Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

నాదైన ప్రపంచం

nadaina prapancham

గత సంచికలో నాదైన ప్రపంచం చదవడానికి ఇక్కడ క్లిక్  చేయండి. http://www.gotelugu.com/issue217/610/telugu-serials/naadaina-prapancham/nadaina-prapancham/

 

( గతసంచిక తరువాయి ).. అడగాలో, వద్దో తేల్చుకో లేక పోతోంది. అడిగితే అతనేమనుకుంటాడోనన్న భయం, అడగక పోతే మనసు స్థిమితంగా వుండదు.

గుమ్మం వరకూ వచ్చాక యికాగలేక....

‘‘అన్నయ్యతో ఈ విషయం....’’ నసిగింది.

‘‘చెప్పాను’’ నవ్వాడు. సంభ్రమంగా చూసింది....‘‘వారం కిందటే!.....’’ వాక్యం పూర్తి చేశాడు. వున్న కొద్దిపాటి సంకోచమూ తొలగి పోయింది. మనసారా చిరునవ్వు నవ్వింది.

‘‘కీర్తనని తీసుకు రండి’’ అతను కారు స్టార్ట్ చేశాక చెప్పింది. వెంటనే కారు ఆపేశాడు.....‘‘ఎప్పుడు తీసుకు రానూ....?’’

‘‘ఈ వీక్ నేను కొంచెం బిజీ...నెక్ట్స్ వీక్ తనకి గేమ్స్ ఏవో వున్నాయి. ఆ నెక్ట్స్ వీక్ తను వూరు నుంచి రాగానే కలుద్దాం’’ చెప్పాడు.
తలూపింది జాహ్నవి.

‘‘వీలయినప్పుడు ఫోన్ చెయ్యండి....ఊ....వీలయినపుడు కాదు వీలు చేసుకుని చెయ్యండి’’ చెప్పాడు. నవ్వి అలాగేనని తలూపింది.
అతను కాసేపు ఆమె వంక అలాగే చూసి, వెంటనే చూపు మరల్చుకుని కారు స్టార్ట్ చేసి ముందుకు దూకించాడు. కారు కనుమరుగయ్యేంత వరకూ చూసి లోనికి వచ్చింది జాహ్నవి.

***********

ప్రకాష్ ఆఫీస్ లో కూర్చుని కెమికల్ ఎనాలసిస్ గురించి పేపర్ వర్క్ ఏదో చేస్తున్నాడు.

‘‘మిస్టర్ అశోక్ వున్నారా....?’’ గంభీరమయిన స్వరం వినిపించేసరికి ఉలిక్కి పడి తలెత్తాడు. ఎదురుగా హిందీ మోడల్ గా కనిపించే అందమైన యువకుడు ఇది వరకు రెండు సార్లు యితన్ని ఆఫీస్ లోనే చూశాడతను.

అశోక్ కోసం వస్తాడు. అతను రాగానే అశోక్ ఎంతో ఆప్యాయంగా అతన్ని కౌగిలించుకుని లోనికి తీసుకు వెళతాడు. గది తలుపులు మూతబడతాయి.

మధ్యలో బాయ్ డ్రింక్ లు తీసుకుని వెళతాడు. ఓ పావు గంట తర్వాత అతను వెళ్ళి పోతాడు. యితని పేరేంటో కూడా తెలీదు.
ఆలోచన నుంచి తెప్పరిల్లి.....‘‘వున్నారు....మీ పేరు?’’ ప్రకాష్ అర్ధోక్తిలో ఆపాడు.

చిరునవ్వు నవ్వాడతను. ‘‘అశోక్ దగ్గరికి నేను పేరు చెప్పి వెళ్ళాల్సిన అవసరం లేదు’’ చెప్పి కదిలాడు. కించ పడ్డాడు ప్రకాష్.
‘‘అయాం సారీ సర్!’’ అన్నాడు.

‘‘ఇట్సాల్ రైట్!’’ హుందాగా లోపలికి వెళ్ళాడు. అశోక్ యధా విధిగా అతన్ని ఆహ్వానించాడు.  డోర్ సరిగా మూత బడలేదు. యిద్దరి మధ్యా ఏవో సీరియస్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. అవి సరిగ్గా అర్ధం కావడం లేదు. కానీ వినటం పద్ధతి కాదని భావించి అక్కడ నుంచి వెళ్ళి పోయాడు.

ఆ తర్వాత అర గంటకి అతను బయట వెయిట్ చేస్తున్న కారెక్కి వెళ్ళి పోయాడు. మనసులో ఎన్నో అనుమానాలున్నా, ఏదో రకంగా తెలుసుకోవాలనుకున్నాడు ప్రకాష్. అందుకే మౌనంగా వుండి పోయాడు.

