Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

ప్రేమిస్తే ఏమవుతుంది

premiste emavutudi

గతసంచికలో ప్రారంభమయిన ప్రేమిస్తే ఏమవుతుంది సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి

http://www.gotelugu.com/issue225/627/telugu-serials/premiste-emavutundi/premiste-emavutundi/

(గత సంచిక తరువాయి)  సాయంత్రం ఐదు గంటలు. రమేష్ బైక్ లోయర్ ట్యాంక్ బండ్ రోడ్డులో ఉన్న  ఇందిరాపార్క్  గేటు ముందు ఆగింది. , బైక్ మీదనే కూర్చుని గాయత్రి వచ్చిందేమో అన్నట్టు అటూ , ఇటూ చూస్తూ కూర్చున్నాడు కొద్దిసేపు.  ఎవరో  ఆడ , మగా పెద్దవాళ్ళు వాకింగ్ కోసం కాబోలు లోపలికి వెళ్తున్నారు. గాయత్రి వస్తున్న జాడ కనిపించలేదు.  బైక్  ఓ పక్కగా పార్క్ చేసి కౌంటర్లో ఐదు రూపాయలు ఇచ్చి టికెట్ కొనుక్కుని లోపలికి నడిచాడు. అటు, ఇటు పరికించి చూస్తూ గేటు పక్కనే ఉన్న రాళ్ళ  మీదనుంచి మెల్లిగా  ముందుకు నడవసాగాడు.

గాయత్రీ తప్పకుండా వస్తుందని అతనికి  బలంగా అనిపిస్తోంది .  రోజు ఇంట్లోనుంచి కాలేజికి బయలు దేరుతూ తనకోసం ఆమె విశాలమైన కళ్ళు అటూ , ఇటూ తిప్పుతూ చూడడం తనని చూడగానే సిగ్గుతో తల వంచుకుని నడకలో వేగం తగ్గించడం అబ్సర్వ్ చేస్తున్నాడు. ఉదయం తను మాట్లాడుతుంటే ఆమె చెక్కిళ్ళ మీద సిగ్గు , కళ్ళల్లో వెలుగు కూడా పసికట్టాడు.  దాంతో అతనికి బాగా హుషారు వచ్చింది. ఆ హుషారు తోటే పార్క్ కి రమ్మని అడిగేశాడు . ఆమె వస్తాను, రాను అని ఖచ్చితంగా చెప్పక పోయినా  ఆమె వస్తుందన్న నమ్మకం తో అతను నేరుగా పార్క్ కి వచ్చాడు.

రమేష్ తండ్రి గంగరాజుకి ఒక పాన్ షాప్ ఉంది. రమేష్ కాక మరో ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్దవాడు మూడేళ్ళ క్రితమే దుబాయ్ వెళ్ళాడు , రెండోవాడు  డిగ్రీ పాసై ఒక ప్రైవేటు కంపెనీలో చేస్తున్నాడు. వాడికి ఆరో, ఏడో వేలు వస్తుంది. తండ్రికి పాన్ షాప్ మీద నెలకి అద్దె పోగా ఒక పన్నెండు వేలు మిగులుతుంది. సిగరెట్లు , పాన్, సిమ్ కార్డ్ రీఛార్జి మొదలైనవి చేస్తాడు.

రమేష్ మూడోవాడు. టెన్త్  నాలుగుసార్లు ఫెయిల్ అయి అతి కష్టం మీద పాసయాడు.  పాలిటెక్నిక్ లో చేర్చాడు గంగరాజు. కానీ కాలేజికి తక్కువ,  ఊరిమిద  బలాదూరు ఎక్కువ తిరుగుతాడు. అదే కాలనీలో ఉంటున్న కోటేశ్వరరావుతో గంగరాజుకి మంచి స్నేహం ఉంది. గంగ రాజే కాదు ఆ కాలనీలో ఉన్న మిగతా కుటుంబాల వాళ్ళకి కూడా కోటేశ్వరరావు అన్నా, ఆయన భార్య అన్నపూర్ణ అన్నా ఎంతో  గౌరవం. గంగరాజు భార్య అప్పుడప్పుడూ వాళ్ళింటికి వెళ్లి అన్నపూర్ణకి ఏదో  ఒక సాయం చేస్తూ ఉంటుంది. ఇరు కుటుంబాల మధ్య గౌరవనియమైన స్నేహం ఉంది.

