గత సంచిక లోని నాదైన ప్రపంచం సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి...http://www.gotelugu.com/issue238/654/telugu-serials/naadaina-prapancham/nadina-prapancham/
(గత సంచిక తరువాయి)... ‘‘ఏం?’’
‘‘మీ లాంటి మంచి మనిషికి జన్మనిచ్చిన ఆవిడ ఇంకెంత గొప్ప వ్యక్తో.’’
ఆమె మాట్లాడుతుండగానే మధ్యలోనే లేచి తాళం తీస్తూ ‘‘ఏంటి ఉదయాన్నే ఇంత దాడి?’’ నవ్వుతూనే అడిగాడు.
‘‘అబద్దం కాదు’’ మెల్లగా అంది. అతనికి వినబడిందో లేదో తెలీదు. లోపలికి వెళ్ళాడు. ఓ అరగంట అక్కడే కూర్చుని తర్వాత లోపలికి వెళ్ళి స్నానం చేసి గది బయటకు వచ్చింది.
ప్రణీత్ కిచెన్‌లో వున్నాడు. ‘‘నేను హెల్ప్ చేస్తాను’’ అంటూ తనూ జాయినయింది.
ఏడున్నరకల్లా బ్రేక్‌ఫాస్ట్ రడీ అయింది. ఇద్దరూ టేబిల్ ముందు కూర్చోబోతుండగా వరండా లోంచి ఎవరో పివడం వినిపించింది.
ప్రణీత్ చప్పున లేచి వెళ్ళాడు. ఎవరిదో మగ గొంతు వినిపిస్తోంది.
ఆ వాయిస్ వినగానే ఉలిక్కిపడింది. ఎవరిదో పరిచయమయిన గొంతులా వినబడుతోంది.
అదురుపాటుతో లేచి నిలబడి కిటికీలోంచి చూసి మ్రాన్పడిపోయింది. వరండాలో అశోక్.
ప్రణీత్‌తో ఏదో మాట్లాడుతున్నాడు.
కలలో నడుస్తున్నదానిలా బెడ్‌రూంకి వచ్చింది. అశోక్ ఇక్కడికి ఎలా వచ్చాడు....?
తనిక్కడ వున్నట్లు ఎలా తెలుసు...?
తనెవరికీ చెప్పలేదు. ఆఖరికి తన ఫ్రెండ్స్‌కి కూడా. ప్రణీత్ అడ్రస్ కానీ, ఫోన్ నెంబర్ కానీ తెలీవు. అలాంటపుడు అశోక్ ఎలా రాగలిగాడు?
అంటే....???
ప్రణీత్ తనిక్కడ వున్నట్లు అన్నయ్యకి ఫోన్ చేసి చెప్పి ఉంటాడు.
‘‘అంతా మోసం....?’’
అందరూ మోసగాళ్ళే! వేటగాడి బాణం తగిలి విలవిల్లాడే గువ్వలా ముడుచుకుపోయింది మనసు.
ఈ లోకంలో నమ్మదగిన మనుషులే లేరా...? అశోక్ మాటలకే యిప్పటికీ తనకి అయోమయం నుంచి తేరుకోనివ్వలేదు.... అలాంటిది యిపుడు ప్రణీత్ కూడా....
నిరాశగా, నిస్పృహగా అనిపించింది. అంతేకాదు, ఈ లోకం అంటేనే కసి పుట్టుకొస్తుంది.
బెడ్‌మీద కూర్చొని శూన్యంలోకి చూస్తూ ఆలోచిస్తోంది కీర్తన. ప్రణీత్ లోపలికి వచ్చాడు.
అతని అడుగుల చప్పుడు వినిపించినా తలెత్తలేదు కీర్తన. ఆమె కోపాన్ని అర్ధంచేసుకున్నాడతను.
‘‘మీ అన్నయ్య వచ్చారు. మాట్లాడండి’’ చెప్పాడు. చివ్వున తలెత్తి చూసింది. ఆ చూపులో ‘మోసం చేశారన్న’ భావం పదునుగా కనిపించింది. చలించలేదు ప్రణీత్...‘‘నేనే ఫోన్ చేశాను. మీరు ఎక్కడికి వెళుతున్నదీ చెప్పకుండా వచ్చేస్తే వాళ్ళు కంగారుపడతారు కదా!’’
‘‘అందుకే అతి జాగ్రత్తగా నన్ను మా అన్నయ్యతో పంపానిల నిశ్చయించుకున్నారా....? మీకు రాత్రే చెప్పాను. నేను ఎలాంటి పరిస్థితిలో యిల్లు వదిలి వచ్చేశానో... అయినా మీరు అన్నయ్యకి ఫోన్ చేశారు’’ నిష్ఠూరంగా అంది.
‘‘ముందు ఒకసారి తనతో మాట్లాడండీ!....చాలా బాధపడుతున్నాడు.
కాసేపు మాట్లాడలేదు కీర్తన. తర్వాత హఠాత్తుగా అంది.
‘‘అసలు విషయం నాకు అర్ధమయింది.’’
‘‘ఏమిటీ?’’ ఆశ్చర్యంగా అడిగాడు.
