గత సంచికలో నాదైన ప్రపంచం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.http://www.gotelugu.com/issue218/612/telugu-serials/naadaina-prapancham/nadaina-prapancham/
( గతసంచిక తరువాయి )..
అది తన తొలి విజయం. నిరుత్సాహపడకూడదు.
‘‘సరే! ఇప్పుడు చెప్పండి. వింటాను’’ అన్నాడు.
అంతే! ఎక్కడ లేని ఉత్సాహమూ ముంచుకొచ్చేసింది కీర్తనలో. కాళ్ళు మఠం వేసుకుని అతని వేపు తిరిగి కూర్చుని....
ఏదో గేమ్ గో చెప్పడం ప్రారంభించింది. వింటూ ఆమెని చూసి ‘‘అయ్యో!.....ఎంత సొంపైన డ్రస్, ఏం టేస్ట్‌రా గొణుక్కున్నాడు. ఖద్దరు కర్ కాటన్ చుడీదార్, చాలా మందంగా ఒళ్ళు కన్పించకుండా, కాలి నుంచి మెడ వరకూ కవర్ చేస్తూ ఉంది. చున్నీ వేసుకున్న తీరు చూసి అతనికి జీవితం అంటే విరక్తి వచ్చేసింది. స్కూల్లో యూనిఫాం వేసుకున్నప్పుడు చున్నీని నీట్‌గా మడతలుపెట్టి క్రాస్‌గా ఫోల్డ్ చేసి భుజాలకి పిన్ చేస్తారు.
ఎదభాగం కనిపించకుండా, కొన్ని స్కూల్స్‌లో అలా మందంగా వేసుకుంటారు.
ఆ మాదిరిగా చున్నీ వేసుకుంది.
అతనికీ డైరెక్ట్‌గా చెప్పాలన్న కోరిక కలిగింది.
‘‘నేనూ ఓ విషయం చెపుతాను. మీరేమీ అనుకోకూడదు’’ మాటలు ముగిసాక అన్నాడు.
‘‘ఏంటి అడగండి’’ అందమైన అతని మొహం చూస్తూ అంది.
‘‘నేను చెప్పాక మళ్ళీ మీరు అలగకూడదు’’ చెప్పాడు.
‘‘భలేవారే! ఎందుకు అలుగుతాను.....? చెప్పండి’’ అంది కీర్తన.
‘‘మీ డ్రస్ అస్సలు బాగాలేదు. డ్రస్ స్టిచ్చింగ్ కూడా ఏవో ప్రాంతాల వాళ్ళు వేసుకునేట్లు ఉంది’’ కుండ బద్దలుకొట్టినట్లు అన్నాడు.
అయోమయంగా తన డ్రస్ వంక ఓసారి చూసుకుంది. ఇతను ఇలా కామెంట్ చేస్తాడని అస్సలు అనుకోలేదు. కొంచెం కోపం కూడా వచ్చింది. కానీ ముందే మాటివ్వడం మూలంగా దానిని పైకి కనిపించనీయలేదు.
‘‘ఈ డ్రస్ కేమయింది....? బాగానే వుంది’’ అంది.
‘‘మీరనుకుంటున్నారా....? ఎవరైనా చెప్పారా?’’ కొంచెం వ్యంగ్యంగా అన్నాడు.
అది ఆమెకి బాగానే అర్ధమయింది. కానీ ఆమె పేషెన్స్ లూజవలేదు. ‘‘డ్రస్ అన్నది ఎదుటి వారిలో అసభ్యమైన ఆలోచనలు కలగనివ్వకుండా వుండటానికి, మన కంఫర్ట్ కోసం వేసుకుంటాం’’ తన అభిప్రాయం చెప్పింది.
అమ్మో! అనుకున్నంత అమాయకురాలేం కాదు, అనుకున్నాడు. దాంతో ఆ టాపిక్ కట్ చేసాడు. మాట మధ్యలో అడిగింది. ‘‘మీరు నిజంగా చెన్నై ఎందుకు వస్తున్నారు?’’ అని.
