Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

అనుబంధాలు - పద్దెనిమిదవ భాగం

Anubandhaalu eighteenth Part

వాళ్ళిద్దరి దుస్తుల తీరూ, స్టయిల్ చూడ్డానికి ఫారినర్స్ లా ఉన్నారు తప్పితే భారతీయ పద్ధతులు గాని, తెలుగు సాంప్రదాయంగాని మచ్చుకి కూడా కనబడడం లేదు. వాళ్ళలో ఇక్కడికొచ్చాక కూడా అణుమాత్రమైనా మార్పు రాకపోవడం డాక్టర్ గోపాల్ కి చాలా బాధ కల్గిస్తోంది.

అన్న రామలింగేశ్వర్రావు, బావ రఘునాథ్ లు వేరు వేరు సోఫాల్లో కూర్చున్నారు. మిగిలిన కుటుంబ సభ్యులంతా అక్కడే ఉన్నారు. ఒక్క నవీన్ తప్ప. అతడు ఏదో పనిమీద గుంటూరు వెళ్లి ఇంకా తిరిగి రాలేదు.

చీమ చిటుక్కుమన్నా వినబడేంత నిశ్శబ్ధంగా ఉందక్కడ.

"నేను వచ్చింది మీలో ఎంతవరకు మార్పు వచ్చిందో చూడడానికి... మీలో కొంచెం కూడా మార్పు రాలేదని అర్ధమవుతుంది. చెప్పండి మీ పద్ధతి మార్చుకోరా? ఎందుకిలా చేస్తున్నారు?" తిరిగి తనే వాళ్ళిద్దర్నీ నిలదీస్తున్నట్టు అడిగాడు.

వాళ్ళు మౌనమే సమాధానంగా అలాగే నిలబడున్నారు.

"జాలీగా తిరగడం, మంచినీళ్ళలా డబ్బు ఖర్చుచేయడం ఇదే జీవితమనుకుంటున్నారా? మనం అమెరికాలో ఉన్నా మన పునాదులు ఇక్కడే ఉన్నాయి. ఇవి తెలుసుకుని ఆచరించాల్సిన బాధ్యత మీకు లేదా?" అడిగాడు.

"సారీ డాడ్! మేం అమెరికాలో ఎలా ఉన్నామో, ఇక్కడా అలాగే ఉన్నాం. లేదంటే ఇక్కడ మాకు నచ్చిన వసతులు లేకపోవడంతో నగరాలకు వెళ్లి రావలసి వస్తోంది. ఖర్చులు పెరుగుతున్నాయి. మాకిక్కడ నచ్చలేదు. మీవెంట అమెరికా వచ్చేస్తాం" అన్నాడు అనంత్.

"అవును. ఇక్కడ వుండడం మావల్ల కాదు. మేము వచ్చేస్తాం" అంటూ అన్నయ్య ప్రతిపాదనను బలపర్చింది శివాని.

"షటప్. పొరపాటు చేశాను. చాలా పెద్ద పొరపాటు చేశాను. పిల్లల్ని వదిలి ఉండలేనని మీ అమ్మ బాధపడుతుంటే చూడలేక మిమ్మల్ని మా దగ్గరే ఉంచుకొని పెద్దవాళ్లని చేసి చాలా పెద్ద తప్పు చేశాము. మీ ఇద్దర్నీ చిన్నప్పుడే ఇక్కడ వదిలేసి మా దారిన వెళ్లిపోయుంటే పద్ధతిగా పెరిగి వుండేవాళ్ళు. చూడండి. వారసత్వంగా మీకివ్వడానికి అవసరమైన డబ్బు, ఆస్తులు సంపాదించాను గాని, తరతరాల మన తెలుగు సంస్కృతిని మీకు ఇవ్వలేకపోయాను. అవి మీరు నేర్చుకుంటారనే ఇక్కడికి పంపించాను. నేర్చుకోవాలి. అంతే!"

