Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
nadaina prapancham

ఈ సంచికలో >> సీరియల్స్

అతడు..ఆమె..ఒక రహస్యం

atadu ..aame..oka rahasyam

గత సంచిక లోని అతడు-ఆమె-ఒక రహస్యం సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి http://www.gotelugu.com/issue220/617/telugu-serials/atadu-aame-oka-rahasyam/atadu-aame-oka-rahasyam/

 

( గతసంచిక తరువాయి ).. 

“సార్, ఆ సూరత్ వ్యాపారికి మనం ఇవాళ ఫోన్ చేస్తామని చెప్పాం. అతడి కోట్ చెబుతానన్నాడు”  బంగారు లక్ష్మి కుర్చీ పక్కనే మరో కుర్చీ వేసుకుని కూర్చున్న వ్యక్తితో అన్నాడు పక్కనున్నతను. 

“ఈ బంగారు లక్ష్మిని ఎన్ని హింసలు పెట్టినా  వజ్రాలెక్కడ ఉన్నాయో చెప్పడం లేదు. అసలు  వజ్రాలు ఎక్కడ ఉన్నాయో పూర్తిగా తెలుసుకోకుండా బేరం పెట్టడం  మీరు చేసిన పెద్ద వెధవ పని.  అయినా కొంపలేం అంటుకు పోతాయని బేరం పెట్టారు మన వాళ్ళూ?” విసుగ్గా అన్నాడు ఆ వ్యక్తి.

“అంత విలువైన వజ్రాలని అమ్మాలంటే ఒక్క రోజులో తెగే వ్యవహారం కాదని” నసుగుతున్నట్టుగా అన్నాడు పక్కనున్న అతడు.

“సరే, మనం మళ్ళీ ఫోన్ చెయ్యక పోతే ఆ సూరత్ వజ్రాల వ్యాపారికి  మన దగ్గర వజ్రాలు లేవన్న అనుమానం రావచ్చు. చెప్పిన టైముకి అతడికి  ఫోన్ చేసి బేరం ఒప్పుకోకుండా మాట్లాడండి.  వజ్రాలు దొరక గానే బేరం తెగ్గొడదాం”

“సరే” అని చెప్పి అక్కడి నుంచి బయటికి వెళ్ళాడు అతడు. సరిగ్గా వెళ్ళిన ఐదు నిమిషాలకి తన సెల్ నుంచి సూరత్ లోని చమన్ లాల్ కి ఫోన్ చేసాడు.
****
ఆ గతుకుల రోడ్డు మీద కారుని ఎనభై కిలో మీటర్ల వేగంతో పోనిస్తూ మనసు లోనే నిజామాబాద్ వెళ్ళి రావడానికి, అక్కడ యాదగిరితో మాట్లాడడానికీ ఎంత సమయం పడుతుందో మనసు లోనే  లెక్కలు వేస్తున్నాడు పాణి.  అసలు యాదగిరి దగ్గర తనకి కావాల్సిన సమాచారం ఏదైనా దొరుకుతుందా లేక  సమయం వృధానా అన్నది కూడా తెలియదు.   రాత్రంతా నిద్ర లేక పోవడం వల్ల కళ్ళు మండుతున్నాయి.  అయినా సరే, ఏకాగ్రతగా కారు నడుపుతూ ఆమెకి  జరిగినది చెప్పి అన్నాడు.

“ఈ కేసుని నేను పరిశోధించకుండా ఆపాలని ఎవరో గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అది ఎవరన్నది తెలియదు.  దీని వెనకనున్న హస్తం మీది కావచ్చూ,  మీ స్నేహితురాలు బంగారు లక్ష్మిది కావచ్చు.  మిమ్మల్ని కోటలో వదలకుండా నాతో పాటూ రమ్మన్నది కూడా అందుకే”
ఇంద్ర నీల చిన్నగా నవ్వింది. “ఒకవేళ మీరనుకుంటున్నట్టుగా నేనూ మా స్నేహితురాలు బంగారు లక్ష్మీ ఈ కేసులో నేరస్థులమే అయితే, నేను మీతో పాటూ ఉండడం వల్ల మీకన్నా నాకే ఎక్కువ లాభం అవుతుంది. మీరేం పరిశోధిస్తున్నారో వెంటనే తెలియడం వల్ల తప్పించుకునే ఎత్తులు తొందరగా వేసే అవకాశం ఉంటుంది కదా?” 

 “ఇప్పుడు మనం వెళ్ళేది డి.ఎస్.పి. ప్రసాద్ ఇంటికి. మిమ్మల్ని నేను కూడా రమ్మన్నది మీ ‘ఎదురుగా’  పరిశోధన చెయ్యడానికి కాదు. మీరు హాయిగా మీకు కేటాయించిన గదిలో విశ్రాంతి తీసుకోవచ్చు. నేను ఎవరితో మాట్లాడానో కూడా మీకు తెలియదు”

ఆమె ముఖం అవమానంతో ఎర్రబడింది అతడి మాటలకి. 

