Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
premiste emavutundi

ఈ సంచికలో >> సీరియల్స్

నాదైన ప్రపంచం

nadaina prapancham

గత సంచిక లోని  నాదైన ప్రపంచం సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి....http://www.gotelugu.com/issue233/644/telugu-serials/naadaina-prapancham/nadaina-prapancham/ 

 

(గత సంచిక తరువాయి)..క్లాస్ కి వెళుతుంటే మణి బిందు తన బ్యాచ్ తో ఎదురయింది.

గుండె గుభేల్ మన్ది.

ప్రేమలో ఓడిన అవమానం.

ఆటలో ఓడిన అవమానం...

ఈ అమ్మాయి దేనినీ అంత తొందరగా వదిలి పెట్టదు.

‘‘హలోవ్!....’’చిటికలు వేసి విలాసంగా పిలిచింది మణి బిందు. ప్రశాంతం గానే తలెత్తి చూసింది.

‘‘గేమ్ లో మన ప్లేస్ ఏంటి తిరగ బడిందంట?’’ వ్యంగ్యంగా అడిగింది మణి బిందు.

గుండెల్లో గుప్పున బాధా కెరటం ఉప్పొంగింది. వెనకే వచ్చిన టీమ్ మేట్స్...

‘‘అది నీకనవసరం బిందూ!’’ కోపంగా అన్నారు.

‘‘కెప్టెన్ మూలంగా మ్యాచ్ ఓడినా సపోర్ట్ చేస్తున్నారే!’’

‘‘ఒక మ్యాచ్ లో ఓడినంత మాత్రాన విమర్శించడం మా నైజం కాదు. మా కెప్టెన్ మూలంగానే ఎన్నో మ్యాచ్‌లు గెలిచిన సంగతి మర్చి పోలేం’’ ఆవేశంగా అంది.

‘‘సరే...సరే!....ఇంతకీ నా ఉడ్ బి ఆకాష్ ఏమంటున్నాడు?’’ సర్ కాసిక్ గా అంది.

చిరు నవ్వు నవ్విండి కీర్తన.

తెల్లబోయింది మణి బిందు.

‘‘ఆకాష్ ఎలాంటి వాడో తెలియని నిన్ను చూస్తే జాలేస్తోంది బిందూ! అతని పేరెత్తి నువ్వు ఏ రకం గానూ బాధ పెట్టలేవు.....ఆ ఆయుధం నా మీద ఇప్పుడు పని చేయదు. ఇంకోటి వెతుక్కో....’’ హుందాగా చెప్పి కదిలింది. కొంచెం దూరం వెళ్ళి వెనక్కి తిరిగి....

‘‘బిందూ! ఒకటి మాత్రం గుర్తుంచుకో!....విజయానికి అడ్డ దారులు లేవు’’ చెప్పి వెళ్ళి పోతుంటే నోట మాట రానట్లు చూస్తుండి పోయారు మణి బిందు, ఆమె బ్యాచ్.

సాయంత్రం ప్రాక్టీస్ కి వెళ్ళింది. ఆ ప్రాక్టీస్ లో ఆమె ఎప్పటి లాగే ఆడటం చూసి మిగతా వాళ్ళు సంతోషించారు. హృదయంలో ఆవరించిన దిగులు మేఘాలన్నీ కరిగి పోయాయి. ఇది వరకటిలా ఉత్సాహంగా, వుల్లాసంగా కేరింతలు కొడుతూ ఆడుకుంటుండగా జరిగిందా సంఘటన.
స్టేడియం మెట్లెక్కి వస్తున్న పొడవాటి మనిషిని చూసి సైగలు చేసుకున్నారు. కీర్తన ఈ లోకంలో లేదు. ఆమె మామూలు గానే ఆటలో లీనమై పోయింది.

అతను డైరెక్ట్ గా వీళ్ళు ఆడుకుంటున్న దగ్గరకు వచ్చేశాడు. కోర్టు బయట నిలబడి....

‘‘కీర్తనా! ఓసారి రా!’’ పిలిచాడు.

చివ్వున తల తిప్పి చూసింది.

ఆకాష్!....

