Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
alumagalu

ఈ సంచికలో >> కథలు >> యద్భావం తద్భవతి

yadbhavam tadbhavati

నెమ్మదిగా కళ్ళు తెరిచాడు శేఖరం.ఏదో రైల్వే స్టేషన్.జనాలు గుంపులు,గుంపులుగా కదులుతున్నారు.అంతా మసగ్గా ఉంది.కళ్ళు నులుముకుని చూశాడు.అయినా ప్రయోజనం లేదు.ఇంకా అంతా మసకగానే కనబడుతోంది.అసలు ఏమైందబ్బా అని తల గోక్కుందామనుకున్నపుడు ,తల కొంచెం నెప్పిగా అనిపించింది.తాను రైల్లో టాయిలెట్ కి వెళ్ళిరావడం వరకు గుర్తుంది.తర్వాత ఏం జరిగిందో మాత్రం శేఖరానికి ఎంత ప్రయత్నించినా గుర్తుకు రావడం లేదు.పైగా కళ్ళు మసగ్గా కనబడుతున్నాయి.ఏం జరిగిందో తాను మరో సారి తీక్షణంగా గుర్తు చేసుకోసాగాడు.అవును, నేను రైల్లో సింగల్ విండో సీట్ లో కూర్చున్నాను.నాకెదురుగా మరొకడు కూర్చున్నాడు.ట్రైన్ అనకాపల్లి దాటింది.నాకెదురుగా కూర్చున్న వాడు,నేను రాజమండ్రి లో ట్రైన్ ఎక్కినప్పటినుండీ, నా వంక అదోలా చూడసాగాడు. అంటే ,నా మెడలో ఉన్న నాలుగు తులాల బంగారు గొలుసు వంక.నాకు భయంగానే ఉంది, వాడు దొంగ వెధవేమోనని.కానీ అలా అని ఎలా నిరూపించగలను.పైగా రిసర్వేషన్ బోగీ .లైట్స్ ఆపేశారు.మరి కొన్ని వెలగడం లేదు.

దాంతో కాస్త చీకటిగా ఉంది.అందుకే ఈ రాత్రి ప్రయాణాలు వద్దనేది.దేవుడిపై భారం వేసి నిద్ర నటించాను.దాంతో వాడు అదే అదుననుకుని నాకు దగ్గరగా వచ్చి నా మెడ తాకాడు.దాంతో నాకు టక్కున మెలకువ వచ్చి ,ఏయ్ ఏం కావాలి.ఎందుకలా నాకు దగ్గరగా వచ్చావ్ అంటూ గదమాయించేసరికి,సారి .అని వాడు కొంచెం వెనక్కి జరిగి,వాడి స్థానంలో వాడు బుద్ధిగా కూర్చున్నాడు.కానీ నేను మాత్రం అలా మెలకువగానే ఉన్నాను.తర్వాత మాట్లాడటానికి ప్రయిత్నించాడు,నేను తల తిప్పేశాను.అయినా పరిచయం చేసుకోవాలని తాగడానికి నీళ్ళు అడిగాడు.ఇవ్వనని ముఖాన చెప్పేశాను.అంతలో అనకాపల్లి వచ్చింది.నాలో కొంచెం ధైర్యం వచ్చింది.విశాఖపట్నానికి గంట ప్రయాణం మాత్రమె మిగిలి ఉంది.

