అన్ని రంగాల్లోనూ దూసుకుపోతోన్న యువత, ఇప్పుడు సంస్కృతీ సంప్రదాయాల పరంగానూ తన ప్రత్యేకతను చాటుకోవడానికి ముందుకొస్తోంది. సెల్ఫీల మోజులో కొట్టుమిటాడుతున్నవారు సైతం, సంప్రదాయాల పట్ల అవగాహన పెంచుకుంటున్నారు. పాత పద్ధతుల్ని అనుసరించడం కూడా ట్రెండీగా భావిస్తుండడం ఇందులో కొత్త కోణం. పల్లెటూరి పండుగల్లో యువత ఉత్సాహంగా పాల్గొంటుండడం అభినందించదగ్గ విషయమే కదా. ఒక టైంలో యువత పండగలు, సాంప్రదాయాల్ని పెడ చెవిన పెట్టి, సాంప్రదాయాలు పాఠించడం అంటే అదేదో పాత చింతకాయ పచ్చడి అన్నట్లుగా కొట్టి పాడేసేవారు. కానీ ఇప్పుడు యువత ఆలోచనల్లో మార్పు వచ్చింది. మన సంస్కృతీ సాంప్రదాయాలకు విలువ ఇవ్వడమే కాకుండా, వాటిని ఫాలో చేయడానికీ ఇష్టపడుతున్నారు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటే ఇదే. పాత సాంప్రదాయాలు, స్టైల్స్ ఇప్పుడు కొత్తగా ట్రెండీ అవుతున్నాయి. కట్టు, బొట్టు దగ్గర నుండీ చాలా విషయాల్లో యువత పాత తరాన్ని thuతలంపుకు తీసుకొస్తోంది.
పండుగలు, పబ్బాలే కాకుండా సేవా కార్యక్రమాల్లో కూడా యువత ముందడుగు వేస్తోంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ఓ హాబీగా కాకుండా బాధ్యతగా భావిస్తున్నారు. ఆ రకంగా సామాజిక బాధ్యతగా భావించి, యువత సేవా కార్యక్రమాల్ని విరివిగా చేపడుతోంది. ఇటీవలి కాలంలో సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా యువతే కన్పిస్తున్నారు. పెద్ద పెద్ద ఫంక్షన్స్, పార్టీల్లోనూ నీట్‌గా రెడీ అవుతూనే, క్లీనింగ్ వంటి పనుల్లోనూ యువత బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. ఉన్నత విద్యనభ్యసించినవారు, పేదలకు విద్యనందించేందుకు ముందుకొస్తున్నారు. తమకు తెలిసిన విషయాల్లోని జ్ఞానాన్ని పదిమందికీ పంచేందుకు మంచి ఆలోచకనలు చేస్తున్నారు. ఖాళీ సమయాల్లో సర్కారీ స్కూళ్ళకు వెళ్ళి ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా పేద విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు.
రాజకీయ రంగంలోనూ యువత పాత్ర కీలకంగా మారుతోంది. సోషల్ మీడియా వేదికగా ప్రజలకు వాస్తవాలు తెలియజేయడంలో ఈ యువతదే కీలక పాత్ర. అయితే కొందరి కారణంగా సోషల్ మీడియా చెడు ప్రభావం సమాజంపై చూపుతోందనే కఠోర వాస్తవాన్నీ విస్మరించలేం. అయినప్పటికీ కూడా సోషల్ మీడియాని మంచి కార్యక్రమాలకు వినియోగించుకుంటోన్న యువతను అభినందించాలి. మనది యువ భారతం. యువత సన్మార్గంలో పయనించాలనే ఆలోచనతో ఉండడం మనకి గర్వకారణం. తల్లిదండ్రులు, విద్యాబుద్ధులు నేర్పే గురువులు, సమాజం, పాలకులు ఇలా ప్రతి ఒక్కరూ యువత మంచి మార్గంలో పయనించేలా చూడటంతోపాటు, వారిని ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ, సరైన గైడెన్స్ ఇస్తే ఇంకా అద్భుతమైన సమాజాన్ని మనం చూడగలం.
|