Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
premiste emavutundi

ఈ సంచికలో >> సీరియల్స్

నాదైన ప్రపంచం

nadina prapancham

గత సంచిక లోని  నాదైన ప్రపంచం సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి  ..... http://www.gotelugu.com/issue224/624/telugu-serials/naadaina-prapancham/nadina-prapancham/

 

( గతసంచిక తరువాయి )..

‘‘ఎగ్జాట్లీ!....’’

‘‘నాకు భయం...నేను రాను...’’ మొండిగా అంది. కోపంగా చూశాడతను. అమ్మాయిలూ కోపంగా చూశారు.

‘‘ఇంత రాత్రి పూట....’’ గొణిగింది.

‘‘నిన్ను దయ్యాలూ, పిశాచాలూ ఏమీ ఎత్తుకు పోవులే! వెళ్ళు’’ అంతా కోరస్ గా అన్నారు.

తను వెళ్ళక పోతే, వీళ్ళంతా కలిసి ఎత్తుకు వెళ్ళయినా కారులో వేసేట్లున్నారు. తప్పదనుకుంటూ ఆకాష్ ని అనుసరించింది.

అందరూ రహస్యంగా ‘బెస్టాఫ్ లక్’ చెపుతుంటే వినపడి ముసి ముసిగా నవ్వుకున్నాడు ఆకాష్.

చెన్నై వీధుల్లో కారు మెల్లగా వెడుతోంది. ఒక చేత్తో డ్రైవ్ చేస్తూనే కోటు విప్పి వెనక సీట్లోకి విసిరాడు.

‘‘కొంచెం టై లూజ్ చేస్తావా...?’’ అడిగాడు.

‘‘నాకు రాదు.’’ తెల్ల మొహం వేసి అంది కీర్తన.

ఓ క్షణం తేరి పార చూసి... ‘‘చాలా నేర్పించాలయితే!’’ అన్నాడు.

మౌనంగా వింది....

‘‘ట్రై చెయ్యి’’ చెప్పాడు. సంకోచిస్తూనే ముందుకు వంగింది. కారు సరాసరి ఓ పబ్ ముందుకు వెళ్ళి ఆగింది.

అతను తల కొంచెం పక్కకి తిప్పి వంచాడు. కంపిస్తున్న చేతులతో టై నాట్ ని లూజ్ చెయ్యడానికి ట్రై చేస్తోంది. అతని త తన హృదయానికి చేరువలో వుంది.

ఏదోలా వుంది. మనసంతా సంచలనం....గబుక్కున చేతులు తీసేసి ‘‘ఊహూ!’’ తల అడ్డంగా తిప్పేసింది.

ఆమె మనసేంటో తెలిసి పోయినట్లు మధురంగా నవ్వేశాడు. అతనే టై తీసి వేసి, షర్ట్ పై బటన్ విప్పాడు.

‘‘వెళదామా....?’’ డోర్ తీస్తూ అడిగాడు.

‘‘ఎక్కడికీ...?’’ ఎదురుగా కనిపిస్తున్న జిలుగు లైట్ ల వంక చూసి, లోపల నుంచి వినిపిస్తున్న మ్యూజిక్ విని భయంగా అంది.

‘‘ఇంత రాత్రి పూట మనం ఫ్రీగా మాట్లాడుకోవాలంటే ఇక్కడ తప్ప ఎక్కడా వీలు కాదు.’’ డోర్ వేసి తిరిగి వచ్చి డోర్ తీసి ఆమె దిగడానికి చెయ్యందిస్తూ అన్నాడు. సంకోచిస్తూనే అతనికి చెయ్యి అందించింది.

పూల గుత్తిని పట్టుకున్నట్లు అపురూపంగా ఆమె చేతిని అందుకున్నాడు. మరి వదల లేదు. వదిలించుకోడానికి ఆమె కూడా ప్రయత్నించ లేదు.

అతను మనీ పే చేయడానికి వెళ్ళినప్పుడు మాత్రం ఆమె ఎడంగా నుల్చుంది. ఆ గందరగోళ వాతావరణాన్నంతా ఇంతలేసి కళ్ళతో చూస్తూ నిల్చుంది.

అతను దగ్గరకు రాగానే ‘‘ఏంటో భయంగా వుంది’’ చెప్పింది. నవ్వేసి ‘‘నేనుండగా ఎందుకు భయం....’’ మృదువుగా ఆమె నడుం చుట్టూ చెయ్యి చుట్టి చెప్పాడు.

