‘అమ్మా! చిన్నమ్మా!’ అంటూ నాంచారి పెట్టిన గావుకేకతో అప్పుడే బయటనుంచి వచ్చి అలసటగా మంచంపై వాలినదాన్నల్లా ఉలిక్కిపడి లేచాను.
‘ఏమైంది నాంచారమ్మా?’ అంటూ ఆ కేక వచ్చిన దిశగా పరిగెత్తాను.
వంటగది బయట నాంచారి భయంతో గజగజా వణుకుతూ గుడ్లప్పగించి లోపలికి చూస్తోంది.
‘చిన్నమ్మా అదిగో ఆ లోపల అటు చూడండి !’ అంటూ వేలెట్టి చూపించింది.
‘ఏంటదీ?’ అంటూ లోపలికి వెళ్ళి చూసిన నాకు ఒక పట్టాన నవ్వాగలేదు...................
అసలు కథేమిటంటే ..............
*********
నేను పుట్టింది పెరిగింది అంతా రాజమహేంద్రవరం దగ్గర ఉన్న తాపేశ్వరంలో. నాన్న అక్కడే వ్యవసాయం చేసుకుంటూ ఉండిపోవడంవలన ఎప్పుడూ ఆ ఊరుదాటి ఎక్కడికీ వెళ్ళవలసిన అవసరమే కలుగలేదు ఎవ్వరికీ .
మా ఇంట్లో పనికి నాంచారి అనే ఆవిడ ఉండేది. ఆవిడ అక్షర జ్ఞానం, ప్రపంచజ్ఞానం కూడా లేని అమాయకురాలు. ఆవిడకి నా అనేవారుఎవ్వరూ లేరనీ మా నాన్నమ్మ కాలంనుంచీ మా ఇంట్లోనే ఉన్నదనీ అమ్మ చెప్పగా నాకు తెలిసింది.
65 సంవత్సరాల వయసులోనూ ఇంటి పనంతా ఎంతో ఉత్సాహంగా చేస్తుంది. చాలా కాలంనుంచీ మా ఇంట్లో పనికి ఉండడం వలన ఆవిడ దాదపుగా మాఇంటి మనిషిలానే అయింది.
అమ్మా నాన్నలకు నేనొక్కదాన్నే సంతానం కావడం వలన ఇంట్లో అందరికీ నేనంటే విపరీతమైన గారం.
నా పేరు రాజ్యలక్ష్మి, నాన్నమ్మ పేరు. అందుకేనేమో నాంచారమ్మకి నాపట్ల మరింత వల్లమాలిన అభిమానం.
నాంచారి నన్నెప్పుడూ ‘చిన్నమ్మా, మీరు!’ అని మర్యాద పూర్వకంగా పిలిచేది .
‘అదేమిటీ నన్ను అలా పిలుస్తావు ? చక్కగా నా పేరు పెట్టి పిలవరాదూ?’ అని ఎన్నోసార్లు అడిగాను.
అందుకు నాంచారి ససేమిరా ఒప్పుకోలేదు సరికదా ‘మీ నాన్నమ్మగోరు నన్ను అక్కలా సూసేవోరు. ఆ తల్లి నాకు యజమాని, మాకు అన్నదాత. మీలో నాకు ఆయమ్మ కనిపిస్తాది. మీ పేరు ఆయమ్మ పేరే కదా యజమానిని పేరు పెట్టి పిలవరాదమ్మా’ అనేది.
నేను పై చదువులకి పట్నం వెళుతుంటే ‘ చిన్నమ్మా మళ్ళీ ఎప్పుడొస్తారు ఇంటికీ?’ అంటూ దిగులుపడింది నాంచారి.
చదువు పూర్తై ఈమధ్యనే గుంటూరులోని ఒక బ్యాంకులో ఆఫీసరుగా చేరాను. నాకు అన్ని సౌకర్యాలు ఉన్న పెద్ద ఇల్లు ఏర్పాటుచేసారు బ్యాంకువారు.
