Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
premiste emavtundi

ఈ సంచికలో >> సీరియల్స్

నాదైన ప్రపంచం

nadaina prapancham

గత సంచిక లోని  నాదైన ప్రపంచం సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి... http://www.gotelugu.com/issue232/641/telugu-serials/naadaina-prapancham/nadaina-prapancham/

(గత సంచిక తరువాయి)... అతని మాటల్ని శ్రద్ధగా వింది. చాలా బాగా మాట్లాడతాడనిపిస్తుంది. కానీ ఒక పట్టాన అర్ధం కావడం లేదు.

‘‘రండి ఆడదాం....’’ కోర్టు నుంచి బయటికి వచ్చి ఆమెకి ఎదురుగా నిలబడి అన్నాడు.

అతని చేతిలో బాల్‌ తనని క్షమించ మన్నట్టుగా చూస్తోంది. ఆ బంతిని చూడగానే ఎక్కడ లేని ప్రేమా పుట్టుకొచ్చింది. దానినే మనసులో క్షమాపణలు కోరింది.

అతని చేతిలో, మాటలో ఏ మహత్యం వుందో అతను విసిరిన సరైన బాల్‌ని పొజిషన్‌ లోనే ఆడింది.

‘‘వెరీ గుడ్‌! బాగా ఆడుతున్నారు’’ మెచ్చుకున్నాడు.

‘‘అసలు యిందాక మ్యాచ్‌లో....’’

‘‘వద్దన్నాను కదా!’’ మృదువుగా అన్నాడు. అర గంట ప్రాక్టీసయ్యాక పర్‌ఫెక్ట్‌గా ఆడారు’’ అన్నాడు.

ఇద్దరూ నడుచు కుంటూ స్టేడియం బయటికి వచ్చారు. నడుస్తూనే ఆమెకి సజెషన్స్‌ యిచ్చాడు.

మనసు బాగా లేనపుడు ఫిజికల్‌గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పాడు.

స్టేడియం నుంచి బైటికి రాగానే అతను బై చెప్పి, వెళ్ళబోతుంటే ‘ప్రణీత్‌!’ పిలిచింది కీర్తన.

ఏమిటన్నట్లు తిరిగి చూశాడు.

‘‘స్టిల్‌ ఐ నీడ్‌ యువర్‌ కోపరేషన్‌’’ మొహమాటంగా అంది.

‘‘చెప్పండి....’’ దగ్గరకి వచ్చి అన్నాడు.

‘‘మీరేం చేస్తారో, ఎక్కడ వుంటారో తెలీదు, కానీ ఒక కోరిక కోరతాను.’’

చిరు నవ్వుతో వింటున్నాడు ప్రణీత్‌.

‘‘నేషనల్‌ గేమ్స్‌ అయ్యే వరకూ నా పర్సనల్‌ కోచ్‌గా ఉండగరా? మనీ పే చేస్తాను’’ గబ గబా అంది. స్తబ్దుడయ్యాడు. వెంటనే తేరుకుని....

‘‘ఎంత పే చేయ గలరు?’’ తమాషాగా అడిగాడు.

‘‘అంటే నా ఉద్దేశం....’’ వివరించ బోయింది.

‘‘అర్ధమయింది ఓ.కె.... కానీ మనీ మీరు పే చేయ లేరు. ఎందుకంటే మీ పన్నెండో ఏట నుంచి యిప్పటి వరకూ అంటే ఏడేళ్ళ పాటు మీరాడిన ముప్పయి నాలుగు టోర్నమెంట్స్‌ దేశంలో ఎక్కడ జరిగినా నేను వచ్చాను.

అందులో ఇరవై తొమ్మిది గెలిచి అయిదు ఓడి పోయారు. మీ పదిహేనో ఏటకి మీ ఓటముల సంఖ్య నాలుగైతే ఇది అయిదోది. మధ్యన గాప్‌ నాలుగేళ్ళు.

