Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

ప్రేమిస్తే ఏమవుతుంది?

premiste emavutundi?

గత సంచికలోని ప్రేమిస్తే ఏమవుతుంది సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి...http://www.gotelugu.com/issue238/653/telugu-serials/premiste-emavutundi/premiste-emavutundi/

(గత సంచిక తరువాయి)...

రమేష్ విసిరిన ప్రేమ లేఖ కుడి చేతిలో అత్యంత భద్రంగా పట్టుకుని, అందులో ఏముందో అనే ఆత్రుతతో గబా, గబా లోపలికి  నడిచిన గాయత్రికి నిప్పుల కుంపటిలా కూర్చున్న తల్లిని చూడగానే గుండె జారిపోయింది.. అమ్మ చూడలేదు కదా తను వంగి రమేష్ విసిరిన కాగితం ఉండ తీయడం అనుకుంటూ తల్లి వైపు తల తిప్పి కూడా చూడకుండా కావాలని కొంచెం విసురుగా గది లోకి వెళ్ళిపోయింది..

గదిలో కార్తికేయ డ్రెస్ మార్చుకుని మంచం మీద అడ్డంగా పడుకున్నాడు. అతన్ని అలా చూడగానే చిరాకేసింది. గాయత్రి అడుగుల శబ్దానికి కళ్ళు తెరిచి చూసి తిరిగి కళ్ళు మూసుకున్నాడు కార్తికేయ ..

“ ఎటూ కానివేళ నువ్విలా మంచం మొత్తం ఆక్రమిస్తే ఎట్లా? ఇవాళ నుంచి నువ్వు హాల్లో పడుకో ఈ గది నాది”  అంది.

“ మనిషికో గది ఉండడానికి మనం కోటిశ్వరులం కాము ... అయినా నీ మంచం నీకు సపరేట్ గా ఉందిగా ... నా మంచం మీద నేను పడుకుంటే నీకేం కూర్చుంటే నీకేం ...”

“ నాకు ప్రైవసీ కావాలి.. నేను  పెద్దదాన్ని అయ్యాను. ఇంక నుంచి నీతో షేర్ కలవడం నాకిష్టం లేదు”  అంటూనే హాల్లోకి వెళ్లి తల్లికి వినిపించేలా అంది ...” ఇవాళ నుంచి నీ కొడుకుని హాల్లో పడుకోమను ... ఆ గది నాకు కావాలి.. “

ఆవిడ సమాధానం చెప్పలేదు..

గాయత్రి మరోసారి అంది “ అయినా అసహ్యంగా అన్నయ్య నా గదిలో పడుకోడం ఏం బాగుంటుంది? ఇద్దరం పెద్దవాళ్ళం అయ్యాం కదా...నాకు చదువుకోవలన్నా, పడుకోవాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది ..”

అన్నపూర్ణ కూర్చున్న దగ్గర నుంచి లేచి కూతురు వైపు వచ్చింది. సూటిగా గాయత్రి మొహంలోకి చూస్తూ అంది “ నీకేదన్నా దయ్యం పట్టిందా... అఘాయిత్యం చేస్తున్నావెందుకే .. నువ్వేం కోటిశ్వరుడి కూతురుని అనుకుంటున్నావా..  హద్దులు తెలుసుకుని మసలుకో.. వేదవ్వేషాలేస్తే  కాళ్ళు , చేతులు విరగ్గొట్టి ఇంట్లో కూర్చోబెడతాను.  ఎందుకులే ఆడపిల్లవి నీ మనసు కష్టపెట్టడం మంచిది కాదని ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావేంటి.. వాడి మీద  ఒంటికాలి మీద లేస్తున్నావు వాడు ఎవరనుకుంటున్నావు.. నీకు అన్నయ్య అని మర్చిపోతున్నావా  చంపేస్తాను జాగ్రత్త ..”. తర్జని చూపిస్తూ హెచ్చరించింది అన్నపూర్ణ .