‘‘మీరు నన్ను బర్డెన్‌గా భావిస్తున్నారు. వదిలించుకోడానికి యిలా మా అన్నయ్యకి ఫోన్ చేశారు. అసలు నాదే తప్పు. మిమ్మల్ని అడక్కుండానే ఇక్కడికి వచ్చి సెటిలయిపోయాను’’ గబగబా ఆవేశంతో మహా ప్రవాహంలా మాట్లాడుతున్న ఆమె మాటకి అడ్డుకట్టవేస్తూ...
‘‘మీరు వెళతానన్నా నేషనల్ గేమ్స్ అయ్యేవరకూ మిమ్మల్ని ఎక్కడికీ పంపించను’’ మెల్లగా మృదువుగా అన్నాడు.
‘‘ఆ!....’’ రెప్పల్లార్చింది కీర్తన.
మళ్ళీ రిపీట్ చేశాడు ప్రణీత్. మొహంలోకి మళ్ళీ వెలుగు పాకి వచ్చింది.
‘‘మరి అన్నయ్య?’’ సందేహంగా చూసింది.
‘‘మీరు భయపడి యిక్కడ దాక్కున్నట్లు ఉండకూడదు. ధైర్యంగా ఇక్కడే వుంటానని చెప్పండి. భయపడాల్సిన పనిలేదు. నేను మీకు అండగా వుంటాను. కానీ ఒక్కమాట. మీ అన్నయ్యని అర్ధం చేసుకోటానికి ప్రయత్నించండి. యింత కాలం ప్రాణంలా పెంచిన అన్నయ్య ఒక్కసారిగా ఎందుకు మారుతారు?.....ఏవో కారణాలు వుంటాయి. అందుకే ద్వేషించడం మానండి. అసలు అంతెందుకు...? ఆ విషయాన్నీ మనసు లోంచి తీసేయండి. పదండి. కాసేపు మాట్లాడిరండి’’ ప్రణీత్ చెప్పగా లేచి వరండాలోకి వెళ్ళింది.
అక్కడే వున్న ఛెయిర్‌లో తల వంచుకుని కూర్చున్నాడు అశోక్ కీర్తన రాగానే చప్పున కళ్ళెత్తి చూశాడు.
అతని కళ్ళలోని ఆతృతనీ, ఆరాటాన్నీ చూసి తట్టుకోలేనట్లు చటుక్కున కళ్ళు వాల్చుకుంది కీర్తన.
అశోక్ లేచి నిల్చుని ‘‘పద’’ అన్నాడు. కదల్లేదు కీర్తన. ప్రశ్నార్ధకంగా చూశాడు.
‘‘నేనిక్కడే వుంటాను’’ మెల్లగా అంది.
‘‘యిక్కడా....’’ కోపంగా అన్నాడు. అతని స్వరంలో పదును తొంగిచూసింది.
‘‘ఆ!....యిక్కడే!....యిక్కడ నన్ను మోసం చేసేవాళ్ళెవరూ లేరు’’ కీర్తన శాంతంగానే అన్నా అందులోవున్న వ్యంగ్యం బాగానే అర్ధమయింది.
‘‘అందర్నీ, అన్ని సంఘటనలనీ అర్ధం చేసుకోడానికి చాలా ఓర్పు వుండాలి. అది నీకు లేదని తెలుస్తూనేవుంది. పద’’ అతని స్వరంలో కించిత్ బాధ తొంగిచూసింది.
‘‘నేను రాను’’ మొండిగా అంది.
‘‘నువ్విలా ముక్కూ మొహం తెలీని మనిషి దగ్గర గడుపుతుంటే ఆకాష్ బాధపడతాడు.’’
‘‘అతనెవరూ బాధపడటానికి?’’ కోపంగా అంది.
‘‘అతనెవరో, మీ అనుబంధం ఏమిటో మీ మనసుకే తెలియాలి. బయట ఆకాష్ వెయిట్ చేస్తున్నాడు రా! వెళదాం’’ అన్నాడు.
అపుడు చూసింది కీర్తన. బయట కారులో కూర్చున్న ఆకాష్ చూడగానే ఒళ్ళు భగ్గున మండింది.
‘‘నీ చెల్లెల్ని రెండో పెళ్ళివాడికిచ్చి చేయాలని కోరికగా వుందా?’’ హేళనగా అంది.
‘‘ఎవరు! ఆకాషా?’’ ఆశ్చర్యంగా అడిగాడు.
‘‘ఎస్! ముందు మణిబిందుతో అతని అనుబంధం ఏమిటో తేల్చుకోమను. ఆ తర్వాత నా గురించి తీరిగ్గా బాఢపడొచ్చు. అయినా యిప్పుడే చెపుతున్నాను విను. నా లక్ష్యం నేషనల్ గేమ్స్....నా ప్రాణం పోయినా నేను లెక్కచేయను కానీ లక్ష్యానికి దూరమవ్వను. దీనికి ఎవరు ఆటంకం కల్పించినా నిర్ధాక్షిణ్యంగా వాళ్ళతో అన్ని సంబంధాలు తెంచుకుంటాను’’ ఖచ్చితంగా అంది కీర్తన.