*************

హైద్రాబాద్ రైల్వేస్టేషనంతా కోలాహలంగా వుంది.

అపుడు టైమ్ ఏడు పదిహేను పి.ఎమ్. చెన్నై వెళ్ళే ఛార్మినార్ ఎక్స్ ప్రెస్ ప్లాట్ ఫాం మీదకి వచ్చింది. ప్రయాణీకులంతా హడావిడిగా రిజర్వేషన్ కంపార్ట్ మెంట్లను వెతుక్కుంటున్నారు. జనరల్ లో వెళ్ళే వాళ్ళు సీట్ల కోసం తోపులాడుకుంటున్నారు .

ఎస్.త్రీ కోచ్ కోసం వెతుకుతున్నారు కీర్తన, ఆమె ఫ్రెండ్స్ పదకొండు మందీ. కాస్త ముందుకు నడిచాక కనిపించింది ఎస్.త్రీ. టికెట్ లోని నెంబర్స్ ప్రకారం తమ సీట్లని వెతుక్కుని లగేజీ సర్దుకున్నారు.

మద్రాసు లో జరుగుతున్న సౌతిండియా వాలీ బాల్ టోర్నమెంట్ కోసం ఆంధ్రా తరపున రెండు జట్లు బయల్దేరుతున్నాయి. ఒకటి విశాఖ జట్టు.

రెండోది హైద్రాబాద్ జట్టు.

నేషనల్ గేమ్స్ కి  ముందు జరిగే ప్రతి మ్యాచ్, ఇంపార్టెంటే ! చాలా జాగ్రత్తగా ఆడాలి. అయితే మ్యాచ్‌ లు ఆడేపుడు సీరియస్ గా వుండే టీమ్ మెంబర్స్ కి జర్నీలే ఆటవిడుపుగా వుంటాయి.

రకరకాల గేమ్స్ ఆడుకుంటూ, బుక్స్ చదువుకుంటూ హుషారుగా కబుర్లు చెప్పుకుంటూ ఫ్రీగా వుండొచ్చు.

అమ్మాయిల మొహాలన్నీ ప్రయాణపు హుషారుతో వెలిగి పోతున్నాయి.

ట్రైన్ కదలడానికి ఇంకా పది నిమిషాల టైమ్ వుండటంతో అమ్మాయిులు దిగి తమకి సెండాఫ్ యివ్వడానికి వచ్చిన పేరెంట్స్, బ్రదర్స్ తో సిస్టర్స్ తో మాట్లాడుతున్నారు.

అశోక్ కీర్తనని స్టేషన్ లో దింపేసి పనుందని వెళ్ళి పోయాడు.

కిటికీ కి మొహం ఆన్చి కూర్చుని ఫ్లాట్ ఫాం మీద వచ్చి పోతున్న జనాల్ని చూస్తోంది కీర్తన.

అందరి మొహాల్లోనూ రక రకాల భావాలు.

కొందరు టెన్షన్ గా, మరి కొందరు నవ్వుతూ, యింకొందరు దిగులుగా, ఎవరెవరు ఏ సమస్యల్లో వున్నారో, ఎంత ఆనందంతో వున్నారో, వారి ముఖాలే చెబుతున్నాయి. కీర్తన ఆలోచనలు యింటి మీదకి వెళ్ళాయి.

అంతలో సడన్ గా ఆకాష్ వచ్చాడక్కడికి. అతన్ని చూస్తూనే టీమ్ లోని ప్లేయర్స్ అందరూ విస్మయానికి లోనయ్యారు. అందులో ఒకమ్మాయి తేరుకొని ‘‘ఎక్కడికి వెళ్తున్నారు....?’’ అతని చేతిలో బ్యాగ్ చూస్తూ అడిగింది. ‘‘చెన్నై’’ అన్నాడు ఆకాష్ కీర్తన వంక చూస్తూ.

మొహమొహాలు చూసి నవ్వుకున్నారు అమ్మాయిలు.

ఇంకొక అమ్మాయి ఆగ లేక, ‘‘మీరు చెన్నై ఎందుకు వెళుతున్నారు?’’ ఆసక్తిగా అడిగింది.

‘‘నేనూ వాలీ బాల్ టోర్నమెంట్ కే!’’

‘‘నిజంగా!’’ ఆశ్చర్య పోయి అడిగారు.

‘‘యస్!’’ చెప్పాడు.

‘‘మీరు ఆడతారా?’’ తేరుకుని అడిగారు.

‘‘ఊహూ..చూస్తాను...’’ కీర్తన వంక ఓరగా చూసి చెప్పాడు.

‘అభిమాని కదా!’ ఒకరి చెవిలో ఒకరు గుసగుస లాడుతున్నారు.

