పిల్లలూ మీకు తెనాలి రామలింగడి గురించి తెలుసుగా... ఓ తెలుసుమమ్మీ... పాలూ, పెరుగూ గుటుక్కున మింగేశాడు కదూ... దీనికెప్పుడూ తిండి ధ్యాసే... నేను చెప్తామమ్మీ... ఆయన వికటకవి... అప్పట్లో ఆయన గ్రేట్ కమెడియన్.
కమెడియన్ మాత్రమే కాదర్రో... కవీ, పండితుడూ కూడా. సమయస్ఫూర్తితో సమస్యలను పరిష్కరించగల నేర్పరి తెనాలి రామలింగడు.
అందుకే ఆయనంటే శ్రీ కృష్ణదేవరాయల వారికి ఎంతో అభిమానం. తెనాలి రామలింగడి తెలివితేటల గురించి ఎన్నో కథలున్నాయి...
మరలాంటి కథ ఒకటి చెప్పవూ... చెప్తా...
*****
ఒకసారి తెనాలి రామలింగడి ఊళ్ళో దొంగల బెడద ఎక్కువయింది. ఊళ్ళో వాళ్ళంతా వచ్చి మన వికటకవి ముందు మొరపెట్టుకున్నారు. "అయ్యా రాయలవారికి చెప్పి మీరే ఏదోవిధంగా ఈసమస్యనుండి మనూర్ని కాపాడాలయ్యా." ఈ దొంగల బాధ భరించలేకుండా వున్నాం... అధైర్యపడకండి అన్నీ నేను చూసుకుంటాను" అంటూ అభయమిచ్చి వాళ్ళను పంపేశాడు రామలింగడు.
ఊళ్ళో వాళ్లకిచ్చిన మాట ప్రకారమే ఈ సమస్య గురించి రాజుగారి చెవిన వేశాడు రామలింగడు. అప్పుడు రాయలవారు నవ్వి. ఓ వికటకవీ - నీ సమయస్పూర్తితో మాకే ఎన్నో సలహాలిచ్చి మమ్మల్ని మెప్పించిన నీకు ఇదేమంత పెద్ద సమస్య కాదు. కావాలంటే మా సహకారం ఎప్పుడూ ఉంటుంది. అన్నారు.
సరేనని తెనాలిరామలింగడు కొంతసేపు ఆలోచించగా అతనికొక బ్రహ్మాండమైన ఆలోచన తట్టింది. అది రాయలవారికి చెప్పి ఆయన సహకారం ఏం కావాలో కూడా వివరించాడు.
దానికి రాయలవారు భళా రామలింగా భళా. నీ పధకము భలేగున్నది. మీరు కోరిన సహకారము ఇచ్చేశాం పొండి అన్నారు.
ఆ మర్నాడే రాయలవారు రామలింగడి హాస్య చతురోక్తులకు మెచ్చి బోలెడంత బంగారం, ఇంకా ఎన్నెన్నో కట్న కానుకలను బహుకరించారు. వాటన్నిటినీ రాజభటులు తెచ్చి రామలింగడి ఇంట్లో పెట్టి వెళ్ళిపోయారు. రామలింగడి అంచనా ప్రకారం దొంగల దృష్టి వాటి మీద పడనే పడింది. ఇకనేం, ఆ దొంగలంతా ఒక్కచోట చేరి. "ఒరే, ఎంతకాలమని ఇలా చిల్లర మల్లర దొంగతనాలతో కాలక్షేపం చేస్తాంరా, రాయల వారు రామలింగ కవికిచ్చిన కట్న కానుకలన్నీ దొంగిలించేసుకుంటే జీవితాంతం కాలుమీద కాలేసుకుని హాయిగా గడిపేయొచ్చు." అని పథకం వేసుకున్నారు. అదే రాత్రి గుట్టుచప్పుడు కాకుండా రామలింగడి ఇంట్లో చొరబడి వాటికోసం వెతికారు ఎక్కడా దొరకలేదు. అతన్నేలేపి బెదిరిద్దామనుకునేంతలో రామలింగడి గదిలో వెలుగుతున్న దీపమూ కనిపించింది. చిన్నగా ఏవో మాటలు కూడా వినిపించాయి. అవేమిటంటే, రామలింగడి భార్య. "ఏమండీ, రాజుగారు మనకి బోలెడన్ని కట్న కానుకలిచ్చారు కదా, నాకు భయంగా ఉందండీ" పిచ్చిదానా భయమెందుకే? అది కాదండీ "మీరు రాజాస్థానానికి వెళ్లినప్పుడు నేనొక్కదాన్నే ఉంటానాయే. ఏ దొంగ వెధవలో వస్తే ఎలాగండీ?"
"నీ మొహం ఆ సొత్తంతా ఇంట్లో దాచడానికి నేనేమన్నా తెలివి తక్కువ వాణ్ణనుకున్నావే, అదంతా మూటకట్టి మన పెరట్లో వేపచెట్టు మొదట్లో పాతిపెట్టా. అలాంటి భయాలేం పెట్టుకోక, హాయిగా నిద్రపో"
చాటుగా పొంచి ఉన్న దొంగలు ఇదంతా విన్నారు.
ఇంకేం, దొరికేసింది బంగారం అనుకుంటూ పొలోమని పెరట్లోకి పరిగెత్తేశారు. అంతే, రామలింగడి పథకం ప్రకారం అక్కడ వేపచెట్టు చుట్టూ పదడుగుల వెడల్పూ - ఇరవై అడుగులలోతూ ఉండేలా తవ్వి, పైన ఎండటాకులతో కప్పిన గోతిలో అమాంతం పడిపోయారు.
రాజభటులొచ్చి వాళ్ళని తీసుకుపోయి చెరసాలలో వేసేసారు.
ఆ విధంగా వికటకవి తెలివితేటలతో వూరికి దొంగల బాధ తీరిపోయింది...
హే భలే భలే...
|