Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

అనుబంధాలు - పంతొమ్మిదవ భాగం

Anubandhaalu nineteenth Part

అయితే వచ్చిన అరగంట వరకు గోపాల్ ను చూడ్డానికి డాక్టర్లు అనుమతించలేదు. తర్వాత ఆయనకొచ్చిన ప్రమాదమేమీ లేదని లోనకు పంపించారు. స్పెషల్ రూమ్ లో తలదిండుకు జేరబడి, బాధగా కళ్ళు మూసుకుని ఉన్నాడు గోపాల్. పది లంకణాలు చేసినట్టు వాడిపోయి ఉంది ముఖం.

మనిషి బాగా దిగాలు పడిపోయినట్టు కన్పిస్తోంది. వస్తూనే భర్త పక్కన కూర్చుని అతడి చేయిని తన చేతిలోకి తీసుకుని ఏడ్చేసింది సత్యవతి. ఒక కుర్చీ కొడుక్కి దగ్గరగా లాక్కుని కూర్చుని కన్నీళ్ళు తుడుచుకుంది అన్నపూర్ణేశ్వరి.

"నాకేం కాలేదు. నేను బాగానే ఉన్నాను. మీరేం దిగులు పడకండి" అన్నాడు పొడి మాటలతో.

"ఏం జరిగిందిరా? ఎందుకిలా దుఃఖాన్ని ఆపుకుంటూ..." అడిగింది అన్నపూర్ణేశ్వరి.

"టైం బాగాలేదమ్మా ఏం చేయను? నేను షేర్లలో పెట్టిన నా సంపాదన, నా ఆస్థి ఐదు వందల కోట్లు షేర్లలో కొట్టుకుపోయింది. నేను షేర్లు కొన్న కంపెనీ దివాళా తీసింది. అంత డబ్బు నేను తిరిగి సంపాదించగలనా? నా జీవితం తిరిగి ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్లిపోయింది. మన ఊరిలో ఆస్పత్రి కట్టాలని ఇంతకాలం ఆ డబ్బుని షేర్ల రూపంలోనే ఉంచేశాను. నేను చేయాలనుకున్న మంచి పని ఆ దేవుడికి నచ్చనట్టుంది. నన్ను చావు దెబ్బ తీశాడు. ఆ షాక్ లో లైట్ గా గుండె నొప్పి వచ్చింది. ఇప్పుడు ఫరవాలేదు" అన్నాడు.

"పరాయి దేశంలో అయినవారికి దూరంగా బ్రతుకుతున్నాం. మీకేమన్నా అయితే మేమేం అయిపోవాలి" అంటూ భర్త భుజం మీద తల ఆన్చుకుని ఏడ్చేసింది సత్యవతి.

"అంత డబ్బు బాధకల్గించే విషయమే. అంతమాత్రాన నువ్వు ఇంతగా ఎందుకు దిగులుపడ్డావో అర్ధం కావడం లేదు. మేమింకా బ్రతికే ఉన్నాంరా. నీకేం లోటని. డబ్బుపోతే సంపాదించుకుంటావు. ప్రాణాలు పోతే తెచ్చుకోగలమా? డబ్బు మీద నీకెంత మమకారం ఉందో అర్ధం అవుతుంది" అంది అన్నపూర్ణేశ్వరి.

"అమ్మా ఏమిటి నువ్వంటున్నది?" అంటూ ఆశ్చర్యంగా అడిగాడు.

"అవున్రా. పోతేపోయింది వెధవ డబ్బు. దానికి నువ్వలా గుండెపోటు తెచ్చుకోవాలా..... చిన్నపిల్లాడివా? కోట్లకు పడగెత్తినా చచ్చేప్పుడు ఒక్కరూపాయి కూడా వెంట రాదని తెలీదా? మనకి ఎంత ప్రాప్తమో అంతే ఉంటుంది. మీకేం లోటని? ఇక్కడి ఆస్థులన్నీ అమ్మేసి బాకీలుంటే తీర్చిపారేసి, నాతో వచ్చినా అక్కడ మిమ్మల్ని బంగారంలా చూసుకోవడానికి మేమంతాబ్రతికే ఉన్నాంరా. కావాలంటే పొలాల్ని అమ్మేసి నీకు ఆస్పత్రి కట్టిస్తానురా. వెనకా ముందూ ఎవరూ లేని అనాథవనుకున్నావురా గుండె పోటు తెచ్చుకుని ఇలా బెడ్ మీద పడ్డానికి?" తల్లికోపంతోనే నాలుగు ఓదార్పు మాటలు చెబుతున్నా గోపాల్ కి మాత్రం పోయిన డబ్బు గురించి చింత పోలేదు. తోటి డాక్టర్లు, తెలిసిన వారు పరామర్శించారు, ధైర్యం చెప్పారు. అయినా కూడా వారం రోజులపాటు ఆస్పత్రిలోనే ఉన్నాడు గోపాల్.

