Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Anubandhaalu eighteenth Part

ఈ సంచికలో >> సీరియల్స్

నడిచే నక్షత్రం పన్నెండవ భాగము

nadiche nakshatram telugu serial twelth part

మనం మన తెలుగమ్మాయిలకు ప్రోత్సాహం ఇవ్వనంతకాలం ఈ పరభాషాహీరోయిన్లు ఇలాగే మన నెత్తిన ఎక్కి డాన్స్ చేస్తారు. మనవాళ్లని మనమే ప్రోత్సహించాలి" అంటూ ఆయన సెలవు తీసుకున్నాడు.

"ఇలాటి వేదికలమీద ఏదో క్షణికావేశంలో ఎంకరేజ్ చేయాలంటూ మాట్లాడుతారే కానీ... ప్రాక్టికల్ గా తెలుగమ్మాయిలను హీరోయిన్లుగా తీసుకోవడం సక్సెస్ ఫార్ములా కాదని ఇండస్ట్రీ హిస్టరీ చెప్తోంది" అన్నాడు 'నవతార' ఫిల్మ్ జర్నలిస్ట్ సుదర్శన్. 'మాతంగరావు సినిమా - మంచిచెడ్డలు' అనే అంశంపై ఇపుడు జర్నలిస్ట్ సుదర్శన్ మాట్లాడుతారని పిలవగానే వేదిక మీదకి వచ్చి మైకు అందుకున్న సుదర్శన్ పలికిన తొలిపలుకులు అవి.

"దయచేసి ఔటాఫ్ సబ్జెక్ట్ మాట్లాడుతున్నామని ఎవరూ అనుకోకండి. డైరక్టర్ సరిగమరావుగారు ఈ ఇష్యూ గురించి అంత సుదీర్ఘంగా మాట్లాడిన తర్వాత... నడుస్తున్న తెలుగు సినిమా పోకడల్ని ఎప్పటికపుడు పత్రికల్లో ప్రచురిస్తున్న జర్నలిస్ట్ గా నేనూ ఈ విషయం గురించి రెండు మాటలు చెప్పాలనుకుంటున్నా. దర్శక నిర్మాతలు చాలామంది తెలుగమ్మాయిలు హీరోయిన్లని చేస్తే వర్కవుట్ కాదని 'ఆఫ్ ది రికార్డ్'లో తమ అభిప్రాయాల్ని చెప్పారు. సావిత్రి, భానుమతి, కృష్ణకుమారి, షావకారు జానకి, వాణిశ్రీ, భానుప్రియ, విజయశాంతి, శారద లాంటి వాళ్ళెంతో మంది తమ ప్రతిభాపాటవాలు విజయవంతంగా ప్రదర్శించిన తెలుగుతెరమీద తెలుగు అమ్మాయిలకు అవకాశాలు దక్కకపోవడం బాగోలేదని... హీరోయిన్ల కోసం ప్రపంచమంతా వెతుకుతున్నారే తప్ప అందమైన అమ్మాయిలు ఈ నేల మీద లేరనే మీ ఉద్దేశమా? అని సూటిగా అడిగిన సందర్భాల్లో వాళ్లదగ్గర్నుంచీ వచ్చిన జవాబేంటో తెలుసా? తెలుగమ్మాయిలకు ఎక్కడలేని మోమాటం. కాస్త పైటజార్చమన్నా సిగ్గుతో కుంచించుకుపోతారు. అదే... డిల్లీ, ముంబాయి, కలకత్తా లాంటి సిటీల్లోని అమ్మాయిలకు చొరవెక్కువ. ఇవాళ్టి కమర్షియల్ సినిమాలకు తగ్గట్టు కేరక్టర్లలో ఒదిగిపోతారు. గ్లామర్ ని ఒలికిస్తారు. అందుకే... హీరోయిన్లుగా పరభాషా నటీమణులే తెలుగు తెరపై రాజ్యమేలుతున్నారు... అని చెప్పారు. నిజానికి ఇవాళ కూడా సినిమాల్లో ట్రయ్ చేస్తున్న తెలుగమ్మాయిలు చాలామంది ఉన్నారు. అయితే, తెలుగమ్మాయి తెలుగు ఇండస్ట్రీలో నెగ్గాలంటే రచ్చ గెలవాల్సిందే. మన అచ్చ తెలుగు రాజోలు అమ్మాయి 'అంజలి' మొదట్లో తెలుగులో ఒకట్రెండు సినిమాల్లో చేసి తమిళనాడుకి వెళ్లి అక్కడ 'షాపింగ్ మాల్', 'జర్నీ' లాంటి చాలా సినిమాల్లో సక్సెస్ అయి తిరిగి ఇపుడు 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలో హీరో వెంకటేష్ పక్కన హీరోయిన్ గా చేస్తోంది. అలాగే, 'కలర్స్' స్వాతి, హైద్రాబాద్ బ్యూటీ మధుశాలిని... ఇలా ఎంతోమంది తెలుగులో అవకాశాలు కరువై ఇతర భాషా చిత్రాల వేపు చూపు సారిస్తున్నారు. కనుక... మన అమ్మాయిలు సరిగ్గా నటించరని అవకాశాలు ఇవ్వకపోవడం కాదు... ఎక్కువగా ఎక్స్ పోజ్ చేయడానికి వెనుకాడుతారనే ఇవ్వడం లేదు. ఇక... ఈ సినిమా విషయానికొస్తే..." అంటూ ఆ సినిమా మంచిచెడ్డల గురించి ముచ్చటించడం మొదలెట్టాడు సుదర్శన్.