గాయత్రి ఆడపిల్ల కావడం, కార్తికేయ  ఎవరితో ఎక్కువగా మాట్లాడక పోవడం వల్ల పిల్లల మధ్య మాత్రం అంతగా స్నేహం ఏర్పడలేదు.  అయితే ఇటివలే  గాయత్రిలో వచ్చిన మార్పులు , కనిపించే అందాలూ రమేష్ దృష్టిలో పడ్డాయి.  ఎప్పుడూ లేని  ఆలోచనలు రమేష్ లో కొత్తగా   ఏర్పడ సాగాయి .. ఫలితంగా ఆమెని ఆకర్షించే ప్రయత్నాలు మొదలు పెట్టాడు.  అందుకు కారణం రమేష్ కూడా  బాలుడు నుంచి యువకుడుగా ఎదగడం కావచ్చు. యవ్వనం ప్రారంభం అవుతున్న తోలి రోజుల్లో యువతి యువకుల మధ్య ఏర్పడే ఆకర్షణ ప్రేమేనా అనేది ఎవరికీ తెలియదు. రమేష్ కి కూడా తన మనసులో గాయత్రి పట్ల కలిగిన భావానికి ఏం పేరు పెట్టాలో ఇంకా ఇదమిద్ధంగా తెలియదు కానీ ఆమెతో వంటరిగా కాసేపు గడపాలన్న కోరిక మొదలై ఈ మధ్య తీవ్రమైంది.  అందుకే వారం క్రితమే పార్క్ కి రమ్మని అడగాలని నిర్ణయించేసుకున్నాడు . కానీ గాయత్రి వెనకాలే  రెండు, మూడు సార్లు వాళ్ళ అన్నయ్య కూడా బయటికి రావడంతో ధైర్యం చేయలేకపోయాడు. ఇవాళ వచ్చిన అవకాశం ఉపయోగించుకున్నాడు కాబట్టి తప్పకుండా గాయత్రీ వస్తుందనే సాయంత్రం దాకా బలాదూర్ తిరిగి సరిగ్గా కాలేజి వదిలే వేళకి పార్క్ దగ్గరకి వచ్చాడు.

రమేష్ కి చదువే కాదు అందం కూడా పెద్దగా లేదు. కానీ షోగ్గా తాయారు అవడం వచ్చు. గాలికి క్రాఫ్ చేరిగిందేమో అని ఒకసారి ప్యాంటు జేబులో నుంచి చిన్న దువ్వెన తీసుకుని దువ్వుకున్నాడు.  తిరిగి దువ్వెన జేబులో పెట్టుకుని గేటు వైపు చూడసాగాడు.

