Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
chamatkaaram

ఈ సంచికలో >> శీర్షికలు >>

ఉత్తరాఖండ్ ( గంగోత్రి ) - కర్రా నాగలక్ష్మి

uttarakhand tourism

యమునోత్రి దర్శనం తరువాత మరునాడు బయలుదేరి గంగోత్రి బయలుదేరేం .

ఉత్తరకాశి మీదుగానే సాగుతుంది ప్రయాణం . ఉత్తరకాశి వరకు యమున వొడ్డున , ఉత్తరకాశి నుంచి భగిరథి వొడ్డున ప్రయాణిస్తాము . యమున నీరు నల్లగా ( డార్క్ రంగులో ) వుంటే భగీరథీ నీరు పాలవలె తెల్లగా వుండి నురగలు కక్కుతూ ప్రవహిస్తూ వుంటుంది . భగీరథి వేగం చూడడానికి రెండుకళ్లు చాలవు .

ఉత్తర కాశి నుంచి గంగోత్రి సుమారు 100 కిలో మీటర్ల దూరం లో వుంది . ఉత్తరకాశి నుంచి రోడ్డు సన్నగా వుండడం వల్ల ప్రయాణం కష్టంగా సాగుతుంది . కొండలలో రాత్రి ప్రయాణం చెయ్యకపోవడమే మేలు . కొండలలో యెక్కడో ఓ చోట వానపడకా మానదు , కొండ చరియలు విరిగి పడకా మానవు . అందుకే కొండలలో పొద్దున్నే ప్రయాణం మొదలుపెట్టి చీకటి పడకముందే రాత్రి బస చేసుకోడం మంచిది .

ఉత్తరకాశిలో బయలు దేరిన మాకు గంగనాని మొదటి హాల్ట్ , అక్కడకి చేరేలోపున భగీరథి గురించి తెలుసుకుందాం .

' సాగర ' మహారాజు కి మొదటి భార్య సుమతి వల్ల అరవైవేల మంది పుతృలు కలుగుతారు , రెండవ భార్య కేశిని వల్ల 'అసమంజ ' అనే పుతృడు కలుగుతాడు . సాగర మహారాజు అశ్వమేధయాగం చేసి యాగాశ్వాన్ని తన అరవైవేల పుతృల రక్షణ లో విడిచి పెడతాడు , సాగరుడు చేసే యాగం విజయవంతమైతే తన పదవి కి భంగం వాటిల్లుతుందని భావించిన ఇంద్రుడు యాగాశ్వాన్ని  ' కపిలముని ' ఆశ్రమంలో ముని తపస్సు చేసుకొంటూ వుంటే అతని వెనుక చెట్టుకు కట్టి వెళ్లి పోతాడు . అశ్వాన్ని వెతుకుతూ వచ్చిన సాగరుని పుతృలు కపిలముని ఆశ్రమాన్ని కూలగొడతారు , తపస్సుకు భంగం వాటిల్లిన కపిలముని జరిగినది చూచి కోపోద్రేకుడై సగర పుతృలను భస్మం చేస్తాడు . భస్మమయిన వారికి ఉత్తమగతుల ప్రాప్తికై గంగను తీసుకు వచ్చి ఆ భస్మాలమీదుగా ప్రవహింపజెయ్యాలని ఋషులు చెప్పగా వారి సంతతి గంగ కొరకై తపస్సు చేస్తారు . కాని గంగ వారికి ప్రసన్నం కాలేదు . సాగర రాజ వంశజుడైన భగీరథుడు గంగాదేవిని ప్రసన్నం చేసుకొని , ఆమెను భూలోకంలో తన పూర్వజులకు ఉత్తమ గతులు కల్పించేందుకు రావలసినదిగా కోరుతాడు , గంగ భూలోకానికి వచ్చేందుకు సమ్మతిస్తుంది కాని తన ప్రవాహవేగానికి భూదేవికి తట్టుకొనే శక్తి లేకపోవుట వలన మరెవైనా తన వేగాన్ని నియంత్రించ గలిగే సమర్ధులను ప్రసన్నని చేసుకొన వలసినదిగా చెప్పగా పరమశివుడు తప్ప వేరెవరూ సమర్ధులు కారని శివునికై తపస్సాచరించి పరమశివుని ప్రసన్నని చేసుకొని తన కోరిక తెలియజేస్తాడు . శివుడు గంగను తన శిరస్సున పట్టి జడలో బంధించి ఒకపాయను భూమిపైకి విడిచిపెడతాడు . భగీరథుడు నాగలి తో గంగకు దారి చూపుతూ సాగర రాజపుతృల భస్మాల మీదుగా గంగను ప్రవహించేటట్లు చేసి వారికి ఉత్తమగతులు కలుగజేస్తాడు .

