Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

ప్రేమిస్తే ఏమవుతుంది?

premiste emavutundi

నిలువుటద్దంలో తననితాను చూసుకుని, చెంపల మీదికి జారిన జుట్టులోని ఒక పాయని సుతారంగా వెనక్కి  నెట్టుకుని,  వదులుగా ఉన్న జడలోంచి మెడ మీదకి జారి గిలిగింతలు పెడుతున్న కనకాంబరం పూల మాలను కుడిచేతి మునివేళ్ళతో సరిచేసుకుని , కళ్ళల్లో     ముసి, ముసినవ్వులు చిందులేస్తూ ఉంటే టేబుల్ మీద సిద్ధంగా పెట్టుకున్న నాలుగు పుస్తకాలు చేతిలోకి తీసుకుని,  గోడకున్న హ్యాండ్ బాగ్ భుజాన వేసుకుని మరోసారి అద్దంలో తనని తాను చూసుకుని, గదిలోంచి బైటికి వచ్చి  “అమ్మా నేను వెళ్తున్నాను “ అంటూ వంట గదిలో ఉన్న తల్లికి వినిపించేలా కేక పెడుతూ వీధి గుమ్మంలో నుంచి కొద్దిగా తొంగి చూసింది గాయత్రి .

గాయత్రికి సమాధానంగా అన్నపూర్ణ  లోపలినుంచే అడిగింది “కారేజి తీసుకున్నావా ?”

“ఆ ఆ తీసుకున్నాలే తలుపు దగ్గరకు వేస్తున్నాను” అంటూ మరోసారి చెప్పి వీధి తలుపు వోరగా వేసి వీధిలోకి వచ్చింది.

మలుపు తిరుగుతుండగానే ఆమె చూపులు అటూ, ఇటూ చంచలంగా ఎవరినో వెతుకుతూ కదిలాయి.

కిళ్ళికొట్టు పక్కనే ఉన్న ఓ వేపచేట్టుకి కుడికాలు జాపి  ఆనించి నిలబడి విలాసంగా సిగరెట్ కాలుస్తూ ఆమె కోసమే ఎదురుచూస్తున్న రమేష్ ఆమెని చూడగానే చేతిలో సిగరెట్ విసిరి పారేసి, కాలు సరిగా తీసుకుని హుషారుగా  పక్కనే ఆపిన బైక్ మిద ఎక్కి స్టార్ట్ చేసాడు.

అతనలా తనని చూడగానే ఉత్సాహంగా బయలుదేరడం గాయత్రికి కొంచెం గర్వంగా, మరికొంచెం సిగ్గుగానూ అనిపించి తలవంచుకుని నడవసాగింది.

కొంచెం దూరం వెళ్ళాక అతను వేగంగా ఆమెని సమీపించి బండి ఆపి “ రా ఎక్కు”  అన్నాడు.

గాయత్రీ వంచిన తల ఎత్తకుండా తల అడ్డంగా ఉపుతూ “ రాను”  అంది.

“ ఏం ఎందుకు రావు?”  పొగరుగా అడిగాడు రమేష్. తనంతటి వాడు లిఫ్ట్ ఇస్తానంటే వద్దనడం అవమానకరంగా అనిపించింది అతనికి.

“ ఎవరైనా చూస్తే బాగుండదు”  అంది.

“ నువ్వొకదానివి “ విసుగ్గా అంటూ “ ఈవినింగ్  ఇందిరాపార్క్ కి రా” అన్నాడు.

అమ్మో గుండెల మీద చేయేసుకుంది భయంగా .

“నీతో  పరేషాన్  ఉంది ఎక్కడికి రావు, బండేక్కవు నీకు నేనంటే ఇష్టం లేదా”  సీరియస్ గా  అడిగాడు. .

గాయత్రీ మాట్లాడలేదు.

