గత సంచిక లోని నాదైన ప్రపంచం సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండిhttp://www.gotelugu.com/issue220/616/telugu-serials/naadaina-prapancham/nadaina-prapancham/
( గతసంచిక తరువాయి ).. సముద్రాన్ని అంత దగ్గరగా చూడగానే ఉత్సాహంతో పొంగి పోయింది కీర్తన.
‘‘ఎంత బావుందో!’’ ఆనందంతో మొహం వెలిగి పోతుండగా అంది. ఇసుకలో నడుస్తుంటే పాదాలు లోపలికి కూరుకు పోతున్నాయి. అడుగులు ఎత్తెత్తి వేయాల్సి వస్తోంద.
ఎంత తొందరగా నీళ్ళ లోకి పరుగెడదామనుకుంటే అంత ఆలస్యమై పోతోంది.
పొడి ఇసుకలో కూర్చుండి పోయాడు ఆకాష్.
‘‘మీరు నీళ్ళలోకి రారా!’’
‘‘ఊహూ! దూరంగా కూర్చుని చూడటమే నాకిష్టం’’ చెప్పాడు.
‘‘మరి నేనూ?’’ నిరుత్సాహంగా అంది.
‘‘మీరు వెళ్ళండి’’ చెప్పాడు.
అతనా మాట అనగానే శాండిల్స్ అక్కడ విడిచి పెట్టి రివ్వున నీళ్ళ లోకి పరిగెత్తింది. చుడీదార్ కొంచెం పైకి పట్టుకుంది. తెల్లని పాదాలు కలువ పువ్వుల్లా ముద్దొస్తున్నాయి.
చల్లని పిల్ల కెరటం వచ్చి పాదాల్ని స్పృశించగానే ఒళ్ళంతా పులకించి పోయింది.
కెరటాలు ఒడ్డుతో సయ్యాటలాడుతుంటే ఆమె పాదాలు కెరటాల్ని కవ్విస్తున్నాయి.
‘‘ఇంకొంచెం లోపలికి వెళ్ళనా?’’ ఆమె ప్రతి దానికి చిన్న పిల్లలా తన మీద ఆధార పడి అడుగుతుంటే హృదయం పొంగి పోయింది.
‘‘మరీ లోపలికి వెళ్ళకండి’’ గట్టిగా అరిచి చెప్పాడు. తలాడించింది.
కాసేపు కెరటాలతో ఆడిన తర్వాత ఫొటోలు దిగుతానంటూ అక్కడ వున్న రాళ్ళ మీదకి ఎక్కి నిల్చుంది.
నిరంతరం కెరటాల తాకిడికి రాళ్ళు నున్నగా మారాయి. పాకుడు కూడా పట్టేసింది.
రెండు మూడు యాంగిల్స్‌లో ఫొటోలు తీశాడు. జన సమర్ధం దూరంగా వుండటం చేత ఆ ప్రాంతమంతా ప్రశాంతంగా వుంది.
‘‘ఇంకో ఫొటో ఆ పై రాయి మీద దిగుతాను’’ అంటూ పైకి వెళుతోంది కీర్తన.
‘‘జాగ్రత్త...మరీ పైకి వెళ్ళకండి’’ హెచ్చరించి తల తిప్పాడు. దూరంగా సూర్యుడు కుంగి పోతూ సగం సూర్యుడు కనిపిస్తుంటే అటే చూస్తుండి పోయాడు ఆకాష్.
పై రాతి మీదకు వెళుతున్న కీర్తన రాతి నున్నదనానికి బాలెన్స్ చేసుకో లేక జారి పోయింది. కెవ్వుమంటూ అరచి నీళ్ళలో పడి పోయింది.
కీర్తన అరుపుకి ఉలిక్కి పడి తిరిగి చూశాడు ఆకాష్. నీళ్ళలో ఉక్కిరి బిక్కిరి అవుతోంది కీర్తన.
మరీ లోపలికి వెళ్ళ లేదు. కానీ, సడన్‌గా రాళ్ళ మీద నుంచి పడటంతో కంగారు పడి పోయింది.
దానికి తోడు ఆమె ఎప్పుడూ మోకాలి లోతు కూడా నీళ్ళ లోకి వెళ్ళ లేదు. అలాంటిది ఒకే సారి ఛాతీ లోతు కెరటాల్లో మునిగే సరికి ఆమె ఉక్కిరి బిక్కిరి అయి పోతోంది. చూడ్డం తోటే షాక్ తిన్నాడు ఆకాష్. గబ గబా పరిగెడుతూ కీర్తన వైపు వెళ్ళాడు. ఈదాల్సినంత అవసరం కూడా లేదు.
ముందు చెయ్యి పట్టుకుని లేపి నిల్చోబెట్టాడు. గజ గజ వణుకుతూ అతన్ని హత్తుకు పోయింది.