ఇక్కడ స్థానికులు కథనం ప్రకారం గంగ అనేక పాయలుగా ప్రవహించి దేవప్రయాగలో గంగగా మారిందని అంటారు . భగీరథుని ప్రయత్నంతో ప్రకటితమైన నది కాబట్టి దేవప్రయాగలో అలకనంద తో సంగమించేవరకు దీనిని భగీరథి అని అంటారు . దేవప్రయాగ తరువాత మాత్రమే దీనిని గంగ గా వ్యవహరిస్తారు .

సాగర రాజ పుతృలకు ఉత్తమ గతులు కలిగించినది కావటంతో యిక్కడకు వచ్చే యాత్రీకులు భగీరథీ వొడ్డున అపరకర్మలు నిర్వహిస్తూ వుంటారు .

ఉత్తర కాశి నుంచి సుమారు 46 కిలో మీటర్ల దూరంలో ' గంగనాని ' అనే వేడినీటి బావులలో యాత్రీకులు స్నానాదులు చేసుకొని గంగోత్రి వెళతారు . దీనిని ఋషికుండం అని అంటారు . మేం కూడా పది పదిన్నరకి ' గంగనాని ' చేరుకున్నాం , చుట్టూరా దేవదారు వృక్షాలతో వున్న యెత్తైన కొండల నడుమ ఆ చలి ప్రదేశం లో ప్రకృతి సిధ్దమైన వేడి నీళ్ల బావులు రాతితో చేసిన నేల పదిమంది ఒకే సారి స్నానం చెయ్యగలిగేటట్టు యేర్పాటు చేసిన కుళాయిలు , నీటుగానే వున్నాయి . కాని మేము అక్కడ స్నానం చెయ్యడానికి తయారు కాలేదు . నీళ్లు తలపై జల్లుకొని దండం పెట్టుకున్నాం . ముఖ్యంగా చార్ధామ్ యాత్ర చేసేటప్పుడు మన ఆరోగ్యాన్ని కాపాడు కోవాలి , తరచూ కలిగే వాతావరణ మార్పులకు మన శరీరం తట్టుకోవడం కష్టం , యెంత వేడి నీరైనా అంత చలి ప్రదేశం లో స్నానం చేసి బట్టలు మార్చుకొనే టప్పటికి బాగా చలి పట్టుకుపోతాం , చలి జ్వరం గాని వచ్చిందా మన యాత్ర తలకిందులై పోతుంది . అందుకనే ముఖ్యమైన ప్రదేశాలలో స్నానం చేసి మిగతా చోట్ల తలపై నీరు జల్లుకోడంతో సరిపెట్టుకున్నాం .

గంగనాని చిన్న గ్రామం , యిక్కడ రాత్రి నివాసానికి చాలా తక్కువ సౌకర్యాలు వున్న గదులు అద్దెకు దొరకుతాయి .

గంగనాని కి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో  ' భట్వారి ' అనే చిన్న గ్రామంలో వ్యాసముని తండ్రి ' పరాశర ముని ' మందిరం దర్శనానికి వెళ్లేం .

