Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> కథలు >> మమకారంలో తేడాలా ?

mamakaaram lo tedaalaa

విడాకుల కోసం కేసు వేసిన భార్యాభర్తలకు కౌన్సలింగు కి రిఫర్ చేసి తిరిగి రెండు వారాలకు వాయిదా రాసి  తన ఛాంబరు లోకి వచ్చింది వనిత .

తర్వాత కేసుకు సంభందించిన కాయితాలు యెదురుగా టేబుల్ మీద వున్నాయి . కాళీ కప్పు టేబుల్ మీద పెట్టి కాయితాలు చేతిలోకి తీసుకుంది .

కేసు పూర్తి గా చదివేక తనకు కలిగిన సందేహాలని నెంబరు వారీగా రాసుకుంది .

" మేడమ్ కేసు రెడీ , హాజర్ చెప్పమంటారా ? " అన్న పిలుపుతో తలెత్తి సరే అన్నట్టుగా తలాడించి పేపర్లు అందించి అతని వెనుకే నాలుగో నంబరు రూము లోకి నడిచింది .

కేసు పది సంవత్సరాల ఆరతి కష్టడీ గురించి ఆమె తండ్రి కమల్ ఆరతి తనకే చెందాలని వేసిన కేసు , తల్లి కాంచన అందుకు అంగీకరించడం లేదు . న్యాయస్థానం తమకు పూర్తి న్యాయం చేస్తుందనే నమ్మకంతో కోర్టుని ఆశ్రయించేరు అని గుమస్తా స్థూలంగా కేసుని కోర్టుకి వినిపించేడు

వనిత ముగ్గురినీ పరీక్షగా చూసింది . మధ్యతరగతి కన్నా ఒక మెట్టు కిందన వున్న కుటుంబమని వారిని చూడగానే తెలుస్తోంది . వారిచ్చిన వివరాల ప్రకారం తండ్రి ఆరతిని కాంచన కిడ్నాప్ చేసి నిర్భందించి నట్లు అభి యోగంలో వుంది . కాంచన పిల్ల యిష్ఠప్రకారమే తన దగ్గరకి వచ్చినట్లు చెప్తోంది .

వనిత కమల్ ని కాంచనని చూస్తూ యిద్దరికీ సమయం యివ్వబడుతుందని , వారు చెప్ప దలుచుకున్నది క్లుప్తంగా చెప్పుకోవచ్చని , యిద్దరి వాదనలూ విన్న తరువాత తీర్పు చెప్పబడుతుందని చెప్పి ముందుగా కమల్ ని చెప్ప మంది .

కమల్ చిన్న టైలరింగు పనులు చేసి జీవనం సాగిస్తున్న సామాన్యడు . కాంచన కలలలో బతికే మనిషి , యిద్దరికీ యెక్కడా పొంతన కుదరలేదు . కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఆరతికి తల్లి తండ్రులయేరు . పిల్ల రాక తో మరింత అసహనానికి గురైన కాంచన తన కలల పురుషుడిని యింటికి తెచ్చి తనకూ యింటికి యెటువంటి సంబంధం లేదని కుండబద్దలకొట్టినట్లు చెప్పి యేడుస్తున్న పసిపిల్లని వదలి వెళ్ళిపోయింది . నాలుగిళ్ళ అవతల వుంటున్న చెల్లెలి సహాయంతో పిల్లని పెంచుకుంటున్నాడు . తెలివైన పిల్ల నాలుగో తరగతి లోకి వచ్చింది . నెల్లాళ్ళ కిందట నాన్నా యెవరో నన్ను వెంబడిస్తున్నారు అంది . కిందటి గురువారం బడికి వెళ్ళిన పిల్ల యింటికి రాలేదు . పోలీసు స్టేషను లో ఫిర్యాదు చేసేడు . తనలాంటి వాడి పిల్లని డబ్బు కోసం కిడ్నాప్ చెయ్యరు . స్కూల్లో వాకబు చేస్తే గత కొన్ని రోజులుగా యెవరో ఆడమనిషి తో రోజూ ఆరతి మాట్లాడడం చూసినట్టుగా కొందరు పిల్లలు యిచ్చిన సమాచారంతో కాంచనే పిల్లని కిడ్నాప్ చేసివుండొచ్చు అనే అనుమానం తో పోలీసులు వెంటనే రంగం లోకి దిగి అదే వూరిలో మరో మూల వున్న కాంచనని పట్టుకోడం పెద్ద కష్టం కాలేదు . పోలీసులు కాంచన యింటిపై దాడి చేసేటప్పుడు ఆరతి మంచానికి కట్టి , నోటికి టేపు అంటించి స్పృహ లేని స్థితిలో లభంచింది . కాంచన దగ్గర వుంటే ఆరతి బతుకు నాశనమవుతుందని కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు కమల్ .