‘‘చెప్పానుగా....మీ ఆట కోసమే’’ అన్నాడు.
ఆనందంతో తలమునకలయి చాలా సేపు మౌనంగా ఉండిపోయింది. తర్వాత అతని వివరాలు అడిగింది.
‘‘ఇప్పుడు మీరే అడిగినా నేను చెప్పలేను. సమయం వస్తే నేనే చెపుతాను’’ ముభావంగా అనడంతో ఆమె ఏమీ మాట్లాడలేకపోయింది.
మధ్యలో ఫ్రెండ్స్ వచ్చి తాము ఏం చేస్తున్నారో చూసి పోతున్నారు.
ఆకాష్ తమతో ప్రయాణం చెయ్యడం చాలా విచిత్రంగా, హుషారుగా వుంది వాళ్ళకి....
మాట మధ్యలో తెలిసింది ఆకాష్ కూడా తమకి అలాట్ చేసిన హోటల్ లోనే రూం బుక్ చేసుకున్నాడని.
‘‘అయితే ఈ వారం రోజులూ మనం కలిసే వుంటామన్న మాట.’’ ఎలాంటి మర్మం లేకుండా అంది కీర్తన.
ఊ! మీకు ఇష్టమైతేనే. లేకపోతే....నేను కనపడను బింకంగా అన్నాడు.
‘‘అయ్యయ్యో! అదేం లేదు. ఐ లైక్ యువర్ కంపెనీ’’ చెప్పేసింది.
నిద్రపోయే వరకూ అలా కబుర్లు చెప్పుకుంటూనే వున్నారు.
*******
అశోక్ ఆఫీస్‌కి రాగానే ప్రతి రోజూ మిషన్స్ దగ్గరకి వెళ్లి వర్క్ ఎలా సాగుతుందో చెక్ చేసుకుంటూ వుంటాడు. వర్కర్స్‌ని హుషారు చేసి పని త్వరగా పూర్తి చేసేలా చూస్తాడు.
ఈ రోజు ఉదయం రాగానే మిషన్స్ దగ్గరకి వెళ్ళాడు. శ్రీధర్ కనిపించాడక్కడ. అతని బట్టలు నలిగిపోయి మొహం వాడిపోయి కనిపించింది. కళ్ళు ఎర్రగా వున్నాయి.
‘‘ఏంటి....? హెల్త్ బాగా లేదా?’’ అడిగాడు.
‘‘బాగానే వున్నాను సర్!...’’ వినమ్రంగా అన్నాడు.
‘‘ఫేస్ ఏం అలా వుంది?’’ మళ్ళీ అన్నాడు.
‘‘ఏం లేదు సర్! రాత్రి నిద్రలేక’’ మొహమాటంగా అన్నాడు.
‘‘రాత్రి నిద్రలేదా....? ఏం...?’’ భ్రుకుటి ముడివేసి అడిగాడు.
‘‘రేపటికల్లా బాటిల్స్ రడీ అవ్వాలి. వర్క్ పెండింగ్‌లో పడి లేటయ్యేకొద్దీ రోజుకి రెండువేల పెనాల్టీ పడ్తుంది. అందుకే!’’ మెల్లగా అన్నాడు.
అశోక్ మనసు ఆర్ద్రంగా మారింది. అప్పటికి ఏమీ అనలేదు. అతని భుజం మీద చెయ్యి వేసి తడుతూ ‘కారీయాన్’ అని చెప్పి ఆఫీసు వైపు నడిచాడు.
సీట్లో కూర్చోగానే ప్రకాష్‌ని పిలిచి, శ్రీధర్‌కి ఈ నెల నుంచి అయిదువందలు ఇంక్రిమెంట్ పెంచమని చెప్పాడు.