‘‘ఏం ఫర్లేదు. ఏమీ కాలేదు....’’ నీళ్ళ లోంచి బయటికి తీసుకు వస్తూ అన్నాడు.
నోట్లోకి, ముక్కు లోకి వెళ్ళడానికి ప్రయత్నించిన నీటిని అప్పటి వరకూ రెసిస్ట్ చెయ్యడంతో వూపిరి సరిగ్గా అందక విపరీతమైన దగ్గు వచ్చింది.ఒక చేత్తో పొదివి పట్టుకుని ఇంకో చేత్తో వీపు మీద రాస్తూ బయటికి తీసుకుని వచ్చాడు.త, ఒళ్ళు మొత్తం తడిచి పోయింది. తనుంచి నీరు ధారాపాతంగా కారుతోంది.
ఆకాష్ కూడా సగం వరకూ తడిచి పోయాడు. బయటికి రాగానే పొడి యిసుకలో కూర్చుండి పోయింది కీర్తన. ఆకాష్ కూడా పక్కనే కూర్చున్నాడు.
భుజం చుట్టూ చేతిని మాత్రం తియ్యలేదు. తడి బట్టకి ఇసుక అంటుకుంది. దులుపుకునే ధ్యాస కూడా లేదు.
ఒక్కళ్ళిద్దరు తప్ప పెద్దగా జన సంచారం లేదు. ఉన్నా ఎవరి ధ్యాసలో వాళ్ళున్నారు. కనుచీకట్లు ముసురుకుంటున్నాయి.ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు కీర్తన. అంత పెద్ద రాళ్ళ మీద నుంచి నీళ్ళలో పడటం, అలల్లో చిక్కుకుని తను ఉక్కిరి బిక్కిరి కావడం, అంతా తలచుకుంటేనే భయంగా వుంది. ఒక్క సారిగా ఒళ్ళు జలదరించింది.
కన్సోలింగా భుజం మీద తట్టాడు. అప్పుడు ఇహ లోకం లోకి వచ్చి ఆకాష్ వంక చూసింది. చిన్నగా నవ్వాడు.
ఇతనే తన ప్రాణాలు కాపాడాడు. ఇతను రాకపోతే ఆ అలల్లో పడి తను కొట్టుకు పోయేదే!
‘చచ్చి పోతాననుకున్నాను’ గొంతు పెగల్చుకుని అంది.
‘‘ఎందుకు?’’
‘‘ఏమో! ఆ నీళ్ళలో అలా కెరటాలు అసలు నన్ను పైకి లేవనీయ లేదు. నాకు స్విమ్ చేయడం రాదు అనుకోగానే మరింత పేరలైజ్ అయి పోయాను. భయం వేసింది’’ గువ్వలా ముడుచుకుంటూ అంది.
చేతితో మరింతగా హత్తుకున్నాడు. ఆమెకి ఏమీ అభ్యంతరం చెప్పాలనిపించ లేదు. అతని భుజం మీద నిస్సంకోచంగా తల వాల్చింది.
నేనుండగా ఎందుకు భయం?’’ మంద్ర స్వరంతో అన్నాడు. చెవి పక్కనే అతని మెల్లని మాటలు ఎంతో ధైర్యాన్నిచ్చాయి.
‘‘నిజమే! ఈసారి భయ పడను’’ సమాధానం చెప్పింది.
పక పకా నవ్వాడు. తనేమందో గుర్తొచ్చి నాలుక్కరుచుకుంది.
‘‘ఇంత అమాయకమైన దానివి ఎలా బతుకుతావు?’’ మృదు స్వరంతో అన్నాడు. ప్రేమతో అతన్నుంచి ఏక వచనంలో మాట వచ్చిందని ఇద్దరూ గమనించలేదు.
‘‘ఇంటి దగ్గర అన్నయ్య, టూర్స్‌కి వచ్చినప్పుడు మీరూ ఎప్పుడూ పక్కనే వుంటారుగా, ఇంకేంటి భయం?’’ ధీమాగా అంది.
‘‘నేనా? ఎప్పుడూ వుంటానని ఏంటి నమ్మకం?’’
ఆమె కళ్ళు బాధతో రెపరెపలాడాయి. ‘‘పోనీ అప్పుడప్పుడు’’ అతి కష్టం మీద అంది.
నిట్టూర్చాడు. కీర్తనకి భయంగా అనిపించింది. అతనికి ఇలా మరింత దగ్గరగా జరిగింది. నమ్మ లేక పోయాడు. ఈ అమ్మాయి తన మీద ఇలా ఆధారపడుతుందని అసలు నమ్మ లేక పోతున్నాడు.
అతను టాపిక్ మార్చాడు.
‘‘పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు?’’
‘‘నేనా... పెళ్ళా...? ఎప్పుడూ ఆలోచించలేదు. వాలీ బాల్‌కి దూరమవ్వాల్సి వస్తే దేనినీ నేను యాక్సెప్ట్ చేయను.