లోపలికి వెళ్ళగానే మరింత అయోమయం అయిపోయింది. మ్యూజిక్ కి అనుగుణంగా ముప్పయి మంది అమ్మాయిలూ, అబ్బాయిలూ డాన్స్ చేస్తూ వూగి పోతూ కనిపించారు.  మరి కొంత మంది అక్కడక్కడా వున్న టేబిల్స్ చుట్టూ కూర్చుని గ్లాసుల్లోని ద్రవాన్ని తాగుతూ నవ్వులూ, కేరింతల్లో మునిగి పోయారు.

ఈ సందడికి కొంచెం దూరంగా, లైట్లు మంద్రంగా ఉన్న చోటికి తీసుకెళ్ళాడు ఆకాష్.

అక్కడ ఇంత గోలగా లేదు.

కానీ వాతావరణంలో ఏదో మత్తు...

ఒళ్ళు తేలిపోతున్నంత మైకం....

పెదవుల ఆకారంలో వున్న సోఫా వైపు దారి తీశాడు ఆకాష్. అతని పక్కన కీర్తనని కూర్చోబెట్టి, ఆమె చేతిని తన గుప్పెట్లోకి తీసుకున్నాడు.

కాసేపు ఇద్దరూ పరిసరాలకు అలవాటు పడటానికి ప్రయత్నించారు. ‘‘నేను అసలు వూహించ లేదు...’’ సడెన్ గా అన్నాడతను.

‘‘ఏంటి..?’’ బిత్తర పోయి అడిగింది.

‘‘నువ్వింత అందంగా వుంటావని’’ కాంప్లిమెంట్ పాస్ చేసాడు ఆకాష్. అందంగా సిగ్గు పడింది కీర్తన.

‘‘ఎప్పుడూ కాక పోయినా అప్పుడప్పుడయినా ఇలా ఉండొచ్చుగా’’ అడిగాడు.

‘‘నాకు రాదు’’ అమాయకంగా అంది.

‘‘ఏంటి రాదు?’’ ఈసారి బిత్తర పోవడం అతని వంతైంది.

‘‘ఇలా డ్రస్సవడం....’’ అంది కీర్తన అమాయకంగా.

‘‘మరి ఇపుడు...?’’ ప్రశ్నార్ధకంగా అన్నాడు.

‘‘మా ఫ్రెండ్స్ చేశారు.

‘‘అనుకున్నాలే! నీకు పెళ్ళయ్యాక చీర విప్పే డ్యూటీయే గాక, చీర కట్టే డ్యూటీ కూడా మొగుడిదేనని’’ గొణుక్కున్నాడు.

‘‘ఏంటి అంటున్నారు....? ఆరాగా అంది.

‘‘కొంచెం దగ్గరికిరా!’’ అతని పెదాలే కాదు, కళ్ళూ ఆహ్వానిస్తున్నాయి.

‘‘ఎందుకూ?!’’ అంటూ అలాగే బిగదీసుకుని కూర్చుంది.

అతని చెయ్యి ఆమె నడుం భాగాన్ని స్పృశించగానే, చక్కిలిగింతతో మెలికలు తిరిగి పోయి ఆటోమాటిక్ గా అతని వేపు జరిగింది.

తన నడుంని చుట్టి వేసిన అతని చేతిని తీయడానికి ప్రయత్నిస్తోంది కీర్తన.

‘‘చుట్టూ అందరూ ఎలా వున్నారో చూడు....’’ చెవి దగ్గన గుసగుసగా వినిపించింది.

‘‘నాకు తెలీదు.....వద్దిలా!....’’ తల అడ్డంగా తిప్పింది.  తియ్య లేదతను. ‘‘నాకిలాగే ఇష్టం’’ మొండిగా అన్నాడు. అతనికి తను చాలా సన్నిహితంగా వుందన్న వూహే ఏంటో గాభరాని కలిగిస్తోంది.

తన భుజం అతని ఛాతీని రాసుకుంటోంది. అతని దృఢమైన చేతిలో తన నడుం మరింత చిక్కి పోతోంది. ఆ దాడికి కోపించినట్లు ఎద ఉప్పొంగి పోతోంది.

తనలో వస్తున్న మార్పు అందరికీ తెలిసి పోతాయేమోనన్న భయం, సంకోచం....కలవర పడుతూ చుట్టూ చూసింది.

అందరూ ఎవరి లోకంలో వాళ్ళున్నారు.

‘‘కీర్తనా! నువ్వు నాకు నచ్చావు. అయ్ లవ్ యూ!’’ అతని స్వరం చెవి పక్కన గమ్మత్తుగా వినిపించింది. ఎక్స్ పెక్ట్ చేసిన విషయమే అయినా అతను చెప్పగానే మాత్రం నిర్ఘాంతత కి గురైంది మనసు.