ప్రకాష్ ఏదో చెప్పబోయాడు. అతని మనసు ఆందోళనకి గురవుతోంది. ఎలా చెప్పాలో, చెపితే అతని రియాక్షన్ ఎలా వుంటుందో తెలీదు. అసు తన రీజన్సే తనకి స్ట్రాంగ్‌గా లేవు.
అలాంటప్పుడు తనేం చెప్పినా శ్రీధర్ మీద అశోక్‌కి వున్న ఇంప్రెషన్ చెడగొట్టడానికి చెప్పినట్లుగా వుంటుంది. కొన్నాళ్ళు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయడం మంచిదని నిశ్చయించుకున్నాడు ప్రకాష్.
*******
సౌతిండియా వాలీబాల్ టోర్నమెంట్‌లో భాగంగా సౌత్ ఇండియా నుంచి స్త్రీ జట్లు మొత్తం పదహారు వచ్చాయి. లీగ్ మ్యాచ్‌లో కర్నాటక`ఎ జట్టుమీద, ఆంధ్రా`ఎ జట్టు అంటే హైద్రాబాద్ జట్టు 15`8, 15`5తో సునాయాసంగా గెల్చింది. క్వార్టర్ ఫైనల్లో కూడా తమిళనాడు`బి జట్టుమీద గెల్చింది.
ఇంకా సెమీఫైనల్‌కి మూడురోజుల గ్యాప్ వచ్చింది. మిగిలిన టీమ్స్ మ్యాచ్లు ఇంకా అవ్వాలి.
తనాడిన రెండు మ్యాచ్‌లకి ఆకాష్ వచ్చి గ్రౌండ్‌లో తమ టీమ్‌ని ఎంకరేజ్ చెయ్యడం ఆమె గమనిస్తూనే వుంది. అతను చూస్తున్నాడనుకుంటేనే ఎంతో ఉత్సాహం వస్తోంది.
అతని మెప్పుకోసమయినా ఆడాలన్పిస్తోంది.
ఈ రెండు రోజులూ అతనితో మాట్లాడటం కుదరలేదు. అతను కూడా తనని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేనట్లు దూరం నుంచే చూపుల్తోనే తనని ప్రోత్సహిస్తున్నాడు.
మూడు రోజులు ఆటవిడుపు కావడంతో, మొదటి రోజు చెన్నై లోని పారిస్ సెంటర్‌లో షాపింగ్ చేసి, ఈవెనింగ్ బీచ్‌కి వెళదామనుకున్నారు అమ్మాయిలు.
కోచ్‌ని ఒప్పించారు. టి.వి.లో క్రికెట్ మ్యాచ్ వస్తుండటంతో అతను రూంలో రెస్ట్ తీసుకుంటానన్నాడు.
మహదానందంగా అందరూ తయారవుతున్నారు. మాట వరసకు కూడా కీర్తనని అడగలేదు. ఆమెకి ఉక్రోషంగా వుంది. అయినా వాళ్ళనని ఏం తప్పు....? ఇప్పటి వరకూ యిలాంటివన్నీ తనే ఎవాయిడ్ చేసింది. అడిగినా తను రానని చెపుతుందన్న ఉద్దేశంతో వాళ్ళు అడగలేదు.
కీర్తన అలా చూస్తూ కూర్చునే వుంది. వాళ్ళు సీతాకోకచిలుక గుంపులా తయారయి వెళ్ళిపోయారు.
కాసేపు కూర్చుంది. ఏమీ తోచలేదు. రూంలో ఒంటరిగా వుండబుద్ధి కాలేదు.
అదే హైదరాబాద్‌లో అయితే ఏం తోచకపోతే తండ్రి దగ్గర కూర్చొని కబుర్లు చెప్పడమో, స్టేడియంకి వెళ్ళి ప్రాక్టీస్ చేయడమో చేసేది.
తండ్రి గుర్తుకు రాగానే ఆయనెలా వున్నారోనని ఫోన్ చేసింది.