'నిజానికి... కళ ఓ భాష, ఓ ప్రాంతం అనే చట్రంలో ఇమిడిపోదు. ఏ భాషకు చెందినవాళ్లయినా అన్ని భాషల్లోనూ నటించవచ్చు. అలాగనీ... మన తెలుగమ్మాయిల్లోని ప్రతిభని కూడా గుర్తించి ప్రోత్సహించాలన్నదే నా సూచన. ఈ సినిమాలో కాస్త గ్లామర్ ఎక్కువే. ఆ ఎక్కువ గ్లామర్ ని ఒలకబోసిన హీరోయిన్ గాయత్రీపాటిల్. ఈ ఒక్క సినిమా ఆమె స్టార్ హీరోయిన్ అయేందుకు రూట్ క్లియర్ చేసినట్లయింది. హాట్సాఫ్ టు గాయత్రిపాటిల్..." సుదర్శన్ ప్రశంసల వర్షం కురిపించాడు.

ఆ తర్వాత మాట్లాడడానికి వచ్చిన ప్రొడ్యూసర్ మాతంగరావు - "ఈ ఫంక్షన్ లో హీరోయిన్ గాయత్రీపాటిల్ కి సడన్ సర్ ఫ్రయిజ్ ఇద్దామనుకున్నాను..." అన్నాడు. దాంతో... ఆ ప్రయిజ్ ఏమై ఉంటుందా? అని ఇక్కడ చెన్నయ్ లోని గాయత్రికి ఒకటే ఉత్కంట.

"ఈ వేదిక మీంచే ఇపుడు నెక్స్ ట్ మూవీ ఎనౌన్స్ చేస్తున్నాను. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా అది. ఆ సినిమాలో గాయత్రీపాటిల్ హీరోయిన్ అనుకున్నా. కానీ..."

"కానీ..." గాయత్రి లో ఆత్రుత.

"కానీ... ఇపుడు నా సినిమానుంచి ఆమె అవుట్. ఈ ప్రాజెక్ట్ లోకి కొత్తగా 'ఇన్' అయ్యే హీరోయిన్ వివరాలు త్వరలోనే వెల్లడిస్తా. అయితే... హీరోగా ప్రదీప్ ఇందులో నటిస్తున్నాడు" మాతంగరావు ఎనౌన్స్ చేశాడు.