కోర్టులో చేష్టలు దక్కి నిల్చుండి పోయింది. మైండ్ వేగంగా పని చేసింది.

ఎప్పటికయినా అతనితో ముఖా ముఖి తేల్చుకోవాల్సిందే....! అతనే ఎదురయినపుడు సంకోచించడం దేనికి?

‘‘మీరు ఆడండి.....’’ చెప్పి కదిలింది.

‘‘కీర్తనా!.....’’ ఒకమ్మాయి ఆందోళనగా అంది.

‘‘ఏం ఫర్వా లేదు’’ చెప్పి ఆకాష్ వైపు నడిచింది.

కొంచెం దూరం వెళ్ళాక కూడా అతను నడక ఆప లేదు.

సిమెంట్ బెంచీలున్న దగ్గర ఆగి దాని మీద కూర్చుంటూ ‘‘ఇక్కడ మాట్లాడుకుందాం’’ అంది.

‘‘అదేంటీ..ఎక్కడైనా.....’’ అతని మాటని మధ్యలోనే ఆపేస్తూ ‘‘చెప్పండి’’ అంది.

విచిత్రంగా చూస్తూ వచ్చి పక్కన కూర్చున్నాడు.

కాస్త పక్కకి జరిగింది.

‘‘ఏమయ్యింది నీకు....? ఇన్ని రోజుల నుంచి కలవ లేదని కోపమా? ఏం చేయను? చెన్నై వెళ్ళొచ్చాక చాలా పనులు పెంంగ్గ్ లో వుండి పోయాయి. ఊపిరి సలపని బిజీ. ఫోన్ చేస్తుంటే నువ్వు పి.ఎం. కన్నా బిజీ....’’ జోవియల్ గా అన్నాడు. మాట్లాడ లేదామె...
‘‘ఏంటి చిట్టీ?’’ లాలనగా అన్నాడు.

వెంటనే రియాక్టయ్యింది కీర్తన.

‘‘దయ చేసి అలా పిలవొద్దు....’’ కరుకుగా అంది. ఆమె కళ్ళు జ్యోతుల్లా మండుతున్నాయి.

‘‘ఏం....?’’ ఆశ్చర్యంగా అన్నాడు.

అతని నటనని భరించ లేక పోయింది కీర్తన.

‘‘ఆకాష్! ఇంకా నటన వద్దు. మరింత అసహ్యం పెరుగుతుంది’’ కోపంగా అంది.

‘‘నేనేం చేశాను?’’

‘‘మణి బిందు ఎవరు?’’

‘‘మణి బిందు....??!!’’ తడబడుతూ అన్నాడు.

‘‘మీ హయ్యర్ స్టడీస్ ఎక్కడ జరిగాయి?’’‘.......’’

‘‘మీరు నాకు ఎప్పట్నించీ అభిమాని?’’

‘..............’’

‘‘మీ పేరెంట్స్ మీకు ఎవరినిచ్చి పెళ్ళి చేయాలనుకుంటున్నారు?’’

ఆమెకి అంతా తెలిసి పోయిందని అర్ధమయింది.

‘‘అది కాదు కీర్తనా.....’’ ఏదో చెప్ప బోయాడు.

‘‘ఏం వద్దు. మీరేం చెప్పినా నేను వినను. నా కళ్ళతో నేను చూసాను. స్వయంగా తెలుసుకున్నాను....మీ అసలు స్వరూపం ఏంటో! ఒక ఛీటర్ ని నమ్మి మోస పోయాను. ఈ జన్మకిది చాలు....’’ ఆమె ఆవేశంతో అంటుంటే...

అతనికి నర నరానా ఉద్రేకం పెరిగి పోతోంది.

‘‘నన్ను ట్రాప్ చేయడానికి అభిమానినంటూ వెంట పడ్డారు. ఒక ఆడ దాని శరీరం కోసం వాళ్ళ మనసుతో ఇంతగా ఆడుకోవాలా?’’
ఆ మాటకి వెంటనే బరస్టయ్యాడు ఆకాష్.