“క్షమించండి. నేర పరిశోధనలో  నమ్మకం కన్నా తర్కమే ముందుంటుంది”  

ఇంద్రనీల మాట్లాడకుండా తల తిప్పుకుని కిటికీ లోంచి బయటకి చూడసాగింది. 

“మీ ఫోన్ ఒకసారి ఇలా ఇస్తారా?”  ఆలోచననుంచి తేరుకుని సడెన్ గా అడిగాడు అతడు ఆమెని.

అతడెందుకు అడుగుతున్నాడో అర్ధం కాకపోయినా, ఆమె అసంకల్పితంగానే తన సెల్ ని అతడి చేతికిచ్చింది.  డ్రైవ్ చేస్తూనే ఒక చేత్తో ఆమె సెల్లోంచి అంజలి నెంబరుకి కాల్ చేసాడు.

అతడు  చేస్తున్నాడని తెలియని అంజలి ఫోన్ ఎత్తింది.

“హలో అంజలీ... నేను. దయచేసి ఫోన్ పెట్టెయ్యకు.  నీకు ఆ ఫోటోలు ఏ నెంబరు నుంచి వచ్చాయో చెప్పు.  నామీద దయ ఉంచి ఒక్క ప్రశ్నకీ సమాధానం  చెప్పు.  ఎవరో నాచేత పరిశోధన ఆపించాలన్న దురుద్దేశంతో నీకా ఫోటోలు పంపారు.  వాళ్ళెవరో తేలితే, క్లిష్టమైన ఈ కేసు సులువుగా తేలిపోతుంది.  అంతే కాదు, నువ్వు చెప్పే సమాధానం  రెండొందల గ్రామాల ప్రజల జీవితాన్ని బాగు చేస్తుంది. ప్లీజ్ అంజలీ ఆలోచించు”  అభ్యర్ధనగా అన్నాడతడు.

అంజలి ఒక్క క్షణం ఏమీ మాట్లాడలేదు.  తరువాత నెమ్మదిగా అంది “చెబుతాను. మీరు  కూడా ఒక  ప్రశ్నకి సమాధానం చెప్పండి?”

“తప్పకుండా. అడుగు” అన్నాడు పాణి.

“ఆ ఫోటోలు మార్ఫింగ్ చేసినవా లేక నిజమైనవా? అబద్దమాడకుండా  గుండెల మీద చెయ్యేసుకుని చెప్పండి”

“అంజలీ నీకెలా చెప్పాలో అర్ధం కావడం లేదు. అవి మార్ఫింగ్ చేసినవి కావు. కానీ  ఆ ఫోటోలు తీసిన  పరిస్థితి నీకు తెలియ...”

అతడి మాటలు పూర్తి కాకుండానే అవతలనుంచి అంజలి ఫోన్ పెట్టేసింది.  చేతిలో ఉన్నది తన ఫోన్ అయితే విసిరి కొట్టే వాడు పాణి. అది ఇంద్రనీల ఫోన్ కావడంతో కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఫోన్ని  ఆమె చేతికి ఇచ్చేసాడు.
****
డి.ఎస్.పీ. రాజేంద్ర  ఇంట్లోని  డ్రాయింగ్ రూమ్ లో  పాణి. రాజేంద్ర కూర్చుని ఉన్నారు.  వాళ్ళ ఎదురుగా ఉన్న ఒక  కుర్చీలో  యాదగిరి కూర్చున్నాడు. 

 బయట అప్పుడే తెల్లవారుతోంది. యాదగిరికి రాత్రి తాగిన మందు మైకం ఇంకా పూర్తిగా దిగలేదు.

“చూడు యాదగిరీ... నీమీద ఏం నమ్మకమో ఏమో చనిపోయిన రాజేంద్ర వర్మగారు నీతో చాలా విషయాలు చెప్పేవారని మాకు తెలుసు.  ఆయన చనిపోయే ముందర ఈ ప్రపంచానికి చెప్పాల్సిన ఒక ముఖ్యమైన  రహస్యాన్ని చెప్పకుండా వెళ్ళిపోయారు.  అది  నీకేమైనా తెలిస్తే చెప్పు.  నువ్వు చెప్పే రహస్యం మీ రెండొందల గ్రామాల అభ్యున్నతికీ కారణమౌతుంది.  మనకి ఎక్కువ సమయం కూడా లేదు. అవతల ఆ వజ్రాల బేరం జరుగుతోంది.  నువ్వు ఎంత తొందరగా నిజం చెప్పేస్తే, ఆ వజ్రాలని చేతులు మారకుండా  కాపాడడానికి అంత అవకాశం ఉంటుంది” 