ఏమీ మాట్లాడ లేనట్లు తల దించుకుని వుండి పోయింది. అతని చేయి అనాచ్చాదితంగా వున్న ఆమె నున్నని నడుం వంపుని నిమురుతోంది.

‘‘చెప్పు...!’’ అడిగాడతను.

ఏమని? అన్నట్లు కళ్ళెత్తి చూసింది.

ఆ కళ్ళ సౌందర్యానికి...

ఆ కళ్ళ లోని భావాలకి ముగ్ధుడై చూస్తుండి పోయాడు.

‘‘అయ్ టూ లవ్ యూ! చెప్పు.’’

తల అడ్డంగా తిప్పేసింది. అతని చేయి యధాస్థానానికి వచ్చేసింది. మొహంలో ఒక్క క్షణం అవమానం మెరిసింది.

‘‘ఎందుకు?’’ అడిగాడు. మళ్ళీ అతని వంక చూసింది. కోపంగానో, ఎలాగో వున్నాడు.

‘‘నాకు భయం’’ ఏడుపు స్వరంతో అంది.

‘‘దేనికి భయం?’’ కొట్టినట్లే అడిగాడు.

‘‘మీరన్నది చెప్పడానికి’’ అంది.

జాలీ, నవ్వూ కలిగాయి.

‘‘భయం లేక పోతే చెప్పే దానివేనా?’’ ప్రసన్నంగా అడిగాడు.

‘‘ఊఁ!’’

‘‘ఏమని చెప్పే దానివి?’’

‘‘ఐ లవ్ యూ అని’’ అంటూ నాలిక్కరుచుకుంది.

నవ్వేసి " మొత్తానికి చెప్పేశావు! థాంక్యూ!’’ అంటూ ఆమె బుగ్గ మీద ముద్దిచ్చాడు.

కంగారుగా చుట్టూ చూసింది.

‘‘నువ్వు నన్ను ప్రేమిస్తావని నేను ఎన్నడూ వూహించ లేదు’’ తనలో తాను చెప్పుకుంటున్నట్లు అన్నాడు.

‘‘కానీ మీరు ప్రేమిస్తున్నారని నాకు ఎప్పుడో తెలుసు’’ కాన్ఫిడెంట్ గా అంది.

‘‘ఎలా?’’ ఆశ్చర్యంగా అన్నాడు.

‘‘ప్రేమ లేక పోతే, నా గేమ్స్ అన్నీ మీరు చిన్నప్పటి నుంచీ చూసేవారే కాదు. నన్నిలా ఎంకరేజ్ చేసే వారు కాదు.’’ ఆమె తన దోవన తాను చెప్పుకుంటూ పోతుంటే అతను చేదు తిన్నట్లు మొహం పెట్టాడు.

‘‘అవునా కాదా చెప్పండి?’’ పావు గంట ఏదేదో చెప్పేశాక జడ్జి గారి తీర్పు అడిగినట్లు అడిగింది.

‘‘అవునవును’’ కంగారుగా అనేశాడు.

‘‘ఆ దేవుడు మిమ్మల్ని నా కోసమే సృష్టించాడు. అసలు ప్రేమలూ పెళ్ళిళ్ళ పట్ల ఆసక్తి లేని నాకు మీ పట్ల ప్రేమ కలిగేలా చేశాడు. మిమ్మల్ని పెళ్ళి చేసుకున్నాక కూడా నేను గేమ్ కంటిన్యూ చేయవచ్చు. నేను ఎక్కడికి వెళితే అక్కడికి మీరు కూడా వస్తారు. నన్ను ఎంకరేజ్ చేస్తారు. ఇంత అదృష్టం ఏ క్రీడాకారిణికి దొరుకుతుంది?’’

ఆమె చెప్పుకు పోతుంటే జుట్టు పీక్కోవాలనిపించింది ఆకాష్ కి.

‘‘నువ్వు ప్రతిదీ గేమ్ తో ముడి పెట్టి తప్ప ఇంకోలా ఆలోచించ లేవా? కోపంగా అన్నాడు.

‘‘అంటే....!’’ అయోమయంగా అంది.

‘‘అంటే ఏముందీ? నీ గేమ్ ని ఇష్ట పడుతున్నాను కాబట్టే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా?’’

‘‘అవును!’’

‘‘కేవలం అందు కోసమేనా?’’ విస్మయంగా అన్నాడు.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్