Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

అతడు..ఆమె ఒకరహస్యం

atadu .. aame..oka rahasyam

గత సంచిక లోని అతడు-ఆమె-ఒక రహస్యం సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి ...http://www.gotelugu.com/issue222/620/telugu-serials/atadu-aame-oka-rahasyam/atadu-aame-oka-rahasyam/

 

గతసంచిక తరువాయి )..

“బంగారు లక్ష్మీ నేను ఒకే రకం మొబైల్ ఫోన్ లని  ఒకే సారి కొనుక్కున్నాం. మొబైల్ ఎప్పుడైనా పోతే ట్రాక్ చెయ్యడానికి దానికుండే EMIE ( International Mobile Equipment Identity )  అనే పదిహేనంకెల నెంబర్ లని మేము ఒకళ్ళ నెంబరు ఒకరి సెల్లోనూ సేవ్ చేసుకున్నాం.  నా సెల్లో సేవ్ చేసుకున్న ఆమె మొబైల్ తాలూకు EMIE నెంబర్ ద్వారా ఆమె మొబైల్ ఎక్కడ ఉందో ట్రాక్ చేసాను. గూగుల్ సెర్చ్ లో ఆమె మొబైల్ సిర్నాపల్లిలో ఉందని తెలిసింది. స్విచాఫ్ చేసి ఉన్నా బ్యాటరీ బయటికి తియ్యక పోతే, దాని నుంచి వెలువడే సిగ్నల్స్ వల్ల మొబైల్ ఎక్కడ ఉందో కచ్చితమైన లొకేషన్ తెలుస్తుంది”

ఆమె మాటలనీ, ఆ కేసుని సాల్వ్ చెయ్యాలని ఆమె పడుతున్న తాపత్రయాన్ని చూస్తుంటే, పాణికి ఆమెకి ఈ నేరంతో ఎటువంటి సంబంధం లేదన్న నమ్మకం మరింత బలపడుతోంది. తాము  అనవసరంగా ఆమెని అనుమానిస్తున్నారేమో అని గిల్టీగా అనిపించింది.

“నిజమే. కానీ మీరు చెప్పిన దాని ప్రకారం సిర్నాపల్లి అని కాక ఆ సిర్నాపల్లిలో  ఆమె ఎక్కడ ఉందో కచ్చితమైన లొకేషన్ కూడ తెలుస్తుంది. అది తెలిసిందా? తెలిస్తే ఆమెని పట్టుకోవడం మరింత సులువవుతుంది మనకి” అడిగాడు పాణి.

“అది కూడా తెలిసింది”  చెప్పింది ఇంద్ర నీల.

“తెలిసిందా? ఎక్కడ?”  ఉత్సుకతగా అన్నాడు.

“సిర్నాపల్లిలోని  సీతా రామా రైస్ మిల్లులో. మరొక విషయం.  హైదరాబాద్ లో ఉండే మా మరో స్నేహితురాలికి ఫోన్ చేసి  బంగారు లక్ష్మి ఇంటికి పంపించాను. ఆమె అక్కడికి వెళ్ళి మరింత ఆసక్తికరమైన సమాచారాన్ని  ఇచ్చింది.  బంగారు లక్ష్మి ఇల్లు బయటి నుంచి తాళం వేసి లేదు.  ఆటోమేటిక్ లాక్ ఉన్నడోర్ కావడంతో అందరూ లాక్ వేసి ఉందని అనుకున్నారట.  తెరిచి ఉన్న తలుపు లోంచి లోపలకి వెళ్ళిన ఆమెకి ఇంట్లో అంతా  గందరగోళంగా, ఏదో దాడి జరిగిన ఆనవాళ్ళు కనిపించాయట. దీన్ని బట్టి  చూస్తే ఆమెని ఎవరో బలవంతంగా  అక్కడ్నించి ఎత్తుకెళ్ళి సిర్నాపల్లి తీసుకెళ్ళినట్టు తెలుస్తోంది”

ఆ మాటలతో పాణికి అప్పటి దాకా ఆమె మీద ఉన్న అనుమానాలన్నీ పటాపంచలై పోయాయి. “అర్ధమైంది” అన్నాడు.ఏమిటన్నట్టుగా చూసారు  ప్రసాద్, ఇంద్ర నీల అతడి వంక.

“రాజేంద్ర రాసిన సూసైడ్  నోట్ లో  వజ్రాల గురించి రాసి, ఆ వజ్రాలు హైదరాబాద్ లో ఎక్సైజ్ డిపార్టుమెంట్ లో ఉన్న బంగారు లక్ష్మి దగ్గర ఉన్నాయని రాసాడు.  సూసైడ్ నోట్ లో ఉన్న ఆ వాక్యాలని ఎరేజ్ చేసిన వాళ్ళే వజ్రాల ఆచూకీ తెలుసుకోవడం కోసం  బంగారు లక్ష్మిని  కిడ్నాప్ చేసి సిర్నాపల్లి తీసుకు వచ్చారు”

“అయి ఉండచ్చు. కానీ అసలు బంగారు లక్ష్మికి రాజేంద్ర ఎలాంటి వజ్రాలనీ ఇవ్వ లేదు కదా? అలా ఎందుకు రాసినట్టూ?” అనుమానంగా అంది ఇంద్ర నీల.

