ఈ రోజుల్లో సిక్స్ ప్యాక్ ఫిజిక్ అంటే పెద్ద విషయమేమీ కాదు. సినిమాల్లో హీరోల్ని చూడట్లేదేటి! ఇది యంగ్ తరంగ్ మాట. అమ్మాయిల కలల రాకుమారుడంటే ఖచ్చితంగా సిక్స్ ప్యాక్ ఉండాలనే అభిప్రాయంతో యువత ఉండటం మామూలే. కానీ అనుకున్నంత తేలిక కాదు, సిక్స్ ప్యాక్. ఆరోగ్యపరమైన నియమాలోన్నో పాటించాలి. వ్యాయామ నిపుణుడి పర్యవేక్షణలో, అలాగే వైద్య నిపుణుల సూచనలు, సలహాల మేరకు సిక్స్ ప్యాక్ కోసం కసరత్తులు చేయాల్సి ఉంటుంది. సినీ స్టార్స్‌కి అవన్నీ అందుబాటులో ఉంటాయి. అంతేకాదు అది చాలా ఖరీదైన వ్యవహారం కూడా. ఏడాది కష్టపడితేనో, ఆర్నెళ్ళు కష్టపడితేనో సినీ హీరోలు సిక్స్ ప్యాక్‌తో కనిపించడం మామూలే. ఎందుకంటే ఆ ఫిజిక్ కోసం వారి శరీరం అప్పటికే సర్వసన్నద్ధంగా ఉంటుంది కాబట్టి, ప్యాక్స్ ఈజీగా వచ్చేస్తాయి. అలాగే వారు కండల విషయంలో ఎంత జాగ్రత్త పడతారో అందుకు తగిన జాగ్రత్తలు కూడా అలాగే తీసుకుంటారు. సో అందుకే వారు హీరోలు, కానీ అందరికీ అలా కుదరదు. హెయిర్ స్టైల్ చేయించుకున్నట్లో హీరోలా డిఫరెంట్ డ్రస్ వేసుకున్నట్లో కాదు కదా సిక్స్ ప్యాక్ అంటే.
సిక్స్ ప్యాక్ చేసేసి, అమ్మాయిల మనసుల్ని కొల్లగొట్టేయాలనే తొందరలో చాలామంది లేనిపోని కష్టాల్ని తెచ్చుకుంటున్నారు. భారీకాయులు అయితే వారి పరిస్థితి దారుణం. షడెన్‌గా ఒళ్ళు తగ్గించేసుకోవడం కోసం తిండి మానేస్తే, అనేక రకాలైన అనారోగ్య సమస్యలొస్తాయి. కొన్ని సార్లు ఆ అనారోగ్య సమస్యలు ప్రాణం పోయే ముప్పుని కూడా తెచ్చిపెడ్తాయి. బక్కపలచగా ఉన్నవారిది ఇంకో కష్టం. తాము ఎప్పుడూ తినని ఆహారాన్ని అమితంగా తీసుకోవడంతో వారినీ అనారోగ్య సమస్యలు వెంటాడతాయి. కోరుకున్న సిక్స్ ప్యాక్ రాదు సరికదా, జీవితం ఛిన్నాభిన్నమైపోతుంది. ఇలా అనవసర కష్టాల్లో పడి యూత్ భవిష్యత్ కష్టాలను ముందుగానే కొని తెచ్చుకుంటున్నారు. అసలే తినే ఆహారం అంతా విషతుల్యమే. పాల నుండీ, పళ్లు, కూరగాయలు, రైస్ ఇలా ఒక్కటేమిటి కాదేది కాలుష్యానికి అనర్హం అన్నట్లుగా ఉంది ప్రస్తుత పరిస్థితి. ఈ పరిస్థితుల్లో యువత లేని పోని ఎట్రాక్షన్స్‌కి లోనయ్యి మరిన్ని సమస్యలు కోరి తెచ్చుకుంటున్నారు.
అబ్బాయిలే కాదు, అమ్మాయిలకీ ఇలాంటి సమస్య ఉంది. అదే జీరో ఫిజిక్. జీరో సైజ్ ఫిజిక్ కోసం అమ్మాయిలు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. డైటింగ్స్, జిమ్‌లో కసరత్తులు ఒక్కటేమిటీ పులిని చూసి నక్క వాతలు పెట్టుకోవడం అంటే ఇదే. ఇది ఎంత మాత్రమూ సబబు కాదు. ఫిజిక్ ఫిట్‌గా ఉండటం ఆరోగ్యకరమే. అలా ఆరోగ్యంగా ఉన్నవారు ఏది ట్రై చేసినా పెద్దగా సమస్యలు రావు. అంతేగానీ హీరో హీరోయిన్లను చూసి తమ పరిస్థితుల్ని బేరీజు వేసుకోకుండా వాతలు పెట్టుకుంటే అది అత్యంత ప్రమాదకరం. అలాంటి ప్రమాదకర పరిస్థితుల్నే యువతీ యువకులు కోరి తెచ్చుకుంటున్నారు. స్టైల్ పేరుతో ఆరోగ్యాన్ని అనవసరంగా పాడు చేసుకుంటున్నారు. ఈ విషయంలో యూత్ తస్మాత్ జాగ్రత్త!
|