ఎదుటి సీటు వంక ఓ సారి చూశాను.ముఖానికి మంకీ కేప్ పెట్టుకుని మరీ నిద్రపోతున్నాడు.సరే అని లేచి టాయిలేట్ కి వెళ్ళాను.ముగించుకుని బయటకు వచ్చేసరికి వాడు నిల్చునున్నాడు.గతుక్కుమన్నాను.గుండె దడదడలాడింది.సరే అని పైకి ధైర్యం నటిస్తూనే,అడ్డులే అని ముందుకు వెళ్లబోతూ, వాడి కుడిచేతి వంక చూశాను.చేతిలో ఏదో కర్ర పట్టుకున్నాడు.నేను వేగంగా ముందుకు కదలబోయేoతలో, నడకలో పట్టుతప్పుతుందనగా,వాడు తలపై దభీమని కొట్టినట్టు గుర్తు.అంతే పడిపోయాను.తర్వాత కళ్ళు తెరిచేసరికి,ఇదిగో ఇలా ఈ ఫ్లాట్ ఫారం అరుగుపై కూర్చుని ఉన్నాను.సమోసా,సమోసా అన్న అరుపుతో ఈ లోకంలోకి వచ్చిన శేఖరం,గాబరాగా తన మెడ వంక చూసుకుని చేత్తో తడిమాడు.మెడలో బంగారు గొలుసు లేదు.చుట్టూ చూసుకున్నాడు,తన సామాను కూడా లేదు. మొబైల్ కూడా బ్యాగ్ లోనే పెట్టాడు.నేను అనుకున్నట్టు ఇది వాడి పనే.పోలీసు కంప్లయింట్ ఇస్తాను అనుకుంటూనే,మరో క్షణం ,అవునూ వాడ్ని ఆ రాత్రి ప్రయాణంలో సరిగా చూడను కూడా చూడలేదు.ఛ , ఏంటో ! నాకే ఇలా జరగాలా,అంటూ మళ్ళీ ఓ సారి కళ్ళు నులుముకున్నాడు.ఈ సారి కొంచెం పర్వాలేదు.మసక తగ్గి కొంచెం నయంగానే కనబడుతోంది చూపు.దాంతో ఏదో తట్టినట్టు, ఆ,ఇప్పుడు ఎవర్నైనా పిలుస్తాను.

పిలిచి నా పరిస్థితి చెప్పి నాకు సహాయం చేయమంటాను.నేను ఇప్పుడు ఏ స్టేషన్లో ఉన్నానో తెలుసుకుంటాను. నా ఊరు, అడ్రెస్ చెప్పి, నన్ను ఆ రైలు ఎక్కించమంటాను.అని అటుగా చూశాడు.ఏదో పెద్ద కాయం అటుగా వెళ్ళడం చూసి,ఏవండీ ,సార్ మిమ్మల్నే.చప్పట్లు చరిచి మరీ పిలిచాడు.ఆ భారీ కాయం దగ్గరగా వచ్చి ,క్యా చాహియే భయ్యా ,అందా ఆడ గొంతు.

బితుక్కుమన్నాడు.ఈమె ఆమె !అతననుకున్నానే.నాకు హింది కూడా రాదే.ఎలాగొలా అడుగుతా, తుమ్, తుమ్ అని ఆగిపోయాడు.
హ,హ బోలో.హింది ఆతాహై.అడిగిందామె మళ్ళీ. నేను రాష్ట్రం దాటిపోయానా ఏంటి ఖర్మ.అని తనలో తానే మదన పడుతుండగానే,పాగల్ ఆద్మీ అంటూ ఆ హిందీ ఆమె బిర ,బిరా అక్కడి నుండి వెళ్లిపోయింది.

సరే, ఈసారి ఇలా కాదు.నాకు వచ్చీ రాని ఇంగ్లిష్లో అడుగుదాం.కొంత ప్రయోజనం ఉండొచ్చు,అనుకుని,మరో సాల్తీ వైపు చూసి,ఏ లింగమూ వాడకుండా హలో ఎక్స్క్యూస్ మి అంటూ పిలిచాడు.ఆ ఆకారం ఆగింది .దగ్గరకి రండి. అదే, కం క్లోసర్ ప్లీజ్ అన్నాడు.ఆ ఆగిన వారు దగ్గరకొచ్చారు.

అరె నేను ఒకర్ని పిలిస్తే ఇద్దరు వచ్చారా.రెండు తలలు కనిపిస్తున్నై.సరేలే అని ఒక ముఖం వైపుకి తిరిగి ,ఐ లాస్ట్ ఎవ్రి తింగ్.ఐ నీడ్ యువర్ హెల్ప్ టు రీచ్ మై హోం.చెప్పాడు.