నాకు తోడుగా ఉంటుందని నాంచారిని నాతో రమ్మని అడిగాను. ఎప్పుడూ ఆ ఊరు దాటని నాంచారి మరోటప్పుడైతే ఏమనేదో తెలియదు కానీ నేనంటే ఉన్న వల్లమాలిన ప్రేమతో వెంటనే ఒప్పుకుంది.
రెండవ శనివారం బ్యాంకు సెలవు కావడంతో వెళ్ళి నాంచారిని నాతో గుంటూరు తీసుకొచ్చాను.
ఎప్పుడూ పల్లె దాటి ఎరుగని నాంచారి పట్నం చూసి సంబర పడింది. నా ఇల్లైతే మహా నచ్చేసింది నాంచారికి.
అలవాటు ప్రకారం వచ్చీ రాగానే ఇల్లంతా సర్దేసింది. నాంచారి ఉండడంతో ప్రస్తుతానికి నాకు ఇంట్లో పని కూడా పెద్దగా ఉండడం లేదు.
ఆరోజు ఆదివారం. అపార్ట్మెంట్ కాంప్లెక్సులో కూరలు అమ్మకానికి వస్తాయి ఉదయాన్నే. ముందరే వెళితే తాజా కూరలు దొరుకుతాయని చక చకా తయారై వాషింగ్ మెషిన్ లో బట్టలు వేసి, నాంచారికి చెప్పి తలుపు దగ్గరగా వేసి వెళ్ళాను.
కూరలు కొని ఇంటికి వచ్చి నాంచారికి అప్పగించి లోపలికి ఇలా వెళ్ళనో లేదో ..అలా నాంచారి కేక ....
********
తెరలు తెరలుగా నవ్వుతున్న నన్ను చూసి ‘ఏంటి చిన్నమ్మగోరూ నాకిక్కడ భయంతో పై పాణాలు పైనే పోతా ఉంటే మీకు నవ్వుతాలగా ఉన్నాదా?’ అంటూ నొచ్చుకుంది నాంచారి.
వెంటనే నవ్వాపి ‘ అయ్యో అది కాదు నాంచారమ్మా , అదీ బట్టలుతికే యంత్రం. వాషింగ్ మెషీన్ అంటారు’
‘బట్టలుతకడానికి యంత్రమా? ఏం చోద్యమమ్మా?’ అంది నా మాటలకి అడ్డుతగులుతూ.
‘అవును ఇప్పుడు అన్ని పనులకీ యంత్రాలు వచ్చేశాయిలే’ అని ‘ఆ యంత్రానికి క్రింద ఒక స్టాండు ఉండాలి. అది లేకే ఆ అదురుకి కదులుతోంది. అంతకంటే ఏం లేదులే . భయపడకు’ అన్నాను.
స్టాండు లేకపోవడం వలన వాషింగ్ మెషిన్ స్పిన్ వేగానికి అదిరి ముందుకి కదిలివస్తోంది. అది నాకు అలవాటే కానీ నాంచారికి క్రొత్త కదా మరి!
స్టాండు కొనాలి అనుకుంటూనే అశ్రద్ధ చేసాను. ఇంతలో ఇదంతా జరిగింది.
ఆధునిక యంత్రాల జిమ్మిక్కులు తెలియని నాంచారమ్మ మెషిన్ కదలుతూ ముందుకు రావడం చూసి భయపడిపోయింది.
నేను వివరిస్తున్నంత సేపూ ఆశ్చర్యంతో కళ్ళు వెడల్పు చేసుకుని విని ‘ఓసి దీని ఇల్లు బంగారంగానూ! ఇదన్నమాట అసలు సంగతీ! మాలావు భయపెట్టేసినాది చిన్నమ్మ గారు ఈ బట్టలుతికే యంత్రం నన్ను?’ అంటూ బుగ్గలు నొక్కుకుంది నాంచారి .
|