ఈ విషయాన్ని ఇండియాకు ఫోన్ చేసి బావ రామలింగేశ్వర్రావుకి తెలియపర్చింది సత్యవతి. జరిగిన నష్టం గురించి, గోపాల్ ఆస్పత్రిలో వున్న సంగతి తెలిసి ఇక్కడ కుటుంబ సభ్యులంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రెండ్రోజులు సరిగ్గా భోం చేయలేకపోయారు. ఉదయం, సాయంత్రం కూడా ఫోన్ చేసి పరిస్థితి తెలుసుకుంటూనే ఉన్నారు. ఇక అనంతసాయి, సాయిశివానీలు మొక్కుబడిగా మూడుసార్లు ఫోన్ చేసి డాడీ పరిస్థితి అడిగి తెలుసుకున్నారంతే. తర్వాత ఫోన్లు చేయలేదు. మొత్తానికి ఎనిమిదో రోజున ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చేశాడు గోపాల్.

అక్కడ ఇండియాలో.....

ఆ రోజు రాత్రి సుమారు ఎనిమిది గంటలకు ఇంటికొచ్చారు అన్నాచెల్లెళ్ళు. ఉదయం వెళ్ళినవాళ్ళు ఇదే రావడం. బహుశా విజయవాడలోనే సరదాగా గడిపి ఉండాలి. వాళ్ళు వచ్చేసరికి డాబా ఇంట్లోనే వాళ్ళకోసం ఎదురుచూస్తూ కూర్చున్నాడు రామలింగేశ్వర్రావు.

అన్ని రోజులూ తెలియనితనంతో వీళ్ళిద్దరూ ఇలా బాధ్యతలు లేకుండా తిరుగుతున్నారనుకున్నాడు. తెలియజెప్పినా అర్ధం చేసుకోలేక పోతున్నారనుకున్నాడు. కానీ ఇప్పటి పరిస్థితి వేరు. అక్కడ అమెరికాలో తన తమ్ముడికి పెద్ద ప్రమాదం తప్పింది. కూడబెట్టిన కోట్లాది రూపాయలు పోయి వాడు మంచం పట్టిన దశలో కూడా వీళ్ళకి చీమకుట్టినట్టు కూడా లేదంటే ఏమనుకోవాలి. తండ్రి గురించికానీ, తల్లి గురించికానీ, తమ ఇంట్లో నాయనమ్మ గురించికానీ వీళ్లకి చింతలేదు. ఎప్పటిలాగే తిరుగుతున్నారు. విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నారు. ఆ విషయంగా మాట్లాడాలని రామలింగేశ్వర్రావు ఆలోచిస్తున్నాడు. ఆయన అక్కడ ఉన్న విషయం ఎవరికీ తెలియదు. అందుకే డాబా వైపు ఎవరూ రాలేదు.

లోనకొస్తుంటే పెదనాన్నను చూసి అన్నాచెల్లెళ్లిద్దరూ ముఖాలు చూసుకున్నారు.

"రండి మీ కోసమే చూస్తున్నాను." అన్నాడు.

"ఏం పెదనాన్న? ఏదన్నా విశేషమా?"అంటూ ఎదురుగా వచ్చి సోఫాలో కూర్చున్నాడు అనంత్. మౌనంగా వచ్చి అన్నయ్య పక్కన కూర్చుంది శివానీ.

