Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
nadaina prapancham

ఈ సంచికలో >> సీరియల్స్

ప్రేమిస్తే ఏమవుతుంది ?

premiste emavutundi

 గతసంచికలోని ప్రేమిస్తే ఏమవుతుంది సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి....http://www.gotelugu.com/issue231/640/telugu-serials/premiste-emavutundi/premiste-emavutundi/

 

(గత సంచిక తరువాయి)... పెళ్లి మాట ఎత్తిన రమేష్ వైపు చిత్రంగా చూస్తున్న గాయత్రిని కొంచెం దూరం నుంచి  నడివయసు జంట గమనిస్తోందని గాయత్రికి తెలియదు. వాళ్ళిద్దరూ కోటేశ్వరరావు పెత్తండ్రి  కొడుకు, కోడలు... 

“ ఆ అమ్మాయి కోటేశ్వరరావు  కూతురు కదూ” అన్నాడు శేషు గాయత్రీ వైపు పరిశీలనగా చూస్తూ. 

“ఎవరు ఆ  కొండ మీద నల్లటి కుర్రాడు పక్కన కూర్చున్న అమ్మాయా..”  భర్త చూస్తున్న వైపు చూసింది ఉమ.

భార్యకి సమాధానం చెప్పకుండా గాయత్రి వైపే మరింత పరిశీలనగా చూస్తూ..

“ అవును అదే.... పోయిన ఏడాదేగా చూసాను.. గుర్తు పట్ట గలను” ఖచ్చితంగా అన్నాడు..

ఉమ నాలుగడుగులు కొండ వైపు వేసింది కానీ, వాళ్ళు కనిపించక పోడంతో మళ్ళి వెనక్కి వెళ్లి పరీక్షగా చూస్తూ అంది “ఈ అమ్మాయి కాలేజ్ కి వెళ్ళకుండా ఇలా తిరుగుతోందా.. ఏం పోయే కాలం... మన ముంబై లోనే అనుకున్నా ఇలాంటి విపరీతాలు ఇక్కడ కూడా ఉన్నాయన మాట. “

“ ఏంటి నాన్నా ఇక్కడే నిలబడి పోయారు అప్పటికే ముందుకు నడిచి వెళ్ళి పోయిన శేషు కొడుకు భాస్కర్ వెనక్కి వచ్చి అడిగాడు..

“ఏం లేదు లేరా ఆ అమ్మాయి మన బంధువులమ్మాయి అని చూస్తున్నా” ...అన్నాడు శేషు గాయత్రి వైపు నుంచి చూపు తిప్పకుండా.“వెళ్లి పలకరిద్దామా” అడిగాడు భాస్కర్.

“ అది బాయ్ ఫ్రెండ్ తో వచ్చిందిరా.. కోటేశ్వర రావు కి తెలిస్తే ప్రమాదం కూడాను..”    అదా... తేలిగ్గా అన్నాడు భాస్కర్. “వదిలేయ్ నాన్నా ... మనకెందుకు. ఈ రోజుల్లో ఇవన్నీ కామన్. బాయ్ ఫ్రెండ్ లేక పోతె అమ్మాయిలు, గర్ల్ ఫ్రెండ్ లేక పోతే అబ్బాయిలు నామోషీ గా ఫీల్ అయే రోజులు వచ్చాయి... పద, పద మళ్ళి మనం ఇక్కడి నుంచి మ్యూజియం వెళ్ళాలి అవతల మల్లిక వాళ్ళు ఎదురు చూస్తున్నారు” అంటూ తండ్రి చేయి పట్టుకుని ముందుకు లాక్కుని వెళ్ళాడు భాస్కర్.  వాళ్ళని అనుసరించింది ఉమ.శేషు వెనక్కి, వెనక్కి చూస్తూ నడవ సాగాడు. గాయత్రి తల వంచుకుని కూర్చుంది.. ఆమెని చూస్తుంటే బాయ్ ఫ్రెండ్ తో తరచూ షికార్లు తిరిగే అమ్మాయిలా నదురు బెదురు లేకుండా లేదు... భయం, భయంగా , ముడుచుకుని కూర్చుంది... ఈ వెధవ ఎవడో దీన్ని ట్రాప్ చేసినట్టున్నాడు.... వీలు చూసుకుని కోటేశ్వర రావుని కలవాలి.. ఈ ట్రిప్ లో కుదురుతుందో, లేదో ...కుదరక పోతే ఫోన్ చేయాలి గాయత్రిని జాగ్రత్తగా చూసుకోమని .. అసలే రోజులు బాగా లేవు.. అలా ఆలోచిస్తూనే జనంలో కలిసి పోయాడు. 

