Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
madhuram short flim

ఈ సంచికలో >> శీర్షికలు >>

ఉత్తరాఖండ్ తీర్థయాత్రలు - కర్రా నాగలక్ష్మి

uttarakhand tourism

 ( శిర్ఖండాదేవి ) 

ఉత్తరాఖంఢ్ అంతా వేసవిలో చల్లగా శీతాకాలంలో అతి చల్లగా వుండే రాష్ట్రం , హిమాలయా పర్వతాలు శివాలిక్ పర్వత శ్రేణులు , అభయారణ్యాలతో కూడుకొని వున్న రాష్ట్రం కావడంతో వేసవి విడుదలకు యేం కొదవ , అయితే నైనితాల్ , మస్సూరి , ఆల్మోడా మొదలయినవి దేశవ్యాప్తంగా గుర్తింపబడ్డవే కాకుండా యింకా చాలా  ప్రదేశాలువున్నాయి . ప్రశాంతంగా చల్లగా నాలుగు రోజులు గడాపాలనుకుంటే బాగా పేరుపొందని మారుమూలలో వున్న ప్రదేశాలను యెంచుకుంటే చాలా తక్కువ ఖర్చుతో హాయిగా గడిపి రావొచ్చు . అలాంటి వాటిల్లో  ' టెహ్రీ ' జిల్లాలో వున్న ' దనౌల్టీ ' ఒకటి . 

ధనౌల్టీ యీ మధ్యకాలంలో ఓ మంచి వేసవివిడిదిగా రూపుదిద్దుకుంటోంది . శీతాకాలంలో మంచుకురిసి కనుచూపు మేరవరకు తెల్లగా వెండిలా మెరుస్తూ వుండే దనౌల్టీ యెండాకాలంలో అతిచల్లగా వుండి మిగతా వేసవి విడుదలలో వుండే అన్ని రకాలైన యేక్టవిటీలతో యాత్రీకులను ఆకట్టుకుంటోంది . సన్ సెట్ పాయింటు , సన్ రైజ్ పాయింటు లే కాక అంబర్ , ధారా అనే రెండు ఎకొపార్క్ లను ధనౌల్టీ గ్రామ ప్రజలు ఆడమగ కూడా కష్టపడి నిర్మించడమే కాక వారే వాటి బాగోగులను యాత్రీకుల మార్గదర్శకులుగాను కూడా వ్యవహరిస్తున్నారు . అంతేకాకుండా  యిక్కడ మీ యిష్టుల జ్ఞాపకార్థం మీకు నచ్చిన వృక్షాన్ని నాటుకొనే అవకాశం కూడా కల్పించేరు , వీటికి వేరుగా రుసుములు చెల్లించాలి .

ఈ కొండలలో ప్రకృతిని యెంతని వర్ణించను , ఒకటి మాత్రం చెప్పగలను మీరు వెళ్లి ఒకసారి ఆ అనుభూతిని సొంతం చేసుకోండి .

మస్సూరికి సుమారు 24 కిలో మీటర్ల దూరంలో వుంది ధనౌల్టీ . ఢిల్లీనుంచి ప్రైవేట్లు బస్సులు , టాక్సీలు కూడా నడపబడుతున్నాయి .ఉత్తరాఖంఢ్ లో వున్న మరో శక్తిపీఠం శర్ఖండాదేవి .

ధనౌల్టీ కి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో పర్వతశిఖరాన వున్న శర్ఖండాదేవి మందిరం గురించి తెలుసుకుందాం .

ధనౌల్టీ నుంచి ' చంబా ' వెళ్లే రోడ్డుమీద వున్న ' ఖద్దు ఖాల్ ' అనే గ్రామం నుంచి రెండు కిలోమీటర్లు కొండ యెక్కి కోవెల చేరుకోవచ్చు .
ఖద్దుఖాల్ లో ఒక్క చిన్న బడ్డీ కొట్టు తప్ప మరేమీ వుండేవికావు పదిసంవత్సరాలకిందట , జారుడుగా పాకుపట్టిన రాతి మెట్లు , ఒకటో అరో యాత్రీకులు తప్ప మరెటువంటి అలికిడి లేక చాలా నిర్మానుష్యంగా వుండేది . ఈ సంవత్సరం వెళ్లినప్పుడు పది దాకా దుకాణాలు , భక్తులు కూడా గణనీయంగా పెరగడంతో మస్సూరి , ధనౌల్టీలనుంచి లోకల్ జీపులు నడపబడతున్నాయి . నడక దారి మొదలయే దగ్గర చాలా పెద్ద ద్వారం , మెట్లు నున్నగా సిమెంటు చెయ్యబడి చాలా చోట్ల నడక దారికి షెడ్లు వెయ్యబడి , పైన మందిరం కూడా కొత్తగా కట్టబడి ఆకర్షణీయంగా కనిపించింది .