"విశేషమే. అక్కడ అమెరికాలో పరిస్థితి బాగాలేదని తెలిసికూడా మీరిక్కడ పాత పద్ధతిలో తిరగడం, ఖర్చుచేయడం విశేషమే కదా. ఏరా అనంత్? అదంటే ఆడపిల్ల నీకంటే చిన్నది. దానికి తెలియకపోవచ్చు. కానీ నీకేమైంది? చదువుకున్నావ్. నాలుగు మంచి పద్ధతులు అలవాటు చేసుకుంటారని ఆశించి వాళ్ళు మావద్దకు పంపించారు మిమ్మల్ని. అవి ఎలాగూ నేర్చుకోలేదు. కనీసం కష్టాల్లోనైనా డాడీ గురించి మీకు బెంగలేదా? ఫోన్ చేసి మంచి చెడ్డలు విచారించాలని తెలియదు? మీరు పద్ధతుల్లోకి వస్తే వారు ఆనందిస్తారు కదా? వాళ్లని సంతోషపెట్టే ఆలోచనే లేదా? అంటూ కాస్త ఘాటుగా, కాస్త మెత్తగా వాళ్ళిద్దర్నీ మందలిస్తున్న ధోరణిలో అడిగాడు రామలింగేశ్వర్రావు.

"పెదనాన్నా! మాకు తెలుసు. డాడీ చాలా సంపాదించారు. పోయిన ఐదువందల కోట్లు మాకో లెక్కకాదు. డాడీ తలుచుకుంటే రెండేళ్లలో తిరిగి సంపాదించగలరు. పైగా డాడీ కోలుకున్నారు కదా. ఊరికే ఇక్కడి నుంచి ఫోన్లు చేసి అడిగి ప్రయోజనం ఏమిటి? అంటూ ఎదురు ప్రశ్నించాడు అనంతసాయి.

"అదేకదా... ఇప్పుడేమైందని? డాడీ బాగానే ఉన్నారు. అసలు ఆరోజే మమ్మల్ని కూడా తీసుకుపోయుంటే ఎవరికీ ఇబ్బంది ఉండేది కాదు కదా? మాకు ఇక్కడ నచ్చలేదన్నా విన్పించుకోలేదు. మాకు డాడీ మీద చాలా కోపంగా ఉంది తెల్సా? అంటూ అన్నను సమర్ధిస్తూ మాట్లాడింది శివానీ.

వాళ్లమాటలు రామలింగేశ్వర్రావుకు మనస్థాపం కల్గించాయి. పిల్లలంటే తమ్ముడికి ఎంత ప్రేమో అతడికి తెలుసు. తమ్ముడి పిల్లలు ఇంత భాద్యతలేని పిల్లలుగా మారడం నిజంగా మనసుని కృంగదీసే విషయం. ఆయన ఆరోగ్యం ఎలా ఉందో ఫోన్లో అడిగి తెలుసుకుని, వాళ్ల కష్టాన్ని పంచుకునే తీరికి కూడా వీళ్ళకు లేదా?

"మీది వితండవాదం. ఎవరూ మెచ్చరు. మీకు తెలుసో, తెలియదో? మీ నాన్న ఇచ్చిన డబ్బు ఇప్పటికే మీరు ఖర్చు చేశారు. అదిగాక ఇప్పటికే మీకోసం నేను రెండు లక్షలకు పైగా మీకిచ్చాను. అక్కడ చూస్తే మీ నాన్న డబ్బు పోగొట్టుకుని బాధపడుతున్నారు. ఇక్కడ చూస్తే మీరు డబ్బు విలువ తెలీకుండా మంచినీళ్ళలా ఖర్చు చేస్తున్నారు. ప్రస్తుతం నేను మీకు డబ్బు సర్దుబాటు చేయగల స్థితిలో లేను. మీరు మాట్లాడితే హైదరాబాదనీ, చెన్నై అనీ వెళ్ళడం ఆపకపోతే చిక్కుల్లో పడతారు. ఆలోచించుకోండి" అంటూ హెచ్చరించాడు.

ఆ మాటలకు అన్నాచెల్లెళ్లిద్దరూ ముఖాముఖాలు చూసుకున్నారు.

"పెదనాన్నా... సమస్య చెప్పారు కాబట్టి ఇక మిమల్ని డబ్బులు అడగం, మా దగ్గర పర్సనల్ గా తెచ్చుకున్న డబ్బు పది లక్షల వరకూ ఉంది. మేము అమెరికా వెళ్ళేవరకూ సరిపోతుంది." అన్నాడు అనంతసాయి.