ఊహించని ఆ పరిణామానికి బిత్తరపోయింది గాయత్రి.. తను ఏదో అనుకుని కొంచెం మొండితనం ప్రదర్శించింది .. పరిస్థితి ఇలా అడ్డం  తిరుగుతుందని ఊహించలేదు.. ఈ ఇంట్లో వాళ్ళకి తన మీద అనుమానం వచ్చింది.. అది కన్ ఫర్మ్ చేసుకునేదాకా మంచిగా ఉండాలని నిర్ణయించుకున్నారు.. ఒక్కసారి  రమేష్ విషయం బయటికి వచ్చిందంటే ఇల్లు ఒక జైలు అవడం ఖాయం ...

ఇంతకు ముందు ఈ ఇంట్లో ఎవ్వరూ ఇలా మాట్లాడలేదు. అసలా అవకాశమే రాలేదు. ఎందుకంటే తను కూడా ఎప్పుడూ ఇలా ఎదురు తిరగలేదు.. కనీసం అమ్మ మాటకి కాని, నాన్న మాటకి కాని ఎదురు సమాధానం చెప్పలేదు .. వాళ్ళు ఏం చెప్పినా బుర్ర ఊపడం తప్ప ఇంకో మాట మాట్లాడలేదు. అలాంటిది ఈ మధ్య వాళ్ళు ఏం చేసినా తనకి తప్పుగా అనిపిస్తోంది. రమేష్ తో పరిచయం అయి, షికార్లు అలవాటు అయాక తనకున్న నిబంధనలు భరించరానివిగా అనిపిస్తున్నాయి. కాలేజీ, ఇల్లు తప్ప మరో వ్యాపకం, మరో గోల లేని తనకి ఇప్పుడు అవి రెండు తన స్వేచ్చకి ప్రతిబంధకాల్లా అనిపిస్తున్నాయి. ఆ  జైలు గోడలు బద్దలు కొట్టుకుని రెక్కలు రెప రెప లాడించి గగన వీదుల్లో విహరించాలని అనిపిస్తోంది. అక్కడ తనతో పాటు రమేష్ కూడా ఉంటాడు కాబట్టి ఆ మేఘాల మీద  ఆలా సాగిపోతూ చుక్కల లోకం లోకి వెళ్ళిపోయి రమేష్ చేసే చిలిప పనుల మాధుర్యం ఆస్వాదించాలనిపిస్తోంది. అతని వెచ్చని కౌగిట్లో నలిగిపోవాలనిపిస్తూంది.

ఎన్నడూ లేనిది ఈ మధ్య సినిమాల్లో ప్రేమ సన్నివేశాలు చూస్తోంటే ఆ సన్నివేశంలో తను, రమేష్ కనిపిస్తున్నారు. అందుకే అందరు నిద్రపోయినా తను మాత్రం రాత్రి పొద్దుపోయిందాకా టీవీ చూస్తూ గడుపుతోంది.

అన్నపూర్ణ స్వరం మరింత కరుకుగా వినిపించింది ...” ఇవాళ నుంచి సాయంతం అన్నం వండడం, చపాతీ చేయడం నీ వంతు .. వెళ్ళు వెళ్లి చపాతీ పిండి కలుపు ..”

ఆవిడ మాటలు వినగానే రోషంగా అంది గాయత్రి ...” అయితే ఇంకేం చదువు మానిపించేయండి... వంట చేసుకుంటూ బతికేస్తా.. “
“నీలాంటి వాళ్ళు బోలెడు మంది చదువుకున్నారు.. పెద్ద, పెద్ద డాక్టర్లు అయ్యారు.. ఆఫీసుర్లు అయ్యారు .. వాళ్ళంతా వంట చేయడం లేదా... నువ్వేమైనా దిగి వచ్చావు.. వెళ్ళు అనవసరంగా  వాదన పెంచకు.. “

మారూమాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అన్నపూర్ణ లోపలికి తన గది లోకి వెళ్ళిపోయింది.

గాయత్రి కాళ్ళు ఎత్తి , ఎత్తి  విసురుగా నడుస్తూ వంట గదిలోకి వెళ్ళింది.

