గత సంచిక లోని అతడు-ఆమె-ఒక రహస్యం సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి .http://www.gotelugu.com/issue221/619/telugu-serials/atadu-aame-oka-rahasyam/atadu-aame-oka-rahasyam/
( గతసంచిక తరువాయి )..“ఒక రోజు ఉదయం నేను తోటలో పని చేస్తుంటే రాజేంద్ర బాబు గారు అక్కడున్న ఒక బెంచీ మీద కూర్చుని పుస్తకం చదువుకుంటున్నారు. ముందు రోజు ఈదురు గాలీ వానతో పెద్ద వర్షం పడింది. తోటలో కొన్ని సీతా ఫలం చెట్లు మొదలంటా కూలి పోయి ఉన్నాయి. వాటిని సరి చేస్తూ, పూర్తిగా కూలి పోయిన చెట్లని పక్కకి తోస్తున్నాను నేను. మొదలంటా కూలి పోయిన ఒక చెట్టుని పెకిలిస్తుండగా బయటకి వచ్చిన మట్టి పెళ్ళ ల్లోంచి కనిపించిన దాన్ని చూసి నేను భయంతో గట్టిగా కేక పెట్టాను...
ఆ మట్టి పెళ్ళల మధ్యన మోచేతి వరకూ నరికేసిన ఒక చెయ్యి ఎప్పుడో భూమిలో పాతి పెట్ట బడినది వేళ్ళాడుతూ కనిపిస్తోంది !!
నా అరుపులకి పుస్తకం పక్కన పడేసి పరిగెత్తుకుంటూ వచ్చారు రాజేంద్ర బాబు గారు. అక్కడికి వచ్చి ఆ చెయ్యి వంక పరిశీలనగా చూసిన ఆయన నాకన్నా ఎక్కువగా షాక్ తిన్నారు. మామూలు మనుషులు దగ్గరగా కూడా నిలబడలేని అలాటి ప్రదేశంలో ఉన్నట్టుండి కూలబడి పోయారు. నేను అయన్ని విస్తు పోయి చూస్తుండగా సగం కుళ్ళిన ఆ చేతిని ఆయన తన చేతిలోకి తీసుకున్నారు. ఆ చేతి మీద ప్రేమగా నిముర్తుతూ వేలికి ఉన్న వజ్రపుటుంగరం వంక తదేకంగా చూసారు.
ఆయన ప్రవర్తనకి నేను ఆశ్చర్యం లోంచి తేరుకునే లోపలే చిన్న పిల్లాడిలా భోరు భోరు మని విలపించారు. ‘నా జీవితానికి ఇంక ఏ ఆశా లేదు. నాకింక ఏ ఆశయం లేదు’ అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడారు. నేను ఎంత వారిస్తున్నా అక్కడ్నుంచి కదల లేదు. చాలా సేపటి తరువాత తేరుకుని ఆ ఉంగరాన్ని తీసుకుని చెయ్యిని మట్టిలో కప్పెట్టేసారాయన. ఆ తరువాత రాజేంద్ర బాబు చాలా రోజులు పిచ్చి వాడిలా తిరిగారు. ఎప్పుడూ ఉత్సాహానికి చిరునామాలా ఉండే చిన్న రాజా వారిని అలా చూడడం జీవితంలో మొదటి సారి నాకు. ఆయన్నాలా చూస్తుంటే నాకు కూడా పిచ్చెక్కినట్టుగా అనిపించింది”
తను వింటున్నదాన్ని అర్ధం చేసుకోవడానికి పాణికి పాణికి కొద్ది క్షణాలు పట్టాయి. “ఆ చెయ్యిని చూడగానే రాజేంద్ర ఎందుకలా అయి పోయాడు? అది ఎవరిది?” అన్నాడు.