"మాకు అమెరికా సంస్కృతే బాగుంది. అది చాలు మాకు" ధైర్యం చేసి చెప్పాడు అనంతసాయి. "మాకు చాలదు. మీలో మార్పు రావాలి. అది నాకు ముఖ్యం. వీళ్ళంతా మనవాళ్ళు. వీళ్ళంతా ఎలా ఉంటున్నారో చూస్తూ కూడా ఇక్కడి పద్ధతులు నేర్చుకునే తెలివితేటలు కూడా మీకు లేవంటే మీరు నా పిల్లలని చెప్పుకోవడానికే నేను సిగ్గుపడుతున్నాను. నా పెంపకం మిమ్మల్ని ఇంత అధ్వాన్నంగా చేసినందుకు చాలా బాధపడుతున్నాను."

"అదికాదు డాడీ!" ఏదో చెప్పబోయాడు అనంత్.

"ఇంకేం చెప్పకు" అంటూ అతడి మాటల్ని ఖండించాడు గోపాల్. "మీరేం చెప్పినా నేను వినడానికి సిద్ధంగా లేను." హెచ్చరించాడు.

"వినకపోతే ఎలా డాడీ, అమెరికాలో మన ఫోన్ నెంబర్లు, ఈ మెయిల్ ఐడీలు, అడ్రస్ అన్నీ మార్చేశారు. దీనికిదంతా?" అని నిష్టూరంగా అడిగింది శివాని.

"మీ మంచికోరే అంతా. ఇంతకు మించి మీకు వివరణ ఇవ్వవలసిన అవసరం లేదు. నేను రేపే వెళ్ళిపోతున్నాను. ఫైనల్ గా మీకు ఇంకొక అవకాశం ఇస్తున్నాను. నెల తరువాత మళ్ళీ వస్తాను. నేను వచ్చేసరికి మీలో మార్పు రావాలి. మన సంస్కృతిని సాంప్రదాయాన్ని అలవర్చుకోవాలి. ఖర్చు తగ్గించుకోవాలి. ఒక మంచి పద్ధతిలో సక్రమంగా జీవించడం అలవర్చుకోవాలి. అలా ఇవన్నీ మీరు నేర్చుకోలేదంటే ఈసారి వచ్చినప్పుడు నేనేం చేస్తానో నాకు తెలియదు జాగ్రత్త." అంటూ హెచ్చరించాడు గోపాల్. తరువాత అంతా భోజనాలకు లేచారు. వాళ్లు భోజనాలు చేస్తుండగానే తిరిగి వచ్చాడు నవీన్. నవీన్ గానీ, మహేశ్వరి గానీ ఆ అన్నాచెల్లెళ్ళ నడవడిక ఎంతో ముచ్చటేసింది. అంతా కలిసి భోజనాలు ముగించేసరికి రాత్రి పదకొండు దాటింది. నిజానికి మరునాడే వెళ్ళిపోవాలనుకున్నాడు గోపాల్. కాని అంత దూరం నుంచి మరునాడే వెళ్ళిపోతే ఎలా? అంటూ అతన్ని ఆపేశారంతా.

తండ్రి అక్కడున్న మూడ్రోజులు అనంతసాయి, సాయిశివానీలు బుద్ధిమంతుల్లా ఇంటిపట్టునే ఉన్నారు. నాలుగో రోజు తండ్రి అమెరికాకు ప్రయాణం కాగానే తామూ వస్తామంటూ మరోసారి మారాం చేశారు అన్నాచెల్లెళ్లిద్దరూ. వాళ్లకి నయానో, భయానో సర్దిచెప్పి అటు బావగారితోను, ఇటు అన్నగారితోను విడివిడిగా మాట్లాడి, అందరి వద్దా సెలవు తీసుకొని బయల్దేరాడు గోపాల్. రామలింగేశ్వర్రావు తమ్ముడిని కారులో హైదరాబాద్ కి తీసుకెళ్ళి ముంబై విమానం ఎక్కించి వచ్చాడు. చెప్పినట్టుగానే వారం తిరిగే లోపల డెట్రాయిట్ లోని తమ ఇంటికి చేరుకున్నాడు డాక్టర్ గోపాల్. జర్మనీ ట్రిప్పు చాలా బాగా జరిగిందని, చాలా సంతోషంగా జర్మనీ గురించి అక్కడ కాన్ఫరెన్స్ గురించి ఉన్నవి లేనివి ఉత్సాహంగా చెప్పాడు. తల్లి అన్నపూర్ణేశ్వరి, భార్య సత్యవతి అతడి మాటల్ని ఆశ్చర్యంగా విన్నారు గానీ, అతడి ముఖంలో మునుపటి ఉత్సాహంగాని, కళగాని లేకపోవడం వాళ్ళని ఆశ్చర్యపరిచింది. మనిషి చాలా అలసిపోయినట్టు కన్పిస్తున్నాడు, నవ్వులో జీవం లేదు. కొడుకు వృత్తికి అంకితమైన మనిషి కాబట్టి తీరికలేని పనుల ఒత్తిడిచేత అలా ఉన్నాడని సరిపెట్టుకుంది అన్నపూర్ణేశ్వరి.

