Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Anubandhaalu nineteenth Part

ఈ సంచికలో >> సీరియల్స్

నడిచే నక్షత్రం పదమూడవ భాగం

nadiche nakshatram telugu serial thirteenth part

గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తుండగా... తన మాతృభూమి సిమ్లా మనసుతెరపై హృద్యంగా కదలాడింది. సిమ్లా... 'ఏ ప్యారడైజ్ ఆన్ ఎర్త్'. మంచుకొండల మధ్య మహిమాన్విత ప్రదేశం. హిమాచల్ ప్రదేశ్ రాజధాని. చుట్టూ ఆకృతి దాల్చిన అందమైన ప్రకృతి. ఎగ్జయిటింగ్ మౌంటేన్ రేంజెస్... వైబ్రెంట్ కల్చర్... లాండ్ స్కేప్స్... వుడెన్ హాండీ క్రాప్ట్స్... సిమ్లా అంటే అదీ. ఒకపుడు నేపాలీ రాజులు రాజ్యమేలుతున్న కాలంలో... 'శ్యామల' గా అభివర్ణించిన ఈ ప్రాంతం ఇపుడు సిమ్లాగా అవతరించింది. దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన సమ్మర్ కాపిటల్ సిమ్లా.

"ఎక్కడి సిమ్లా... ఎక్కడి సినిమా? తనువు అణువణువునా యవ్వనం ఆవహించిన తొలినాళ్ళలోనే ఎంత జీవితాన్ని చూస్తోంది తను. ఎగిరే విమానాల రెక్కలు పట్టుకుని ఎగుడుదిగుడు ఆకాశాల్ని ఎంతలా ఈదేస్తోంది? ఆశ్చర్యపోయింది గాయత్రీపాటిల్. ఇండస్ట్రీ లోకి తను రాకముందు తనదో చిన్న ప్రపంచం. ఆ ప్రపంచంలో అల్లారుముద్దుగా ప్రేమించే తల్లీతండ్రీ... తన కుటుంబం... ఫ్రెండ్స్...

కానీ ఇపుడో... తన ప్రపంచం చాలా విశాలమైంది. దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన హిల్ స్టేషన్ సిమ్లా నుంచి హైద్రాబాద్ దాకా విస్తరించింది. పొద్దున లేస్తే చాలు తనపై మెరిసే 'కెమెరా ఫ్లాష్'లు... తన చుట్టూ అల్లుకున్న కథలు, నిత్యం తన కదలికల్ని పరిశీలిస్తూ అత్యంత వేగంగా ప్రవహించే 'గాసిప్' కథనాలు... ఒక్కమాటలో చెప్పాలంటే తను నిల్చుంటే గ్లామర్... కూచుంటే గ్లామర్... నడిస్తే, నవ్వితే గ్లామర్. అలా గ్లామరస్ లైఫ్ తన సొంతం అయింది.

అసలు తనెలా ఇండస్ట్రీకి వచ్చింది? ఆసక్తిగా ప్రశ్నించుకోగానే ఆమెకి ముందుగా సిమ్లాలోని ఓ ఫోటో స్టూడియో గుర్తొచ్చింది. ఆ ఫోటో స్టూడియోలో అందంగా అలంకృతమైన తన కలర్ ఫుల్ ఫోటో కనిపించింది.

ఇపుడు మళ్ళీ ఆ నేపధ్యాన్ని మరోసారి గుర్తుచేసుకుంటోందామె.

ఆరోజు గాయత్రీపాటిల్ యుక్తవయస్కురాలైంది. పైటేసే ఆడపిల్లగా ఎదిగింది. దాంతో... ఇంట్లో అంతా పండుగవాతావరణం. చుట్టాలూ, స్నేహితులు, ఆత్మీయులు అతిధులుగా రాగా... సంబరాలు అంబరాన్నంటుకున్నాయి. ఆ వేడుకని పదికాలాలు పదిలంగా దాచుకుని మళ్ళీ మళ్ళీ చూసుకోవాలంటే... అందమైన ఆల్బమ్ రూపొందించాల్సిందే.

"అరుణ్ ని పిలువ్" సెల్ కెమెరాతో సంబరాన్ని చిత్రీకరిస్తున్న అన్నయ్యకి చెప్పాడు తండ్రి. అరుణ్... సిటీలో ఉన్న అత్యద్బుత ఫోటోగ్రాఫర్లలో ఒకడు. మోడలింగ్ మెట్లెక్కాలని ఆశపడేవాళ్ళంతా ముందుగా అరుణ్ ఫోటోస్టూడియో మెట్లెక్కుతారు. ఆ తర్వాత వారి దశ, దిశ ఖచ్చితంగా మారుతుంది.