ఒక్క క్షణం ఆలోచిస్తున్నట్టుగా మౌనంగా ఉండి తరువాత ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా చెప్పడం మొదలు పెట్టాడు “రాజేంద్ర బాబు గారు ఎప్పుడూ నాతో చెప్ప లేదు కానీ, ఆయనకి రత్న మాలా దేవి గారనే ఒక ప్రియురాలు ఉండేదని నాకు తెలుసు. ఆ రోజు కనిపించిన ఆ చెయ్యిని చూసి ఆయన అంతలా తల్లడిల్లి పోవడాన్ని బట్టి నాకు ఆ చెయ్యి రత్నమాలా దేవి గారిదని అర్ధమయింది. అది అక్కడికెలా వచ్చిందో, ఆమెని చంపినదెవరో మాత్రం వెంటనే అర్ధం కాలేదు”
“తరువాత ఏం జరిగింది?”
“ఆ తరువాత రాజేంద్ర బాబు గారు బంగళాలో పని చేసే ప్రతి ఒక్కరినీ పేరు పేరునా రహస్యంగా పిలిపించి, వారితో తన నెత్తి మీద చెయ్యి వేయించుకుని నిజం చెబుతానని ప్రమాణం చేయించుకుని తనకి తెలియకుండా రత్న మాలా దేవి గారు సిర్నాపల్లి ఎప్పుడు వచ్చారో చెప్పమని అడిగారు. చివరికి ఒక డ్రైవరు రాజేంద్ర గారు ఊర్లో లేని సమయంలో ఒక రోజు నరేంద్ర వర్మ గారూ, సురేష్ వర్మ గారూ రత్న మాలా దేవి గారిని రాజేంద్ర బాబు రమ్మన్నారని చెప్పి హైదరాబాద్ నుంచి తీసుకు రమ్మని చెబితే, రాత్రికి రాత్రి వెళ్ళి అవిడని తీసుకు వచ్చానని, ఆవిడని తీసుకొచ్చి కోటలో దింపాననీ, తరువాత ఏం జరిగిందో తనకి తెలియదనీ చెప్పాడు. అతడి మాటలకి రాజేంద్ర బాబు గారు రత్న మాలా దేవి గారు చని పోయారని తెలిసినప్పటి కన్నా ఎక్కువ షాక్ తిన్నారు.
నోట మాట పడి పోయినట్టుగా అలా ఉండి పోయారు. ఆ రోజు తరువాత ఆయన కోట లోనూ, బయటా నోరు విప్పి ఎవరి తోనూ మాట్లాడడం నేను చూడలేదు. అది జరిగిన రెండు రోజులకే ఆయన ఆత్మ హత్య చేసుకున్నారని కోట నుంచి కబురు వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చాను” కళ్ళల్లో నీరు తిరుగుతుండగా అన్నాడు యాదగిరి.
ఏడుస్తున్న యాదగిరి భుజమ్మీద ఓదారుస్తున్నట్టుగా చెయ్యి వేసాడు పాణి. “సరే, నువ్వు వెళ్ళి ప్రస్తుతం ఉంటున్న హోటల్ గది లోనే ఉండు. నేను చెప్పే వరకూ సిర్నాపల్లి రావద్దు” అన్నాడు.
యాదగిరి తలూపి బయటికి వెళ్ళి పోయాడు. అతడు వెళ్ళిన వెంటనే పక్క గదిలో ఉన్న ఎస్సైని పిలిచి చెప్పాడు ప్రసాద్ “మన కానిస్టేబుళ్ళిద్దరిని మఫ్టీలో అతడు ఉంటున్న రూమ్ దగ్గర కాపలా ఉంచండి”
అతడు వెళ్ళి పోయాక దీర్ఘంగా నిట్టూర్చాడు పాణి. “రాజేంద్రది హత్యా ఆత్మహత్య అన్న అనుమానం ఇంక లేదు కదా? కేసు చాలా మటుకు క్లియరైనట్టనిపిస్తోంది” అన్నాడు.
“ఎలా?”