కాంచన కమల్ ఒక చేతకాని వాడని అతనిని వదిలి వెళ్లిన మాట నిజమేనని  ,  పిల్లమీద మమకారం చంపుకోలేక యిన్నేళ్ళ తరవాత వచ్చేనని , వయసుకి వస్తున్న పిల్ల తండ్రి దగ్గర వుండడం మంచిది కాదని , ఆరతి అన్న పేరు తాను ముద్దుగా పెట్టుకున్నదని , కమల్ ఆరతి ముద్దూ ముచ్చటా తీర్చలేడని , పిల్ల నాన్న నాన్న అని బాగా మారాం చేస్తుంటే భయం చెప్పడానికి అలా చెయ్య వలసి వచ్చిందని , పిల్ల కోసం కమల్ విధంచే యేషరతుకైనా తాను సిధ్దమేనని , అతను వొప్పుకుంటే అతనిలో కాపురం చెయ్యడానికైనా సిధ్దమేనని గోల గోల గా యేడుస్తూ స్పృహ తప్పి పడిపోయింది .

కమల్ కాంచన ప్రతిపాదనని యెంతమాత్రం ఆమోదించలేదు . ప్రేమ వున్నదయితే కట్టిపడెయ్యడం యేమిటి అంటాడు . మిగతావి యెలా వున్నా కట్టేయడం అన్న మాట వనిత కి కూడా మింగుడు పడడం లేదు .

ఇవాళ వాయిదా చెప్పెద్దాం అంటే మరో పదిరోజులవరకు కోర్టు ఖాళీ లేదు . పిల్లని అంతవరకు రిమాండు హోముకి పంపాలి . సాక్ష్యాలు తక్కువయన కేసులకు తప్ప యిలాంటి కేసులు వెంటనే పరిష్కరించేస్తారు జడ్జీలు .

తీర్పు యిచ్చెద్దాం అంటే కాస్త తికమక గా వుంది . పిల్లని తల్లితో వుండాలని తీర్పు యిస్తే యిన్నాళ్ళు మరో పెళ్లి చేసుకోకుండా పిల్లతోడిదే లోకంగా బతుకుతున్న తండ్రికి అన్యాయం చేసినట్లౌతుంది , అలాగని తండ్రి వైపు తీర్పిస్తే వయసుకి వస్తున్న పిల్లకి తండ్రి దగ్గర రక్షణ కరువౌతుందేమో అనే సందేహం ముందుకు వెళ్లనివ్వటం లేదు . ఇంతకీ యీసమస్యకి కారణం దగ్గరే జవాబు దొరుకుతుందేమో ? గతం లో చాలా సార్లు పిల్లల సహకారంతోనే యెన్నో కేసులు ఛేదించిన సంఘటనలు లేక పోలేదు .

అందుకే యేకాంతంలో ఆరతితో మాట్లాడాలని నిర్ణయించు కొంది . పిల్ల బాగా బెదిరిపోయింది , యెవ్వరికీ భయపడక్కరలేదని యెన్నోసార్లు భరోసా యిచ్చేక ఆరతి వెక్కుతూ చెప్పసాగింది .

అమ్మ మీద వ్యాసం రాయలేదని స్కూల్లో నిలబెట్టించేరు అయిదేళ్ల ఆరతిని ,    'అమ్మంటే అత్తా ' అని అడిగినందుకు నవ్వేరు తోటి పిల్లలు . ' నాన్నా అమ్మంటే ఎవరు , యెలా వుంటుంది ' అని నాన్న నడిగితే  ' దెయ్యం , దెయ్యం లా వుంటుంది ' . అన్న సమాధానం .