కబురందగానే క్షణాల్లో వచ్చివాలిపోయాడు అరుణ్. అతడితోపాటు అతడి తమ్ముడు ధీరజ్. కొంచెంకొంచెంగా పెరిగిన ఆకుపచ్చని గడ్డంతో అచ్చం హీరోలా ఉన్నాడు.

"మేడమ్... ఇలా కూచోండి. కాస్త తలపైకెత్తండి. పెదాలపై చిర్నవ్వు కావాలి. కన్రెప్పలు టపటపలాడించొద్దు. గడ్డం కింద ఓ చేయిపెట్టి... కెమెరా వేపు కాకుండా... అదిగో ఆవేపు చూడండి..." దగ్గరికొచ్చి సజెషన్స్ ఇస్తున్నాడు ధీరజ్.

అరుణ్ చేతుల్లోని కెమెరా వెలుగులు చిమ్ముతోంది.

కాసేపు వయారంగా నిల్చుని... ఇంకాసేపు ఆకాశంలోని వెండిమబ్బుల్ని లెక్కిస్తూ... మరికాసేపు ఇంటివెనుక పూలతోటలోని ముద్దొచ్చే గులాబీని మురిపెంగా చూస్తూ తను ఉంటే... అలా ఎన్నో భంగిమల్లో అరుణ్ ఫోటోలు తీసాడు.

"ఆల్బమ్ ఎపుడిస్తారు?" అడిగాడు అన్నయ్య.

"టూడేస్ లో..."

అంతే...! ఆ రెండు రాత్రులు నిద్రపట్టలేదు గాయత్రీపాటిల్ కి. ఎపుడెపుడు తన ఫోటోలు చూస్తానా...? అని ఆశగా ఎదురుచూస్తూ క్షణాలు లెక్కపెట్టింది. ఆ రెండు రోజులూ ఏ పనీ లేకున్నా అరుణ్ ఫోటో స్టూడియో మీదనుంచే 'గాలితిరుగుళ్ళు' తిరిగింది. అలా తిరుగుతూ స్టూడియోవేపు ఓ చూపు విసిరేది. స్టూడియో ఫ్రంట్ రూంలో అద్దాల చాటున ఎన్నో అందాలు క్లోజప్ లో కనిపించేవి. ఇండియన్ స్క్రీన్ ని ఏలుతున్న ఐశ్వర్యారాయ్... కత్రినా కైఫ్ ఫోటోల్తో పాటు చాలామంది మోడల్స్ ఫోటోలు కూడా ఆ 'డిస్ ప్లే' లో చోటుచేసుకున్నాయి. కెమెరా... అందగత్తెల్ని అద్దంలో చూపించినట్లు చూపిస్తుంది... అనుకుంటూనే, ఆ 'డిస్ ప్లే'లో కూడా తన ఫోటో ఎప్పటికైనా కనిపిస్తుందా? అసలెందుకు కనిపిస్తుంది? తనేం మోడల్ కాదు. యాక్ట్రెస్ అంతకన్నా కాదు. అపుడపుడే కళ్ళు విప్పి అందమైన లోకాన్ని చూస్తున్న యువతి. అంతే.

తనలో ఏమంత అందం ఉందని... ఏకంగా ఫోటో స్టూడియోలోని అద్దాల వెనుక అందంగా ప్రకాశిస్తుంది? ఆలోచిస్తుండగా... -"మేడం బయటే నిలబడక్కర్లేదు. లోపలికి రావొచ్చు" అన్న ఆహ్వానం అందింది గాయిత్రీపాటిల్ కి.

ఆశ్చర్యపోతూ చూసేసరికి ఎదురుగా నవ్వుతూ ధీరజ్.

"ఫర్వాలేదు..." మోమాటపడుతూ అందామె.

"నాకు తెలుసు మీరెందుకు వచ్చారో?"

"తెలుసా... ఎందుకు?" అడిగింది.

"మీ ఫోటోల కోసమే" చెప్పాడు.

"కాదు... కాదు. ఈ స్ట్రీట్ లో చిన్నపనుండి..." అతకని ఆన్సర్ ఇచ్చింది.

"మరైతే ఈ స్టూడియో ముందే ఎందుకు ఆగినట్లో?" కొంటెగా అడిగాడు ధీరజ్.