ఈ టోర్నమెంట్స్‌ కోసం మీరు పదిహేను సిటీస్‌ తిరిగారు. నేను మీతో పాటు తిరుగు తూనే వున్నాను.

కానీ ఒకే ఒక సారి మిస్సయ్యాను’’ ఆగాడు.

‘‘ఎప్పుడు?’’ అప్రయత్నంగా అంది.

‘‘మూడేళ్ళ కిందట మా ఫాదర్‌కి హార్ట్‌ ఎటాక్‌ వచ్చి మరణించినపుడు....’’దూరం నుంచి చలి గాలి వీచింది. ఒళ్ళు జలదరించింది.

‘‘ఈ అభిమానానికి మనీ పే చెయ్య గలరా...?’’ సూటిగా అడిగాడు.

దిగ్భ్రాంతిగా చూస్తుండి పోయింది. తనకే పట్టని గణాంకాలన్నీ అతను ఏకరువు పెట్టి చెపుతుంటే, నోట మాట రానట్లు వింటూ వుండి పోయింది.
ఏ వ్యక్తి తన పట్ల ఇలాంటి కేర్‌ తీసుకున్నాడని భావించిందో ఆ వ్యక్తి తన కోసం ఏమీ చేయ లేదు.

కానీ ఇతను....నాలుగేళ్ళ కిందట తన లోని లోపాన్ని సరిజేసి మెరుపులా మాయమయ్యాడు.

మళ్ళీ ఇప్పుడు మానసికంగా డిప్రెషన్‌గా ఉన్న స్టేజ్‌లో ప్రత్యక్షమయ్యాడు.

అంటే యితను తన ఆనందాల్ని షేర్‌ చేసుకోవాలనుకో లేదు. తను కష్టంలో వున్నప్పుడే ఎదురవుతున్నాడు. ఇంత కన్నా శ్రేయోభిలాషి ఎవరుంటారు?

ఇలాంటి వ్యక్తికా తను మనీ పే చేస్తానంటోంది.

‘‘అయాం సారీ!’’ తల వంచుకుని అంది.

‘‘ఫర్వా లేదు. మీకు అవసరమైనపుడల్లా ఫోన్‌ చెయ్యండి. నేనుండేది హైదరాబాద్‌ లోనే’’ చెప్పాడు.

ఆమె మొహం వికసించింది. ఆమెను హోటల్‌ దగ్గర దిగ బెట్టడానికి ఆటో ఎక్కించాడు.

 ‘‘మీరూ రండి’’ పిలిచింది. ఆటోలో కూడా ఆమె గేమ్‌ గురించే మాట్లాడింది. అతనూ అదే మాట్లాడాడు.

ఆకాష్‌కీ ఇతనికీ మధ్య తేడా కనిపించింది. ఆకాష్‌ తన అభిమానినని చెప్పాడే గాని, ఏనాడూ తన ఆట గురించి తనతో చర్చించడానికి ఇష్ట పడ లేదు. అప్పుడు కూడా తనకి అతని పట్ల అనుమానం రాలేదు. అతనిది నిజమైన ప్రేమని గుడ్డిగా నమ్మింది. ఆ నమ్మకం చివరికి తననీ స్థితికి తెచ్చింది.

హోటల్‌ దగ్గర ఆమె దిగ గానే....‘‘జరిగిందంతా మర్చిపొండి. సెలక్షన్స్‌కి యింకా వన్‌ మంత్‌ టైం వుంది. అన్నింటినీ, అందర్నీ మనసు లోంచి తుడిచేయండి. కేవలం ఆటని, లక్ష్యాన్ని మనసులో నిల్పుకోవడం...ప్రాక్టీస్‌ చేయడం....