అతడిని ఏమీ అడగలేదు. కానీ సత్యవతి విషయం వేరు. పెళ్లైనప్పట్నుంచి నీడలా అనునిత్యం భర్త వెంటనే ఉన్న స్త్రీ ఆమె. అతడి గురించి బాగా తెలుసు. అందుకే అతను ఏదో ఒక విషయాన్ని కావాలని దాస్తున్నాడని ఊహించింది. ఇప్పటికైతే అడగలేదు గానీ ఆ రాత్రి బెడ్ రూమ్ తలుపులు మూసాక, భర్త పక్కన కూర్చుని ముఖంలోకి చూసింది. అప్పుడు కూడా దీర్ఘాలోచనలోనే ఉన్నాడు గోపాల్. ఏం జరిగింది సున్నితంగా అడిగింది?

"ఏమిటి?" ఆలోచనల నుంచి బయటపడుతూ అడిగాడు.

"మీ జర్మనీ ట్రిప్ మీరు చెప్తున్నంత హేపీగా లేదు. నాకు అర్ధమైంది. నిజం చెప్పండి మీరు జర్మనీకే వెళ్ళారా?

"అవును నీకెందుకొచ్చిందా అనుమానం?"

"మిమ్మల్ని చూస్తే ఎవరికైనా అనుమానం వస్తుంది. పిల్లలిద్దర్నీ బలవంతంగా ఇండియా పంపిస్తున్నప్పుడు కూడా బాధలేదు. కానీ ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే బాధగా ఉంది. మీలో దిగులు, నిరాశ కనబడుతున్నాయి. ఇన్నేళ్ళ మన కాపురంలో ఎప్పుడు మిమ్మల్నిలా చూడలేదు." అంది బాధపడుతూ. భార్యాభర్తల అనుబంధం ఎంతో పవిత్రమైంది. అమెరికాలో ఉన్నా భారతీయ వివాహ వ్యవస్థ మీద ఉన్న నమ్మకం వీరిద్దరిలోనూ చెక్కుచెదరలేదు. భార్యాభర్తల అనుబంధం ఎంతో పవిత్రమైంది. ఒకరంటే ఒకరికి ఎనలేని ప్రేమ. ఆమె మానసికంగా ఇప్పటికే పిల్లలు దూరంగా ఉన్నందుకు నలిగిపోతోంది. ఇప్పుడు తన గురించి కలత చెందుతోంది. భార్యాభర్తల మధ్య రహస్యాలు ఉండకూడదంటారు. తను కొన్ని విషయాల్లో ఆమెకు చెప్పకుండా దాచి తప్పు చేస్తున్నాడేమో అన్పించింది.

ఆఖరికి తను వెళ్ళింది జర్మనీకి కాదు. ఇండియా వెళ్లి పిల్లల్ని చూసి వచ్చాను. అని భార్యకు చెప్పేయాలని నోటిచివరి వరకు వచ్చిన మాటల్ని మింగేసి పేలవంగా చిన్న నవ్వు నవ్వేసి ఊరుకున్నాడు.

"మీరు నవ్వితే నాకేమీ అర్ధం కాదు. నిజం చెప్పండి..." అంది సత్యవతి.

పెద్దగా నిట్టూర్చి ఆమె ముఖంలోకి చూసాడు.

"నా మాటమీద నీకు నమ్మకంలేదా...? నేను వెళ్ళింది జర్మనీకే. అందులో సందేహించాల్సింది ఏమీలేదు. ట్రిప్పు కూడా చాలా బాగా జరిగింది" అన్నాడు.

"అంతబాగా జరిగితే మరెందుకు మీలో నిరుత్సాహం?" అనుమాన నివృతిత్త కోసం అడిగింది.