ఎంటయ్యా నువ్వు నన్ను పిలిచి అటు చూస్తూ మాట్లాడుతున్నావ్.మెంటలా అడిగాడు కోపంగా.

అరె మీరు తెలుగా.సంతోషం.ఏం లేదు సార్ .ఇద్దరూ ఒక లాగే అనిపించారు. అందుకే అలా అటు చూస్తూ మాట్లాడాను.అని, అనీ అనగానే ఆ ఎదుటి వ్యక్తి, ఎంత మాటన్నవురా ,అంటూ టపీమని నెత్తిన మొట్టేశాడు.

అయ్యో అని నెత్తిన రుద్దుకుంటూ,ఆ మొట్టుడికి మూసిన కళ్ళు తెరిచాడు.ఆశ్చర్యం.అధ్బుతం .ఇప్పుడు శేఖర్ కళ్ళకి అంతా స్పష్టంగా కనబడుతోంది.భలే అనుకున్నాడు.కానీ పిలిచినవాడు ఎందుకు మొట్టాడో అర్ధం కాక అతని వైపుకు తిరిగాడు.అతని వైపు చూసి నీళ్ళు నములుతూ, సారీ అన్నాడు.కారణం అతను ఇందాక మాట్లాడింది అతను సంకనెత్తుకున్న కుక్క వైపు చూసి.పైగా ఇద్దరూ ఒకేలా కనబడుతున్నారు అనడంతో అలా మొట్టేశాడని అర్ధమైంది.చుట్టూ చూశాడు.విశాఖపట్నం బోర్డు కనబడింది.హమ్మయ్య.అన్నీ పోయినా సొంతూరులోనే ఉన్నాను.ఇప్పుడు నాకు కొంచెం ధైర్యం వచ్చింది అనుకుంటుండగానే,ఎవరో ఒకతను దగ్గరకొచ్చి,ఏంటి మీరు ఇంకా ఇక్కడే కూర్చున్నారు.కంపార్టుమెంటు లోంచి మీ లగేజీ తెచ్చుకోండి,అన్నాడతను యెస్.సెవెన్ బోగీ వైపుగా వేలు చూపిస్తూ. ఆ బోగీ వైపు చూసి ,అవును నేను వచ్చిన రైలు ఇదే.బోగీ కూడా ఇదే.అనుకుంటూ బిత్తర చూపులు చూశాడు అతని వంక.

ఏంటి సార్ అలా చూస్తున్నారు.వెళ్ళండి.వెళ్ళి తెచ్చుకోండి మీ లగేజీ.చెప్పాడాయన.

థాంక్ యు.కానీ నా లగేజి లేదు. రైల్లో నా ఎదురుగా సింగిల్ సీట్లో కూర్చున్న ఓ దొంగ వెధవ నా మెడలో చైన్ నొక్కేశాడు.దానికోసం వాడి చేతిలోని స్టిక్ తో నా తలపై కొట్టేశాడు,తర్వాత నా సామాను తీసుకుని, నన్నిక్కడ పడేసి పోయాడు రాస్కేల్.నాతో మాట కలపాలనుకున్నప్పుడూ,మంచి నీళ్ళు అడిగినపుడే అనుకున్న వాడు దొంగ వెధవని. చెప్పాడు కోపంగా.

అబ్బేబ్బే, అదేం లేదు సార్.మీరు పొరబడ్డారు.మీరు టాయిలెట్ కి వెళ్ళి వస్తుండగా ట్రైన్ కుదుపుకి మీరు తూలడంతో  బెర్త్ కొనకి మీ తల తగిలింది.దాంతో మీరు స్పృహ తప్పారు.తర్వాత అతనే మిమ్మల్ని పరీక్షగా చూసి ఏం కాలేదని నిర్ధారించుకున్నాడు.అయితే అంతలోనే స్టేషన్ రావడంతో,జనాలు క్రిందకి దిగడానికి, మీరు అడ్డుగా ఉన్నారని.నేనూ ఇంకో ఇద్దరి సహాయంతో దింపి ఇలా అరుగు పై కూర్చోబెట్టాం.నేను టిఫిన్ చేసి,మళ్ళీ మీ దగ్గరకు వద్దామని వెళ్ళాను.అలాగే మిమ్మల్ని ఓ కంట గమనిస్తూనే ఉన్నాలెండి.ఇంతలోనే మీకు స్పృహ వచ్చింది.తల పై దెబ్బ తగలడంతో కళ్ళు మసకబడ్డట్టున్నై.కనుక మీరు ఇలా ఉన్నారంటే కారణం అతనే. చెప్పాడతను.