"హీరో ప్రదీపా? ఈ ప్రాజెక్ట్ విషయం చర్చలు జరుగుతున్నట్లు ఇంతకుముందు ప్రదీప్ తనకు చెప్పలేదే" అనుకుంది గాయత్రీపాటిల్. విషయం తెలుసుకుందామని ప్రదీప్ సెల్ కి ట్రయ్ చేస్తుంటే... 'ఔటాఫ్ కవరేజ్ ఏరియా' రికార్డెడ్ మెసేజ్ వినిపిస్తోంది. ఆ వెంటనే... టీవీలో ఆ ఈవెంట్ స్టేజ్ మీద ప్రదీప్ ప్రత్యక్షమయ్యాడు.

స్టేజ్ పై అన్ని మాటలు చెప్పిన మాతంగరావు తన కొత్త ప్రాజెక్ట్ లోకి మళ్లీ పరభాష హీరోయిన్నే పెట్టుకున్నాడు. గాయత్రి ఫంక్షన్ కి రాలేదనే అక్కసుతోనే ఆమెని తన చిత్రంలోంచి తప్పించేశాడు. తుఫాను తగ్గి షూటింగ్ ముగించుకుని చెన్నయ్ నుంచి హైద్రాబాద్ వచ్చిన గాయత్రి వచ్చిన రోజు రాత్రే ఓ స్టార్ హోటల్ లో 'కేండిల్ లైట్ డిన్నర్' కి ప్రదీప్ ని ఆహ్వానించింది.

"ఎందుకు పిలిచావ్?"

"కొన్ని యుగాలైంది నిన్ను చూసి... అందుకు" అంది గాయత్రి మసక వెలుతురులో ప్రదీప్ చేయి పట్టుకుని ఆత్మీయంగా నొక్కుతూ.

"అలాగా..." అతడు అన్యమనస్కంగా ఉన్నాడు.

"మాట్లాడు..." అంది గాయత్రి.

"ఏం మాట్లాడను?" అడిగాడు మాటలే కరువైనట్లు.

"అదే... మాతంగరావు మూవీలో నువ్వేగా హీరో. నీ హీరోయిన్ గా మళ్లీ నటించే చాన్స్ మిస్సయింది" అంది గాయత్రి.

"ఓ చాన్స్ మిస్సయినా నువ్వు నటిస్తూనే ఉంటావ్. ఎందుకంటే... నీకు నటన బాగా వచ్చు... రీల్ పైనా, రియల్ గానూ"

"అంటే..." ప్రదీప్ అలా మాట్లాడతాడని ఊహించలేకపోయిందామె.

"అద్సరే... నేను లేని అక్కడ ఎలా జరిగింది షూటింగ్" అడిగాడు ప్రదీప్.

"నీకు తెలీని షూటింగేంటీ? సైలెన్స్ ... స్టార్ట్ కెమెరా... యాక్షన్. అంతేగా"

"కేవలం అంతేనా?"

"కాక..."

"అంతే అయితే... ఏడాదికి ఇన్ని వందల సిన్మాలెందుకు ప్రొడ్యూస్ అవుతాయి. ఇన్నికోట్లమంది సినిమానే ఆరాధిస్తూ బతికేయడమేంటీ? సినిమాల్నే చూస్తూ జనాలు వెర్రెక్కిపోవడమేంటీ? స్టార్ట్ కెమెరా... యాక్షనే కాదు. సినిమా అంటే మేజిక్" అన్నాడు ప్రదీప్.

"కరెక్టే..." అంది అతడితో వాదించలేక గాయత్రి.

"నేనడిగింది షూటింగ్ నువ్వు ఎంజాయ్ చేసావా?" అన్నాడు.