"నిరుత్సాహం కాదు, దిగులు... బాధ. బెర్లిన్ లో ఉండగా ఎందుకో గాని ఓసారి ఇండియా ఫోన్ చేసి అన్నయ్యతో మాట్లాడాలన్పించింది. ఫోన్ చేసాను. నేను ఫోన్ చేసిన
సమయానికి పిల్లలు మున్నలూరులో లేరు...

హైదరాబాద్ వెళ్లారట. వాళ్లకి మనం పుట్టిపెరిగిన ఊరు నచ్చలేదు. వాళ్ల విందులు, వినోదాలు, విలాసాల కోసం హైదరాబాదు, చెన్నై, విజయవాడ బయటి ఊళ్ళకి వెళ్ళేసి వస్తున్నారు. అమెరికా సంస్కృతి నుండి బయటపడలేకపోతున్నారు. డబ్బు దుబారా చేయడం, సరదాగా తిరగడం అదే జీవితం అనుకున్నారు.

అన్నయ్య, బావగారు, వదిన, మా చెల్లెలు ఎంతచెప్పినా వాళ్లల్లో కొంచెం కూడా మార్పు రాలేదు. బాధ్యత లేకుండా తిరుగుతుంటే ఎవరు మాత్రం హర్షిస్తారు చెప్పు. వీళ్లను భరించడం నావల్ల కాదురా వెనక్కి పంపించేస్తాను" అని అన్నయ్య అక్కణ్ణుంచి విషయాలు చెబుతుంటే నాకు చాలా బాధకల్గింది. ఇక్కడ అమ్మ దిగులు పడుతుందనే ఉద్దేశంతో వాళ్లల్లో చాలా మార్పు వస్తుంది, పద్ధతిలోకి వస్తున్నారంటూ అబద్ధాలు చెప్పించాను. అది నిజం కాదని అమ్మకు తెలిస్తే ఎంత బాధపడ్తుందోనని భయంగా ఉంది. వాళ్లని దారిలోకి తేవడం ఎలాగో అర్ధం కావడం లేదు" అన్నాడు బాధగా.

"పోనీ వాళ్లని వెనక్కి పిలిపించేయండి. ఆ ప్రయత్నాలేవో ఇక్కడే చేద్దాం. వాళ్లని ఎక్కడో దూరంగా ఉంచి, మనం ఇక్కడ బాధపడడం దేనికి?"

"నిజమే పిలిపించవచ్చు. కానీ అలా వాళ్ళు వెనక్కి వచ్చిన మరుక్షణం మా అమ్మ ఇండియాకు బయల్దేరి వెళ్లిపోతుంది. వీళ్లు మారరు. వీళ్లల్లో మార్పు వస్తే తప్ప నా చెల్లెలి పిల్లలతో పెళ్ళిళ్ళు జరగవు. అమ్మ ఇండియా వెళ్లినా సంతోషంగా ఉండలేదు. వీళ్ల పెళ్ళిళ్ళ గురించే బెంగ పెట్టుకుంది. అప్పుడు సమస్యలు ఇంకా పెరుగుతాయిగానీ తరగవు. నీకు తెలీదు సత్యా... వాళ్లని ఇప్పుడే వెనక్కి రప్పించడం మంచిది కాదు. కొద్దిరోజులుపోతే వాళ్లే దారికొస్తారు. అదే అన్నయ్యతో జాగ్రత్తగా చూసుకోమన్నాను."

"ఒకవేళ వాళ్లల్లో మార్పు రాకపోతే ఏం చేయాలి?" అతడి ముఖంలోకి సూటిగా చూస్తూ బాధగా అడిగింది. ఆమె కళ్ళల్లో దూకటానికి సిద్ధంగా ఉన్న కన్నీళ్లను చూడగానే గోపాల్ మనసు చెదిరింది. ఆమెను వళ్ళోకి తీసుకొని కన్నీరు తుడిచాడు.

"నీ బాధ అర్ధం చేసుకోగలను. మనం ఏం చేసినా వాళ్ల మంచికోసమే చేస్తున్నాం. కొద్దిరోజుల్లోనే వారు మారతారన్న నమ్మకం ఉంది. కష్టసుఖాల్లో నా వెన్నంట నడిచి వచ్చినదానివి. ఈ విషయంలో కూడా నీ సహాయం నాక్కావాలి. నాకు వాళ్ళంటే ఎంత ప్రేమో నీకు తెలియదా?" అంటూ అడిగాడు లాలనగా.