గాయత్రికి రమేష్ మాట నచ్చలేదు... చక్కగా ప్రేమించుకోకుండా పెళ్లి అంటాడేంటి ? ఇంకా పూర్తిగా ప్రేమించుకో లేదు.. సినిమాలకి వెళ్ళ లేదు.. హోటల్స్ కి వెళ్ళ లేదు, బర్త్ డే గిఫ్ట్లు ఇచ్చుకో లేదు... అప్పుడే పెళ్ళా... పిచ్చా రమేష్ కి ?

“ఏమన్న చెప్పు “ అన్నాడు రమేష్ మౌనంగా ఆలోచిస్తూ కూర్చున్న గాయత్రితో.

“ఏం చెప్పను?” సన్నగా అంది.

“మనం మారేజ్ చేసుకుందాం అన్నా కదా ఏమనవేంది”  అన్నాడు.

గాయత్రి సమాధానం చెప్పకుండా దూరంగా కొండ కింద చెట్టా పట్టాలేసుకొని తిరుగుతున్న జంటలని చూడ సాగింది. వీళ్ళంతా పెళ్లి అయిన వాళ్ళా.... తమ లాగా ప్రేమికులా? ప్రేమికులైతే ఇంత కులాసాగా అసలు భయం లేకుండా ఎలా తిరుగుతున్నారో.. తను భయంతో చచ్చి పోతోంది. దారి పొడుగునా ఎవరన్నా చూస్తారేమో అని వణికి పోయింది... ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరూ రాక పోవచ్చు.... హాయిగా బోలెడు కబుర్లు చెప్పుకో వచ్చు అనుకుంటే ఈ రమేష్ డైనమైట్ పేల్చాడు.. పెళ్లి అంటాడేంటి ? ఇది పెళ్లి చేసుకునే వయసా... ఇద్దరం

దువుకోవాలి... అతను ఉద్యోగం సంపాదించుకోవాలి.. ఒక వేళ అతని జీతం సరి పోక పోతే తను కూడా ఉద్యోగం చేయాలి... ఇదంతా లేకుండా పెళ్లి చేసుకోడం ఏంటి? అసలైనా పెళ్లి అంటే అమ్మ, నాన్న ఊరుకుంటారా... చంపేస్తారు..

“ఓ గాయత్రి” విసుగ్గా పిలిచాడు రమేష్. ఉలిక్కిపడి చూసింది. 

“ఏం చూస్తున్నావు..” అడిగాడు.

ఏం లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపింది. 

“ నాకెరికే జాబ్ లేకుండ మారేజ్ అంటున్న అని సోంచాయిస్తున్నవు .... కానీ గిట్లనే ఉంటె మనం కలుసుకోనుడు కష్టమే,, మంచిగ ఇట్ల ఎంజాయ్ చేసుడు కష్టమే. మీ ఇంట్ల తెలిస్తే ప్రాబ్లం, మా ఇంట్ల తెలిస్తే కూడా ప్రాబ్లం... అందుకే ఏడికన్న పోయి పెండ్లి చేసుకుంటే మనిష్టం.. నువ్వేం పికరు చేయకు నిన్ను మంచిగా చుసుకుంట... “

అతనలా మాట్లాడుతుంటే గమ్మత్తుగా ఉంది గాయత్రికి.. ఇతన్ని పెళ్ళి చేసుకుని కాపురం పెట్టడమా... అంటే తను, రమేష్ ఒక ఇంట్లో ఉంటారు... ఎవరన్న చూస్తారేమో అనే భయం అక్కర్లేదు... ఏ రోజు కా రోజు కలిస్తే బాగుండు అనుకోడం, కలుసుకో లేక పోడం, కలుసుకున్నా మళ్ళి ఇంటికి త్వరగా వెళ్లి పోవాలన్న కంగారు... ఇలాంటి బాధలుండవు.. నిజమే... ఇలా ప్రేమించుకుంటూ ఉంటె వంటరిగా కలుసుకోడానికే చాన్స్ దొరకక పోవచ్చు. కలుసుకోకుండా ఎలా ఉండడం!  వారం రోజులు కలుసుకోక పోతేనే ఎలాగో ఉంది.. ఏదో పోగుట్టుకున్న ఫీలింగ్... హాయిగా పెళ్లి చేసుకుంటే!  ఎవరు ఒప్పుకుంటారు? కాళ్ళు , చేతులు కట్టేసి ఇంట్లో కూర్చో బెడతారు. అప్పుడు జీవితం ఎంత నరకం! అందుకే పెళ్లి చేసుకోవాలి.. రమేష్ అన్నట్టు ఏటన్న వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని.... అవును చేసుకుని... గాయత్రీ కళ్ళ ముందు ఏవేవో దృశ్యాలు.... 
తను, అతను పెళ్లి చేసుకుని ఒక చిన్న ఇల్లు తీసుకుంటారు.. తను ఇల్లు  చూసుకుంటుంది.. అతను ఆఫీస్ కి వెళ్లి వస్తాడు.. అతను వచ్చే సరికి తను అతనికిష్టమైన టిఫిన్ చేసి, చక్కగా తయారై ఉంటుంది. రాగానే ముందు తనని దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుంటాడు.. ఇంత అందంగా తయారయావు నా  కోసమేనా  అంటూ తనని ఎత్తుకుని గిరగిరా తిప్పేస్తాడు... గాయత్రి చెక్కిళ్ళ లోకి వెచ్చటి రక్తం పొంగి వచ్చింది ... కళ్ళు సిగ్గు బరువుతో వాలి పోయాయి.. 