"మీ నాన్న నెలరోజుల్లో మళ్ళీ వస్తానని చెప్పి మరీ వెళ్ళాడు. మర్చిపోయారా?" గుర్తుచేశాడు.

"రావడం దేనికి పెదనాన్నా! ఖర్చులు దండగ. మీరు మా పాస్ పోర్టులు ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాం. మాకు తెలుసు. డాడీ మా పాస్ పోర్టుల్నివెంట తీసుకెళ్ళలేదు. మీ దగ్గరో, మావయ్య దగ్గరో దాచారు. అవునా?" అంది గడుసుగా శివానీ.

"లేదు... ఆవిషయం నాకు తెలీదు. పాస్ పోర్టులు అమెరికా పట్టుకెళ్ళిపోయాడనే అనుకుంటున్నాను. ఇంతకీ మీ సమాధానం ఏమిటి? మీ నాన్నేమో ఎప్పటికైనా ఇక్కడికి వచ్చేసి పెద్ద ఆస్పత్రి కట్టాలని చూస్తున్నాడు. మీరు చూస్తే ఆంధ్రుల ఆచారాలంటే గిట్టనట్టున్నారు. అమెరికాలోనే ఉండిపోవాలనా?" అడిగాడు.

"అవును. ఇక్కడేముందని? డాడీకి ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయో తెలీదు. ఈ పల్లెటూళ్ళలో ఆస్పత్రి కట్టడమేంటి? అమెరికా వెరీ నైస్... మేము అమెరికన్లుగానే ఉండాలనుకుంటున్నాం. మాకు ఇక్కడి పద్ధతులు అక్కర్లేదు. డాడీ ఫోన్ చేస్తే మేం వచ్చేస్తామని చెప్పండి" నిర్మొహాటంగా అంది శివాని. వాళ్ల మాటలు వింటే ఎలాంటి వాళ్లకైనా కోపం వస్తుంది. రామలింగేశ్వర్రావుకి కోపం వచ్చింది. కానీ ఓర్చుకున్నాడు. పెద్దగా నిట్టూర్చి లేచాడు. చివరికి ఒకే మాటన్నాడు.

"ఎంతో తెలివైన వాడు నా తమ్ముడు గోపాల్. అలాంటివాడు మీలాంటి పనికిమాలిన వాళ్లని ఎలా కన్నాడో అర్ధం కావడం లేదు? మిమ్మల్ని మార్చడం బహుశా ఎవరివల్లా కాదనుకుంటాను. మీ ఇష్టం వచ్చినట్టు ఉండండి. నన్ను మాత్రం ఇక డబ్బు అడగవద్దు. వచ్చి భోంచేయండి" అంటూ చరచరా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.

శరీరానికి గాయం అయితే కొద్దిరోజుల్లో తగ్గిపోతుంది. అదే మనసుకు తగిలిన గాయం అయితే అంత త్వరగా తగ్గదు. అలా తగ్గాలంటే ఎవరో ఒకరు ధైర్యం చెప్పాలి. మంచి చెడులు వివరించాలి. నాలుగు మంచి మాటలు చెప్పాలి. జరిగింది మర్చిపోయి తిరిగి జీవితంపట్ల ఆశలు చిగురించేలా చెయ్యాలి. ప్రస్తుతం డాక్టర్ గోపాల్ త్వరగా కోలుకోవాలంటే అతనికి స్వాంతన కల్గించే నాలుగు మాటలు చెప్పే మనుషులు కావాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్న పెద్దదిక్కు తనే కాబట్టి - ఆ బాధ్యతను తన భుజాలకెత్తుకుంది అన్నపూర్ణేశ్వరి. ఇంత భారీనష్టం కొడుక్కి సంభవించినందుకు ఆవిడ మనసులో చాలా బాధగానే ఉంది. ఆ బాధను బయటకు తెలీకుండా జాగ్రత్త పడుతూ ప్రతీక్షణం కొడుక్కి ధైర్యం నూరిపోసే ప్రయత్నాలు చేసింది.

ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చినా అతను మామూలు మనిషి కాలేకపోయాడు. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ కూర్చుంటాడు. తన ఆస్పత్రి బాధ్యతను తన అసిస్టెంట్ కు వదిలేసి ఇంట్లోనే ఉంటున్నాడు. మునుపటి హుషారు లేదు. ఉత్సాహం లేదు. ఎన్నో ఫోన్ కాల్స్ వస్తున్నాయి. కొత్తగా ఆపరేషన్స్ ఏవీ ఒప్పుకోవడం లేదు. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఒంటరిగా గడపడానికి ఇష్టపడుతున్నాడు. సాయంకాలం వేళ తమ తోటలోనే పిచ్చాడిలా తిరుగుతున్నాడు. ఇదంతా చూస్తూ తనలో తానే కుమిలిపోతోంది సత్యవతి.

సమయానికి పిల్లలు కూడా దగ్గర్లేకపోవడంతో ఆమె పరిస్థితి మరీ బాధాకరంగా ఉంది. ఇదంతా చూస్తున్న అన్నపూర్ణేశ్వరికి కొడుకు మీద కోపం కూడా వస్తుంది.

"ఏరా... వెధవ డబ్బు కోసం నువ్వు అంతగా దిగులుపడిపోవాలా?" అంటూ ఆ సాయంకాలం మేడమీద కూర్చున్న కొడుకు వద్దకెళ్ళి నిలదీసింది.

పేలవంగా నవ్వాడు గోపాల్.

వెధవ డబ్బు కాదమ్మా అది. కష్టపడి సంపాదించిన డబ్బు అన్నాడు.

ఇంకా కష్టపడే వయసుంది. పిల్లలు చేతికి అందివచ్చినట్టే. ఇంకెందుకు దిగులు? పోయిన దానిగురించి జీవితాంతం బాధపడుతూ కూర్చుంటామా?

"హు... పిల్లలు... వాళ్లు ప్రయోజకులవుతారన్న నమ్మకం నాకు లేదమ్మా!"

"అదేమిట్రా... వాళ్ళు చక్కగా మన పద్ధతులు నేర్చుకుంటున్నారని, వాళ్ళలో చాలా మార్పు వచ్చిందని పెద్దోడు ఫోన్లో చెప్తున్నాడుగా... ఎందుకు ప్రయోజకులు కారు?" నిలదీసింది.

తను నాలుక జారాడని గ్రహించి, కంగారును అణుచుకుంటూ తల్లి వంక చూశాడు గోపాల్. పాపం అమాయకురాలు. పిల్లల విషయంలో అన్నయ్య చేత తను అబద్ధం చెప్పిస్తున్న సంగతి వీళ్లకి తెలియదు.

"అమ్మా! వాళ్లు మన పద్ధతులు అలవర్చుకుంటే సరిపోయిందా... వాళ్ళు ఉద్యోగాల్లో చేరాలి... డబ్బు సంపాదించాలి... వాళ్ళు ప్రయోజకులు కావడానికి ఇంకా చాలా టైముంది. ఇప్పట్నుంచే అంచనాలు వేసుకోవడం అనవసరమని నా ఉద్దేశం" అంటూ తన మాటల్ని సమర్ధించుకున్నాడు." కావచ్చు. కానీ నువ్విలా దిగులుపడి కూర్చుంటే చూడలేకపోతున్నానురా... వందలు కాదు వేలకోట్ల రూపాయలు పోయినా మనిషి దిగులుపడకూడదు. పట్టుదలగా తిరిగి పైకి రావడానికి ప్రయత్నించాలి."

"అది కాదమ్మా..."