గాయత్రి కాలేజ్ నుంచి నాలుగింటికే ఇంటికి వచ్చింది. పుస్తకాలు, బాగ్ గదిలో మంచం మీద పడేసి గాభరాగా అటు, ఇటూ తిరగ సాగింది. రమేష్ పార్క్ కి రమ్మన్నాడు... వెళ్ళాలని ఉంది.... వెళితే ఏం జరుగుతుందో అనే భయం..  అసలు ఒకసారి కాలేజ్ నుంచి ఇంటికి వచ్చాక మళ్ళి బయటకి వెళ్ళాలంటే బోలెడన్ని ఆంక్షలు.... ఎందుకు, ఎక్కడికి లాంటి వంద ప్రశ్నలు.. అవన్నిటినీ ఎదుర్కునే ధైర్యం కూడా లేదు.. కానీ వెళ్ళాలన్న కోరిక ముందు,  చిన్నగా ప్రారంభం అయి క్రమంగా బలపడసాగింది. గబ, గబా వెళ్లి మొహం కడుక్కుంది.. జాగ్రత్తగా, శ్రద్ధగా తయారైంది.. జడ వేసుకుని  పెరట్లో పూచిన గులాబీ తెంపి పెట్టుకుంది.. లేత పసుపు రంగు చీర తీసుకుంది.. మళ్ళి చీర కట్టుకుంటే ప్రత్యేకంగా కనిపించి అమ్మ అనుమానాలకి తావివ్వడం అవుతుందని ఆకుపచ్చ సిల్కు పరికిణి, ఆకుపచ్చ జాకెట్టు, తెల్ల జార్జెట్ ఒణి వేసుకుంది.. గదిలోంచి బయటకి రాబోతూ  వెనక్కి తిరిగి ఒక పొడుగాటి రిజిస్టర్ , బాగు తీసుకుని, మనసులోనే అబద్ధం చెప్పడానికి రిహార్సల్స్ వేసుకుంటూ సాయంత్రం వంటకి సొరకాయ తరుగుతున్న తల్లి దగ్గరకు వచ్చింది.

నెమ్మదిగా మాటలు  కూడ దిసుకుంటూ పిలిచింది. అమ్మా ....

అన్నపూర్ణ తలెత్తి కూతుర్ని చూసి భ్రుకుటి ముడేస్తూ అడిగింది “ ఎక్కడికి తయారు ....”

గాయత్రి స్వరం లో వణుకు తెలియకుండా జాగ్రత్త పడుతూ “ మరి.... అపర్ణ  వాళ్ళింటికి వెళ్ళాలి.. ఇద్దరం కలిసి నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి... గంటలో వచ్చేస్తా...” గబా, గబా  చెప్పేసింది.

“ దాన్నే రమ్మనక పోయవా ... నాన్న గారు వచ్చే టైం అయింది... తిడతారేమో”   అందావిడ..

గాయత్రికి చిరాకేసింది... పాపం దాన్ని మాత్రం వాళ్ళ నాన్న తిట్టాడా... అనుకుంటూ..” లేదమ్మా మెటిరియల్ దాని దగ్గర ఉంది.. త్వరగా వచ్చేస్తా “ అంది..

ఆవిడ అయిష్టం గానే “ సరే త్వరగా రా... వాళ్ళ నాన్న గారిని దిగ బెట్టమను”  అంది..

ఒక్క క్షణం ఆలస్యం చేసినా ఆవిడ మూడ్ మారిపోతుందేమో అన్నట్టు అలాగే అంటూ వేగంగా బయటికి వచ్చేసింది.
కాచిగూడ నుంచి ఇందిరా పార్క్ కి నడిచి వెళ్ళడం కష్టం అనుకుంటూ పర్స్ తెరిచి చూసుకుంది..  హమ్మయ్య పర్లేదు రెండు వందల చిల్లర ఉంది... అడపా దడపా నాన్న ఖర్చులకి ఇచ్చిన డబ్బు దాచుకుని, లిప్స్ టిక్ , నెయిల్ పాలిష్ కొనుక్కుంటుంది.. ఇవాళ ఆ డబ్బే ఆటోలో బాయ్ ఫ్రెండ్ ని కలుసుకోడం కోసం ఉపయోగ పడుతోంది అనుకుని చిన్నగా నవ్వుకుని అటో పిలిచి ఎక్కింది.

రమేష్ చాలాసేపు అటు, ఇటూ పచార్లు చేస్తూ గేటు వైపు అసహనంగా చూడసాగాడు. 