చుట్టుపక్కల కనిపిస్తున్న అందాలను కళ్లలో నింపుకుంటూ నడుస్తూవుంటే కష్టం తెలియకుండా మందిరం చేరుకుంటాం , అయితే మొత్తం రెండుకిలోమీటర్లూ నిటారుగా వున్న  కొండయెక్కడం వల్ల విపరీతంగా ఆయాసం వస్తుంది . కాని దిగేటప్పుడు కాస్త సులువుగా వుంటుంది . 

కోవెల లోపల అమ్మవారి చిన్నవిగ్రహం పూజలందుకుంటోంది . పక్కగా ప్రభుత్వం వారి స్థలపురాణం రాసిన బోర్డు కనిపిస్తుంది . ఆ పర్వత శిఖరం నుంచి చుట్టూవున్న ప్రకృతిని చేస్తే నోటమాటరాలేదు , అంతబాగుంది మరి . 

భక్తులు అమ్మవారికి డ్రైఫూట్స్ , పసుపుకుంకుమ గాజులు యెర్రవస్త్రం సమర్పిస్తూవుంటారు . ఉదయం యేడునుంచి సాయంత్రం యేడు వరకు కోవెల తెరిచే వుంటుంది . శీతాకాలంలో ఓ గంట ఆలస్యంగా తెరిచి ఓ గంట ముందుగా మూసెస్తారు . 

ప్రతీ సంవత్సరం యిక్కడ ' గంగా దశరా ' యాత్ర వైభవంగా నిర్వహిస్తారు , చుట్టుపక్కల రాష్టాలనుంచి వేలమంది భక్తులు యీ యాత్రకు తరలి వస్తారు . 

ఇప్పుడు స్థలపురాణం గురించి తెలుసుకుందాం .

దక్షుడు నిర్వహిస్తున్న యజ్ఞానికి పిలువకపోయినా వెళ్లిన సతీదేవి యెదురైన అవమానానికి తట్టుకోలేక యజ్ఞకుండం లో ఆత్మాహుతి చేసుకోగా సతీదేవి ఆత్మత్యాగం చేసిన విషయం విన్న శివుడు కోపోద్రేకుడై దక్షుని శిరస్సు ఖండించి , సతీదేవి యొక్క శరీరాన్ని భజానవేసుకొని విలయతాండవం చెయ్యసాగేడు . ఉగ్గరతాండవం చేస్తున్న  శివుని వారించలేక దేవతలు విచారిస్తూ వుండగా విష్ణుమూర్తి శుష్కిస్తున్న సతీ దేవి శరీరం కొద్దికాలానికి మట్టిలో కలిసి శివుడు కార్యోన్ముఖుడౌతాడని అభయమిస్తాడు , కొంతకాలానికి సతీదేవి శిరస్సు మొండెంనుంచి వేరుపడి కిందపడిపోతుంది , అయినా శివుడు ఆ మొండాన్నే భుజాన వేసుకు తిరుగుతూ వుండగా విష్ణుమూర్తి తన చక్రంతో సతీ దేవి శరీరాన్ని ఖండాలుగా తుంచెస్తాడు . ఆలా చెల్లాచెదురైన సతీదేవి శరీరఖండాలు , ఆభరణాలు పడ్డ ప్రదేశాలను శక్తిపీఠాలుగా గుర్తించేరు .  ముందాగా సతీదేవి శరీరాన్నుంచి వేరుపడిన శిరస్సు పడ్డ ప్రదేశమే శిర్ఖండాదేవిగా గుర్తింపబడింది . శిరస్సు పడ్డ ప్రదేశం కాబట్టి అన్ని పుణ్యస్థలాలలోను ప్రధమస్థానం యీ అమ్మవారికి యివ్వబడింది . 

ఈ వ్యాసంతో ఉత్తరాఖండ్ రాష్ట్రం లోని ఘరేవాల్ ప్రాంత యాత్రాస్థల విశేషాలను మీకందించేను , కుమావు ప్రాంతపు విశేషాలను కూడా తెలుసుకుందాం .

దేశరాజధాని ఢిల్లీ లో బయలుదేరి గజరోల , మురాదాబాదు ( రెండు నగరాలూ ఉత్తరప్రదేశ్ లోకి వస్తాయి ) మీదుగా ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన రామ్ నగరు చేరుకోవచ్చు .