“ గాయత్రీ నువ్వంటే నాకు చానా  ఇష్టం . నీతో జరసేపు గడపాలని, చాలా మాట్లాడాలని అనిపిస్తుంటుంది. నువ్వేమో అమ్మ తిడుతుంది, నాన్న తిడతాడు , పక్కింటామే  చూస్తుంది, ఎల్లయ్య చూస్తాడు అని  ఐదు నిముషాలు కూడా మాట్లాడవు. ఇగో ఇప్పుడే చెప్తున్నా నువ్వు ఈరోజు రాకుంటే మాత్రం బాగుండదు చెప్తున్నా వస్తున్నావు కదా “ .

అతనలా నిలదిస్తుంటే గాయత్రీ చెంపల్లోకి వెచ్చటి రక్తం ప్రవహించి మొహం ఎర్రగా మందార పూవులా అయింది.

“మాట్లాడతావా  నిన్ను కిడ్నాప్ చేయాలా?”  విసుగ్గా అడిగాడు రమేష్.

భయంగా చూసింది అతనివైపు. అతని కళ్ళు కొంటెగా నవ్వుతున్నాయి. గాయత్రీ గుండె జల్లుమంది.

వస్తావా  ఆమెకి కొంచెం దగ్గరగా జరిగి చెవిలో  రహస్యంగా అడిగాడు.

అప్రయత్నంగా తల ఊపింది.

“ గుడ్ గర్ల్  కంపల్సరీ రా వెయిట్  చూస్తుంటా”  అంటూ తాకి, తాకకుండా ఆమె చేయి తాకి బండి రివర్స్ చేసుకుని వెనక్కి వెళ్ళిపోయాడు.
గాయత్రీ తనువంతా అదోరకమైన అనుభూతి నిండిపోయింది. ఎక్కడినుంచో ఓ నెమలి ఈక తన చేతిమీద పడిందేమో అనుకున్నట్టుగా చేయి చూసుకుంది. అతని బండి ముందుకు సాగి మలుపు తిరిగింది.

గాయత్రీ మనసు విలవిల్లాడింది . తనలా నిర్మొహమాటంగా రానని చెప్పి ఉండాల్సింది కాదేమో ఏమనుకున్నాడో ఏంటో.. ఛి ఈ వెధవ సిగ్గు ఒకటి పిలవకుండా వచ్చేస్తుంది.

కానీ అతనితో బండి మీద వెళ్తే పొరపాటున అన్నయ్య కంట పడితే ఎమన్నా ఉందా?  బెల్టు తీసుకుని చర్మం ఊడేలా  కొడతాడు . ఏంటో వెధవ బతుకు స్వేచ్చగా నచ్చిన వాడితో బండి మీద వెళ్ళడానికి కూడా లేదు. అమ్మా, నాన్న మరీ ఇంత అర్ధాడైక్స్ ఏంటో. అన్నయ్య కూడా అంతే బి టెక్ చదువుతున్నాడే కానీ ఒక్క గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు. మరీ దద్ధోజనం.

రమేష్ లాగా స్టైలిష్ గా కూడా ఉండడు . కొబ్బరి నూనే రాసుకుని నున్నగా తల దువ్వుకుని వదులు, వదులు పాంట్లు,  షర్ట్ కూడా అంతే దిండు గలిబులా ఉంటుంది. వాళ్ళకి ప్రేమలు, సరదాలు ఏమి తెలియదు. వాళ్ళలాగే తనూ ఉండాలంటే ఎలా కుదురుతుంది.

రమేష్ కళ్ళముందు కదిలాడు. ఎప్పుడూ గాలికి ఎగురుతుండే క్రాఫ్, ట్రిమ్ గా తయారై, టిప్ టాప్ గా ఉంటాడు.  నల్లగా ఉన్నా కళ గా ఉంటాడు. ఆ  కళ్ళు ఎప్పుడు చిలిపిగా నవ్వుతూ ఉంటాయి. ఆ కళ్ళు తనవైపు చూడగానే గుండె లయ తప్పుతుంది. ఒళ్ళంతా జల్లుమంటుంది .