తెల్లని చున్నీ గాలికి ఎగురుతూ ఓ మల్లె తీగ నడచి వస్తున్నట్టు వస్తోంది గాయత్రి .. ఆమె చూపుల్లో భయం ... తనని ఎవరన్నా చూస్తున్నారేమో అన్నట్టుగా బెదురు చూపులు చూస్తూ వస్తోంది. రమేష్  వడి వడిగా నడుస్తూ ఆమెకి ఎదురు వెళ్ళాడు.

ఆమె అతన్ని చూసి మొహమాటంగా నవ్వింది.

“లేట్ అయిందా” అంటూ “ఆడ కూర్చుందాం రా “  అంటూ షేడ్ గార్డెన్  వైపు నడిచాడు. గుల్ మొహర్ చెట్టు మీద నుంచి పడిన ఎర్రటి పూలు  నేలంతా పరుచుకుని,  కాళ్ళ కింద కార్పెట్ లాగా మెత్తగా తగులుతుంటే ఇద్దరూ నడుచుకుంటూ  నీడ గా ఉన్న చోట  బెంచి మీద కూర్చున్నారు. ఇద్దరిలో ఎవరికీ ఏం మాట్లాడాలో అర్ధం కాలేదు. గాయత్రి ఒంగి కింద రాలిన పూలు ఏరసాగింది... అతను చూస్తూ కూర్చున్నాడు.

అప్పుడే వాకింగ్ ముగించుకుని వాళ్ళకి కొంచెం దూరంలో  బెంచి మీద కూర్చున్న తేజ, శరణ్య దృష్టి రమేష్, గాయత్రిల మీద పడింది. తనకి కొంచెం ఎడంగా కూర్చున్న శరణ్య వైపు చూస్తూ అన్నాడు తేజ ...” వాళ్ళని చూడు ఎంత చక్కగా, హాయిగా  కూర్చున్నారో  ప్రేమికులంటే అలా కూర్చోవాలి..”

శరణ్య నవ్వింది “ వాళ్ళు ప్రేమికులు కాదు ఇప్పుడే కలుసుకున్నారు .”

తేజ వింతగా చూసాడు ఆమె వైపు “ ఎలా చెప్పగలవు?”

“అనుభవంతో “

“ నీకంత సిన్ లేదులే గానీ చెప్పు ఎందుకలా అనుకుంటున్నావు. వాళ్ళిద్దరూ క్లోజ్ గానే కూర్చున్నారుగా“

“ ఆ అమ్మాయి మొహంలో భయం, బిడియం కనిపించడం లేదా ... అతను కూడా పెద్దగా అనుభవం ఉన్నవాడిలా అనిపించడం లేదు.. కూర్చుని  ఐదు నిముషాలు అయింది ఇద్దరిలో ఎవరూ మాట్లాడడం లేదు.”

తేజ వాళ్ళ వైపు ఆసక్తిగా చూసాడు. నిజంగానే గాయత్రీ  తల వంచుకుని పూలు లెక్కపెడుతూ  కూర్చుంది... రమేష్ అటు, ఇటూ దిక్కులు చూస్తున్నాడు.

“ ప్రేమంటే  వంద కిలోమీటర్ల  దూరం పరిగెడతావు పెద్ద అనుభవం ఉన్నట్టు ఎలా చెప్తున్నావు ”   అడిగాడు.

“బాగుంది దానికి, దీనికి  సంబంధం ఏంటి? వాళ్ళని చూస్తుంటేనే తెలుస్తోంది.. పెద్ద వయసు కూడా లేదు... వీళ్ళ మధ్య ప్రేమ ఉంటుందని ఎలా అనుకుంటావు?”

“ వాళ్ళ గోల మనకెందుకు కానీ ఇపుడు చెప్పు నన్ను ఎప్పుడు ప్రేమిస్తావు?”

“ నాకు టైం లేదు బాబు... నన్ను వదిలేయ్”  రెండు చేతులు జోడించి దణ్ణం పెట్టింది.