"ఫోటోలు చూస్తున్నా... ఎంత బాగున్నాయో అవి" డిస్ ప్లే వంక చూస్తూ అంది గాయిత్రీపాటిల్.

"వాటిలో కొన్ని మేం తీసినవి కూడా ఉన్నాయి..." అన్నాడతను.

"ఐశ్వర్యారాయ్... కత్రినా కైఫ్ ఫోటోలు కూడా మీరు తీసినవేనా?"

"ఎస్... మేం తీసినవే. అన్నయ్య అరుణ్ ఓసారి ముంబాయి కెళ్లినపుడు షూటింగ్స్ లో వాళ్లని కలిసినపుడు వెరీ స్పెషల్ గా తీసాడు. అందుకే, వాళ్ల ఫోటోలు కూడా ఇక్కడ అందంగా అమర్చాం" చెప్తున్నాడతను.

"ఐశ్వర్య ఫోటో ఎంత బాగుందో? నా ఫోటోలు కూడా అలా రావాలి" అమాయకంగా అంది.

"ఓ... తప్పకుండా, వన్ మినిట్" అని దగ్గర్లోని డెస్క్ ని గాలించి ఓ ఫోటో తీసి ఇచ్చాడు ధీరజ్.

"ఏంటీ...?"

"మీ ఫోటో" అన్నాడు.

అందుకుని చూసిందామె అది ఐశ్వర్య ఫోటో.

"మీ ఫోటో బాగా తీసానా?" అడిగాడు మళ్ళీ నవ్వుతూ.

"ఆటపట్టిస్తున్నారు..." కోపంగా ఉడుక్కుంది గాయిత్రీపాటిల్.

"మరి... కెమెరా మిమ్మల్ని మీలాగే చూపిస్తుంది. ఐశ్వర్య... కత్రినాకైఫ్... మాధురీదీక్షిత్... రాణీముఖర్జీ... సొనాలిబింద్రేలా కావాలంటే ఎలా?"

"అంటే... నేనంత అందంగా ఉండనా?"

"ఎందుకుండరు? వాళ్ళకంటే అందంగా ఉన్నారు మీరు" అన్నాడతను అభినందనగా.

"అవున్నిజం, తప్పుగా అనుకోకండి. ఆరోజు మీ ఇంటికొచ్చి మిమ్మల్ని చూసిన మొదటిక్షణంలో అనుకున్నది ఒక్కటే..." అనుకున్నదేంటో చెప్పకుండా కాసేపు ఆగాడు ధీరజ్.

అదేంటో తెలుసుకోవాలని ఆమెలో ఆత్రుత.

"ఊ... చెప్పండి" అందామె.

"ఊరికినే చెప్తారేంటీ?"

"మరేం ఇచ్చుకోవాలో?"

"ఫీజ్..."

"మిమ్మల్ని పిలిచే కదా... బోలెడు ఫోటోలు తీసుకున్నాం" అంది.

"ఆదివేరు బిజినెస్..."

"మరి ఇది...?"

"కాంప్లిమెంట్"
"కాంప్లిమెంట్స్ హృదయంతో ఇవ్వాలి. కాసులు పుచ్చుకుని కాదు. మీ మనసులో మీరేం అనుకుంటే నాకెందుకు? చెప్పకండి" అంది గాయిత్రీపాటిల్.

"సరే... మీ ఇష్టం. మీ కోరిక నేనెందుకు కాదనాలి?" అన్నాడు ధీరజ్.

మనసు మార్చుకుని అతడేమన్నా చెప్తాడేమోనని ఓ రెండు నిముషాలు అక్కడి ఫోటోలు చూస్తున్నట్లు నటించిన తర్వాత అక్కడ్నుంచి జారుకుంది.

 ఆ సాయంత్రం -

"మీ ఆల్బమ్ ఇదిగో..." తెచ్చిచ్చాడు ధీరజ్. ఆత్రుతగా అందుకుని ఒక్కో ఫోటో చూస్తోందో గాయిత్రీపాటిల్. నిజంగా తనేనా... తనలా ఉన్న ఎవరోనా? అనుమానం వచ్చిందామెకి.

"ఎలా ఉన్నాయి?" అడిగాడతను.

"మీరే చెప్పాలి" ఆమె అంది.

"చెప్పాల్సింది నేను కాదు... మీరు. అవి మీ ఫోటోలు" అన్నాడతడు.