వెనకాల హారన్ మోగుతుంటే గాయత్రీ ఉహల్లోంచి బైటపడి పక్కకి జరిగింది.

ఆమెని దాటి ముందుకు వెళ్ళిన మోటార్ సైకిల్ యువకుడు తల తిప్పి ఆమె వైపు కొంచెం చిరాగ్గా చూసాడు.

గాయత్రి మొహం ఎర్రబడింది. వెధవ ఎందుకలా చూస్తాడు తనకి సివిక్ సెన్స్ లేదన్నట్టు. ఆలోచనల్లో ఉండి హారన్ శబ్దం వినలేదు అంత మాత్రాన తనేదో  నేరం చేసినట్టు ఆ చూపేంటి. తిట్టుకుంటూ కాలేజ్ వైపు ఎడం పక్క రోడ్డులోకి తిరిగింది.

గాయత్రి  కోటేశ్వరరావు కూతురు , అన్నపూర్ణ దంపతులకు ఇద్దరు పిల్లలు. గాయత్రి , కార్తికేయుడు . గాయత్రీ ఈ ఏడాదే టెన్త్ పాసై ఇంటర్లోకి వచ్చింది. కార్తికేయుడు బి టెక్ మొదటి సంవత్సరంలోకి వచ్చాడు.

కోటేశ్వరరావు పంచాయతీ  డిపార్ట్ మెంట్ లో క్లర్క్. ఆయన దాదాపు ఇరవై ఐదేళ్ళ నుంచి క్లర్క్ గానే ఉన్నాడు. ఎందుకంటే అతను చదువుకున్నది ఎస్ ఎస్ ఎల్ సి మాత్రమే. పెద్దగా తెలివితెతలున్నవాడు కూడా కాకపోడంతో అంతటితో చదువాపెసి తండ్రి పరపతితో పంచాయతీ డిపార్ట్ మెంట్ లో రికార్డ్ అసిస్టెంట్ గా  చేరాడు. తరవాత నెమ్మదిగా క్లర్క్ గా ఎదిగాడు.  అన్నపూర్ణ  ఐదో తరగతితో చదువాపేసిన  సాధారణ గృహిణి. సంప్రదాయాలు, ఆచారాలు నిష్టగా పాటించే కుటుంబం. కొడుకు కార్తికేయ కూడా తల్లి,తండ్రుల బాటలోనే నడుస్తున్నాడు.  కాలేజికి వెళ్ళినా బి టెక్ చదువుతున్నా నేటి యువకుల పోకడలు పోకుండా వినయం,  నెమ్మదితనంతో మసలుకుంటూ, నిత్యం గాయత్రీ మంత్రం జపిస్తూ పద్దతిగా ఉంటాడు. అతనికి ఏడో ఏడే ఉపనయనం చేసేసారు. సంధ్య వార్చడం కూడా నియమంగా చేస్తాడు.  అతన్ని కొందరు బుద్ధిమంతుడు అని మరికొందరు దద్ధోజనం అని అంటారు. ఎవరేమన్నా అతను పట్టించుకోడు . చదువు మాత్రమే తన లక్ష్యం అన్నట్టు ఉంటాడు. అతని మొహంలో వింత వర్చస్సు ఉంటుంది అది చూసిన వాళ్ళకి అతనిని ఏమి అనే ధైర్యం ఉండదు.    గాయత్రి మాత్రం చిన్నప్పుడు తల్లి చెప్పినట్టు బుద్ధిగా ఉన్నా, పెద్దమనిషి అయాక ఆమెలో అనూహ్యమైన మార్పు వచ్చేసింది. నల్లపిల్ల అనిపించుకున్న గాయత్రీ పెద్దమనిషి అయాక విచిత్రంగా రంగు మారి ఛామన చాయగా  అవడం కాక తీరైన కను,ముక్కు తీరుతో  ఆకర్షణియంగా తయారైంది.  దానికి తోడు ఆమెది చాలా అందమైన తలకట్టు. వదులుగా ఒక్క జడ వేసుకుంటే  వీ పుమిద నల్లతాచు పాకుతున్నట్టు ఉంటుంది.