"దేన్నయినా ఎంజాయ్ చేస్తూ చేయాల్సిందేగా. కష్టపడుతూ చేస్తేనే మంచి రిజల్ట్ వస్తుంది" అందామె.

"ఇవన్నీ బాగానే ఉన్నాయి. మరి, చెన్నయ్ నుంచి ఒక్క కాల్ నాకు చేయలేదే. హీరో మారగానే నన్ను మరచిపోయావా?" అడిగాడు ప్రదీప్.

"ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు?" కస్సుమంది గాయత్రి.

"నిజం మాట్లాడుతున్నా. హీరో సాగర్ నిన్ను గట్టిగా కౌగిలించుకున్నాడా? నీ పెదాల్ని తన పెదాల్లోకి తీసుకుని గాడమైన ముద్దులిచ్చాడా? డ్యూయెట్ సాంగ్ పిక్చరైజేషన్ లో అతడేం చేసాడు?"

"అంటే... నన్ను అనుమానిస్తున్నావా?"

"కాదు... అక్కడేం జరిగిందో తెలుసుకుంటున్నా. పేరుకి స్క్రీన్ లవ్. డ్యూయెట్ సాంగ్ పిక్చరైజేషన్. కెమెరా ముందు ప్రొవోకింగ్ ఫోజులు. కెమెరా పక్కకు వెళ్లగానే ఏమీ తెలియనట్లు అమాయకపు చూపులు. నంగనాచివి" అన్నాడు ప్రదీప్.

ఆ తర్వాత - "నా కన్నీ తెలుసు. చెన్నయ్ లో నువ్వుండగా ఎవ్విరి సెకండ్ తాజా కబురు అందుతూ వచ్చింది. షూటింగ్ లో సాగర్ కాస్త ఓవర్ చేయడం... నువ్వు పట్టించుకోనట్లు బిహేవ్ చేయడం... లిప్ లాక్ సీన్ లో యాక్ట్ చేయడం... నువ్వు ఎంకరైజ్ చేయడం... హోటల్లో నీ రూంలోకి అతడు రావడం... నవ్వుతూ తుళ్ళుతూ అర్ధరాత్రి దాకా ముచ్చట్లాడుకోవడం... ఏం... సాగర్ కి లైనేస్తున్నావా?" అడిగాడు ప్రదీప్.

"స్టాపిట్..." గట్టిగా అరిచింది గాయత్రి.

"నాగురించి ఏమనుకుంటున్నావు నువ్వు. రోజుకొకడితో తిరిగేదాన్ననుకుంటున్నావా?"

"కాదు... సిన్మా సిన్మాకీ చొక్కాలు మార్చినట్లు హీరోని మార్చేదానివనుకుంటున్నా"

"అదేమాట నేన్నీకు చెప్తే..."

"హీరోయిజం. పుస్తకాల్లో చదవలేదా... పదిమంది ఆడవాళ్లని మేంటైన్ చేయగలవాడే దక్షిణనాయకుడు" శాడిస్టిక్ గా నవ్వాడు ప్రదీప్.

"నువ్వు ఎందుకిలా మారావ్?"

"సాగర్ కి నువ్వేం చెప్పావ్?"

"ఏం చెప్పాననుకుంటున్నావ్?"

"వాడు నిన్ను ప్రపోజ్ చేసాడా లేదా?"

"అదే పని నువ్వూ చేసావుగా..." అడిగింది గాయత్రి.

"చేసాను... ఇక్కడ హైదరాబాద్ లో నాతో డేటింగ్... అక్కడ చెన్నయ్ లో సాగర్ తో హోటల్ రూంలో మీటింగ్. ఎంత నెరజాణవి? అంతా సాగర్ చెప్పాడు"

"సాగర్ చెప్పాడా?" ఆశ్చర్యపోయింది గాయత్రి.