“సార్. మీరనుకుంటున్నట్టుగా రాజేంద్ర దొరగారు నాకు ఏ వజ్రాల సంగతీ చెప్పలేదు. కానీ ఒక్క విషయం మాత్రం తెలుసు.  నేను తోటలో తరచుగా పనులకి వెడుతూ ఉంటాను. ఒకసారి తోట పని చేస్తుండగా చిన్న పెట్టి భూమిలోంచి బయటపడింది.  దాన్ని నేను నేరుగా తీసుకెళ్ళి రాజేంద్ర దొరగారికి ఇచ్చేసాను. ఆయన దాన్ని తెరిచి చాలా సేపు పరిశీలించారు. అందులో వారి  పూర్వీకుల నగలు చాలా ఉన్నాయి. ఆయన అప్పుడు నాతో ఏమీ అనలేదు కానీ, తరువాత ఒకసారి నన్ను పిలిపించి  తోటలో ఆ పెట్టె దొరికిన సంగతి ఎవరితో  చెప్పద్దని అన్నారు.   అసలు రాజమహల్లో జరిగిన విషయాన్ని కంటితో చూసినది  నోటికి తెలియనివ్వను నేను.   ఎందుకో మీ మాటలు నా మీద కనికట్టు చేసినట్టుగా అనిపించింది.  మొట్టమొదటి సారిగా నోరు తెరిచాను”  అన్నాడు యాదగిరి ఎమోషనల్ గా.

పాణికి అతడి మాటలకి నిరాశగా అనిపించింది. అనుకున్నంతా అయింది.  అతడి దగ్గర తనకి ఉపయోగపడే  కొత్త సమాచారం ఏమీ దొరకలేదు.   అప్రయత్నంగా అతడు వాచీ చూసుకున్నాడు. ముంబై ఫ్లైటుకి ఇంకా ఆరు గంటలే సమయం ఉంది !!

అసహనంగా గదిలో పచార్లు చేస్తున్న అతడు ఏదో గుర్తొచ్చినట్టుగా ఆగి అన్నాడు “నిన్ను నిజామాబాద్ వెళ్ళి బార్ లో తాగి పడుకోమన్నది సురేష్ వర్మగారు కదూ?!”

యాదగిరి తడబడుతున్నట్టుగా చూసి తల దించుకున్నాడు.

“నిజం చెప్పు?” గద్దిస్తున్నట్టుగా కాక అర్ధిస్తున్నట్టుగా అన్నాడు పాణి.

“అవునండీ” ఒప్పుకున్నాడు యాదగిరి.

“ఎందుకు?”

“రాజా వారు చనిపోవడాన్ని నేను తట్టుకో లేక పోతున్నానని జాలితో పంపించారు”

“అబద్దం”

“నాకు అంత కన్నా ఏమీ తెలియదు సారూ”  యాదగిరి భరించలేనట్టుగా రెండు చేతులతో తల పట్టుకుని మోకాళ్ళలో తల పెట్టుకున్నాడు.

“యాదగిరీ... రాజ వంశానికి ద్రోహం చెయ్యకూడదన్న అంకిత భావం నీ రక్తంలో జీర్ణించుకు పోయి ఉంది.   నేను తప్పు పట్టడం లేదు. కానీ, నువ్వు పుట్టి పెరిగిన నీ గ్రామానికీ, అలాంటి రెండొందల గ్రామాలని బాగు చెయ్యాలన్న రాజా రాజ్ బహదూర్ రాజేంద్ర వర్మ గారి ఆశయం గురించి నువ్వు మర్చిపోతున్నావు.  నీకు తెలిసిన ఏ విషయమైనా నాకు చెప్పడం వల్ల  నీకూ మీ గ్రామానికీ మేలే తప్ప కీడు జరగదు” 

ఒక్క క్షణం తరువాత యాదగిరి నెమ్మదిగా తలెత్తాడు.  అతడి కళ్ళు ఎర్రగా ఉన్నాయి. కళ్ళనిండా నీరు.   ఏదో చెప్పడానికి సమాయత్తమౌతున్నట్టుగా నెమ్మదిగా గొంతు విప్పాడు.  పాణీ,  ప్రసాద్ ఎంత నిశ్శబ్దంగా అయిపోయారంటే,  గదిలోని గోడ గడియారంలోని సెకన్ల ముల్లు చేసే శబ్దం కూడా వాళ్ళకి  స్పష్టంగా వినిపిస్తోంది.  యాదగిరి చెప్పడం మొదలు పెట్టాడు.


 (యాదగిరి చెప్పబోయే ఆ నిజాలేంటి? కథలోని క్లిష్టమైన మలుపుల్ని చేధించడానికి అవి పాణికి ఏ విధంగా సహకరించబోతున్నాయి?????తెలుసుకోవాలంటే వచ్చేవారం దాకా ఆగాల్సిందే........ఈ సస్పెన్స్ వచ్చేవారాం దాకా కొనసాగాల్సిందే..........)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్