అది సరే.కానీ ఆ దొంగ వెధవ నా మెడ తడిమినట్టు గుర్తు.

అతను మీ మెడ తడమలేదు.మీ విండో లోంచి వాన చినుకులు వస్తుంటే కాస్త కిందకి దించే క్రమం లో తగిలుంటుంది.అలాగే మీరు అతని చేతిలో చూసింది స్టిక్ కాదు ఊత కర్ర. మీ చైన్ కూడా ఎక్కడికీ పోలా.మిమ్మల్ని దించే క్రమంలో తెగిపోతే మీ జేబులో

శాo.చెప్పాడతను.కాస్త శాంతంగా చూస్తూ.

ఆహా!ఇంతకీ ఇవన్నీ మీకెలా తెల్సు.మీరూ ఆ బోగీలోనే వచ్చారా .

అవును.అది మాత్రమే కాదు.ఇందాకటినుండీ మీరు అంటున్న,అనుకుంటున్న ఆ దొంగ వెధవ కూడా నేనే.ఎందుకంటే మీ ఎదురు విండో సీట్లో ప్రయాణం చేసింది నేనే కాబట్టి.రాత్రి ,నాకు జ్వరం అందుకే నేను స్వెట్టర్ ,మంకీ కేప్ వేసుకున్నాను.మీతో మాటకలిపింది నన్ను కొంచెం పైకి లేపుతారేమోనని,బాత్రూమ్ కి వెళ్దామని .ఓపిక లేక నిలబడలేక పోతున్నానప్పుడు. అలాగే మంచి నీళ్ళడిగింది టాబ్లెట్ వేసుకోడానికి. చెప్పాడు ,చిన్నగా మడిచిన అతని ఊత కర్ర తీసి, అక్కడినుండి నడవడానికి సిద్ధపడుతూ.

ఓ క్షణం,శేఖరం మనసు చివుక్కుమంది.ఉపకారిని అపకారిగా భావించాను.ఏవిటి ఈ ప్రారబ్దం?అవును, ఎదుటివారిని చూడగానే ఒక అభిప్రాయం ఏర్పరుచుకోవడం, దానిని బట్టి వారిని అంచనా వేయడం. నేను చూసే దృష్టిలోనే లోపం ఉన్నపుడు,నాకు ఎదుటి వారు ఇలా కాక ఎలా కనబడతారు.ఓ పది నిమిషాలు నా కళ్ళు మసకబారేప్పటికి,ఎవరైనా సహాయం చేస్తే బావుండునని తహ ,తహ లాడను.అలాంటిది జ్వరంతో ఉన్న నడి వయసు మనిషి, స్వతహాగా లేవలేని స్థితిలో నా వంక ఆశగా సహాయం కోసం చూస్తే, నేను ఏదో ఊహించుకుని అతన్ని అవమానించాను.కానీ నేను అంత చేసినా అతను నాకు మంచే చేశాడు. మాట కలపకుండా,మనిషిని అంచనా వేయకూడదేమో.యద్భావం తద్భవతి అన్నది నా లాంటి వారి కోసమేనేమో అని మరుక్షణం అతని వైపు చూశాడు.అప్పటికే అతను తన చేతి కర్ర సాయంతో ,చిన్నగా కుంటుతూ చాలా దూరం నడిచేశాడు.చిన్న కన్నీటి పొరతో అతని కళ్ళు మళ్ళీ మసగబారాయి.కానీ తన మసకబారిన బుద్ధికంటే అది పెద్ద మసకగా అనిపించలేదు శేఖరానికి.                                                                            

                                                            

మరిన్ని కథలు