ఈ పల్లెకు , పల్లె వాసులకు యెక్కడా నాగరికత వాసనలు అంటలేదు . దేవదారు , పైన్ వృక్షాల మధ్య వున్న పరాశర ముని మందిరం చిన్న దైనా ఆ ప్రశాంత పరిసరాలు మనసుకి హాయినిచ్చేయి . ఈ ప్రాంతాలలో ప్రశాంత జీవనం కావాలనుకునే వారు వచ్చి యిక్కడ కొద్దికాలం గడిపి వెళుతూవుంటారుట , యిక్కడి ప్రజల పలకరింపులు వారు చూపించే ఆప్యాయత మరువలేనివి .

15 కిలో మీటర్లు వెనుక వచ్చి గంగోత్రి రోడ్డు మీద మా ప్రయాణం మరో 5 లేక 10 కిలో మీటర్ల తరువాత ఆగి పోయింది . అప్పటికే మా ముందు చాలా వాహనాలు ఆగి వున్నాయి . దారంతా బురదగా వుండడం వల్ల ప్రయాణం ముందుకు సాగదని తెలిసి మాకు నిరాశ కలిగింది , కారు దిగి ముందుకు వెళ్లిచూడగా దారంతా బురదగా వుంది , బురదలోకి దిగిన సామానులతో నిండి వున్న పెద్ద ట్రక్కు బురదలో కూరుకొని ముందుకి గాని వెనుకకు గాని కదలలేక మెల్లగా బురదలో కి జారసాగింది , ప్రమాదం కనిపెట్టిన స్థానికులు డ్రైవర్ నీ క్లీనర్ నీ వాహనం లోంచి బయటకి వచ్చేయమని సలహా యిచ్చేరు , వాళ్లిద్దరూ ట్రక్కుని విడిచి పెట్టి బయటకి దూకేసారు , ఆ ట్రక్కు ను బురద  లోయలోకి లాక్కొని వెళ్లడం  మా కళ్లతో చూసేం . బురద కి అంత శక్తి వుండగలదని అప్పుడే తెలిసింది . స్థానికుల మాట వినకుండా బురదేం చేస్తుందిలే అనుకొని ప్రయాణం సాగించి వుంటే యేమయివుండునో అనే ఆలోచనకే వణుకు పుట్టింది .

మొత్తం ఆ బురద 1/4 కిలోమీటర్లు మేర వుంది  అంతే , గంగత్రి యాత్ర యింకలేదేమో అనుకుంటున్న సమయంలో స్థానికులు పదిరూపాయలిస్తే ఆ ప్రాంతాన్ని సురక్షితంగా దాటించుతాం అన్నారు . అప్పటికే వారు ట్రక్కులోని డ్రైవరుని , క్లీనర్లను దాటించటం చూసేం కాబట్టి వారి చెయ్యి పట్టుకు దాటడానికి నిర్ణయించుకున్నాం . మా లాగే చాలామంది యాత్రీకులు దాటి అటుపక్క వున్న లోకల్ జీపులలో గంగోత్రి వైపు ప్రయాణించడానికి సంసిధ్దులయేరు . అప్పటికే యాత్ర ముగించుకున్న వారు యిటువైపున వున్న వారి వారి వాహనాలవైపు వెళ్లసాగేరు .

మేం మా టాక్సీని అక్కడ వదిలేసి స్థానికుని సహాయంతో ఆవైపుకి వెళ్లి లోకల్ వాహనంలో మా ప్రయాణం సాగించేము .

లోకల్ వాహనం కావడంతో యిల్లు కనపడగానే ఆగడం , యింట్లో వాళ్లు వచ్చి యెక్కేవరకు వుండి  బయలు దేరడం లాంటి ఆలస్యాలు జరిగేయి , యిలా ఓ యిరవై కిలోమీటర్ల ప్రయాణం సుమారు రెండుగంటలు పట్టింది .

ఓ మోస్తరు గ్రామం చేరేం , ఆ గ్రామం పేరు ' హర్షిల్ ' , యిది యిప్పుడిప్పుడే పర్యాటకలను ఆకర్షిస్తున్న వేసవి విడిది , పెద్దగా సదుపాయాలు లేవు , ఓ మోస్తరు చిన్న హోటల్స్ ఒకటో రెండో వున్నాయి . ఘరెవాల్ వికాష్ మండల్ వారి గెస్ట్ హౌసు వుంది . పర్యాటకుల తాకిడి లేకపోవడంతో ప్రభుత్వం వారు కూడా యెక్కువ సదుపాయాలు కలుగ జెయ్యలేదు . స్థానిక వంటలు మాత్రమే తినడానికి దొరుకుతాయి , మాగి నూడిల్స్ కల్చరు యీ కొండలకు పాకడం మన అదృష్టమునే చెప్పుకోవాలి .