"నేనెప్పుడూ మీ వెన్నంటే ఉన్నాను. నా బాధంతా అత్తయ్య గురించే. ఆవిడకు నిజం తెలిస్తే క్షణం ఇక్కడ ఉండరు." అంది.

"అమ్మకు నిజం తెలియకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీది. సరేనా? కొద్దిరోజులు పోతే అన్నీ సర్దుకుంటాయి."

రోజులు గడిచిపోతున్నాయి. పదిరోజుల తర్వాత మున్నలూరు ఫోన్ చేశాడు గోపాల్. రామలింగేశ్వర్రావు మాట్లాడాడు.

"లేదురా. వాళ్లు మారతారన్న ఆశ అడుగంటింది. అమెరికా తీసుకుపోలేదని నీ మీద బాగా అలిగినట్టున్నారు. ఆ కోపంలో మరింత ఖర్చులు చేస్తున్నారు. ఏం చేయాలో అర్ధం కావడం లేదు" అంటూ పరిస్థితి వివరించి మరింత బాధపడ్డాడు.

"అన్నయ్యా! అమ్మ ఫోన్ చేస్తే వాళ్లు పూర్తిగా మారిపోయారని అబద్ధం చెప్పు. అమ్మకి అనుమానం రాకుండా చూసుకో. మరో వారం పదిరోజుల్లో మీ వద్దకు వస్తున్నాను. ఏం చేయాలో ఆలోచిద్దాం. కానీ నేను వచ్చినట్టుగానీ, రాబోతున్నట్టుగానీ, అమ్మకిగానీ, సత్యవతికి గానీ తెలియకూడదు. "ఎంతకాలం రా ఇలా? ఎందుకొచ్చిందీ వాళ్ళిద్దరికీ ఇక్కడ నచ్చలేదు. అమెరికా పంపించేస్తాను." "ఆ పని మాత్రం చేయకు. వాళ్లు అక్కడే ఉండాలి. నేను వస్తున్నాగా." అంటూ లైన్ కట్ చేశాడు. ఇదే విషయం గురించి గోపాల్ తీవ్రంగా ఆలోచిస్తూనే ఉన్నాడు. ఎంతగా అంటే, ఇప్పుడతను అమెరికాలోని ఏ ఆపరేషన్లూ ఒప్పుకోవడం లేదు. డెట్రాయిట్ లోని తన ఆసుపత్రికే పరిమితం అయ్యాడు. అవసరమైన ఆపరేషన్లు ఏవో ఇక్కడే చేస్తున్నాడు. ఇండియా నుంచి వచ్చాక డెట్రాయిట్ నగరం వదిలి బయటకు పోలేదు గోపాల్. కాస్త తీరిక దొరికితే చాలు పిల్లల గురించే ఆలోచన. ఈ పరిస్థితుల్లోనే ఒక రోజు ఉదయం ఎప్పటిలాగే తమ ఇంటినుంచి కారులో ఆస్పత్రికి బయలుదేరాడు గోపాల్.

ఆస్పత్రికి రాగానే తన ఛాంబర్ లో కూర్చుని కాసేపు పేపర్ చూడడం అతనికి అలవాటు. న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్ లాంటి ప్రముఖ అమెరికా పత్రికలే కాకుండా బ్రిటన్, జర్మనీకి చెందిన కొన్ని ముఖ్య పత్రికలు కూడా ఆస్పత్రికి తెప్పిస్తారు.