"ఔను... సాగర్ నా ఫ్రెండ్. షూటింగ్ లో జరిగిన ప్రహసనం గురించే కాదు... అతడి లవ్ ప్రఫోజల్ గురించి నాకు చెప్పాడు"

"మరి... నువ్వేమన్నావ్?"

"ఏమంటాను. నువ్వేంటో తెలుసుకునే అవకాశం చిక్కిందనుకుని సాగర్ చెప్పేవన్నీ వింటూ వచ్చాను" అన్నాడు ప్రదీప్.

"నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్లు సాగర్ కి చెప్పలేదా?" అడిగిందామె.

"ఎందుకు చెప్పాలి? మనది లవ్ కాదు... డేటింగ్"

"ఆ డేటింగ్ గురించైనా చెప్పాలి కదా? డేటింగ్ అంటే ఒకర్నొకరు అర్ధం చేసుకోవడం అన్నావ్. నన్ను ఇదేనా నువ్వర్ధం చేసుకున్నది"

"ఔను... నిజమే. డేటింగ్ అంటే అర్ధం చేసుకోవడమే. అదే చేసుకుంటున్నానిపుడు. సినిమాల్లో తెరపై ప్రేమ నటించే హీరోయిన్ తెరవెనుక కూడా ప్రేమని నటిస్తుందని తెలుసుకుంటున్నా..." చెప్తుండగా అతడి సెల్ ఫోన్ రింగైంది. స్క్రీన్ పై కనిపించిన పేరు చూడగానే ప్రదీప్ మోహంలో కాంతి.

"హాయ్... అనూషా?" అంతవరకున్న చిరాకు ఎటు మాయమైందో ఏమో... పంచదార అపుడే తిన్నట్లు ఎంతో స్వీట్ గా పలకరించాడు.

"ఎక్కడున్నావ్?" అడిగాడు.

తర్వాత - "బిజీయేం కాదు... ఎవరో పాతదోస్త్ కలిస్తే మాట్లాడుతూ కూచున్నాం. అర్జంట్ వర్కేం లేదు. ఓ హాఫెనవర్ లో అక్కడుంటా కదా?" అంటున్నాడు ప్రదీప్.

"అనూష ఎవరు?" అడిగింది గాయత్రి ఆమెతో అతడు మాట్లాడడం పూర్తయ్యాక.

"నీకు తెలీదా... గాయత్రి అవుట్. అనూష ఇన్. మాతంగరావు కొత్త సినిమా హీరోయిన్. మాంచి కత్తిలాటి ఫిగర్. ఒక్క చూపుతోనే నా గుండె కోసేసింది"

"మరి... మన సంగతి"

"ముందు సాగర్ సంగతి తేల్చు. ఆ తర్వాత మన సంగతి మాట్లాడుకుందాం" అన్నాడు ప్రదీప్ కనీసం 'బాయ్' చెప్పకుండా బయటకి వెళ్తూ.

ప్రదీప్... సాగర్. రీల్ హీరోలు. రియల్ గా వాళ్ళెవరు?

ఆలోచిస్తోంది గాయత్రి. ఇంతలో ఇన్ బాక్స్ లో ఓ ఎస్ఎంఎస్ వచ్చిపడింది.

'మేడం... మిమ్మల్ని హీరోయిన్ గా తప్పించారని తెలిసింది. వెరీసారీ - మీ అభిమాని" వెంటనే, ఆమెకి జర్నలిస్ట్ సుదర్శన్ గుర్తొచ్చాడు, అతడికి కాల్ చేసింది.

"హలో..." అన్నాడు సుదర్శన్.

"ఇపుడు మీరు నా సెల్ కి మెసేజ్ పంపించారా?" అడిగింది గాయత్రి.

"లేదే... అదే మెసేజ్ మేడం?" సుదర్శన్ అడిగాడు.

"ఏం లేదు..."