బస్సు స్టాండులో అమ్ముతున్న బబ్బుకోష్ ( యిండియన్ పియర్ ) అని పిలువ బడే పళ్లు మమ్మల్ని ఆకర్షించేయి , సాధారణం గా బజారులో లభించే వాటికి రెండు రెట్ల సైజులో వుండి నాలుగు రెట్లు రుచి వున్న యిక్కడి పళ్లు యెంత బాగున్నాయో ? .

హర్షిల్ చుట్టుపక్కల ప్రాంతాలు బబ్బుకోష్ తోటలకు ప్రసిధ్ది .

ఆ ట్రిప్పులో మేము హర్షిల్ లో బస చెయ్యలేదు . తరువాత వెళ్లినప్పుడు ఓ రాత్రి బసచేసేం .      హర్షిల్ ఏపిల్ , బబ్బుకోష్ తోటలతో యెత్తైన ఓక్ , దేవదారు తోటలతో చాలా అందంగా వుంటుంది .   హర్షిల్ గ్రామానికి సుమారు ఒక కిలోమీటరు దూరంలో వున్న ' ముఖ్బా ' గ్రామం లో శీతాకాలంలో గంగాదేవి విగ్రహాన్ని వుంచి పూజలు నిర్వహిస్తారు . ఈ గ్రామంలో బెంగాలీబాబా ఆశ్రమం వుంది .

ఎలాగైతేనేమి గంగోత్రి చేరేసరికి మద్యాహ్నం మూడయింది . దారంతా వాన పడుతూనే వుంది . గంగోత్రి సుమారు 3100 మీటర్ల యెత్తున వుంది . చుట్టారా మంచుకొండలు విపరీతమైన చలి , దాని పైన వర్షం తడిపొడి బట్టలతో నడక గజగజ వణికించేసింది . ముందుగా వేడివేడి టీ తాగి గంగోత్రి కి నడవసాగేం . సుమారు ఓ అరకిలోమీటరు నడవాలి గంగోత్రి చేరడానికి . ముందుగా గంగ వొడ్డున పెద్ద శిల దానిపైన నిలబడి బగీరధుడు తపస్సు చేసుకున్నాడని అందుకే దానిని బగీరథ శిల అంటారని రాసి వుంది .

గంగా మాత మందిరం పక్కనుంచి గంగోత్రి ఘాట్ చేరుకొని అతి చల్లగా వున్న నీళ్లు పూజారి బకెట్టుడు నెత్తి మీద దిమ్మరించి బట్టలు మార్చుకొని వచ్చేలోగా మాకు ఓ రెండు లీటర్ల బాటిల్ లో నీరు నింపి వుంచేరు . అప్పటికే బాగా చలిపట్టుకు పోయేం , గంగోత్రి లో పట్టిన నీటిని గంగాదేవి ( మొసలి వాహనం ) విగ్రహం దగ్గర పెట్టి పూజ చేయించు కొని శివలింగానికి పూజచేసుకొని బయటకి వచ్చేం .

         పిండ ప్రదానాలు కూడా చెయ్యడం యిక్కడవుంది . పూజారులకు చెబితే వారు గంగోత్రికి అవతల వొడ్డున వున్న  వారి యిళ్లల్లో వాటికి కావలసిన సరంజామా సమకూర్చి గంగోత్రీలో యేర్పాటు చేస్తారు . లేకపోతే సామాన్యంగా తర్పణాలు యివ్వవచ్చు .