"కానీ... తీసింది మీరు..." అందామె. ఇంతలో అక్కడికి గాయిత్రీపాటిల్ అన్న రావడంతో వారిద్దరి మధ్య మాటలు అక్కడితో ఆగిపోయాయి. మధ్యలో ఆమె అన్న రాకుండా ఇంకాసేపు అతడితో మాట్లాడి ఉంటే... తనని చూసిన మొదటిక్షణంలో అతడేమనుకున్నాడో స్పష్టంగా ఆమెకి తెలిసేది. లేదా... ఆ మర్నాడో ఆమె మరోసారి ఫోటో స్టూడియోలోకి తొంగిచూసినా అసలు విషయం తెలిసేది. ఆ రెండూ జరగలేదు కానీ... ఓరోజు సాయంసమయాన ఓ సినిమా డైరెక్టర్ తనిల్లు వెతుక్కుంటూ వచ్చిన తర్వాతే... ఆ ఫోటో స్టూడియోలో తన ఫోటో డిస్ ప్లే చేసి ఉందని ఆమెకి తెలిసింది. ఆ స్టూడియో ఫ్రంట్ రూంలో అద్దాల వెనుక కొలువు తీరిన ఆ అందాలభామ ఎవరా? అని ఆరాతీసిన ఆ డైరెక్టర్ తెలుగులో తొలి సినిమా ఆఫర్ ఇవ్వడం... ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్న గాయిత్రీపాటిల్ ఈ ఇండస్ట్రీలో తన కెరీర్ ని చకచకా ఫ్లాన్ చేసుకోవడంతో 'మోస్ట్ హేపినింగ్ హీరోయిన్' గా అనతికాలంలోనే పేరు సంపాదించుకుంది.

గతమంతా ఒక్కసారి గుర్తొచ్చింది గాయిత్రీపాటిల్ కి.

"వావ్... ధీరజ్" మెసేజ్ పంపించింది గాయత్రి.

"ఎలా ఉన్నావ్?"

"ఇక్కడే హైద్రాబాద్ లో..."

"ఏం చేస్తున్నావ్?" మళ్లీ మెసేజ్.

"నిన్ను చూస్తూ... ఫోటోలు తీస్తూ"

"అంటే... ఇక్కడ కూడా?"

"అన్నయ్య ఫ్రెండ్ ఫోటో స్టూడియో. నిర్వహణబాధ్యత నేను చూసుకుంటున్నా"

"మరి... నన్నొకసారి కూడా కలవలేదేం?"

"నక్షత్రాల్ని అందుకోగలమా?"

"అదేంటీ?"

"నువ్వు నడిచే నక్షత్రానివి. ఒక్క చోట... ఒక్క ఎదలో కుదురుగా ఉండవు కదా?"

"నిన్ను కలవాలనుంది..."

"ష్యూర్..."

"ఎక్కడ... ఎలా?" అడిగింది గాయత్రి.

"నువ్విక్కడికి వస్తే జాతరే... నీ దగ్గరికి నేనే వస్తా"

"అడ్రస్ తెలుసా?"

"నువ్వు వాడే సెంట్ దగ్గర్నుంచీ సెల్ నంబర్ తెలుసుకున్నవాడిని. నీ అడ్రస్ తెలీదా?"

"ఎపుడొస్తావ్?"

 "ఇపుడు రానా?" అడిగాడు ధీరజ్.

"రా... ఎదురు చూస్తుంటా" రిప్లయి ఇచ్చింది గాయత్రి.

సమాధానంగా అరగంటలోనే ధీరజ్ వచ్చాడు. ఆ క్షణంలో అతడు బాగా తెలిసిన చుట్టంలా తోచాడామెకి.

"సిమ్లా ఎలా ఉంది?" ఆరాతీసింది. అమ్మానాన్న ఒక్కసారైనా వచ్చిపొమ్మంటున్నా తీరికలేని కాల్ షీట్లతో సతమతమవుతూ సొంతూరుకి ఓసారైనా వెళ్ళలేకపోయింది. అతితొందర్లోనే సిమ్లా చూసి రావడానికి తనకుతానే కొన్ని కాల్ షీట్స్ కేటాయించుకోవాలి. నవ్వుకుంది గాయత్రి.

"నువ్వూ, సిమ్లా ఎపుడూ బాగానే ఉంటారు"

"ఔనా...?" ఆ అభినందనకే మురిసిపోయిందామె.

(... ఇంకా వుంది)

మరిన్ని సీరియల్స్
jaatara telugu story by shreekanta murthy