ఆటలో కొత్తగా నేర్చుకోవాల్సిన మెలకువలు ఏమీ లేవు. మీరు నేర్చుకోవలసిందల్లా ఏకాగ్రత. అంతే!’’ చెప్పాడు. శ్రద్ధగా వింది. అతను వెళ్ళి పోతున్నా బాధ కలగ లేదు. అతనిచ్చిన ఉత్తేజం నర నరాన నిండి వుంది.

రూంకి రాగానే ఫ్రెండ్స్‌ బిక్క మొహాలు వేసుకుని కీర్తన వంక బితుకు బితుకుమంటూ చూశారు.

ఒక్క సారి అందర్నీ కలియ జూసి ఫక్కున నవ్వింది. చేతిలో బాల్‌ని గాల్లోకి ఎగరేస్తూ...

‘‘ఈ ఓటమి గెలుపుకి తొలి మెట్టు. ఈ రోజు నా ఆటతో మీ అందరిని బాధ పెట్టాను. అయాం సారీ!’’ మనస్ఫూర్తిగా అంది.
అందరి మనసులూ తేలిక పడ్డాయి. అందరూ వచ్చి కీర్తనని చుట్టేశారు. చుట్టూ చేతులు వేసుకుని గుంపుగా నిలబడ్డారు అందరూ. తమ హృదయాల్లోని అవమానాల్ని, బాధల్నీ, ఓటమినీ తరిమి కొట్టారు.

యిది వరకు ఆకాష్‌ పరిచయం కాగానే అతని గురించి అంతా చెప్పేయాలన్నంత ఆతృత కలిగినట్లుగా ప్రణీత్‌ గురించి చెప్పాలనిపించ లేదు.
రేపు హైద్రాబాద్‌లో ప్రాక్టీస్‌ చేసేప్పుడయినా అందరికీ తెలుస్తుంది. అప్పుడు ఎలా తెలిసినా తనకి సంబంధం లేదు. కానీ తనంతగా తాను మాత్రం చెప్పదు.

ఈ ఓటమి ఒక గుణపాఠం...

ఈ ఓటమిని ఎలా అధిగమించాలో తనకి ప్రణీత్‌ బాగానే చెప్పాడు. అతని సహాయం తోనే తను ఈ హార్టిల్‌ని దాటాలి. యిందాక అతనే రాక పోయి వుంటే తన పరిస్థితి...?

వూహించు కోవడానికే భయం వేసింది. అలా డిప్రెషన్‌లోకి వెళ్ళి పోయి వుండేది. నేషనల్‌ గేమ్స్‌ కాదు కదా....సెలక్షన్స్‌లో కూడా తను గెలవ లేక పోయేది.

ఎక్కువ ఆలోచించ వద్దన్న అతని మాటలు గుర్తొచ్చి ఆలోచనల్ని కట్టి పెట్టి డిన్నర్‌ చేసి త్వరగా పడుకుంది. ప్రశాంతంగా నిద్ర పట్టింది.

**********

కీర్తన యింటికి వచ్చే సరికి మృదులా దేవి యింట్లోనే వుంది. అలవాటు ప్రకారం ముందు గుండె జారి పోయినా, మళ్ళీ తనే సర్ది చెప్పుకుంది.
రాగానే ఎదురయి నిప్పులు కక్కే కళ్ళతో చూస్తూ....

‘‘అయ్యాయా తిరుగుళ్ళు?’’ అంది.

అశోక్‌ తన రూం లోంచి బయటకి వచ్చి చెల్లి వంక పలకరింపుగా చూసి తన గది లోకి వెళ్ళి పోయాడు.

తెల్ల బోయింది కీర్తన. ఎప్పటిలా తనకి సపోర్ట్‌ వచ్చి పిన్నిని ఎదిరిస్తాడనుకుంటే యిదేంటి??

ఆమెకి అర్ధం అయింది. ఈ యుద్ధంలో తన లక్ష్య సాధనలో తను ఒంటరి. తనని తనే కాపాడుకోవాలి.