“రాజేంద్ర వర్మకీ అతడి తాత గారైన నరేంద్ర వర్మకీ కొద్ది కాలంగా మాటల్లేవని వంట వాడు నరసింహ చెప్పాడు. దీన్ని బట్టి చూస్తే రాజేంద్ర రత్న మాలని ప్రేమించడం నరేంద్ర వర్మకి ఇష్టం ఉన్నట్టు లేదు. వాళ్ళిద్దరూ పెళ్ళి చేసుకోవడానికి ఆయన అభ్యంతరం చెప్పి ఉండచ్చు. అందుకే రాజేంద్ర ఎవరికీ తెలియకుండా రత్నమాలని ‘గాంధర్వ వివాహం’ చేసుకున్నాడు. తాత గారికి ఇష్టం లేక పోయినా ఆమెని తీసుకుని అండమానూ, కేరళా వంటి ప్రదేశాలు తిరిగి వచ్చే వాడు. ఆమె బ్రతికి ఉండగా మనవడు తను చెప్పిన సంబంధాలు చేసుకోడన్న ఉద్దేశంతో అతడు రత్నమాలని చంపించి ఉంటాడు”
“నరేంద్ర వర్మా?” ఆశ్చర్యంగా అన్నాడు ప్రసాద్.
“అతడంటే అతడొక్కడే కాక పోవచ్చు. ఆమెని చంపాలన్న ప్లాన్ నరేంద్ర వర్మా, సురేష్ వర్మా ఇద్దరూ కలిసి వేసి ఉండచ్చు. వాళ్ళీద్దరివీ ఒకటే అభిప్రాయాలని రాజ మహల్ లో అందరికీ తెలుసు. రెండు నెలల క్రితం నెట్ లో హత్య చేయడానికి సంబంధించిన సైట్ లు చూసినది కూడా రాజేంద్రని హత్య చేయడానికి కాదు.... రత్నమాలని చంపడానికి !”
“నిజమే అయి ఉండచ్చు. మరి రాజేంద్ర తనని ఎవరో చంపడానికి ప్రయత్నిస్తున్నారని నీకు మెయిల్ రాసాడెందుకు?”
“సరిగ్గా రాజేంద్ర రత్నమాలని రహస్య వివాహం చేసుకున్న సమయంలో తోటలో నిధి బయట పడింది. అప్పటికే ఇంట్లో వాళ్ళతో సరిగ్గా సంబంధాలు లేని రాజేంద్ర వర్మ నిధి విషయం ఇటు తాత గారితో కానీ, అటు సురేష్ వర్మతో కానీ చెప్ప లేదు. రాజేంద్ర రత్న మాలని గంధర్వ వివాహం చేసుకున్నాడని తెలిసిన తాత, సురేష్ వర్మ అప్పటి నుంచీ ఆమెని చంపడానికి వెంట పడే వారు. రాజేంద్ర, రత్నమాల కలిసి ఉన్న సమయంలో ఆమెని చంపడానికి నరేంద్ర వర్మ నియమించిన మనుషులు వెంట పడుతుంటే, నిధి గురించిన అభద్రతా భావంతో ఉన్న రాజేంద్ర ఎవరో తనని చంపడానికి వెంట పడుతున్నారనుకున్నాడు. చివరికి రాజేంద్రతో కలిసి ఉన్న సమయాల్లో రత్నమాలని చంపడం కుదరక రాజేంద్ర రమ్మంటున్నాడని చెప్పి దొంగతనంగా కోటకి తీసుకు వచ్చి ఆమెని చంపేసారు!”
“అసలే అభద్రతా భావంలో ఉన్న రాజేంద్ర వర్మ నిధి గురించి తనకి తప్ప మరో వ్యక్తికెవరికైనా తెలియడం మంచిదనుకున్నాడు. అందుకే ఆ విషయం తనకి నమ్మకం ఉన్న రత్నమాలకి చెప్పాడు. అదే భయంతో నిధి రాజ మహల్ లో ఉండడం ప్రమాద కరమని భావించి ఆ నగలని రత్న మాల స్నేహితురాలైన బంగారు లక్ష్మికి దాచమని ఇచ్చి ఉండచ్చు” అన్నాడు ప్రసాద్ తను కూడా పాణి ఊహకి సాయం చేస్తూ.