అన్నపూర్ణ కావాలని బీరువా తెరిచి సర్దుతూ కూర్చుంది ... కార్తికేయ గదిలో పడుకుని ఉన్నాడు.

ఇదే మంచి సమయం ... గాయత్రి కుడి చేయి గుప్పిట విప్పింది. కాగితం నలిగిపోయింది. ఒ పక్కగా నిలబడి కాగితం తెరిచింది.
గాయత్రీ ,,, ఏమైంది ఈ నడమ కానోస్తాలేవు... నీకోసం పెచ్చోడినైతున్న ... రేపు సాయంత్రం ఇందిరా పార్క్ కి రా నీతోని చాన మాట్లాడాలె... నిన్న నువ్వు కాలేజ్ కి పోతుంటే సూసిన ... జబర్దాస్ట్ గ తయారైనవు .. ఒక్కసారన్న నిన్ను ముద్దు పెట్టుకోవాలె ... రేపు నువ్వు రాకుంటే నేనే మీ ఇంటికి వస్త .. మీ నాయన , అమ్మ ఎదురుంగానే ముద్దు పెట్టుకుంట...

గాయత్రి నరాలన్నీ తీయగా మూలిగాయి.. అప్పటికప్పుడే రమేష్ వచ్చి అదేదో సినిమాలో రవితేజ లాగా తనని అందరు చూస్తుండగా గభాల్న దగ్గరికి లాక్కుని ముద్దు పెట్టుకున్నట్టు.. కుడిచేత్తో తనని దగ్గరకు తీసుకుని గాయత్రి నాది .. ఎవరన్నా కాదంటే లేపుకెళ్ళి పోతా అని హీరోయిజం చూపించినట్టు అనిపించి తనువంతా పులకింతలతో నిండిపోయింది.  నిలబడలేక కాళ్ళు వణికినట్టు అయింది. ఆ కాగితం రెండు చేతుల్లో పట్టుకుని మొహానికేసి రుద్దుకుంది. ఆ స్పర్శ రమేష్ పెదాల స్పర్శలా వెచ్చగా అనిపించింది.

“ గోధుమ పిండి డబ్బా అలమార్లో పై రాక్ లో ఉంటుంది కనిపించిందా ...”  అన్నపూర్ణ గొంతు వినిపించడంతో కాగితం మడతపెట్టి జాకెట్లో దాచేసింది. అలమార తెరిచి గోధుమ పిండి డబ్బా తీసుకుంది.

రమేష్ ఇంటికి వచ్చి బట్టలు మార్చుకుని తల్లి పెట్టిన జోన్నరోట్టే తిన్నాడు. అతను తినడం పూర్తి చేసేసరికి గంగరాజు, సురేష్ వచ్చారు..
రమేష్ ని చూస్తూ తిన్నవా అనడిగాడు గంగరాజు.

రమేష్ సమాధానం చెప్పకుండా లోపలికి వెళ్ళిపోయాడు. గంగరాజు భార్యతో అన్న మాటలు వినిపించాయి...” బేకార్ గ తిరుగుడు , తినుడు... మంచిగ నేర్పిస్తున్నవ్ ...”

“ఊకో .... బిడ్డ రాంగానే రంధి పడతవు”  విసుక్కుంది ఆవిడ..

రమేష్ నిర్లక్ష్యంగా మంచం మీద అడ్డంగా వాలిపోయాడు.

అతనికి పిచ్చి పట్టినట్టుగా ఉంది. గాయత్రిని కలుసుకుని పది రోజులు ... ఆమెని వాళ్ళ డాడి కాలేజ్ కి వెంట పెట్టుకుని వెళ్ళడం ఆమె తనతో మాట్లాడకపోవడం , కనీసం తనవైపు కూడా చూడకపోవడం ఇదంతా ఎందుకు జరుగుతుందో తెలియడం లేదు. తను, ఆమె కలుసుకోవడం ఎవరన్నా చూసారేమో , అందుకే వాళ్ళ అమ్మా, నాన్న ఆమెని కంట్రోల్ చేసారేమో అనే అనుమానం తో పాటు ఆమెకి పెళ్లి  చేసేస్తారేమో అని భయం కూడా వేస్తోంది. గాయత్రి లాంటి అందమైన అమ్మాయి, ఇంటి పక్కనే ఉంటే ఆమెని తను పెళ్లి చేసుకోవాలి గాని ఇంకెవరో పెళ్లి చేసుకోడం ఏంటి?