"ఇంకేమీ చెప్పకు... మీ నాయన పోయినప్పుడు నీలానే నేనూ దిగులుపడి మంచం ఎక్కుంటే మీరు ఇంత పెద్దవాళ్ళు అయి వుండేవారా? మీరూ చూశారుగా ఒంటిచేత్తో కుటుంబాన్ని నడిపాను... మీ ముగ్గుర్నీ చదివించాను. పెళ్ళిళ్ళు చేశాను. రెండిళ్ళు కట్టించాను. పాతిక ఎకరాల మాగాని కొన్నాను. ఈ రోజు యాభై పాడి పశువులు, రెండు ట్రాక్టర్లు, ఇరవై మంది జీతగాళ్ళు... ఇదంతా ఎలా సాధ్యం అయింది? నువ్వు ప్రయోజకుడివైనా నీ నుంచి రూపాయి తీసుకోలేదు. పెద్దోడు సాయం వచ్చాడు. దేవుడు కరుణించాడు. సుఖంగా ఉన్నాం. మీకేమిట్రా లోటు? మీరు కట్టుబట్టలతో మన ఊరు వచ్చేసినా బంగారంలా మీ స్థాయికి తగ్గకుండా చూసుకోగలను. మీ అమ్మ ఇంకా బ్రతికే ఉందని మర్చిపోకు. ఇంతవరకు ఇండియాలో చదివి, అమెరికాలో నీ సేవలు అందించి, సంపాదించుకున్నావు చాలు. లాభనష్టాలు పక్కన పడేయి. మన ఊరు వచ్చేయి. ఆస్పత్రి నేను కట్టిస్తాను. మనం మున్నలూరు చుట్టు పక్కలా ఊళ్ళల్లో సరైన వైద్యం లేక నగరాలకు పోలేక ఎందరో పేదలు, బడుగువర్గాలు బాధపడుతున్నారు. మోగులూరు, ముప్పాళ్ల, కునికినపాడు, చెవిటికళ్ళు, కంచికచెర్ల, ఏలూరు, చందర్లపాడు, లింగాలపాడు, చందాపురం, నందిగామ, అటు కృష్ణానదీ అవతల అమరావతి చుట్టుపక్కల అనేక గ్రామాలున్నాయి. అక్కడి పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించు. ఆ షిరిడీ సాయి నాథుని అనుగ్రహంతో మనందరం ధన్యులమౌతాం." అంటూ తన మనసులో మాట వివరించిందావిడ.

"దైవానుగ్రహాన్ని కోల్పోయినా, మానవత్వాన్ని కోల్పోయినా మనం బాధపడాలిగానీ... ఆస్థిపోతే బాధపడకూడదు. డబ్బు వస్తుంది పోతుంది. దానికోసం ఎందుకు బెంగ" అంటూ ధైర్యం చెప్పింది. ఆవిడ మాటలు అమృత గుళికల్లా అతని మీద పనిచేశాయి. కొడుకుని చంటి పిల్లాడిలా ఒళ్లో పడుకోబెట్టుకొని, ఓదార్చి, లాలించి, ధైర్యం చెప్పి అతడిలో తిరిగి ఆత్మవిశ్వాసం నింపింది. అప్పుడప్పుడూ షిరిడీ సాయి పారాయణ గ్రంధాన్ని చదివి విన్పించేది. భగవద్గీతను చదివి విన్పించేది. "అమ్మా! సంపద మీద మమకారం లేని మనిషంటూ భూమ్మీద ఎవరైనా ఉంటారా? ఓ రోజు తల్లినడిగాడు గోపాల్.

"పిచ్చివాడా... మమకారం భార్యాబిడ్డల మీద ఉండాలి. మనుషుల మీద ఉండాలి. మన కర్తవ్యాలు విధుల మీద ఉండాలి. చేస్తున్న వృత్తిమీద ఉండాలి. అంతేగానీ, నిలకడలేని సంపదమీద కాదు. ఈ భూమీ, ఆకాశం, సమస్త జగత్తు భగవంతుడిది. మనది కాదు. మనకి ఏం వచ్చినా, ఏం పోయినా దైవనిర్ణయంతోనే జరుగుతుంది.

కాబట్టి నీ సంపాదన ఆస్థిపాస్థులను చూసుకొని గర్వపడకూడదు. పోయిన సంపద కోసం విచారపడకూడదు. మనచేతిలో ఉన్నంత వరకు మన విధిని సక్రమంగా నిర్వహించడం మన బాధ్యత." అంటూ కొడుకు అనుమానం నివృత్తి చేసే ప్రయత్నం చేసిందామె.

అంతావిని "అమ్మా! నీ మాటల్లో నా ప్రశ్నకు సమాధానం దొరకలేదు" అన్నాడు గోపాల్.

"ఏరా! పెద్ద డాక్టర్ వి. ఈ మాత్రం అర్ధంకాలేదా? అంటూ నవ్వేసింది అన్నపూర్ణేశ్వరి.

(... ఇంకా వుంది)

http://www.suryadevararammohanrao.com/

మరిన్ని సీరియల్స్
nadiche nakshatram telugu serial thirteenth part