“ఎగ్జాట్ లీ” అన్నాడు పాణి మెచ్చు కోలుగా “తనని పెంచి పెద్ద చేసిన తనవారిని హంతకులుగా ముద్ర వేయ లేక, తమ వంశాన్ని నలుగురి లోనూ అప్రతిష్ట పాలు చెయ్యడం ఇష్టం లేక, సూసైడ్ నోట్ లో తను చని పోవడానికి కారణాన్ని రాయ లేదు. రత్న మాల మరణంతో షాక్ తిని తనని తానే మర్చి పోయిన రాజేంద్ర నిధి సంగతి కూడా మర్చి పోయాడు. ఆఖరి నిమిషంలో గుర్తుకు వచ్చి సూసైడ్ నోట్ లో నిధి గురించి పి.ఎస్. అని రాసి పెట్టి చని పోయాడు”
“అంతా బాగానే ఉంది. మరి వజ్రాలని ఎత్తుకు పోయింది ఎవరు? బంగారు లక్ష్మేనా? అలాగైతే సూసైడ్ నోట్ లో ఉన్న మేటర్ ని ఆల్టర్ చేసినది సుప్రియా?”
ఫ్లోలో చెప్పుకుని పోతున్న పాణి షాక్ తిన్నట్టుగా ఆగి పోయాడు. పక్క గదిలో ఉన్న ఇంద్ర నీల ఉందా పారి పోయిందా అన్న అనుమానం వచ్చింది వాళ్ళిద్దరికీ. ఇద్దరూ ఒక్క సారిగా కదిలి పక్క గది లోకి వెళ్ళబోయేంత లోనే గది తలుపు భళ్ళున తెరుచుకుంది.
ఎదురుగా ఆవేశంతో ఊగిపోతూ నిలబడ్డ ఇంద్రనీల కనిపించింది !!
మరింత షాక్ తిన్నట్టుగా వాళ్ళిద్దరూ అలాగే ఆమె వంక ప్రశ్నార్ధకంగా చూస్తూ ఉండి పోయారు.
ఒక్క క్షణం ఆయాసం తీర్చుకోవడానికన్నట్టుగా ఆగి, తరువాత అంది ఇంద్రనీల “బంగారు లక్ష్మి ఆచూకీ తెలిసింది”
ఊహించని ఆమె మాటలకి ఇద్దరూ ఉలిక్కి పడ్డట్టుగా అన్నారు “తెలిసిందా? ఎక్కడుంది?”
“సిర్నా పల్లిలో!!”
అది మరీ ఊహించని విషయం వాళ్ళిద్దరికీ. తనకి తెలిసిన సమాచారానికి ఆమె ముఖం కూడా షాక్ తిన్నట్టుగానే ఉండడాన్ని గమనించారు పాణీ, ప్రసాద్.
“ఇంతకీ ఎలా తెలిసింది ఆమె ఆచూకీ? ఆమెతో మాట్లాడారా? వజ్రాలు ఆమె దగ్గరే ఉన్నాయా?”
“ఆమెతో మాట్లాడడానికి ఆమె మొబైల్ స్విచాన్ చేసి లేదు”
“మరి ఎలా తెలిసింది ఆమె ఎక్కడ ఉందో?” ఆసక్తిగా అడిగాడు పాణి.
( బంగారు లక్ష్మి సిర్నాపల్లిలో ఉందన్న విషయం తెలిసినంతలోనే కథ సుఖాంతమైపోలేదు....సిర్నాపల్లిలో ఎక్కడుంది? ఎవరు దాచారు....ఎలా కనిపెట్టాలి, ఎలా విడిపించాలన్నదే అసలు కథ......అవన్నీ తెలియాలంటే వచ్చేవారం దాకా ఆగాల్సిందే.....) |