"  అది కాదు నాన్నా , కోమలి వాళ్ళమ్మ దానిని యెంతో ముద్దు చేస్తుందట , గోరు ముద్దలు తినిపిస్తుందట " అంటే " అవన్నీ నేను నీకు చేస్తున్నా కదరా ? , బుజ్జీ " నాన్న సమాధానం .

" అత్తేమో పల్లవి ని రోజూ పాటపాడుతూ జోకొట్టి నిద్రపుచ్చు తుందట , మరి..... నాకూ.... "

" నేనూ రోజూ నీకు జోకొడుతున్నా కదా తల్లీ " నాన్న సమాధానం .

నువ్వయితే ఒక జడే యెప్పుడూ వేస్తున్నావు , అందరూ ఒంటి పిలక ఆరతి , ముసలి పిల్ల ఆరతి , అవ్వా ఆరతమ్మా బాగున్నావా ? అని వెక్కిరిస్తున్నారు నాన్నా , అమ్ముంటే యించక్కా రెండుజడలు వేసును కదా ? "

" రేపు అత్తయ్య ని రెండు జడలు వెయ్యమంటానుగా "

అమ్మ కావాలని యింతలా చెప్పినా నాన్న అర్ధం చేసుకోడేమీ అనే వుక్రోషంతో కళ్లల్లో నీళ్ళు తిరిగేయి .

కాళ్ళు నేల కేసి  గట్టిగా  కొట్టి " నాకు అమ్మే కావాలి అమ్మేకావాలి మీరెవ్వరూ వద్దూ ......" గట్టిగా యేడ్వసాగింది .

నడ్డి మీద గట్టిగా పడ్డ దెబ్బకి యేడుపు వుదృతం యింకా పెంచింది . 

నోర్ముయ్ " అంటూ ఒంటి నిండా దెబ్బలు పడసాగేయి .

పక్కింటి సూరీ వాళ్ళమ్మ అడ్డు పడ్డంతో దెబ్బలు ఆ రోజుకి తప్పేయి , కాని తండ్రి ఆ వుగ్రరూపం ఆరతి గుండెల్లో నిలిచి పోయింది . వయసు పెరుగు తున్న కొద్దీ తల్లి గురించి తెలుసు కోవాలని , తల్లి మీద మోజు పెరగ సాగేయి ఆరతి లో .

ఆ మోజుతోనే తల్లిని గురించిన ప్రశ్నలు వేసి తన్నులు తినేది .

యెందుకో పాతమ్మ అంటే నాన్నకి కోపం , యిద్దరూ కటీఫ్ చెప్పుకొని వుంటారు , పోనీ కొత్తమ్మని తెచ్చుకుంటేనో ? ఆలోచనరావడం తడువు వరండాలో యెవరిదో డ్రెస్సు కుడుతున్న తండ్రి దగ్గరకి పరుగున వెళ్లి తన ఆలోచన చెప్పింది .

" ఆ వచ్చేది నీకు తల్లి అవదే "

" అవుతుంది నాన్నా , నేను అమ్మా అని పిలుస్తానుగా ? "

అంత చిన్న పిల్లలలో వుండే నిర్మలత్వం , వయసు , ఆలోచనా వున్న పెద్దలలో లోపించాయి యెందుకని ? , పెద్దా చిన్నా అందరూ అంత నిష్కల్మషంగా వుంటే ఈ ప్రపంచం యెంత అందంగా వుణ్ణో కదా ? .

"  విసిగించక వెళ్లవతలకి " అన్న నాన్న కళ్లల్లో కోపం ఆరతిని మాట్లాడనివ్వలేదు .

బయటికి చెప్పక పోయినా ఆరతి ఆలోచనలలో అమ్మంటే తనని యెంతో గారం చేసే మనిషి అన్నీ మంచి గుణాలున్న దేవత . యెవరూ లేనప్పుడు తల్లి యెదురుగా వున్నట్లు వూహించుకొని ఆమెతో సంభాషించడం చేసేది .

రెండు మూడు రోజులుగా మీ అమ్మని అని చెప్పి ఒకావిడ స్కూలు కి వచ్చి తనతో మాట్లాడడం , బడి దగ్గర అమ్మే ఉడికించిన శనక్కాయలు , జీళ్లు కొని యివ్వడం చేస్తోంది .