"అంటే... ఏదో ఉంది" అనుకున్నాడు సుదర్శన్. ఆ 'ఏదో' సుదర్శన్ కంప్యూటర్ మౌస్ నుంచి జాలువారి...'నవతార' పత్రికలో ఓ ప్రముఖ వార్తగా ప్రచురితమైంది.

"హీరోయిన్ గాయత్రి సెల్ కి గుర్తుతెలియని మెసేజ్ లు... ఆరా తీస్తూ జర్నలిస్ట్ లకు ఫోన్ లు".

"నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా?" గాయత్రి సెల్ లోకి మెసేజ్.

"ఔను..." గాయత్రి రిప్లయ్.

"నాకు మీరు బాగా తెలుసు" మళ్ళీ మెసేజ్.

"హీరోయిన్ ని కదా... అందులో ఆశ్చర్యం ఏముంది?"

"మీకూ నేను తెలుసు..."

"ఎలా?" వరుస మెసేజ్ ల పరంపర సాగుతోంది.

"ఊహించండి. మీకే తెలుస్తుంది" మళ్లీ పజిల్.

"సారీ... అంత ఆలోచన లేనిదాన్ని. దయచేసి మీరెవరో ఆన్సరివ్వండి" ఓ మెసేజ్ పంపింది గాయత్రి. ఆ వెంటనే మళ్లీ - "ఇండస్ట్రీలో కొచ్చిన దగ్గర్నుంచీ మీ మెసేజ్ లు అందుకుంటున్నాను. నా రీల్ జర్నీని అభినందిస్తూ... ప్రోత్సహిస్తూ అండగా నిలుస్తున్నారు. మీరెవరో తెలుసుకోవాలనుంది" అని కూడా మెసేజ్ చేసింది.

"హీరోయిన్ కాకముందు నుంచే మీరు నాకు తెలుసు. ఓ రకంగా నావల్లే మీరు హీరోయిన్ అయ్యారు" ఆ ఆన్సర్ కి ఆశ్చర్యపోయింది గాయత్రి. ఈ ఇండస్ట్రీకి తనెలా వచ్చింది?

"నువ్వు నా ఇన్నోవేషన్. ఇండస్ట్రీకి నావల్లే నువ్వు ఇంట్రడ్యూస్ అయ్యావు" ప్రొడ్యూసర్ మాతంగరావు పదేపదే చెప్పేమాటలు ఆ సమయంలో గుర్తొచ్చాయి ఆమెకి. ఆయనే కావాలని ఈ మెసేజ్ లు పంపిస్తున్నాడా? ఇండస్ట్రీలో మంచి నిర్మాత. కొత్తకొత్తవాళ్ళని ఎంకరేజ్ చేసే మనస్తత్వం ఉన్నవ్యక్తి. ఆయనకిలా మెసేజ్ లు పంపే అగత్యం ఏముంది? ఆయనతో కావల్సినంత పరిచయం ఉంది. కలిసి పనిచేశాం. ఏదో కోపంతో లేటెస్ట్ ప్రాజెక్ట్ నుంచి తనని తప్పించాడు. అంతే తప్ప... ఆయన ఇలా మెసేజ్ లు పంపిస్తాడనిపించడం లేదు.

ఆలోచిస్తుంటే... బుర్ర వేడెక్కిపోతోంది గాయత్రికి.

"ఫ్లీజ్... ఇవాళే మీరెవరో నాకు తెలియాలి. ఇక, ఈ సస్పెన్స్ భరించలేను. మీ మెసేజ్ లు అందుకున్న తర్వాత చాలాసార్లు కాల్ చేసాను. కానీ, కావాలని మీరే స్పందించలేదు" మళ్లీ ఓ మెసేజ్ పంపించింది.

"ధీరజ్..."

ఆ మూడక్షరాల పేరు ఎక్కడో విన్నట్లుంది... ఎక్కడ వింది?

(... ఇంకా వుంది)

మరిన్ని సీరియల్స్
eru daatina keratam stroy by satyanarayana rao