రామ్ నగర్ నుంచి జిమ్ కార్బెట్ అభయారణ్యం చూడాలనే సంకల్పంతో బయలుదేరేం . ఢిల్లీ నుంచి సుమారు 250 కిలోమీటర్లు . రామ్ నగరు నుంచి పదిహేను కిలో మీటర్ల దూరంలో వున్న జమ్ కార్బెట్ అభయారణ్యం గురించి తెలుసుకుందాం .అయితే రామ్ నగరు వస్తూ దారిలో వచ్చే మురాదా బాదు గురించి ముందు తెలుసుకుందాం . ముందు యిటుగా వెళ్తున్నప్పటికి మాకు యీ వూరుగురించి తెలీదు , వీధులగుండా మాకారు వెళ్తూవుంటే రోడ్డుకి యిరువైపులా వున్న చిన్న పెద్ద షాపులన్నీ యిత్తడి దేవతామూర్తులను విక్రయించడం ఆశ్చర్యం కలిగించింది . వీధులు కాస్త సన్నగా వుండడంతో కారు నిలిపేస్థలంకూడా దొరకలేదు . అందుకే కాస్త దూరంలో ఆపుకొని వెనుకకు1 వచ్చి షాపులు చూసుకుంటూ వస్తూవుంటే లోపల సందులలో పెద్దపెద్ద అంటే పది పన్నెండడుగుల కృష్ణుడు , విష్ణుమూర్తి , లక్ష్మి , సరస్వతి ఒకటేమిటి యెన్నో మూర్తులు , అంగుళం నుంచి యిరవై అడుగుల వరకు విగ్రహాలు వున్న షాపులు చూసి కళ్లు చెదిరేయి . 

 

అన్నీ యిత్తడి విగ్రహాలే కొన్నింటికి పుత్తడిపూతకూడా పూసేరు . ఆవిగ్రహాలు  మరికాస్త సేపటిక లేచి మాట్లాడుతాయేమో అనే భ్రాంతిని కలిగిస్తున్నాయి . మొత్తం మురాదాబాద్ పట్టణమంతా యిత్తడి బొమ్మల తయారీ , అమ్మకాలలోనే జీవనం సాగిస్తున్నారంటే యెంతమాత్రం అతిశయోక్తికాదు .

ఒక్కో షాపులో వందలకొద్దీ విగ్రహాలు వుండడం కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది , చిన్న పెద్ద అన్ని విగ్రహాలూ తూకం లో అమ్ముతున్నారు . అప్పుడు మేం కొన్నప్పుడు కిలో 350రు,, చొప్పున కొన్నాం , యిప్పటి రేట్లు యెలా వున్నాయో మరి .

           అక్కడినుండి రామ్ నగర్ వైపు తిరిగింది మాకారు , రామ్ నగరు ఉత్తరాఖండ్ లో నైనితాల్ జిల్లా లో వుంది . యీ జిల్లా  మొత్తం అరణ్యాలు , పర్వతాలు కావడంతో యెవో చిన్న పల్లెలు తప్ప పెద్దగా నగరాలు లేవనే చెప్పాలి , యీ జిల్లా  రాంనగరు ఓ మోస్తరు పట్టణం . రాంనగరు ప్రాంతం లీచీపళ్లకు ప్రసిధ్ద , జూన్ జూలై మాసాలలో ప్రతీ చెట్టూ ఆకు కనబడకుండా కాస్తాయి . హరిద్వార్ రాంనగరు దారంతా లీచీ తోటలే , అక్కడక్కడా లేళ్లూ దుప్పులూ మనదారికి అడ్డం పడి పరుగెడుతూ కనపిస్తాయి .

జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ సంవతసరంలో కొన్ని నెలలు మాత్రమే పర్యాటకులను అనుమతిస్తారు , మధ్యలో కూడా యేవేవో కారణాలవల్ల మూసేస్తూవుంటారు . ముఖ్యంగా అడవి జంతువుల మీటింగు టైమని , యెండలు యెక్కువగా వున్నప్పుడు జంతువులు రెస్టలెస్ గా వున్నాయని యిలా యేవేవో కారణాలు . పేకేజీ టూరులో వెళ్తేసరే లేకపోతే మాత్రం ముందుగా ఆవివరాలు సేకరించి ప్రయాణం పెట్టుకోవాలి , అభయారణ్యంలో ప్రవేశానికి  ముందుగా అనుమతి పొందవలసి వుంటుంది . అనుమతి లేనిదే లోనికి ప్రవేశం దొరకదు .

ప్యాకేజీ టూర్లలో ఉత్తరాఖండ్ టూరిజం వారి ప్యాకేజీ  కూడా వుంది వారు ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు మూడు రోజుల ప్యాకేజీ టూర్ని అందిస్తున్నారు . 

ప్యాకేజీ టూర్లో అభయారణ్య వీక్షణ యెలావుంటుందో పై వారం తెలుసుకుందాం , అంతవరకు శలవు

మరిన్ని శీర్షికలు
weekly-horoscope-september-15th -to-september-21st