గాయత్రి తొమ్మిదో తరగతిలో ఉండగా రజస్వల అయింది. అప్పడు పరికిణి, జాకెట్ వేసుకునేది.  పదో తరగతికి రాగానే పరికిణి , ఒణిలు వేసుకోడం ప్రారంభించాక ఆమెకి తను బాలిక నుంచి కన్యగా మారినట్టు, తనలో కొత్త అందాలు విచ్చుకున్నట్టు అనిపించడం మొదలైంది. ఆ  అందాలకి మెరుగు పెట్టుకుంటే అందం ఇనుమడిస్తుంది అనే భావన కలిగింది. అందుకే గట్టిగా బిగించి వేసుకునే రెండు జడలు మానేసి, వదులుగా ఒక్క జడ వేసుకోడం, కళ్ళకు అందంగా కాటుక దిద్దుకోడం, రోజు ఎదో ఒక పూ వు జడలో అలంకరించుకోడం ప్రారంభించింది. ఆమెలో కొత్త అందాలు ఒక్కో రేకే విచ్చుకుంటూ నూరు వరహాల పూవులా  తయారైంది. అప్పటినుంచి ఆమె కాలేజికి వెళ్తున్నా వస్తున్నా, కుర్రాళ్ళు బాడి గార్డుల్లా ఆమె వెనకాల రావడంతో ఆమెకి తన అందం మీద బాగా నమ్మకం ఏర్పడింది. తప్పకుండా ఏదో ఒకరోజు తనని ఒక కలెక్టర్ వరిస్తాడని కలలు కంటోంది.  పక్కింటి  రమేష్ తనకి ప్రేమలేఖ తెచ్చి ఇవ్వడంతో ఆ కలెక్టర్ రమేష్ అనే నమ్మకం పడిపోయింది.   దాదాపు మూడు నెలల క్రితం కాలేజికి వెళ్తున్న గాయత్రిని దారి కాచి కలిసి, ప్రేమేలేఖ చేతిలో పెట్టాడు. ఆ క్షణం ఉహించని ఆ సంఘటనకి బిత్తరపోయి  రిప్లై  ఇయ్యి అంటూ  రివ్వున వెళ్ళిపోతున్న అతనిని విబ్రాంతిగా చూసింది. కాలేజికి వెళ్లి ఆ ప్రేమేలేఖ విప్పి చూసింది. రెండే రెండు లైన్లు “ నువ్వంటే నాకిష్టం నీకు కూడా ఇష్టమేనా రేపు చెప్పు “ అని ఉంది. ఆ రెండు వాక్యాలు కొన్ని వందలసార్లు చదువుకుని మురిసిపోయింది కానీ జవాబు ఇచ్చే ధైర్యం చేయలేకపోయింది.  అప్పటినుంచి ఇంట్లోనుంచి బయలు దేరేటప్పుడు అతని కోసం ఎదురు చూడడం ఒక దినచర్యగా మారింది.  ఇద్దరి మధ్య  చిన్న పిల్ల కాలువ లాగా  మొదలైంది  ప్రేమో, ఆకర్షణనో  తెలియని వింత అనుభూతి.  కళ్ళతోటే అతనితో మాట్లాడడం, కళ్ళతోటే అతని మాటలన్నిటికి జవాబు చెప్పడం, మౌనంగానే తన మనసు అతనికి అప్పచెప్పడం అతనికి ఉత్సాహాన్ని ఇచ్చింది.. రోజూ  ఆమె వెళ్ళేటప్పుడు దారి కాసి పలకరించడం మొదలు పెట్టాడు.