అందుకే ఎలాగైనా  గాయత్రిని కలవాలి.. వీలైతే ఇద్దరూ లేచిపోవాలి.. ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఎక్కడికన్నా వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవాలి.. వాళ్ళ వాళ్ళు ఒప్పుకోరు... తన వాళ్ళు ఒప్పుకోరు .. ఏ మాత్రం తెలిసినా తన సంగతి ఎట్లా ఉన్నా ఆమెని మాత్రం ఖచ్చితంగా తన నుంచి దూరం చేస్తారు..

రమేష్ పార్క్ లో కలుసుకుందాం అని రాసి విసిరేసిన కాగితానికి గాయత్రి సమాధానం చెప్పకపోయినా ఆమె తప్పకుండా వస్తుందనే నమ్మకంతో ప్రశాంతంగా నిద్రపోయాడు.

మర్నాడు గాయత్రి ఖచ్చితంగా వస్తుందనే  రమేష్ నాలుగు గంటల నుంచే పార్క్ కి వెళ్లి పచార్లు చేయసాగాడు. పది నిమిషాలు గడిచినా ఆమె రాకపోవడంతో అతనికి టెన్షన్ పెరిగిపోసాగింది. లోపలి నుంచి బైటికి, బైటి నుంచి లోపలికి పదే, పదే తిరగసాగాడు. గేట్ దగ్గర  ఉన్న వాచ్ మాన్ నాలుగు సార్లు చూసి ఐదోసారి అతని చొక్కా పట్టుకుని గట్టిగా అడిగాడు..

“ఏం సంగతి ... గీడ ఏం చేస్తున్నావ్... దమాక్ ఖరాబ్ అయిందా.. ఎవర్నువ్వు... ఆ ... టికెట్ తిస్కున్నావా. ... “

రమేష్ కి భయం వేసింది. షర్ట్ జేబు లోంచి టికెట్ తీసి చూపించాడు.

అతని చేతి లోంచి గభాల్న లాక్కుని చూస్తూ అడిగాడు” ఏం చేయనికి వచ్చినవ్ ....ఒక్కడివే వచ్చినవా.. “

రమేష్ భయంగా అన్నాడు.. “వాకింగ్ కి వచ్చిన నా దోస్త్ గురించి వెయిట్ చేస్తున్న ....”

“ వాకింగ్ గురించి వచ్చినోడివి వాకింగ్ గిట్లనా చేసెడిది.. నీ దోస్త్ లోపటకి రాడా   దోస్త్ అంటే పోరాడా... పోరా...”

రమేష్ తడబడ్డాడు.. అమ్మాయి అని చెబితే వీడు ఏమంటాడో .... దిక్కులు చూడసాగాడు..

వాచ్ మాన్ రమేష్ మేడ మీద చేయి వేసి “  నీ అసంటోల్లని మస్తు సూసిన నడువ్ బైటికి .... నీ బాబు జాగిరి కాదిది... నడువ్ ..” అంటూ తోసేయబోతుండగా ఆటో ఆగడం అందులోంచి గాయత్రి దిగడం ఒకేసారి జరిగాయి.

రమేష్ కళ్ళు ఆమెని చూడగానే మెరిశాయి.. వాచ్ మాన్ చేతి నుంచి విదిపించుకుంటూ “ అన్న సారి అన్నా అదిగో ఆమెనే నా దోస్త్ .... వదిలేయ్ అన్నా”  అన్నాడు బతిమాలుతూ..