“రాజేంద్ర తనకి వజ్రాలని ఇచ్చిన విషయం ఆమె మీతో చెప్పి ఉండక పోవచ్చు కదా?” అన్నాడు పాణి.

“అసంభవం. ఆమె నా దగ్గర ఏ విషయాన్నీ దాచదు”

“అదే నిజమైతే, ఈ కేసులో నా పని ఇంకా చాలా ఉంటుంది”

“అంత కన్నా ముందు అసలు బంగారు లక్ష్మిని కిడ్నాప్ చేసినదెవరో కనిపెట్టాలి కదా?” అన్నాడు ప్రసాద్.  అతడా మాటలంటుండగా పాణి సెల్ రింగయింది.

సెల్ మీద కనిపిస్తున్న పేరుని  సంభ్రమంగా చూసాడు పాణి.  వెంటనే ఫోన్ ఎత్తి “చెప్పు అంజలీ” అన్నాడు ఆనందంగా.

“సెల్ ఫోన్లో నాకు వచ్చిన ఫోటోలు సిర్నాపల్లి నుంచి వచ్చాయి.  ఫోటోలని నాకు పంపుతున్నప్పుడు ఆ సెల్ ఫోన్ ఎక్కడ ఉందో  ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా తెలిసింది” అంటూ చెప్పింది.

“నా మాట నమ్మావు. చాలా థాంక్స్ అంజలీ” సంతోషంగా అన్నాడు పాణి.

“నేను ఈ సమాచారాన్ని మీకు ఇస్తున్నది ‘మీ మాటలని నమ్మి’ కాదు. నేను చెప్పే సమాధానం రెండొందల గ్రామాల ప్రజల జీవితాన్ని బాగు చేస్తుందన్నారని చెప్పాను”

పాణి తల కొట్టుకున్నాడు. “ఏదేమైనా  థాంక్స్ అంజలీ. నిజంగా నువ్వు చెప్పిన సమాచారం రెండొందల గ్రామాల ప్రజల జీవితాన్ని బాగు చేస్తుంది. అవునూ, ఇంతకీ ఈ విషయాన్ని ఎలా తెలుసుకున్నావు?  ఆసక్తిగా అడిగాడు.

“ఆరేళ్ళుగా మీతో సావాసం చేస్తున్నాను. ఆమాత్రం డిటెక్షన్ నేనూ చెయ్యగలను. అడగ్గానే సమాచారాన్ని వెతికి పెట్టి ఇవ్వగల  స్నేహితులు మీకే కాదు, నాకూ ఉన్నారు” కసిగా అని ఫోన్ పెట్టేసింది అంజలి.

“నేనూ సుప్రియా క్లోజ్ గా ఉన్న ఫోటోలు అంజలికి పంపి నన్ను ముంబై వెళ్ళేలా చేయాలని  ప్రయత్నించింది కూడా సిర్నాపల్లి గ్రామలోని సీతారామా రైస్ మిల్లు నుంచే నట.  సో, ఈ కేసులో అనుమానితులు అక్కడే ఉన్నారని మరోసారి కన్ ఫర్మ్ అయింది. నేను వెంటనే  సిర్నాపల్లిలో ఉన్న ఆ రైస్ మిల్లు దగ్గరకి వెళ్ళాలి”  చెప్పాడు పాణి  వాళ్ళీద్దరికీ.

“మనం వెంటనే అక్కడికి వెళ్ళాలి.  మాతో పాటూ నువ్వూ రా.  ఇద్దరు ఎస్సైలనీ,  నలుగురైదుగురు కానిస్టేబుళ్ళనీ కూడా మనతో రమ్మను. క్విక్...”  ప్రసాద్ తో అన్నాడు పాణి.

****

“సుప్రియా... మీకొక విషయం చెప్పాలి”  బయలు దేర బోయే ముందర  అన్నాడు పాణి.

“ఏమిటి?”

“మీరు వెదుకుతున్న మీ స్నేహితురాలు రత్నమాల ఈ లోకాన్ని విడిచి వెళ్ళి పోయింది”

ఇంద్ర నీల స్థాణువులా ఉండి పోయింది అతడి మాటలకి. “ఏమిటి మీరు మాట్లాడుతున్నది? నిజం చెప్పండి” అంది కళ్ళు పెద్దవిగా చేసి అంది.