‘‘ఆట చూడటం కోసం ఇంత దూరం, ఇన్ని పనులు వదులుకొని వస్తారా?’’ ఆశ్చర్యంగా అన్నారు.

‘‘తప్పదు. ఆట కోసం పరీక్షనే వదులుకున్నాను....’’ సిన్సియర్ గా చెప్పాడు.

‘‘ఓ!.....’’ అంటూ కాసేపు వాళ్ళలో వాళ్ళే తర్జన భర్జనలు పడ్డారు. కీర్తన హృదయం పొంగిపోయింది. ఇతను తన గేమ్ చూడటం కోసం వస్తున్నాడు.

మొహం కలువ పువ్వులా వికసించింది. ఈ వారం రోజుూ ఇతను చెన్నైలోనే వుంటాడేమో! అతను తన ఆటని నిశితంగా పరిశీలిస్తాడన్న ఊహ వస్తుంటే చైతన్యం నరనరానా ఇంజెక్టవుతోంది! ‘‘మీరేం మాట్లాడరా?’’ హఠాత్తుగా పక్కకి తిరిగి కీర్తనను ఉద్దేశించి అన్నాడు ఆకాష్.

‘‘నేనా....?’’ తత్తర పడుతూ అంది. కానీ మాట్లాడ లేక పోయింది.

‘‘అభిమాని కాదూ ఏం కాదూ! మన ముద్ద పప్పుని లైన్ లో పెట్టటానికి ఈ ప్లాన్ వేసుంటాడు. పదండి....మనం అటు వెళ్ళి కూర్చుందాం. వీళ్ళని డిస్టర్బ్ చేయటం ఎందుకు?’’ అనుకుంటూ అంతా పోలోమంటూ మరో వైపుకి వెళ్ళి అంత్యాక్షరి ఆడుకోవడం మొదలు పెట్టారు.
కీర్తన కూడా వాళ్ళని అనుసరించ బోతే, ఆకాష్ ఆపేశాడు.

‘‘కొత్త వాలీ బాల్ ఒకటి మార్కెట్ లోకి వచ్చింది. దాని గురించి డిస్కస్ చేద్దాం వుండండి’’ చెప్పాడు.

‘‘చెప్పండి...’’ అంది.

‘‘ఏంటీ?’’ ఏమీ ఎరగనట్లు అడిగాడు.

‘‘కొత్త వాలీబాల్....’’ అంటూ చెప్ప బోయింది.

మధ్య లోనే ఆపేసి....

‘‘దాని గురించి తప్ప ఇంకేమీ మాట్లాడరా?’’ అన్నాడు.

‘‘ఇంకేముంటాయి మాటలు....’’ మెల్లగా తల దించుకుని అంది.

‘‘ఏవో ఒకటి....జనరల్ విషయాలు చెప్పండి.’’ మనసు లోంచి ఏవో భావాలు ఉప్పొంగుతూ వస్తున్నాయి. అతనితో చెప్పాలా వద్దా అని మనసు తటపటాయిస్తోంది..

చివరికి ఏదయితే అదయిందని తెగించి....

‘‘మీతో ఓ విషయం చెప్పాలి’’ అంది.

ఆసక్తిగా ముందుకి వంగి ‘‘చెప్పండి’’ అన్నాడు.

చున్నీ అంచు సరిజేస్తూ ‘‘ఇరవై రోజుల నుంచీ మీతో మాడ్లాడాలనీ, మిమ్మల్ని చూడాలనీ చాలా అనిపిస్తోంది.....’’ లో గొంతుకతో అంది.
నమ్మలేని విషయం విన్నట్లు అతని కళ్ళు పెద్దవయ్యాయి. అతని మొహం వికసించింది. ఆమె అంతట ఆమె అలా చెపుతుందని అస్సలు వూహించ లేదు. తను చెప్పడానికి సాహసించ లేని విషయం ఆమె ఎంత ఈజీగా చెప్పేసిందీ....? మనసంతా ఆకాశమంత సంతోషం.
అతి ప్రయత్నం మీద దానిని అదిమి పెడ్తూ ‘‘ఎందుకు?’’ అడిగాడు

‘‘నా గేమ్ గురించీ మీతో డిస్కస్ చెయ్యాలని’’ అమాయకమైన కళ్ళతో అంది.

ఉస్సురంది మనసు. కానీ తేరుకున్నాడు. ఈ మాత్రం చెయ్య గలిగితే చాలు. కనీసం ఆటకి సంబంధించిన ఫీలింగ్స్ ఆమె తనతో షేర్ చేసుకోవాలనుకుంది.

(సశేషం)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
atadu .. aame..oka rahasyam