ఆమె గట్టిగా మాట్లాడటం విని తనూ బయటికి వచ్చాడు ప్రణీత్. అతన్ని చూసి యింకేమనలేకపోయాడు అశోక్. విసురుగా అడుగువేస్తూ వచ్చి కారులో కూర్చున్నాడు.
******************************
అశోక్ ఒక్కడే రావడం చూసి ఆకాష్ మొహం పాలిపోయింది. కారు స్టార్టు చేశాడు. అయిదు నిముషాలు గడిచాయి. అశోక్ మొహం కందగడ్డలా మారింది. అతనేం మాట్లాడకపోవడం చూసి....
‘‘కీర్తన రానందా...?’’ అడిగాడు.
‘‘వూ...!’’
‘‘ఎందుకని?’’
‘‘మనిద్దరం తనని మోసం చేసినట్లుగా ఫీలవుతోంది. సరేగానీ ఈ ప్రణీత్ వివరాలు తెలిశాయా?’’ ఆతృతగా అన్నాడు అశోక్.
‘‘ఆ!... కీర్తనకి ఈ మధ్యే పరిచయం అయ్యాడు. కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. బాడ్ రిమార్క్స్ లేవు. ఒకప్పుడు వాలీబాల్ ప్లేయరే కానీ సడన్‌గా మంచి స్టేజ్‌లో వుండగా ఆడటం ఆపేశాడు. రీజన్స్ తెలీవు.’’
‘‘ఆహా!’’
యిద్దరూ కాసేపు ఎవరి ఆలోచనల్లో వాళ్ళుండిపోయారు.
‘‘సారీ!’’ సడెన్‌గా అన్నాడు అశోక్.
‘‘ఎందుకు?’’ ఆశ్చర్యపోయాడు ఆకాష్.
‘‘కీర్తన మూలంగా నీకు చాలా యిబ్బంది కలుగుతోంది’’ కించపడ్డాడు అశోక్. నవ్వేశాడు ఆకాష్.
‘‘కమాన్ యార్!....కాబోయే భార్యాభర్తల మధ్య ఈ అలకలు సహజం. మనం ఒకటి భావిస్తే పరిస్థితులు మరోలా పరిణమించాయి. కీర్తన మనసు నాకు తెలుసు. ఆమె మనసు గాయపడినా తొలి ప్రేమని ఎవరు మర్చిపోగలరు....? నేను కీర్తనని అలాగే గెలుచుకుంటాను. చూస్తుండు’’ కాన్ఫిడెంట్‌గా అన్నాడు ఆకాష్.
**********************************
జాహ్నవి రాకతో యింటి వాతావరణమంతా మారిపోయింది. ఇల్లంతా లక్ష్మీశోభతో కలకల్లాడిపోతోంది. పనివాళ్ళకి కూడా ఆమె అత్యంత ఆత్మీయురాలిగా మారిపోయింది. వాళ్లని కూడా ఆమె సొంత మనుషుల్లాగే చూస్తోంది.
ఇపుడు ఆ యింట్లో ఎల్లప్పుడూ నవ్వులు విరబూస్తూనే ఉన్నాయి. కీర్తన యింట్లోంచి వెళ్ళిపోవడాన్ని కూడా ఎవరూ తీవ్రంగా తీసుకోలేదు.
ఆమె తమమీద అలిగిందని.....మళ్ళీ రియలైజ్ తిరిగి వస్తుందని జాహ్నవి అందరికీ సర్దిచెప్పింది.
ఇంతలో ఉరమని పిడుగులో ఓరోజు మృదులాదేవి పుట్టింటివాళ్ళతో వచ్చిపడింది.
ఇదివరకటిలా ఆమెని చూసి ఎవరూ బెదరలేదు. భూపతి కళ్ళలో ధైర్యమూ చూసి ఆశ్చర్యపోయింది.
ఇందుకు కారణమయిన జాహ్నవిని నిశితంగా పరిశీలించింది. పిల్లలో ఏదో తెగువ కనిపించింది.
అధికారం అంతా తన చేతుల్లోంచి జారిపోయినట్లనిపించి ఓ నిశ్చయానికి వచ్చిందామె.
ఆస్థులు పంచమని గొడవ చేసింది. భూపతి ససేమిరా అన్నాడు. అశోక్ విసిగిపోయాడు. లాయర్ని సంప్రదించాడు. తన వాటాకి వచ్చే ఆస్థి అంతా తక్కువ వుండడం ఆమె తట్టుకోలేకపోయింది.
మళ్ళీ గొడవ ప్రారంభం....ఈసారి అశోక్ లొంగలేదు. దాంతో మృదులాదేవి మళ్ళీ పుట్టింటికి వెళ్ళిపోయింది.
ఈ సారి ఆమె లాయర్లని అడిగి హిందూ కుటుంబాల ఆస్థులకి సంబంధించిన అన్ని వివరాలు తెలుసుకుంటోంది.
ఆ వివరాలతో భర్త మరణానంతరం భార్యకి సంక్రమించే ఆస్థిమీద ఆమె దృష్టి పడింది.
(సశేషం) |