ఇప్పుడు కూడా అదే జరిగింది . అతను తనకి ఆజ్ఞ లాంటిదేదో విసిరి వెళ్ళిపోగానే ఒక్క క్షణం తత్తరపడినా అది కొద్దిసేపే. మధురానుభుతితో నిలువెల్లా పులకించిపోయింది. అతన్ని ఒంటరిగా కలుసుకోడం అనే ఉహకే ఆమెలో విచిత్రమైన ప్రకంపనలు కలగసాగాయి .. కాలేజికి వెళ్ళిందన్న మాటే గాని మనసంతా సాయంత్రం అతన్ని పార్క్ లో కలవడమా, మానడమా అనే సంశయంతోటే అన్యమనస్కంగా  గడిపింది.  మనసులో వెళ్ళాలని తీవ్రంగా ఉంది. తప్పకుండా అతను సాయంత్రం ఐ లవ్ యు చెప్పడానికే పిలిచాడు అనుకుంది  ధ్రుడంగా.  మొదటిసారి ఓ యువకుడి నోటి నుంచి ఆ మాట వింటే ఎలా ఉంటుంది?

గాయత్రీ కళ్ళ ముందు తన చేతిలో చేయి వేసి, కళ్ళల్లోకి చూస్తూ ఐ లవ్ యు గాయత్రీ , నువ్వు లేకపోతే బతకలేను అని గుసగుసగా చెబుతున్న రమేష్ మెదిలాడు. నిజంగా ఈ మాట చెబితే .... అవును చెబితే... తను కన్యగా ఎదిగిన ఈ రెండేళ్లలో రమేష్ లాంటి కత్తిలాంటి కుర్రాడు నిన్ను ప్రేమిస్తున్నాను అని రహస్యం చెబితే ఏమనిపిస్తుంది. ఎగిరి గంతేయలనిపిస్తుంది... ప్రపంచాన్ని గెలిచినంత గర్వంతో గుండె ఉప్పొంగి పోతుంది. నది కెరటాల మీద వెల్లకిలా పడుకుని కదిలే మేఘాలతో కలిసి అతనితో  ప్రయాణం చేస్తున్నట్టు ఉంటుంది.. వెన్నెల తరకలు పరుచుకున్న మేఘాల మీద తేలుతున్నట్టు ఉంటుంది. ఆమెకి ఆ ఉహలతో తనువంతా మైకం కమ్ముతున్నట్టుగా అవుతోంది
    వెళ్ళాలి... వెళ్ళాలి. ... కానీ  ఎలా?  ఏనాడూ ఒంటరిగా  కాలేజికి తప్ప ఎక్కడికి వెళ్ళలేదు. ఇవాళ పార్క్ కి వెళ్ళడమా ?  కలల ప్రపంచంలో విహరిస్తున్న గాయత్రి  తనని ఎవరో  ఎత్తునించి కిందకు తోసేసినట్టు విలవిలలాడింది.  వెళ్ళకపోతే అతను చెప్పబోయే తీయటి కబుర్లు వినకపోతే ఎందుకీ బతుకు అనిపించింది . మొదటిసారిగా తనని ఇలా మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టించిన దేవుడి మీద కోపం వచ్చింది.

వెళ్ళాలని ఉంది., వెళ్ళాలంటే గుండె దడ దడ లాడుతోంది . తను అతనితో పార్క్ లో ఉండగా నాన్న చూసినా, అన్నయ్య చూసినా, తన ఫ్రెండ్స్ ఎవరన్నా చూసినా, ఇంటి చుట్టుపక్కల వాళ్ళు చూసినా  జరగబోయే భీభత్సం తలచుకుంటే వణుకుపుడుతోంది ..

అయితే వయసుకి,  నిబంధనలకి జరుగుతున్న సంఘర్షణలో వయసే గెలిచింది. సాయంత్రం వెళ్ళడానికే నిశ్చయించుకుంది.

ఇంకా ఉంది.

 

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
nadina prapancham