“నేను నిజమే చెబుతున్నాను ఇంద్ర నీల గారూ, నాకూ ఇప్పుడే తెలిసింది. ఈ వార్త మిమ్మల్ని బాధ పెడుతుందని తెలుసు. అయినా చెప్పక తప్పడం లేదు” అంటూ ఇన్వెస్టిగేషన్ లో యాదగిరి చెప్పిన విషయాలని చెప్పి అన్నాడు “మీరు రాజేంద్ర  గదిలో చూసిన ఉంగరం అతడికి తోటలో దొరికినదే అయి ఉంటుంది. ఆ ఉంగరాన్ని బట్టే అతడికి  రత్నమాల హత్య చెయ్యబడ్డ విషయం తెలిసి ఉంటుంది. రాజేంద్ర ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ప్రియురాలు రత్నమాల  హత్య చేయ బడటం. అదీ తన సొంత మనుషులతో.  సూసైడ్ నోట్ లో అతడు రాసిన ‘ముల్లు...కాలిలో గుచ్చుకుంటే ఓర్చుకో వచ్చు చేతిలో గుచ్చుకుంటే తీసుకో వచ్చు, కానీ గుండెలో గుచ్చుకుంటే మాత్రం  భరించడం కష్టం’ అన్న వాక్యాలు తన తాత గారినీ సురేష్ వర్మ గారినీ ఉద్దేశించి రాసినవే అని అర్ధం అవుతోంది”

ఇంద్ర నీల ఉన్నట్టుండి కుప్ప కూలి పోయింది. మోకాళ్ళలో ముఖం దూర్చి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉండి పోయింది.  ఏ స్నేహితురాలి కోసమైతే తాను ఇంత కష్ట పడి ఇక్కడికి పోస్టింగు వేయించుకుని మరీ వచ్చిందో...  ఏ స్నేహితురాలి కోసమైతే తాను ఇంత  రిస్కు తీసుకుని  పరిశోధన చేస్తోందో...  ఆ స్నేహితురాలు ఈ లోకం లోనే లేదని తెలిసాక ఆమె చాలా సేపు  మామూలు మనిషి కాలేక పోయింది.

“మీరు ఇలా బాధపడుతూ కూర్చుంటే లాభం లేదు. మనం చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి.  ముఖ్యంగా మీ మరో స్నేహితురాలు బంగారు లక్ష్మిని కాపాడుకోవాలి”  అన్నాడు పాణి ఆమెని ఓదారుస్తున్నట్టుగా.

అతడి మాటలకి  కళ్ళు తుడుచుకుని లేచి నిల బడింది ఇంద్ర నీల.  అందరూ కారు ఎక్కారు.

కారు వెడుతున్నంత సేపూ ఎవరూ ఏమీ మాట్లాడ లేదు. ఎవరి ఆలోచనల్లో వాళ్ళూ ఉన్నారు.  ఇంద్ర నీల కిటికీలోంచి  బయటికి చూస్తూ మధ్య మధ్యలో కళ్ళు తుడుచుకుంటోంది.

కారు సిర్నాపల్లిని సమీపిస్తుండగా తన సెల్ ఫోన్ లో వచ్చిన  మెసేజ్ చదివి అన్నాడు ప్రసాద్ “సిర్నాపల్లిలో ఉన్న సీతారామా రైస్ మిల్ గురించి ఎంక్వైరీ చేసాను.  పదెకరాల స్థలంలో నిర్మించిన జిల్లాలో కెల్లా అతి పెద్దదైన ఆ రైస్ మిల్లు సురేష్ వర్మకి చెందినది! అంత పెద్దదీ ఫేమస్ అయినదీ కనుకే ఆ మిల్లు మొబైల్ ట్రాకింగ్ చేసినప్పుడు గూగుల్ మ్యాప్ లో పేరుతో సహా వచ్చింది” 

“అంటే... వజ్రాల కోసం సూసైడ్ నోట్ ని ఆల్టర్ చేసినదీ, బంగారు లక్ష్మిని కిడ్నాప్ చేసినదీ సురేష్ వర్మా? అందుకేనా అతడు మనల్ని చూసినప్పుడల్లా భయ పడింది?” అంది ఇంద్రనీల.

“కాదు!!” అన్నాడు పాణి.

ప్రసాద్, ఇంద్రనీల ఆశ్చర్యంగా చూసాడు అతడి మాటలకి.  వాళ్ళింకా ఏదో అడిగే లోగానే ఇంకేదో ఆలోచన వచ్చినట్టు  “ఛ... ఇంత చిన్న విషయం నాకు నిన్నటి నుంచీ ఎందుకు తట్టలేదు?” తనలో తాను అనుకుంటున్నట్టుగా పైకే అంటూ మొబైల్ ఫోన్ తీసి  రాజ మహల్ నెంబరుకి రింగ్  చేసాడు.

ఫోన్ ఎత్తిన నౌకరుతో  “ఒక సారి వంట మనిషి నరసింహని పిలుస్తారా?” అని అడిగాడు.

రెండు నిమిషాల తరువాత నరసింహ లైన్ లోకి వచ్చాడు.

పాణికి సడెన్ గా గుర్తొచ్చిన విషయం, వంటవాడు నరసిమ్హ చెప్పబోయే విషయమ ఏమిటి??????

ముగింపు వచ్చే సంచికలో.......

 

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
nadaina prapancham