‘‘నీకోసం, నీ శరీరం కోసం నేను ట్రాప్ చేశానా? దేనికి? ఎవరి కన్నా అందకత్తెవని? ఒక కల్చరంటూ తెలీని నిన్ను ఎవరైనా ప్రేమించ గలరా? అసలేం జరిగిందో తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడకు.

ఎప్పటి కయినా మనిద్దరి పెళ్ళి జరుగుతుంది. ఎందుకంటే నాలాంటి వాడు కాదు కదా, నా కింద పని చేసే ఎంప్లాయి లాంటి వాడు కూడా నీకు దొరకటం కష్టం....’’ ఆవేశంగా అన్నాడు.

ఆమె ఆత్మాభిమానం దెబ్బ తింది.

‘‘నేనసలు పెళ్ళే చేసుకోను. నా లక్ష్యం నేషనల్ గేమ్స్...అది మర్చి పోయి ఇంత కాలమూ మీది ప్రేమనుకొని మీ చుట్టూ తిరిగాను.’’
ఆమె మాటలకి పగలబడి నవ్వాడు ఆకాష్.

‘‘నేషనల్ గేమ్స్....నీ టార్గెటా? మణి బిందుని మర్చి పోయావా? షి ఈజ్ రియల్ ప్రొఫెషనల్. ఆమె సంగతి మర్చి పోకు. ముందు స్టేట్ లెవల్ లో గెలువు. తర్వాత నేషనల్ లెవల్ గురించి ఆలోచిద్దువు గాని....’’ వెటకారంగా అన్నాడు.

అతని నిజ స్వరూపం బయట పడి పోయినట్లయింది.

మణి బిందూ, ఇతనూ కుమ్మక్కై తనని ఎలాగయినా స్మాష్ చేయాలనుకున్నారు.

అది వాళ్ళ వల్ల కాదని తను నిరూపిస్తుంది. ఎస్....తను అడ్డు కట్ట వేస్తుంది.

అంతే!

‘‘మీరూ, మీ బిందు కాదు కదా, ఆమె లాంటి వాళ్ళు ఎంత మంది వున్నా, మా టీమే విన్నర్స్ అవుతుంది. ఇది నా ఛాలెంజ్’’ పట్టుదలగా అంది.

‘‘ఛాలెంజ్.. ఓ.కె....ఈ ఛాలెంజ్ లో నువ్వోడి పోతే....?’’ ఆకాష్ అడిగాడు.

‘‘ముందు మీరు చెప్పండి. నేను విన్నయితే....?’’ ఉద్రేకంగా అంది.

క్షణం ఆలోచించాడు.

‘‘విన్నయితే జీవితంలో నీ ఇష్టం లేకుండా నీ ఎదుటికి కూడా రాను. నీ జీవితంలోంచి తొలగి పోతాను’’ చెప్పాడు. ‘‘మరి నువ్వోడి పోతే?’’ అడిగాడు.

‘‘మీరే చెప్పండి. ఎందుకంటే నాకు నమ్మకం ఉంది. నేను ఓడి పోనని....’’

‘‘నువ్వోడి పోతే....మొదటి కండిషన్ మన పెళ్ళి ఇమ్మీడియట్ గా జరగాలి. రెండోది` నువ్వు లైఫ్ లో వాలీ బాల్ ఆడ కూడదు....’’ చెప్పాడు.
స్థంభీభూతురాలయింది. ప్రకృతి అంతా నిశ్చేష్టిత అయినట్లు కనిపించింది.

ఇదేం కండిషన్....?

నువ్వు ఊపిరి పీల్చొద్దు అన్నట్లుగా.....

‘‘చెప్పు....భయం వేస్తోందా?’’

‘‘అదేం లేదు. ఓ.కె....’’ చెప్పింది.

‘‘నువ్వు మాట మీద నిలబడతావనే నా నమ్మకం.....’’ అన్నాడు.

‘‘మీరు కూడా....’’ చెప్పింది.

దెబ్బ తిన్న పులుల్లా ఒకరినొకరు చూసుకుంటూ, పరస్పరం గాయ పడ్డ మనసుతో వెనక్కి తిరిగారు.

(సశేషం)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్