వాచ్ మాన్ గాయత్రి వైపు చూసాడు. గాయత్రి అతన్ని, రమేష్ ని బెదిరిపోతూ చూసింది..

ఏమనుకున్నాడో వాచ్ మాన్ రమేష్ ని వదిలేస్తూ “ జరసేపు కూసుని  జల్ది బైటికి పొండి ... లోపట ఏమన్న నకరలు చేస్తే బొక్కలు తీస్త” అన్నాడు.

రమేష్ తల అడ్డంగా ఆడిస్తూ గబా, గబా అన్నాడు “ లే అన్న  జస్ట్ కూసుని మాట్లాడుకుంటాం .... అంతే .. జల్ది పోతం “ అన్నాడు.
వాచ్ మాన్ గాయత్రినే చూస్తూ “పొండి “ అన్నాడు.

రమేష్ కుడి బొటనవేలు మడిచి నాలుగు వేళ్ళు నుదుటికి ఆన్చి కృతజ్ఞత తెలిపి గాయత్రి దగ్గరకు వెళ్లి ఆమె చేయి పట్టుకుని లోపలి కి నడిచాడు. గాయత్రికి ఏం జరిగిందో అర్ధం కాక అయోమయంగా రమేష్ తో నడుస్తూ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసింది... వాచ్ మాన్ ఆమెనే చూస్తున్నాడు. గాయత్రికి భయంతో ఒళ్ళంతా జలదరించినట్టు అయింది.

“ ఏమైంది అతను ఏమంటున్నాడు ?” అడిగింది..

“ నీ  గురించి నేను అటు, ఇటూ తిరుగుతున్న ... ఆడికి ఏమో డౌటు వచ్చింది.. లొల్లి స్టార్ట్ చేసిండు... కన్విన్స్ చేసిన” అన్నాడు.
“అంటే ఏమన్నాడు?” అడిగింది గాయత్రి.

గుల్మొహర్ చెట్టుకింద బెంచి మీద కూర్చుంటూ “ఆని సంగతి వదిలేయ్ ... నీ సంగతి చెప్పు ఏమైంది మీ ఇంట్ల తెలిసిందా మన సంగతి... మీ డాడి ఎందుకు తోల్కపోతుండు నిన్ను కాలేజ్ కి ...” అడిగాడు.

గాయత్రి దిగులుగా అంది. “ మా ఇంట్లో  రెట్రిక్షన్స్ బాగా ఎక్కువైనాయి.. మా పెదనాన్న ఆ మధ్య వచ్చి వెళ్ళిన దగ్గర నుంచి నా మీద మా వాళ్ళకు ఏదో డౌటు వచ్చింది కాని పైకి ఏమి అనడం లేదు... మనసులో మాత్రం డౌటు ఉందనిపిస్తోంది.. గోల్కొండ వెళ్ళినపుడు నన్ను మా పెదనాన్న చూసారేమో , నాన్నకి చెప్పారేమో అనిపిస్తోంది. “

“ఎవరు మీ పెదనాయన” అడిగాడు..

“ నీకు తెలియదులే.. మా ఫాదర్ కజిన్ .... బహుశా నేనింక కలవలేను. ఇవాళ నిన్ను కలుసుకోడానికి ఇంట్లో గొడవ పడి కాలేజ్ కి  ఒక్కదాన్నే  వెళ్ళిపోయాను.. అందుకే ఇప్పుడు రాగలిగాను. రేపటి నుంచి ఇంకా ఏం జరుగుతుందో తెలియదు.. నన్ను మర్చిపో ...”

రమేష్ గాభరాగా అన్నాడు...” ఏయ్ గసొంటి మాటలనకు ... మనం మారేజ్ చేసుకుందాం ...”

“ మ్యారేజా .... ఇప్పుడా ...ఏం చేస్తాం పెళ్లి చేసుకుని.... ఎక్కడుంటాం? అసలు ఎలా బతుకుతాం... మనకి జాబ్ కావాలి.. ఎవరు ఇస్తారు..”  విస్మయంగా అడిగింది..

(సశేషం)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
nadaina prapancham