఒక రహస్యాన్ని ఎవరో శాశ్వతంగా సమాధి చేసే ఉద్దేశంతో ఆ పని చేసారు. ఆ రహస్యాన్ని తెలుసుకోవడం ఎలా? ఆ నోట్ లో రాజేంద్ర రాసిన ఒరిజినల్ మేటర్ రాజేంద్ర బ్రతికి వచ్చి చెబితే కానీ తెలియదు. కానీ తెలుసుకోవాలి. ఎలాగని ఆలోచిస్తున్న సమయంలో  రాజేంద్ర గదిలో ఈ నోట్ ప్యాడ్ కనిపించింది.

రాజేంద్ర సూసైడ్ నోట్ ఆ ప్యాడ్ లోని పేపరు  మేదే రాసాడు.  దాన్ని  చూడగానే నాకు ఒక ఐడియా వచ్చింది. రాజేంద్ర రాసేటప్పుడు ఆ ప్యాడ్ లోని క్రింది పేపరు మీద అచ్చు  పడే అవకాశం ఉంది. ఆ అచ్చుమీద  పెన్సిల్ లెడ్ ని పౌడర్ చేసి సున్నితంగా రుద్దితే అక్షరాలు బయట పడచ్చనిపించి, ఆ నోట్ ప్యాడ్ ని నాతో తీసుకు వచ్చి, ప్రయత్నం  చేసాను.  నా ప్రయత్నం ఫలించింది. రాజేంద్ర రాసిన ఒరిజినల్ నోట్  లోపల ఏముందో  తెలిసింది” 

ఆమె అప్రయత్నంగా నోట్ ప్యాడ్ తెరిచి రాజేంద్ర పెన్సిల్ లెడ్ పౌడర్ ద్వారా తిరిగి సాధించిన అక్షరాలని చూసింది.

నిన్నటి వసంత రాత్రులు
గడిచిన వెన్నెల పున్నములు
కురిసిన హిమసుమాలు
గుర్తొచ్చి-

మదిని మెలిపెడుతుంటే
వర్తమానం భారంగా అనిపిస్తోంది
తీపి రుచి తెలిసాక
చేదు మరింత చేదుగా ఉన్నట్టుగా
బ్రతికినంత కాలం
ఆనందాన్ని దోసిలితో తాగిన తృప్తి
ఇంక ముందు బ్రతికినా
ఇంత ఆనందాన్ని పొంద లేనేమోనన్న
దిగులుని కలిగిస్తోంది...
అందుకే
విరక్తితో  వెళ్ళి పోతున్నాను
నిష్క్రమించడం ఓటమి కాదు
ఎందుకంటే,
శక్తివంతమైన సూర్యుడు కూడా
సాయం కాలమయ్యే సరికి అస్తమిస్తాడు !

-రాజా రాజ్ బహదూర్ రాజేంద్ర వర్మ

పి.ఎస్ః  ఈ భూమ్మీద నేను చెయ్యాల్సిన పని మాత్రం ఒకటి మిగిలి పోయి ఉంది.  సిర్నాపల్లి సంస్థానాధీశుల ఆపూర్వ సంపంద కోట్ల విలువ చేసే రెడ్ డైమండ్స్ పొదిగిన నగలు  హైదరాబాద్ ఎక్సైజు డిపార్టుమెంట్ లో పని చేసే  బంగారు లక్ష్మి దగ్గర ఉన్నాయి.  వాటిని సంస్థానం క్రింద ఉన్న రెండొందల గ్రామాల అభివృద్దికి ఖర్చు చేయండి.

“రాజేంద్ర రాసిన  ఆఖరి వాక్యాలని ఎవరో తెలివిగా ఎరేజ్ చేసి, ఏమీ తెలియనట్టుగా సూసైడ్ నోట్ ని యథా స్థానంలో ఉంచేసారు ! అప్పటి నుంచీ  డ్రామా మొదలైంది !!”   వ్యంగ్యంగా అన్నాడు పాణి.

ఇంద్రనీల షాక్ నుంచి తేరుకోనట్టుగా చూస్తుంటే, పాణి అన్నాడు “ఇప్పుడు చెప్పండి.  సూసైడ్ నోట్ లోని ఆ వాక్యాలని ఎరేజ్ చేసే అవసరం, అవకాశం మీకు తప్ప మరెవరికి ఉన్నాయి? సూసైడ్ నోట్ లో ఉన్న అసలు మేటర్ నేను తెలుసుకో గలనని ఊహించని మీరు బంగారు లక్ష్మి కేరెక్టర్ ని మీరు చెప్పే కథలో ఇంక్లూడ్ చెయ్యకుండా  నిర్లక్ష్యంగా కథ అల్లేసారు. అలా నాకు దొరికి పోయారు.  ఇప్పుడు చెప్పండి. బంగారు లక్ష్మి  మీ స్నేహితురాలు కాదూ? ఆమె దగ్గర వజ్రాలు లేవూ?  ఇక్కడి సాక్ష్యాలు తారు మారు చెయ్యడానికే  ఆమె మిమ్మల్ని పంపలేదూ?”

(ఈ సస్పెన్స్ వచ్చేవారం దాకా)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్