మీతో నేను ఇంతసేపు మాట్లాడుతున్నానంటే వాలీ బాల్ మీకు అభిమాన పాత్రం కావడం. మీరు నా చిన్నప్పటినుంచీ నా గేమ్‌ని చూడటం. ముందు నుంచీ నాకు మీరంటే అందుకే యిష్టం.’’
‘‘అంటే నేనెలాంటివాడినైనా, దొంగనైనా, హంతకుడినయినా, వాలీ బాల్ గేమ్‌ని లైక్ చేస్తే చాలా? ఇక మనుషుల్లో ఏ గుణాలు నీకు పనికి రావా?’’ కించిదావేశంతో అన్నాడు.
కాసేపు ఆలోచనలో పడి, ‘‘మిగతా వాళ్ళ సంగతేమో కానీ మీరు అలాంటి వారు కాదు. చాలా మంచి వారు’’ నిదానంగా అంది.
‘‘ఒక వేళ అలా అయితే?....’’
‘‘అలాంటి వారు కానప్పుడు ఎందుకు డిస్కషన్?’’
అతను మౌనంగా వుండి పోయాడు. మొహం పక్కకి తిప్పుకున్నాడు. పక్క నుంచి కూడా అతని మొహంలో సీరియస్ నెస్ కనబడుతోంది.
‘‘ఏమయింది?’’ మెల్లగా అడిగింది.
కెరటాల ఘోషని వింటున్న వాడల్లా తేరుకుని ‘‘ఆలోచిస్తున్నాను’’ అన్నాడు.
‘ఏంటని’ అడగ లేదు. ఏంటో ప్రతి విషయం ఇంత గంభీరంగా, యింత లోతుగా ఆలోచించడం తనకి రాదు.
‘‘నేనేదన్నా తప్పు మాట్లాడితే సారీ...!’’ చిన్నబుచ్చుకున్న మొహంతో అంది.
ఆమె మొహం వంక చూశాడు. చీకటీ, దూరంగా వున్న లైట్లు మసక వెలుగులో ఆమె భావాలు సరిగా కనిపించ లేదు.
తడిసిన బట్టలకి సముద్రపు గాలి తోడయి చలి వణికిస్తోంది. ‘‘చాలా చలిగా వుంది’’ అతని మోచేతి పైన రెండు చేతుతో చుట్టి వేస్తూ అంది.
‘‘వెళ్ళి పోదామా?’’ లేవ బోయాడు.
‘‘వద్దు’’ అతని చేతిని వదలకుండా అంది.
‘‘జులుబు చేస్తుంది.’’
‘‘మీతో వుండానిపిస్తోంది’’ మెల్లగా అంది.
తల కొంచెం పక్కకి జరిపాడు.
ఆమె ముక్కూ, చెంపలు తాకాయి. గబుక్కున తల తిప్ప బోయాడు. కానీ అయస్కాంతం వేసినట్లు మొహం పక్కకి జరగ లేదు.
కీర్తనకి ఆశ్చర్యంగా వుంది. అతనితో యింత సన్నిహితంగా వుండటం. ఏం జరగ బోతోంది....!?
ఆ చీకట్లో అతని పెదాలు వెతుకులాట ప్రారంభించాయి. సంపంగి మొగ్గలాంటి నాసిక మొదటి టార్గెట్ అయింది. కలువ రేకుల్లాంటి కళ్ళు అరమోడ్పులవ్వక తప్ప లేదు. గోదావరీ తీరం లాంటి నుదురు ధన్యమయింది. చెంపలు కెంపులవడం చీకటి మూలంగా తెలిసే అదృష్టం లేదు.
చివరికి దొరికింది అసలయిన నిధి. మృదువుగా పెదవులతో ఆమె పెదాలను బ్రష్ చేశాడు ఆకాష్.
ఊపిరి భారంగా మారింది కీర్తనకి. యింకా ఏదో కావాలని శరీరాలు కోరుతున్నాయి. యింతందమైన అనుభూతిని గురించి చాలా మంది సర్కాస్టిగ్గా కామెంట్ చేస్తారెందుకు?
అతని చేయి మరింత ఎడ్వాన్సవుతుండగా చటుక్కున స్పృహ వచ్చిన దానిలా తేరుకుని, అతని చేతిని పట్టుకుని ఆపేసింది. అప్పటికే తొలి సారిగా పురుష స్పర్శ రేపిన సందడిలో మత్తుగా సోలి పోతోంది వయసు.
అతని స్పర్శ నుంచి విడివడటం అంటే శరీరాన్ని సగం కోసి యివ్వాలన్నంత బాధగా వుంది.
‘‘ప్లీజ్! వన్‌మోర్’’ అతని గొంతు కూడా మగ సిరిని నింపుకున్నట్లుగా వుంది.
‘‘వద్దు....’’ రెసిస్ట్ చేసింది. |