“ ఇలా అన్నావంటే ప్రేమ, పెళ్లి లేకుండానే ముసలిదానివి అవుతావు.. అప్పుడు ఇంక జీవితానికి అర్ధం ఏం ఉంది? “

“నా జీవితానికి బోలెడు అర్ధం ఉంది...” అంటూ బాగ్ లోంచి ఒక పుస్తకం తీసి అంది “ నా జీవితం ఈ ప్రపంచంలో ఉన్న వింతలూ, విశేషాలు పరిశోదించడం లోనే ఉంది... ఇందులోనే నాకు ఆనందం, తృప్తి.. “ పుస్తకాన్ని గుండెలకి హత్తుకుంది ప్రేమగా..

ఆ పుస్తకం వైపు చూసాడు తేజ... A forgotten empire , A contribution to the History of India…. ఆమె వైపు చూపు తిప్పి కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు...” నేను కనీసం ఆ పుస్తకంగా అయినా పుట్టాను కాదు గదా... “

అతని కళ్ళల్లోని చిలిపి తనానికి నవ్వేస్తూ..”. పుస్తకం పుట్టదు.... మేధావుల చేత తయారు చేయబడుతుంది. “ అంది.

“ ఏవిటో శంకర శాస్త్రి గారి మాటల్లాగే నీ మాటలు అర్ధం కావు “ అన్నాడు.

“ అర్ధం కాకపోతే కష్ట పడకుండా వాళ్ళని చూడు  వీళ్ళిద్దరూ ఎక్కువ కాలం ప్రేమించుకోరు” అంది.

“ ఎందుకు తల్లి అలా శపిస్తావు పాపం.... అందరు నీలా సన్యాసులు కావాలనా..”

“ అది కాదు తేజా... వీలైనంత త్వరగా పెళ్లి చేసుకుంటారు..

ఆశ్చర్యంగా చూసాడు తేజ.. “ ఏంటి నీ ఆస్ట్రాలజీ ప్రయోగం వాళ్ళ మీదా? “ అన్నాడు.

“ కాదు ఆ అమ్మాయిని చూడు చాలా ట్రెడిషనల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన్నట్టు లేదూ.... ఇలాంటి అమ్మాయి వాడి కోసం రోజు ఇంట్లో అబద్ధం చెప్పి పార్క్ కి వచ్చేంత సిన్ ఉన్నట్టు అనిపించడం లేదు... అందుకే త్వరగా పెళ్లి చేసుకోవచ్చు, లేక విడిపోవచ్చు.”

తేజ దణ్ణం పెడుతూ అన్నాడు..” పద తల్లి మనం ఇక్కడి నుంచి వెళ్ళి పోదాం పాపం వాళ్ళని అలా వదిలేయ్ “  అంటూ లేచాడు.   “నాకెందుకో అలా వదలాలని లేదు.. ఇద్దరు రాంగ్ స్టెప్ వేస్తారేమో అని భయంగా ఉంది. “

“మైగాడ్ .....  ఊళ్ళో అందరినీ ఉద్ధరిస్తావా ఏంటి? పద కాసేపు ఇక్కడే ఉంటె ఖచ్చితంగా వాళ్ళని విడగోట్టేస్తావు నీకు  ప్రేమంటేనే విరక్తి అనుకున్నా ప్రేమికులంటే కూడా విరక్తి , ద్వేషమా? “

“అలాంటిదేం లేదు కానీ ఆ అమ్మాయికి, అబ్బాయికి అసలు సూట్ అవలేదు..” అంది.

తేజ గబుక్కున లేచి శరణ్య చేయి పట్టుకుని లేవదీసి “ పద ప్రేమికుల రోజు వాళ్ళెవరో కనిపించిన వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు చేసినట్టు నువ్వు కనిపించిన వాళ్ళందరిని విడగోట్టేటట్టు ఉన్నావు”  అన్నాడు ముందుకు నడుస్తూ.

శరణ్య నవ్వాపుకుంటూ  అతనిని అనుసరించింది.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
nadaina prapancham