‘‘సమాధానం చెప్పవేం....?’’ గద్దించింది మృదులా దేవి. ఒక నిశ్చయానికి వచ్చింది కీర్తన. సూట్‌కేస్‌ హాల్లో పెట్టి తన గది వేపు అడుగు వేసింది. నిర్ఘాంత పోయింది మృదులా దేవి.

చెట్టంత మనిషిని యిలా ఎదురుగా నిలబడి అడుగుతుంటే, వులకూ,  పలుకూ లేకుండా వెళ్ళి పోతుందేమిటి?....తను ఇంట్లో లేనపుడు వీళ్ళకి కొమ్ములు వచ్చాయా? తన అధికారానికి గండి పడినట్లుగా భావించింది.

‘‘ఆగు!....’’ గట్టిగా అంది.

ఆగింది కీర్తన. అక్కడే నిల్చుని వెనక్కి తిరిగి చూసింది.

ఆ చర్యకి తిక్క రేగింది మృదులా దేవికి.

‘‘నేనిక్కడ నా మానాన నేను మాట్లాడుతూనే వున్నాను. నువ్వెళ్ళి పోతున్నావ్‌. నీ ఉద్దేశం ఏంటి...?’’

‘‘నావి తిరుగుళ్ళు కావు, వాలీ బాల్‌ గేమ్‌ నీకు నచ్చక పోవచ్చు పిన్నీ! అది నా ప్రాణం, మీకు యిష్టం లేక పోతే నా మానాన నన్ను వదిలేయండి. నేను మేజర్‌ని నా మంచి-చెడు నేను చూసుకుంటాను. యింకో సారి ఎప్పుడూ అవమానించేట్టు మాట్లాడొద్దు. మా తల్లి స్థానంలో వున్న నువ్వంటే మాకు ఎప్పుడూ గౌరవమే! దాన్ని అభిమానంగా మార్చుకోవటానికి ప్రయత్నించు. అంతే తప్ప ద్వేషంగా మార్చొద్దు. అపుడు ఈ ఇంట్లో ఎవరికి ఎవరమో తెలీకుండా పోతుంది. గుర్తుంచుకోండి’’ చాలా ప్రశాంతంగా చెప్పింది.

గదిలో వున్న అశోక్‌కి ఈ మాటలు వినిపించాయి. ముందు ఆశ్చర్య పోయినా తర్వాత ముసి ముసిగా నవ్వుకున్నాడు.

యిక మృదులా దేవికి యిది ఎదురు చూడని షాక్‌. భూపతి వంక చూసింది. ఆయన పెదవులు వికృతంగా వంకర తిరిగాయి.
అది నవ్వు....

మూలన బడ్డ రోగిష్టి మనిషికి కూడా తన అవమానం ఆనందాన్ని కలిగించింది. క్రూరంగా అతని వంక చూస్తూ వుండి పోయింది.

*********

కాలేజీలో అడుగు పెట్టడం తోనే చాలా మంది సానుభూతిగా చూసారు. ప్రిన్సిపాల్‌ కూడా కీర్తన గురించి కబురు పెట్టి ఆమెతో మాట్లాడాడు. తామంతా ఆమె వెనుక వున్నామని....అధైర్య పడొద్దు అని చెపుతుంటే కళ్ళు చెమర్చాయి.

మరింత పట్టుదల పెరిగింది. ఇంత మంది తన మీద ఆశలు పెట్టుకున్నారు.

తను మూర్ఖంగా ప్రేమా, దోమా అంటూ కెరీర్‌ని నిర్లక్ష్యం చేసింది. అందుకు తగిన మూల్యమే చెల్లించింది. అర్హత లేని మనిషి కోసం తను ఆలోచించడానికి సిద్దంగా లేదు. ఎలాగైనా ఈ వల నుంచి, దాని అవశేషాల నుంచి తప్పించుకోవాలి. గట్టిగా నిశ్చయించుకుంది.

 

 (సశేషం)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్