      ఇక్కడ గంగ తాలూకా ఉగ్రరూపం కనిపిస్తుంది , యెంతవేగంగా ప్రవహిస్తుందంటే చెప్పలేం , ఆ దూకుడు , ఆ వేగం హమ్మ చాలా భయం కలిగిస్తుంది . పూజారులు మమ్మలని గంగ వొడ్డుకి కూడా వెళ్లనివ్వలేదు , వారే నీళ్లు తెచ్చి తలపై పోసేరు . అక్కడ ప్రమాదవసాత్తూ కాలు జారిందా అంతా గల్లంతే .

ఆ గంగలో శివలింగం మునిగి వుంటుందట , శీతాకాలంలో గోముఖం గడ్డకట్టడంతో గంగోత్రి కి నీరు తగ్గి శివలింగం కనిపిస్తుందట . భగీరధుని కోరిక మేరకు శివుడు గంగను తన శిరస్సును ధరించి ఒక జటపాయనుంచి గంగను వదిలి పెట్టిన ప్రదేశమట . మామూలు రోజులలో మనకు పూజారులు ఆ ప్రదేశాన్ని చేతితో చూపించి దండం పెట్టుకోమంటారు .

ఇక్కడ యెప్పుడు వచ్చినా మనసునిండిన అనుభూతి కలుగుతుంది , అక్కడనుంచి కదలాలని అనిపించదు . ఎప్పటికైనా గంగోత్రిలో ఓ పదిరోజులు ప్రశాంతంగా గడపాలనే కోరిక వుంది , యెప్పుడు భగవంతుడు దయ తలుస్తాడో ? .

గంగోత్రికి సుమారు 18 కిలోమీటర్ల దూరంలో వున్న గోముఖ్ కి గంగోత్రినుంచి నడక దారిన వెళ్లవచ్చు . రానూపోనూ , రాత్రి బస , తిండి మొదలయిన యేర్పాట్లు చేసే టూరిస్ట్ సంస్థలు వున్నాయి . గోముఖ్ కు వెళ్లలానే మా కోరిక తీరలేదు . యెప్పుడు ప్రాప్తమో ? , గోముఖ్ వెళ్ల దల్చుకున్నవారు టూరిస్ట్ సంస్థలను సంప్ర దించవచ్చు . గోముఖ్ వెళ్లి వచ్చిన వారి అనుభవాలు వింటూవుంటే ఒక్కసారి వెళ్లానే కోరిక కలిగింది .

సుమారు అయిదు గంటలకి తిరుగు బస్సు పట్టుకున్నాం . రాత్రి తొమ్మిదింటికి మళ్లా బురద ప్రాంతం చేరుకున్నాం . బురద దాటించే స్థానికులు మా టాక్సీ అతను ఏడింటివరకు చూసి ఉత్తరకాశి వెళ్లిపోయేడని చెప్పేరు . బాగా వాన కురుస్తోంది , కటికచీకటి చుట్టుపక్కల నివాసయోగ్యమైనవి యేవీ లేవు , అప్పటికే మా బట్టలు తడిచి పోయేయి . కర్నాటక నుంచి వచ్చిన పర్యాటక బృందం వారు వారి బస్సులో మమ్మల్ని ఉత్తర కాశి వరకు తీసుకు వెళతామని చెప్పి వారి బస్సులో మమ్మలని ఉత్తరకాశిలో దింపేరు . ఏదో మా అదృష్టం బాగుండి తెరిచి వున్న హోటల్ లో భోజనాలు చేసుకొని బయటకి వచ్చి ఓ కిలోమీటరు దూరం ఆ చీకటిలో నడవడానికి సిధ్దపడ్డాం , హోటలు బయట మా టాక్సీ అతను కనపించి తాను అక్కడ నిరీక్షిస్తున్నట్లు చెప్పేడు . మా టాక్సీ లో మా బస చేరుకున్నాం , మరునాడు పొద్దున్నే ప్రయాణ మలవాలని నిర్ణయించుకున్నాం .

మళ్లా వారం మరిన్ని విశేషాలతో మీ ముందుకు వస్తానని మాట యిస్తూ అంత వరకు శలవు .

మరిన్ని శీర్షికలు
sarasadarahaasam