తన చాంబర్లోకి వచ్చి కూర్చోగానే ముందుగా  వాషింగ్టన్ పోస్ట్ పేపర్ తీసాడు. పత్రిక తెరిచీ తెరవగానే ముందుగా షేర్ల గురించి ఆలోచించడం అతనికి అలవాటు. అందుకు తగిన కారణం కూడా ఉంది. డాక్టర్ గోపాల్ తన అమెరికా సంపాదన ఆరంభించిన నాటి నుంచే షేర్ మార్కెట్ల మీద గల ఇంట్రెస్ట్ కొద్దీ షేర్లు అమ్మడం, కొనడం కొనసాగించేవాడు. అదృష్టం కొద్దీ ఏ షేర్లు కొన్నా అవి లాభాల పంట పండించేవి. ఒక పక్క డాక్టర్ వృత్తిలోనే ఉంటూ చాలాకాలం షేర్ల వ్యాపారం చేసాడతను. తర్వాత డాక్టర్ వృత్తిలో క్షణం తీరిక లేని బిజీ క్షణాలు మొదలవగానే ఆ వ్యాపారం ఆపేసి తన పెట్టుబడి మొత్తాన్ని జిన్ లేబోరేటరీస్ షేర్ల మీదే పెట్టాడు. ఆ డబ్బు ఇండియా కరెన్సీలో ఐదువందల కోట్ల రూపాయలు ఉంటుంది. అందుకే పేపర్ తీయగానే ముందుగా ఆయన్ని ఆకర్షించేవి షేర్ల మార్కెట్లే. యధాలాపంగా షేర్ల బిజినెస్ పేజీలోకి చూడగానే పిడుగులాంటి వార్త కన్పించింది. ఊహించని వార్త అది.

ఆ వార్తా సారాంశం ఏమిటంటే. జిన్ కంపెనీ కుప్పకూలిపోయింది. నిన్నటి వరకు వంద డాలర్లు పలికిన జిన్ లేబొరేటరీస్ షేర్ విలువ ఐదు డాలర్లకు పతనం కావడంతో ఆ కంపెనీ దివాళా తీసింది. కాసేపు ఆ కంపెనీ దివాళా తీయడానికి దారితీసిన పరిస్థితులు చదువుతూనే అలాగే ఉండిపోయాడు. తర్వాత పెద్దగా కేక వేస్తూ ఉన్నట్టుండి టేబుల్ మీదకు వాలిపోయాడు. ఆ కేక వింటూనే స్టాఫ్ పరిగెత్తుకుంటూ వచ్చారు. ఒక్కసారిగా కలకలం రేగిందక్కడ.

అత్యవసరంగా అతన్ని స్పెషల్ వార్డుకు తరలిస్తూ ఈ విషయాన్ని ఇంటికి ఫోన్ చేసి సత్యవతికి తెలియపర్చారు డాక్టర్లు.

అత్తని వెంటబెట్టుకొని వెంటనే కారులో తన ఆస్పత్రికి బయల్దేరింది సత్యవతి. కలిమిలేములు కావడి కుండలోయ్ అన్నాడు సినీకవి. జీవితంలో వెలుగు నీడల్లా సుఖ దుఃఖాలు వస్తుంటాయి, పోతుంటాయి అన్నాడో పెద్దమనిషి.

భవబంధాల విషయంలో మనిషి తామరాకు మీద నీటి బొట్టులా వ్యవహరించాలని, అన్నింటినీ సమదృష్టితో చూడాలని గీతా సారాంశం, ఆటుపోట్లును తట్టుకుంటూ నది తన ఉనికి ఎలా కాపాడుకుంటుందో అలాగే మనిషి కూడా అన్నింటినీ తట్టుకొని నిబ్బరంగా మనుగడ సాగించాలంటారు తలపండిన అనుభజ్ఞులు. అయితే ఇదంతా వినడానికో, చెప్పుకోవడానికో బాగానే ఉంటుంది. కానీ ఆయా సమయాల్లో కష్టాల్ని, బాధల్ని ఎదుర్కొంటున్న వారికి తెలుస్తుంది అసలైన బాధేమిటో. ఒకటికాదు రెండుకాదు. ఏడాదిలో ఒక తుఫాన్ వచ్చి ఇసుక మేటను ఎగరేసుకుపోయినట్టు కోట్ల సంపాదన ఒక్కసారికే కుప్పకూలిపోతే ఆ మనిషి కూడా కుప్పకూలకుండా ఎలా ఉండగలడు?

ప్రస్తుతం డాక్టర్ గోపాల్ పరిస్థితి అదే! అదృష్టం కొద్దీ ప్రాణాలతో మిగిలాడు గానీ, లేదంటే మనిషి కూడా దక్కేవాడు కాదు. విషయం తెలీగానే అత్తాకోడల్లిద్దరూ హడలిపోయి కారులో బయల్దేరి ఆస్పత్రికి వచ్చేసారు.

(... ఇంకా వుంది)

http://www.suryadevararammohanrao.com/

మరిన్ని సీరియల్స్
nadiche nakshatram telugu serial twelth part