ఇంటికి వెడదాం రమ్మంటే రానంటోంది . అందరి తల్లుల్లా భోజనం సమయం లో గోరు ముద్దలు నోటికి అందించటం లేదు .

" అమ్మా అన్నం తినిపించవా అంటే " , నాకు అలవాటు లేదుగా ? , నువ్వే తినెయ్ " అనడం ఆరతికి నచ్చలే .

ఆ రోజు పుట్టిన రోజని అత్త తలస్నానం చేయించి నాన్న కుట్టిన కొత్త గౌను వేసింది . యెప్పటిలాగే లూజు లూజు గా వుంది గౌను . అమ్మ తనను చూడ్డానికి వచ్చిన రోజు తనని దగ్గరకు తీసుకొని 'నేనైతే నీకు మంచి రెడీమేడ్ గౌను తొడిగివుందును , యిలా ముసలమ్మలా కాకుండా అప్పుడు నువ్వు మహారాణి లా వుందువు " అన్న మాటలు చెవుల్లో తిరుగుతున్నాయి . ఇవాళ అమ్మ తప్పకుండా మంచి గౌను తెస్తుంది , అమ్మ నెలాగైనా వొప్పించి యింటికి తీసుకు వెళ్లాలి , ఆరతి ఆలోచనలన్నీ అమ్మ చుట్టూ తిరగసాగేయి .

పరాకుగా ' నాన్నా అమ్మ మనతో వుంటే యెంతో బాగుంటుంది కదా ' అన్న తరవాత నాన్నేమంటాడో అని భయపడింది .

కానీ చిత్రంగా నాన్న కసరలే కళ్లనిండా దిగులుతో " యేం నాన్నా యీ ముసలి నాన్న నీకు నచ్చలే " అంటూ గుండెకద్దు కున్నాడు  .       ఆరతికి నాన్న గుండెల వెచ్చదనం నచ్చింది . ఆ వెచ్చదనం తల్లి దగ్గర దొరకలేదని అనిపించింది .

స్కూల్ కి బయలుదేరిన ఆరతికి టా టా చెప్పుతున్న నాన్న కళ్లల్లో నీటిపొరతో పాటు తన మీదవున్న యిష్టం కనిపించింది .

అమ్మ కళ్ళల్లో ఆ యిష్టం కనిపించలే , తను సరిగ్గా చూడలేదేమో ? ఇవాళ బాగా చూడాలి , నిన్నొచ్చిన ఆ గడ్డం అంకుల్ తనకి నచ్చలేదని , యింకెప్పుడూ అతనితో మాట్లాడొద్దని చెప్పాలి . ఆలోచనలతోనే స్కూలు దగ్గరకొచ్చింది .

ఎప్పుడూ నిలబడే చెట్టుకిందే నిలబడి వుంది అమ్మ .

" అమ్మా " అంటూ అమ్మ కి చుట్టుకు పోయింది .

గబుక్కున దూరంగా లాగి  ' పదపద ' అంది అమ్మ .

" కొత్త బట్టలు కొనడానికా "

" కొత్త బట్టలా యెందుకు "

ఇవాళ నా పుట్టిన రోజుగా , రెడీమేడ్ వి కొనడానికి "

విసురుగా అమ్మ యేదో అనబోయే లోపలే ఆ గడ్డం అంకుల్ ' ఆ... ఆ.... అందుకే పద పద ' అంటూ అమ్మకి కళ్లతో సైగ చేసేడు .

అమ్మ కూడా " అవును పద పద " అంది .

ఇద్దరూ చెరో వైపు కూర్చొని ఆటోలో తీసుకు వెళ్లేరు .

" ఇటు యెక్కడకి వెల్తున్నాం " అన్న ప్రశ్నకి ముందుగా యింటికి వెళ్లి అక్కడనుంచి బజారుకి వెళదాం అన్న సమాధానం వచ్చింది .  " బజారు దగ్గరనుంచి నాన్న దగ్గరకి వెళదాం , నాన్నకి నీమీద కోపం వున్నా నేను చెపితే నిన్ను యేమనడులే " అంటూ మాట్లాడుతున్న ఆరతిని

" నోర్ముయ్యమని చెప్పు తెగవాగుతోంది " గదమాయుంచేడు గడ్డపు అంకుల్ .