నానమ్మ మాట్లాడింది. నాన్నగారు అప్పుడే టిఫిన్ చేశారంటూ చెప్పింది. తనిక్కడ బాగానే వున్నానని చెప్పమంది. ఇంకా తర్వాత తన మనసు ఎక్కడికి వెళ్ళిపోతోందో కీర్తనకి బాగానే అర్ధమయింది.
ఉండబట్టలేక డ్రస్ మార్చుకుని, రూం లాక్ చేసి బయల్దేరింది. పై ఫ్లోర్ లోకి వెళ్ళి డోర్ నాక్ చేసింది.
‘‘కమిన్....!’’ ఆకాష్ గొంతు విన్పించింది.
లోపలికి అడుగుపెట్టింది. అతను అప్పుడే డ్రస్సవుతున్నట్లున్నాడు. టైట్ జీన్స్ వేసుకున్నాడు. షర్ట్ చేతిలో వుంది. ఛాతీ అనాచ్ఛాదితంగా వుంది. దృఢంగా వున్న అతని శరీరాన్ని చూసి కలవరంగా చూపు తిప్పుకుంది.
‘‘మనల్ని చూసి ఎదుటి వారిలో అసభ్యభావాలు కలగకుండా ఉండటానికే మనం బట్టలు వేసుకుంటాం, నిజమే! కానీ నన్నెలా చూసినా మీకు అసభ్యభావాలు, సభ్యభావాలేకాదు, ఏ భావాలు రూఢగాి కలగవని తెలిసే మీకు సారీ చెప్పలేదు’’ గుక్కతిప్పుకోకుండా అన్నాడు.
‘‘నాకు అర్ధం కాలేదు’’ బిక్క మొహం పెట్టి అంది.
అతను షర్ట్ వేసుకోకుండానే ఆమె దగ్గరకి వస్తుంటే, ఆమె వూపిరి భారంగా మారింది. శ్వాస వేడిగా రావడం గమనించింది. ఏదో తత్తరపాటు....భయం, అక్కడ నుంచి పారిపోవాలనీ, అక్కడే వుండాలనీ ఏదో పోరాటం, ఎదలో ఆరాటం. కాళ్ళు నేలకి అంటుకుపోయాయి.
‘‘నన్ను ఎలా చూసినా మీరు చలించరని అంటున్నాను’’ దగ్గరగా వచ్చి అన్నాడు.
ఒకడుగు వెనక్కి వేసి, మాట మారుస్తూ....
‘‘వాళ్ళందరూ బైటకి వెళ్ళారు. రూంలో ఒక్కదాన్ని వుండాంలంటే బోర్‌గా వుండి వచ్చాను’’ సంజాయిషీగా అంది.
‘‘ఓ! సరే అయితే ఇప్పుడేం చేద్దాం, మనిద్దరం బాల్ గేమ్ ఆడదామా?’’ అడిగాడు.
‘‘బాల్ గేం..? అదేం గేమ్?’’
‘నీకు అంత తెలిస్తే నాకీ తంటాలు ఎందుకు తల్లీ! అని మనసులోనే గొణుక్కుని.
‘‘అదే వాలీబాల్ మనిద్దరం ఆడదామా అంటున్నాను’’ కప్పిపుచ్చుకున్నాడు.
‘‘మీరు మరీనూ....! మనిద్దరమే ఎలా ఆడతాం?’’ నవ్వుకుంటూ అంది.
‘పెద్ద పిచ్చిమాలోకం’ అనుకుంటూ...‘‘మనం కూడా బయటకి వెళదామా?’’ భయపడుతూనే అడిగాడు.
ఏ కళనుందో ఒప్పుకుంది...
అంత తొందరగా ఒప్పుకోగానే కలా, నిజమా! అనిపించింది. అతని ఫీలింగ్స్ చూసి నవ్వుకుంది కీర్తన.
రూం లాక్‌చేసి బయల్దేరారు. ముందు కీర్తన నడుస్తుంటే వెనుక ఆకాష్ ఆమెని పరిశీలిస్తూ నడుస్తున్నాడు. |