రమేష్ అటు, ఇటూ చూసాడు. తమని ఎవరూ గమనించడం లేదు అని నిర్ధారించుకుని గభాల్న గాయత్రిని చేయి పట్టుకుని దగ్గరకు లాక్కుని చెంప మీద ముద్దు పెట్టుకున్నాడు. 

గాయత్రికి ఒక్క సారిగా పరిసరాలన్నీ గిరగిరా తిరిగినట్టు అయింది.. ఆపాదమస్తకం వణికి పోయింది... గభాల్న దూరం జరిగింది. 
రమేష్ ఆగలేదు ఆమెకి దగ్గరగా జరుగుతూ ఏడికి పోతున్నవు ? అంటూ ఆమె చేయి పట్టుకున్నాడు.

గాయత్రికి ఇప్పుడు పులకింతకన్నా భయంతో ఒళ్ళంతా చేత పట్టేసింది...” వదులు” అంది చేయి లాక్కుంటూ..

“ ఏయ్ గమ్మునుండు... ఇంత దూరం వచ్చింది ఎందుకు?”  అంటూ మరింత గట్టిగా బిగించి పట్టుకుని ఇంకా కొంచెం దగ్గరగా జరిగి  చేయి వదిలి అదే చేయి ఆమె నడుం చుట్టూ బిగించి దగ్గరకు జరుపుకున్నాడు..

గాయత్రికి కళ్ళ ముందు మెరుపులు కనిపించాయి.. పెదాలు వణుకుతుంటే అతని చేయి తోసేయ బోయింది..

అతను ఇంకా బిగించి మరింత దగ్గరకు జరుపుకుని కొంచెం ఆమె మొహం వైపు వంగాడు. 

అకస్మాత్తుగా చెప్పుల చప్పుడు వినిపించింది. అతని చేయి వదులైంది .. గాయత్రీ దూరం జరిగింది. ఇద్దరు యువతీ యువకులు చేతులు పట్టుకుని కొండ ఎక్కి పైకి వచ్చి వీళ్ళని చూసి వీళ్ళు కూర్చున్న కొండనానుకుని ఉన్న మరో  కొండ వైపు వెళ్ళి పోయారు. గాయత్రి  గబుక్కున లేచి నేను ఇంటికి వెళ్ళాలి అంది. 

“అప్పుడేనా..”. అన్నాడు రమేష్.

“నేను వెళ్ళాలి... నాకు భయం వేస్తోంది.. “ అంది.

“ అరె నేనేం చేయనులే కూసో “ అన్నాడు రమేష్.

తల ఆడిస్తూ “ లేదు నేను వెళ్ళాలి... ఇంటికి వెళ్ళాలి... నన్ను ఆటో ఎక్కించు ప్లీజ్” బతిమాలింది గాయత్రీ. 

రమేష్ కూడా లేచి “నడువ్ ఐస్ క్రీం తిని పోదాం” అంటూ కొండ దిగ సాగాడు. గాయత్రీ అతనిని అనుసరించింది.  వాళ్ళు నడుస్తుంటే అక్కడక్కడ గోడ చాటు చేసుకుని కూర్చున్న ప్రేయసి ప్రియులు కనిపించారు. వాళ్ళని చూపిస్తూ “అక్కడ చూడు ఎంత మంచిగ లవ్ చేసుకుంటున్నారో “ అన్నాడు రమేష్.

ఇంకా కాసేపు కూర్చోవాలని,  అతను చేస్తున్న చిలిపి పనుల తీయని అనుభూతి పొందాలని మనసు ఉవ్విళ్ళూరుతోంది. కానీ అణువణువునా నిండిన భయం వద్దు, వద్దు అని హెచ్చరిస్తుంటే వేగంగా నడుస్తూ కొండ దిగింది. 

(సశేషం)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్