" ఇల్లుచేరేంత వరకేగా తరవాత యెలాగూ వాగలేదు " అంది అమ్మ .

ఆ మాటలకర్ధం యిల్లుచేరేక తెలిసింది ఆరతికి .

" అమ్మా నీ యిల్లేమీ బాగాలేదు నాన్న దగ్గరకి వెళిపోదాం పద గౌను నాన్నతో వెళ్లి రేపు కనుక్కుందాం " ఆ యింట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి అమ్మ గడ్డం అంకుల్ తో కలిసి రాసుకు పూసుకు మాట్లాడటం నచ్చలేదు , ఆ యింట్లోంచి యెప్పుడు బయట పడతానా అనిపించ సాగింది ఆరతికి , అందుకే పదే పదే వెళ్లిపోదాం అనసాగింది .

" యెక్కడకీ వెళ్లేది , యేకంగా నువ్వు వెళ్లేది బొంబాయికే , నస పెట్టక నోర్మూసుకో " తీవ్రంగా అన్నాడు గడ్డం అంకుల్ .

బొంబాయి అన్న పదం చెవిన పడగానే భయం వేసింది  ఆరతికి అందుకే తలుపు వైపు పరుగెత్తింది . ఆమె కన్నా ముందే రియాక్టయిన వాళ్లిద్దరూ ఆరతిని ఒడిసి పట్టుకొని కొట్టసాగేరు .

" అమ్మా .....అమ్మా ......కొట్టొద్దు ......కొట్టొద్దు.... నాన్న దగ్గరకి పంపెయ్ " గట్టిగా యేడ్వసాగింది సాగింది ఆరతి .

ఆరతి అరుపులు బయటకు వినిపించకుండా వుండేందుకు అమ్మ నోటికి గుడ్డ కట్టింది .

గడ్డం అంకుల్ చేతులు కాళ్లు మంచానికి  కట్టేడు . అమ్మ కర్ర తెచ్చి బయటకి కనిపించన చోట్లలో కొట్టు , కనిపించే చోట కొడితే డబ్బులు తక్కువ వస్తాయి అంది . వీపు మీదా కాళ్ల మీదా చూడండి యెలా కొట్టారో ? ఈవిడ మా అమ్మ కాదేమో అని చాలా సార్లు అనిపించింది . నిజంగా మా అమ్మే అయితే మరి మా దోస్తులు చెప్పినట్లు ప్రేమగా , దయగా , నాన్న కొట్టవస్తే రక్షించే దేవతగా , నిద్దర పుచ్చేటప్పుడు చందమామంత చల్లగా లేదే . కాని మా దోస్తులు అమ్మ గురించి చెప్పినవన్నీ నాకు నాన్న దగ్గర దొరికేయి . ఎలా తెలిసిందో నాన్నకి , నేను అక్కడ బంధీగా వున్నట్లు , పోలీసులతో వచ్చి నన్ను ఈవిడ దగ్గర నుంచి రక్షించేడు . ఇలాంటి అమ్మ నా కొద్దు మేడం , నన్ను నాన్న దగ్గర వుండనివ్వండి , మీకు దండం పెడతాను . ఇంత మంచినాన్న మీద వ్యాసం రాయమనకుండా అలాంటి అమ్మ మీద రాయమన్నారేంటి మా టీచర్ , యేం నాన్నల మీద వ్యాసాలు వుండవా ? "  అంటూ ముగించింది ఆరతి .

యెందుకో ఆరతి మాటలు వనిత లో ఆలోచనలు రేకెత్తించేయి . నిజమే యెవరూ అడగని ప్రశ్న . మమకారానికి ఆడా మగా తేడాలుంటాయా ? . అర్ధం లేని ఆలోచనలు చుట్టు ముట్టసాగేయి . గుమస్తా రాకతో కర్తవ్య నిర్వహణలో పడింది వనిత .

ఆరతి కష్టడీని కమల్ కు యిచ్చి , కాంచన , ఆమె సహచరుడి పైన క్రిమినల్ కేసుల నడిపించ వలసిందిగా పోలీసులను ఆజ్ఞాపిస్తూ తీర్పు యిచ్చింది వనిత .

మరిన్ని కథలు
naamchari